తెలంగాణ: 10 మంది మంత్రుల కమిటీ, నెలన్నర గడువు


శేఖర్ కార్టూన్స్

శేఖర్ కార్టూన్స్

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 10 మంది కేంద్ర మంత్రులతో ‘మంత్రుల కమిటీ’ ని ఏర్పాటు చేయనున్నట్లు హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఆర్ధిక, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సరిహద్దుల నిర్ణయం, ఆస్తులు-అప్పుల పంపకం, నీటి పంపకం తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు, సిఫారసులు చేయాలి. ఆరు వారాల గడువులో ఈ కమిటీ నివేదిక సమర్పించాక చలికాలం పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారు. తెలంగాణ విభజనకు నిరసనగా కాగా మంత్రులు, ఎం.పిల రాజీనామాలు కొనసాగుతున్నాయి.

మంత్రుల కమిటీకి నిర్ణయించిన విధి, విధానాల ప్రకారం కింది శాఖల మంత్రులు మంత్రుల కమిటీలో సభ్యులుగా ఉంటారు.

  • హోమ్ శాఖ
  • న్యాయ శాఖ
  • జల వనరుల శాఖ
  • ఆర్ధిక శాఖ
  • మానవ వనరుల అభివృద్ధి శాఖ
  • పట్టణాభివృద్ధి శాఖ
  • విద్యుత్ శాఖ
  • రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ
  • సిబ్బంది శాఖ
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

తెలంగాణ, శేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను మంత్రుల కమిటీ నిర్ణయిస్తుంది. ఎన్నికల నియోజక వర్గాలు, న్యాయ సంస్ధలు, చట్టబద్ధ సంస్ధల కేటాయింపు, తదితర పరిపాలన సంబంధిత విభాగాల ఏర్పాటును కూడా ఈ కమిటీ పరిశీలించి తగు సూచనలు చేస్తుంది.

రెండు రాష్ట్రాలకు హైదరబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కనుక సంబంధిత విధి విధానాలను కూడా మంత్రుల బృందం రూపొందిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్ళ పాటు హైదారాబాద్ నుండి సమర్ధవంతంగా పని చేయడానికి తగిన పాలనాపరమైన చర్యలను ప్రతిపాదిస్తుంది.

న్యాయ పరమైన చర్యలు, ఆర్ధిక పరమైన పాలనా చర్యలను కూడా మంత్రుల బృందం పరిశీలించి ప్రతిపాదిస్తుంది. నూతన ఆంధ్ర ప్రదేశ్ కు అవసరమైన కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలీ, సదరు ఏర్పాటుకు తీసుకోవలసిన పాలనా చర్యలు ఏమిటి అన్న అంశాలను పరిశీలిస్తుంది. నూతన రాజధాని ఏర్పాటులో తలెత్తే న్యాయ, పాలనా చర్యలను పరిశీలిస్తుంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి తీసుకోవలసిన ప్రత్యేక చర్యలను కూడా కమిటీ సిఫారసు చేస్తుంది.

విభజన వలన తలెత్తిన, తలెత్తనున్న శాంతి భద్రతల సమస్యలను, రక్షణ మరియు భద్రతా చర్యలను అధ్యయనం చేస్తుంది. విభజన అనంతరం ఇరు ప్రాంతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొనడానికి తగిన చర్యలను రూపొందించి ప్రతిపాదిస్తుంది. విభజన దరిమిలా దీర్ఘకాలికంగా తలెత్తే అంతర్గత భద్రతా సమస్యలను కూడా కమిటీ పరిశీలిస్తుందని, తగిన సిఫారసులు చేస్తుందని హోమ్ మంత్రి షిండే తెలిపారు. అంతర్గత భద్రత అంటే బహుశా నక్సలైట్ సమస్య అయి ఉండవచ్చు.

ఈ అంశాలన్నీ గత రెండు నెలలుగా సీమాంధ్ర ప్రజలు, రాజకీయ నాయకులు, ఎమ్మేల్యేలు, మంత్రులు చివరికి ముఖ్యమంత్రి సైతం ఆందోళన పడుతున్నవే. ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసేసుకున్నారని చెబుతూ ప్రస్తావించిన సమస్యలే ఇవి. విభజనకు ఆమోదిస్తూ చేసిన ప్రకటనలోనే ఇవన్నీ ఇమిడి ఉండాలని వీరంతా భావించినట్లు వారి ప్రకటనల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. అయితే సి.డబ్ల్యూ.సి గానీ, కేంద్ర కేబినెట్ గానీ తెలిపింది సూత్రప్రాయ ఆమోదమేననీ, సూత్రబద్ధ ఆమోదం అంటూ ఒకటి అయ్యాక ఇతర అంశాలన్నీ అనివార్యంగా పరిశీలనకు వస్తాయనీ, అవన్నీ విభజన ప్రకటన అనంతరం తీసుకోవలసిన చర్యలేననీ దీని ద్వారా కేంద్రం స్పష్టం చేసినట్లయింది.

