కాణీ విలువ లేని చంద్రబాబు దీక్ష? -కార్టూన్


Chandrababu hunger strike

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ దీక్ష ఎందుకు చేస్తున్నట్లు? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆయన ఒకసారి చెప్పుకున్నారు. కానీ ఆ దీక్షకు నిర్దిష్ట డిమాండ్ అంటూ ఏమీ లేదు. దీక్ష చేస్తున్నాను అనిపించుకుని సీమాంధ్ర ప్రజల్లో ఓటు విలువ పొందడానికే ఆయన దీక్ష తలపెట్టారన్నది అర్ధం అయ్యే విషయమే. కానీ ఉద్దేశ్యం ఏదయినా దీక్షకు ఒక డిమాండ్ ఉండాలి కదా?

అందుకే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నా పట్టించుకునేవారు లేరని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఆయన దీక్షకు కాణీ విలువ లేదని దీక్షకు వచ్చిన బలహీన స్పందనే తెలియజేస్తోందని పరోక్షంగా సూచిస్తోంది. ఒకపక్క దీక్ష చేస్తున్న చంద్రబాబును వదిలిపెట్టి దీక్షాస్ధలిలోని కటౌట్, బేనర్లు, షామియానా తదితర ప్రచార పటాటోపాన్ని తరలించడానికే పోలీసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు కార్టూన్ లో. దానర్ధం చంద్రబాబు దీక్ష కన్నా ఆ దీక్షకు వస్తున్న ప్రచారం పైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అది రాకుండా అడ్డుకోడానికే ఆయన దీక్షను భగ్నం చేసిందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. దీక్ష మానాలని చెప్పడం మాని ఎ.పి భవన్ ని ఖాళీ చేయించడానికి ప్రయత్నించడం కూడా ఈ కోవలోనిదే.

కాంగ్రెస్ కి రాజీనామా చేసిన రాయపాటి శ్రీనివాసరావు “సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు ఎన్ని రాజీనామాలు చేసినా, ఎంతమంది ఆందోళనలు, ధర్నాలు, ఊరేగింపులు చేస్తున్నా జాతీయ పత్రికలు అసలు పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేశాకనే సీమాంధ్ర ప్రజల ఆందోళన దేశానికి, ప్రపంచానికి తెలిసి వచ్చింది” అని సర్టిఫికేట్ ఇవ్వడంతో దీక్షను భగ్నం చేయాల్సిన అత్యవసరం కేంద్రానికి గుర్తుకొచ్చిందేమో మరి!

‘కార్టూనిస్టు గీతలకు అర్ధాలే వేరులే’ అని పాడుకోవాలిక!

7 thoughts on “కాణీ విలువ లేని చంద్రబాబు దీక్ష? -కార్టూన్

  1. చంద్ర బాబు నాయుడు గారి నిరాహారదీక్ష కాణీ విలువ లేదని ప్రస్తుత పరిస్థితిలో అనవచ్చు నేమో గాని, దేశ రాజకీయాలలో, దేశరాజధాని లో తెలుగువారి పలుకు బడి, విలువ మాత్రం అమాంతం పడిపోయింది. భవిషత్ లో మనవారి విలువ కాణి చేసిన ఎక్కువే అనుకోనే రోజులొచ్చిన్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో! బాబు గారిది మీద వేసిన కార్టూన్ మొదలు మాత్రమే.

  2. శ్రీ రామ్ గారు… మీ ఆవేదనలో కొంత నిజం ఉన్నా, ఎప్పుడైనా ఒకరికి విలువ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది జనం సంఖ్యను ఉండదు అని నా అభిప్రాయం.
    ఇప్పుడు మన రాష్ట్రంలో ముప్పై మూడు మంది ఎంపీలు ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ముప్పై మూడు మంది అంటే సాధారణ మాటలు కాదు. వీళ్ల ద్వారా మన రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి. ఎన్ని పనులు జరగాలి. జరిగిందేమిటో మీకు…నాకు అందరికీ తెలుసు.
    మన కన్నా తక్కువ ఎంపీలున్న రాష్ట్రాలు చాలా ప్రాజెక్టులు సాధించుకున్నాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది.
    జనాన్ని బట్టి విలువ ఉండదు….అని. కాబట్టి రేపు మనం రెండు రాష్ట్రాలైనా మన విలువకు కొత్తగా వచ్చిన ప్రమాదం ఉండదు. ( ఇప్పుడున్న దానితో పోలిస్తే.)

