మై గుడ్ నెస్! ఇవి శిల్పాలంటే నమ్మక తప్పదు -ఫోటోలు


మానవుడి సృజన శక్తికి అంతెక్కడ అంటే చెప్పడం కష్టం అనుకుంటాను. ఎక్కడ హోమో సెపియన్, ఎక్కడ సెల్యులార్ ఫోన్?!

మనిషి సాధించిన సాంకేతిక పరిజ్ఞానం ఒక ఎత్తైతే సంస్కృతీ, సృజనల పరంగా అతను అధిరోహించిన అత్యున్నత శిఖరాలు మరో ఎత్తు. ఈ శిల్పాలే చూడండి. ఇవి శిల్పాలంటే నమ్మగలమా? వాస్తవత్వానికి ఏమాత్రం తేడా చూపకుండా చిత్రాలు గీయడమే అద్భుతం అనుకుంటే ఏకంగా శిల్పాలకూ మనిషికీ తేడా లేకుండా సృజించడం పరమాద్భుతం కాదా? దీనిని ‘హైపర్ రియలిస్టిక్ స్కల్ప్ఛర్’ అంటున్నారు.

లండన్ శిల్పి రాన్ ముయెక్ తయారు చేసిన శిల్పాలివి. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాపితంగా ఆయన ఇచ్చిన ప్రదర్శనల నుండి సేకరించిన ఫొటోలివి. ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది వీటిని.

ఇంత వాస్తవికంగా శిల్పాలు తయారు చేయడం ఎలా సాధ్యమయింది? ఏయే పదార్ధాలు ఆయన ఉపయోగించారు. ది అట్లాంటిక్ పత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం రెసిన్, ఫైబర్ గ్లాస్, సిలికాన్ లాంటి అనేక పదార్ధాలను ఉపయోగించి రాన్ ముయెక్ ఈ శిల్పాలను నిర్మిస్తారట. టేబుల్ పై పెట్టుకోగల చిన్న చిన్న సైజు శిల్పాల నుండి ఊహించలేని భారీ శిల్పాల వరకు అంతే నైపుణ్యంతో తయారు చేయడం రాన్ ముయెక్ ప్రత్యేకత. వాస్తవికతకు ఏ మాత్రం  భంగం కలగకుండానే సైజులతో ఆటలాడడం రాన్ గొప్పతనం.

గతంలో మోడల్ మేకర్ గా రాన్ పని చేశారట. పిల్లల ఆనందం కోసం టి.వీల్లో పప్పెటీర్ ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. 1996 నుండి ఆయన శిల్పకళ వైపుకి మళ్లారు.

మనకి మన చుట్టూ కనిపించే జాతీయ నాయకులు, ఛోటా మోటా నాయకుల విగ్రహాలను ఒకసారి తలుచుకోండి. అవి ఫలానా వారి విగ్రహం అని చెబితే తప్ప గుర్తు పట్టలేని పరిస్ధితి తరచుగా కనిపిస్తుంటుంది. రాన్ ముయెక్ శిల్ప కళా నైపుణ్యాన్ని వాటితో పోల్చడం ఆయనకి అవమానమే అయినా మనవాళ్లు ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాల్సి ఉందో తెలుసుకోవడానికి ఆ పోలిక పనికొస్తుంది. కాదంటారా?

One thought on “మై గుడ్ నెస్! ఇవి శిల్పాలంటే నమ్మక తప్పదు -ఫోటోలు

  1. శిలలపై శిల్పాలు చెక్కినారు….మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అన్నట్లు….
    ముయెక్ శిల్పాలు సృష్టికే ప్రతిసృష్టి అన్నమాట.
    నిజమే మనవాళ్లు ఇంకా చాలా ఎదగాలండి….

వ్యాఖ్యానించండి