ఒక సూచన

తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుండి ఒక ప్రతిపాదన వినిపిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ను తెలంగాణ నుండి వేరు చేసి కొత్త ఆంధ్ర ప్రదేశ్ లో కలపాలి. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న కారణం నీటి సమస్య.

సాధారణంగా నదుల్లోని నీటిని వివిధ ప్రాంతాలకు/రాష్ట్రాలకు కేటాయింపులు జరిపేటప్పుడు నదీ పరీవాహక ప్రాంతాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో గానీ, రాష్ట్రాల్లో గానీ ఎంతెంత పరీవాహక ప్రాంతం ఉందన్నదాన్నిబట్టి నీటి కేటాయింపులు ఉంటాయి. గోదావరి నది పరీవాహక ప్రాంతం కొత్త ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు శూన్యం. అంటే గోదావరి నదికి వచ్చి చేరే నీరు తెలంగాణలో సమకూరుతుంది తప్ప కోస్తా జిల్లాల్లో కాదు. అంటే గోదావరి నది నుండి కొత్త ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయింపులు జరిపేటప్పుడు తీవ్ర సమస్య ఏర్పడుతుంది.

భద్రాచలం డివిజన్ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఒక భాగం. ఈ డివిజన్ లోనే గోదావరి ఉపనది అయిన శబరి నది కూడా ప్రవహిస్తోంది. కాబట్టి నూతన ఆంధ్ర ప్రదేశ్ కు గోదావరి నదీజలాలలో వాటా దక్కాలంటే పరీవాహక ప్రాంతం అయిన భద్రాచలం డివిజన్ ను తెలంగాణ నుండి వేరు చేసి నూతన ఆంధ్ర ప్రదేశ్ లో కలపాలి. తద్వారా గోదావరి జలాలపైన ఆంధ్ర ప్రదేశ్ కు చట్టబద్ధమైన హక్కు వస్తుంది.

భద్రాచలంను వెనక్కి ఇచ్చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు, ఉద్యమకారులు కోరినప్పటికీ వారి దృష్టిలో ప్రధానంగా రామాలయమే ఉన్నట్లు కనిపిస్తోంది. గోదావరీ జలాల సమస్య వారి దృష్టిలో ఉన్నట్లుగా వారి మాటలు లేవు. అసలు సమస్యలను వదిలి కొసరు సమస్యలను పట్టుకుంటే నష్టపోవలసి ఉంటుంది. ఉద్యమకారులు ఈ సంగతి గమనించి విభజన ప్రక్రియ ఎలాగూ ప్రారంభం అయింది కనుక సాధ్యమైనన్ని ఎక్కువ నీటి, ఖనిజ, ఉపాధి వనరులను రాబట్టుకోవడానికి కృషి చేయాలి. తదనుగుణమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలి.

రాజీనామాలు

మానవ వనరుల శాఖ కేబినెట్ యేతర మంత్రి పళ్లం రాజు, రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. తొందరపడవద్దని, నిదానించి ఆలోచించుకోవాలని తనకు ప్రధాని సూచించారని, రాత్రంతా ఆలోచించాక రాజీనామా చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చానని ఆయన చెప్పారు. ఇద్దరు మహిళా మంత్రులు కిల్లి కృపారాణి, డి.పురంధరేశ్వరి కూడా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారని ది హిందు తెలిపింది. ప్రధాని మంత్రి కార్యాలయానికి వారి రాజీనామా పత్రాలు పంపారని తెలుస్తోంది.

అమెరికాలో ఉన్న ఆర్.సాంబశివరావు కూడా తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ కు ఫాక్స్ చేశానని తెలిపారు. ఈయన రాజీనామా ప్రకటించడం ఇది రెండోసారి అనుకుంటాను. కాంగ్రెస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశానని ఆయన తెలిపారు. రాజీనామా చేస్తూ ఆయన నరేంద్ర మోడిని ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. మోడి విద్యార్ధులను, యువతను బాగా ఆకర్షిస్తున్నారని, సీమాంధ్రలో బి.జె.పి లబ్ది పొందే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. బి.జె.పిలో చేరేదీ లేనిదీ చెప్పడానికి మాత్రం నిరాకరించారని ది హిందు తెలిపింది. మరో కేంద్ర మంత్రి కోట్ల సూర్యభాస్కర రెడ్డి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి చిరంజీవి తన రాజీనామాను ప్రధాని ఫాక్స్ చేసినట్లు చెప్పారు.

