భారత సముద్ర జలాల్లో సాయుధ బ్రిటిషర్ల అరెస్టు


Seaman Guard Ohio at Tuticorin

భారత సముద్ర జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన ఒక ఓడను ఇండియా అదుపులోకి తీసుకుంది. తమిళనాడులోని ట్యుటుకోరిన్ వద్ద సియర్రా లియోన్ దేశం జెండాతో ఉన్న ఈ ఓడలో అత్యాధునిక ఆయుధాలు ధరించిన బ్రిటిషర్లు ఉన్నారు. వారితో పాటు ఎస్తోనియా, ఉక్రెయిన్, భారత్ జాతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. సియర్రా లియోన్ జెండా ఉన్నప్పటికీ ఓడ వాస్తవానికి ఒక అమెరికా కంపెనీకి చెందినది.

ఓడలో అత్యాధునిక ఆయుధాలు ఉండడంతో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు. ఓడలో ఉన్నవారు మాత్రం తాము ఒక గల్ఫ్ దేశపు వాణిజ్య నౌకకు కాపలాగా వచ్చామని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే గల్ఫ్ నౌకకు కాపలాగా ఉంటే ఆ నౌకకు దగ్గరగా ఉండాలి గాని భారత సముద్ర జలాల్లోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో తెలియలేదు.

‘సీమన్ గార్డ్ ఓహియో’ అనే పేరుతో ఉన్న ఈ ఓడ అమెరికా సెక్యూరిటీ కంపెనీ ‘అడ్వాన్ ఫోర్ట్’ కి చెందినది. ఓడలో 25 మంది సాయుధులు ఉన్నారని ది హిందు తెలిపింది. భారత జలాల్లోకి తమ ఓడ ఎందుకు ప్రవేశించిందీ అందులో ఉన్న సిబ్బంది వివరించలేకపోయారని రక్షణ బలగాలను ఉటంకిస్తూ పత్రిక తెలియజేసింది. భారత జలాల్లోకి ప్రవేశించిన వెంటనే భారత తీర రక్షణ బలగాలు ఎలక్ట్రానిక్ నిఘాలో ఉంచాయి. చొరబాటు కొనసాగడంతో భారత తీర రక్షణ నౌక ‘నాయకి దేవి’ దానిని శనివారం అటకాయించి ట్యుటికోరిన్ రేవుకు తీసుకొచ్చారు.

ఒడలోని సిబ్బందిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ గూఢచార సంస్ధలు ఉమ్మడిగా విచారిస్తున్నాయి. బ్రిటన్, ఎస్తోనియా, ఉక్రెయిన్ దేశాలతో పాటు ఇండియాకు చెందినవారు కూడా ఇందులో ఉన్నారు. వారు తమ వద్ద ఉన్న ఆయుధాలకు అనుమతి పత్రాలు ఏవీ చూపించలేదు. శుక్రవారం సాయంత్రం తమకు ఈ ఓడ గురించి సమాచారం వచ్చిందని తీర రక్షణ బలగాల తూర్పు ప్రాంత ఇనస్పెక్టర్ జనరల్ మరియు కమాండర్ సత్య ప్రకాష్ శర్మ చెప్పారని పత్రిక తెలిపింది.

మేరిటైమ్ బులెటిన్ వెబ్ సైట్ ప్రకారం ఓడలో ఎస్తోనియన్లు 14 మంది, బ్రిటిషర్లు 6 గురు, ఇండియన్లు 4గురు, ఒక ఉక్రేనియన్ ఉన్నారు. మరో 10 మంది ఓడ సిబ్బంది కూడా ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

ఓడలోని సిబ్బంది వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లు కోస్ట్ గార్డ్ బలగాలు గమనించాయి. సెమీ-ఆటోమేటిక్ తుపాకులు, ఎస్.ఎల్.ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్) వారి వద్ద ఉండడంతో అక్రమ ఆయుధ రవాణాలో వారు నిమగ్నమై ఉన్నారా అన్నది విచారిస్తున్నామని సత్య ప్రకాష్ శర్మ తెలిపారు. కోస్తా పోలీసులు కూడా ఈ విషయమై విచారణ చేస్తారని ఆయన తెలిపారు.

