దతియా దసరా తొక్కిసలాట, 115 పైగా దుర్మరణం -ఫోటోలు


దుర్గాష్టమి రోజున మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 115 మందికి పైగా దుర్మరణం చెందడం ఏ విధంగా చూసినా అనివార్యం కాదు. ఇదే చోట ఏడేళ్ళ క్రితం జరిగిన తొక్కిసలాటలో పాతిక మందికి పైగా చనిపోయారు. రెండు రాష్ట్రాల నుండి జనం ఈ చోటికీ వస్తారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘోరమైన రీతిలో భద్రతా చర్యలు తీసుకోవడం బట్టి వారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఏపాటిదో అర్ధం అవుతోంది. వెనుకబడిన రాష్ట్రాన్ని ఆగమేఘాల మీద అభివృద్ధి చేస్తున్నారని బి.జె.పి చెప్పుకునే రాష్ట్రం మధ్య ప్రదేశ్. వాళ్ళు చెప్పే అభివృద్ధి నిజంగా ఎవరికి చేరుతోందో దతియా దసరా తొక్కిసలాట స్పష్టంగా చెబుతున్న విషయం.

అధికారిక లెక్కల ప్రకారం తొక్కిసలాటలో 115 మంది వరకు మృతి చెందారని పత్రికలు చెబుతున్నాయి. పోలీసుల లాఠీ చార్జి నుండి, తదనంతరం సంభవించిన తొక్కిసలాట నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం ఇంకా చాలామంది నదిలోకి దూకేసారని చెబుతున్నారు. గజ ఈతగాళ్ళు వారి కోసం వెతుకున్నారట. వారి సంఖ్య కూడా లెక్క తేలితే మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందని భయపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు సింధు నది ఉధృతంగా ప్రవహిస్తోందని, అందువల్ల ఈత వచ్చినవారు కూడా ఒడ్డుకు క్షేమంగా చేరుకోలేని పరిస్ధితి ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదం నూటికి నూరు పాట్లూ మానవ తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం. ప్రజల ప్రాణాల పట్లా, వారికి కల్పించాల్సిన సౌకర్యాల పట్లా లెక్కలేనితనం చూపిన ఫలితం.

మధ్య ప్రదేశ్, దతియా జిల్లాలోని రత్నఘర్ నవరాత్రి ఉత్సవాలకు పేరెన్నిక గన్నదని పత్రికలు చెబుతున్నాయి. ఎంత పేరెన్నిక గల్లదో గాని దసరా ఉత్సవాల కంటే ఎక్కువగా తొక్కిసలాట వల్లనే అది రెండుసార్లు వార్తల్లోకి రావడం ఎలా అర్ధం చేసుకోవాలి? మృతుల్లో అత్యధికులు స్త్రీలు, పిల్లలే. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ఉత్సవాలకు హాజరవుతారని తెలుస్తోంది. అలాంటి చోటును ఎంత అభివృద్ధి చేయొచ్చు! సింధు నది అవతల ఉండే దేవీ ఆలయానికి వెళ్లడానికి ఇరుకైన వంతెన ఉన్నా, దానిని వెడల్పు చేయడానికి సంవత్సరాల తరబడి చర్యలు తీసుకోలేదంటే ఏమిటి అర్ధం?

హిందూ మతం, హిందూ భక్తులు అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవడం పైన ఉన్న ఆసక్తి భక్త జనానికి సౌకర్యాలు కల్పించడం పైన బి.జె.పి కి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదా? వివాదాస్పద స్ధలాల్లో గుడులు కట్టడానికే కాషాయ సంస్ధలకు ఆసక్తి ఉంటుంది తప్ప మిగతా చోట్ల ఉండదా? రామ జన్మ భూమి వివాదం కేవలం ఓట్ల కోసమే తప్ప మతం కోసమో, భక్తి కోసమో కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి?

బి.జె.పి నాయకులు ఎల్.కె.అద్వానీ, నరేంద్ర మోడి గారి వైబ్రెంట్ గుజరాత్ కి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ గారి మధ్య ప్రదేశ్ ని పోటీగా చెప్పడం రివాజు. అప్పటికే అభివృద్ధి చెందిన గుజరాత్ ని మోడి కొత్తగా అభివృద్ధి చేసిందేమీ లేదని, బాగా వెనుకబడిన మధ్య ప్రదేశ్ లో చౌహాన్ సాధించిన అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని అద్వానీ తరచుగా చెప్పే మాట! అద్వానీ దృష్టిలో అభ్వృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు వచ్చింది.

ప్రభుత్వం, పోలీసుల ప్రకారం తొక్కిసలాటకు కారణం వంతెన కూలిపోనున్నదని పుకార్లు రావడం. కానీ జనం చెబుతున్నా కారణం ఇందుకు విరుద్ధంగా ఉంది. దుర్గా దేవి దర్శనానికి జనం బారులు తీరి ఉన్న పరిస్ధితిలో కొంతమంది క్యూలను దాటుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారట. వారిని నిరోధించడానికి పోలీసులు లాఠీచార్జికి దిగారని, దానితో బ్రిడ్జి పైన తొక్కిసలాట జరిగిందని ప్రజలను ఉటంకిస్తూ ఛానెళ్లు, పత్రికలు చెబుతున్నాయి. దుర్ఘటన జరిగే సమయానికి బ్రిడ్జి పైన క్యూలను అదుపు చేయడానికి 7 గురు పోలీసులు మాత్రమే ఉన్నారని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.

ఇప్పటికైనా వంతెనను వెడల్పు చేయడమో లేక కొత్తగా వెడల్పాటి వంతెనను నిర్మించడమో చేయడానికి ప్రభుత్వాలు ఉపక్రమిస్తాయా?

ఈ ఫోటోలు హిందూ స్ధాన్ టైమ్స్ తదితర పత్రికల నుండి సేకరించినవి.

3 thoughts on “దతియా దసరా తొక్కిసలాట, 115 పైగా దుర్మరణం -ఫోటోలు

  1. కేవలం ఒక నమ్మక మీద ఆధారపడీ ప్రజలు మరణించడం మనకు కొత్త కాక పోయిన, ఈసంఘటన చాలా దుర్దృష్టకరమైనది. ఇల్లాంటివి ఎన్నో సంఘటనలు జరిగిన మతానికి ముఖ్యత్వం ఇచ్చే వాళ్లు కూడ వీ టికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ దేశ పరి పాలనలో భాగమే.

వ్యాఖ్యానించండి