కాంగ్రెస్ పార్టీ ఎలాగో ధైర్యం చేసి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ పార్టీని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చనున్నదో తెలియని పరిస్ధితి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన పెద్ద మనుషులంతా ఆ మాట తీసి గట్టున పెట్టి తలో దారి పడుతున్నారు. సీమాంధ్ర జనం కోసం రాజీనామాలు నటించలేక అలాగని పార్టీలో కొనసాగుతూ ప్రజల ఆగ్రహానికి నిలవలేక ఆపసోపాలు పడుతున్నారు.
తెలంగాణ మ్యాజిక్ ద్వారా ‘anti-incumbency’ ఫ్యాక్టర్ ని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ భావించిన సంగతి ఇప్పుడు ‘బుడ్డోడ్ని’ అడిగినా చెపుతారు. సీమాంధ్రలో పార్టీని ‘ఏడు అడుగుల గోతిలో నిలువునా పాతిపెట్టింది మా అధిష్టానం’ అని సీనియర్ నేత జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆ పార్టీ పరిస్ధితిని ఊహించవచ్చు.
‘మా తాత, నాయన, నేను ఇన్నాళ్లూ ఉన్న పార్టీని ఎలా వదిలిపెట్టి పోవాలి?’ అని జె.సి లాంటివారు ప్రశ్నిస్తున్నా, అనేకమంది ఆ దారిలో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల ప్రకటనలే నిజం అయితే సీమాంధ్ర నుండి ఇక ఒక్కరూ కూడా కేంద్రంలో మంత్రిగా ఉండకూడదు. ఎం.పిలు కూడా ఒక్కరూ మిగలకూడదు. అంతా ఖాళీ అయిపోవాలి.
‘తెలంగాణ షో’ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించిన ప్రక్రియ ఇలా ఖాళీగా మిగిలిపోయిందని కార్టూనిస్టు చెబుతున్నట్లుంది. మెజీషియన్ ఉద్దేశ్యంలో ఆయన తెరిచిన బాక్సులో సొంత గూటి పక్షులు బోలెడు మిగిలి ఉండాలి. కానీ అవి ఆయనకు తెలియకుండానే నిచ్చెన దిగి వెళిపోతున్నాయి. ఆ సంగతి మెజీషియన్ ఇంకా గమనించినట్లు లేదు మరి!
కానీ కాంగ్రెస్ రాజకీయాలు, ఎత్తులు, జిత్తులు అంత తేలికగా అందేవి కాదు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం నిజమే అయినా దాన్ని చూపుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు, నిరసనలు, నిట్టూర్పులు మాత్రం ఒక మహా నాటక రంగంలో భాగం కాకుండా ఏమీ లేదు. ఆ నాటకం ఏమిటో త్వరలోనే బైటపడక మానదు.