గల్ఫ్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలకు తాము కాపలాగా వ్యవహరిస్తున్నామని, తమకు ఆయుధాలు ధరించే అధికారం ఉన్నదనీ, ఓడలోని సిబ్బంది తెలిపారు. అయితే దానికి సంబంధించిన అనుమతి పత్రాలు మాత్రం వారు చూపలేదు. అడ్వాన్ ఫోర్ట్ కంపెనీ నుండి తగిన సమాచారం కోసం కోస్ట్ గార్డ్ అధికారులు చూస్తున్నారు.

అమెరికాలోని అడ్వాన్ ఫోర్ట్ ఎమర్జెన్సీ సెంటర్  ను తాము సంప్రదించామని ది హిందు తెలిపింది. తమ ఉన్నత కార్యాలయాన్ని సంప్రదించి ఏ విషయమూ చెబుతామని అక్కడి వారు చెప్పినప్పటికీ ఆ తర్వాత వారి నుండి ఎలాంటి సమాచారమూ అందలేదని పత్రిక తెలిపింది.

అడ్వాన్ ఫోర్ట్ వెబ్ సైట్ ప్రకారం అదొక ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డి.సి లో ఉన్నది. ప్రపంచ వ్యాపితంగా కూడా అనేక చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. వాణిజ్య నౌకా పరిశ్రమకు సమగ్ర భద్రతా సౌకర్యాలు అందించడానికి తాము కృషి చేస్తున్నామని కంపెనీ చెప్పుకుంది. తమ భద్రతా బృందాల్లో అమెరికా, బ్రిటన్ లతో పాటు నాటో కి చెందిన సైనిక, నౌకా బలగాల్లో పని చేసి రిటైర్ అయినవారు ఉన్నారని, ప్రత్యేక బలగాల్లో పని చేసినవారు కూడా ఉన్నారని చెప్పుకుంది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగే దోపిడిని తిప్పికొట్టడంలో తమ సిబ్బంది గొప్ప నైపుణ్యం కలవారని కూడా చెప్పుకుంది. అంతా బాగానే ఉంది గానీ భారత సముద్ర జలాల్లో వారు ఏం సాధించడానికి వచ్చారన్నదే అసలు విషయం.

ఇటలీ నౌకకు భద్రత కల్పించడానికి వచ్చి ఇద్దరు భారతీయ జాలరులను కాల్చి చంపిన ఇద్దరు ఇటలీ మాజీ సైనికుల వ్యవహారం ఇంకా ఏమీ తేలనేలేదు. ఈసారి అలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఒక ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీకి చెందిన ఓడ దేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, అందునా సిబ్బంది అత్యాధునిక ఆయుధాలతో ఉండడం నిస్సందేహంగా ఆందోళన కారకమే.

ఓడలో అమెరికా మాజీ సైనికులు లేకపోవడం ఇండియా అదృష్టం అనుకోవాలి. లేనట్లయితే ఈ పాటికి అమెరికా పత్రికలు గోల గోల చేస్తూ ఉండేవి. తగిన కారణాలతోనే భారత జలాల్లోకి వారు ప్రవేశించారనీ, ఇండియాతో సహా ప్రపంచ దేశాల భద్రత అంతా తమ భుజస్కందాలపై మోస్తున్నామని కాబట్టి వెంటనే తమ పౌరులను విడుదల చేయాలని కాకి గోల చేస్తూండేవి. అమెరికన్లు ఉంటే గనుక అసలు మనవాళ్లు అరెస్టు చేసేవారా అన్నది కూడా అనుమానమే.

వ్యాఖ్యానించండి