  3. శ్రీరాం గారూ, కొంపదీసి స్విట్జర్లాండ్ చేసిన సంతకం సుబ్రమణ్య స్వామి పోరాటం వల్లనే అనరు కదా!

    నల్లధనాన్ని వెలికి తీసే ఉద్దేస్యం మనవాళ్లకి లేదనే సంపాదకీయం చివరికి తేల్చింది. గమనించారా?

  4. ఇక్కడ మీరు గమనించాల్సిందేమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా స్విజర్లాండ్ లో ఉన్న నల్లధనం మీద యురోప్ దేశాలు విరుచుకుపడుతున్నా, మనదేశ మీడీయాలో కవరేజ్ కనీస స్థాయిలో కూడా ఉండేదే గాదు. దానికొరకు పోరాడేవారి గురించి ప్రజలకేవరికి తెలియదు. ఇక నల్లధనం వెలికితీసే ఉద్దేశం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని విషయం అందరికి తెలిసిందే. స్వామి టీం లో పనిచేసే అతను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాడు. ఎంత సొమ్ము ఉండవచ్చు,ఎంతమంది ప్రజలకి స్విస్ లో అకౌంట్లు ఉండవచ్చు అని లెక్కలు కట్టాడు. ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు.
    రాజు అనుకొంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్లు, పొలిటికల్ విల్ ఉంటే నల్లధనం మనదేశానికి తీసుకురావటం చాలా సులభం. ఆ విషయం అమేరికా, ఫ్రాన్స్,జర్మని దేశాలు చేసి చూపించాయి. బిజెపి ఫ్రంట్ తో కూడిన కొత్త ప్రభుత్వమోస్తే వీలౌతుందేమో చూడాలి. థార్డ్ ఫ్రంట్ వస్తే నల్లధన విషయంలో ప్రస్తుతానికి చేసేదేమి లేదు.
    ప్రస్తుతం నల్లధన విషయంలో స్వామి క్రేడిట్ ను క్లైం చేయడు :)

    ఓటింగ్ యంత్రాల విషయంలో ఆయన పట్టువదలకుండా కోర్టులో పోరాడి నాలుగు సంవత్సరాలలో అర్థవంతమైన ముగింపు ఇచ్చాడు.

    Are electronic voting machines tamper-proof?
    http://www.hindu.com/2009/06/17/stories/2009061755160900.htm

    Supreme Court asks Election Commission to implement paper trail in EVMshttp://www.ndtv.com/article/india/supreme-court-asks-election-commission-to-implement-paper-trail-in-evms-429689

  5. @ ఈ నేపద్యంలో- అడిగిన సమాచారం ఇవ్వడానికి స్విస్‌ బ్యాంకులు సిద్దంగా ఉన్నా, దేశాన్ని దోచి విదేశాల్లో దాచిన జాతి ద్రోహుల పని పట్టే నైతిక స్థైర్యం మన్మోహన్‌ ప్రభుత్వానికి ఉందా అన్నదే మౌలిక ప్రశ్న! @
    మన్మోహన్‌ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నైతిక స్థైర్యం ఉండదనేదే సత్యం! ఎందుకంటే ఆ పధానికి అర్ధం వీరి నిఘంటువులోనే లేదు కధా?

    ఇంకో విషయం ఏంటంటే నల్లధనం వెలికి తీసే ప్రయత్నం లో భాగంగా పోరాడే వారు తెలియనట్లే, నల్ల ధనం దాచుకున్న వారు ప్రజలకు తెలియదు. ఇది ఒక రాజకీయ విన్యాసం మాత్రమే!

వ్యాఖ్యానించండి