సహజం

సీమాంధ్ర ఆందోళనలను సహజంగా హోమ్ మంత్రి షిండే అభివర్ణించారు. ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆందోళనలు సహజమేననీ, కాకపోతే వారికి నచ్చజెప్పాలని అన్నారాయన. సీమాంధ్ర ప్రజలకు నచ్చజేబుతామని హామీ ఇచ్చారు.

కాగా రాష్ట్రాన్ని విభజించిన తీరుకు నిరసనగా ఆమరణ దీక్ష చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీలో గానీ, హైదరబాద్ లో గానీ దీక్షకు దిగవచ్చని తెలుస్తోంది. నిరాహార దీక్ష చేస్తానని వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో టి.డి.పి నేత కూగా జాగ్రత్త పడుతున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేస్తుండగా చంద్రబాబు నాయుడు డిమాండ్ ఏమిటన్నదీ తెలియలేదు. కొన్నాళ్లు దీక్ష చేయడం అనంతరం నిమ్మరసం పుచ్చుకోవడం నేతలకు మామూలుగా మారినందున వీరి దీక్షలకు ప్రజలు స్పందిస్తారా అన్నది అనుమానమే.

10 thoughts on “తెలంగాణ: 10 మంది మంత్రుల కమిటీ, నెలన్నర గడువు

  1. పాపం సీమాంద్ర మంత్రులు రాజీనామా డ్రామ ఆడలేక చాలా కష్ట పడుతున్నారు, ఇటు అదిష్టానం మధ్య ప్రజల మద్య నానా తంటాలు పడుతూ.

  2. భద్రాచలం డివిజన్ గతంలో ఆంధ్రప్రాంతంలో ఉన్న మాట నిజమే…..కాని ఎప్పుడైతే దాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారో అప్పుడే ఆ ప్రాంతానికి చాలా మంది ఖమ్మం జిల్లా ప్రజలు వలస వచ్చి స్థిరపడ్డారు. ఐతే గోదావరి జిల్లాల ప్రజలు కూడా అధిక సంఖ్యలోనే వలస వచ్చారు. దానికి ప్రధాన కారణం ఆ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం. కనుక అక్కడ చౌకగా భూములు లభించడం, పెద్ద పేపర్ ఫ్యాక్టరీ, దాని అనుబంధంగా ఇతర పరిశ్రమలూ ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగాల కోసం అక్కడికి భారీగానే వలసలు జరిగాయి.
    ఇప్పటి వరకూ భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలందరిలాగానే భద్రాచలం ప్రజలూ ఆలోచిస్తారు.
    ఇప్పుడు భద్రాచలాన్ని సీమాంద్రలో కలపాలా…? తెలంగాణలో కలపాలా…? అన్నది పాలకులు కాదు నిర్ణయించాల్సింది.
    అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రకారమే నిర్ణయం జరగాలి.

  3. వీలైతే భద్రాచలాన్ని అంధ్రా లో కలపకుండా చేయమనండి(కేంద్రానికి)!అప్పుడు ఏమౌతుందో చూద్దం?

  4. aaa గారూ మీరు కార్టూన్ ని అలా ఉపయోగించకూడదు. కార్టూనిస్టు ఒరిజినల్ కాన్సెప్ట్ కి సరిగ్గా విరుద్ధంగా మార్చడం misuse మాత్రమే కాదు, abuse కూడా అవుతుంది. అందువలన లింక్ తొలగించాను.

  5. నేనంత ఆలోచించలేదు. కార్టూన్ చూడగానే నాకొచ్చిన ఆలోచన వర్డ్స్ లో కంటే ఆ విధం గా ఈజీ గా త్వరగ అర్ధం అవుతుందని అలా చేసానంతే. రెండు కార్టూన్ లు చూస్తే రీడర్స్ కి ఒక అభిప్రాయం ఎర్పడుతుంది కదా. నేను మరో రూపం లో కార్టూన్ గీయాల్సింది.
    మీకు నా అభిప్రాయం పబ్లిష్ చేయడం అభ్యంతరకరం ఐతే మీ ఇష్టం. ఇంకెప్పుడూ ఇలా I.P.R. ఉల్లంఘన జరగదు.

  6. మీ అభిప్రాయాన్ని మాటల్లో రాయండి, పబ్లిష్ చేస్తాను. ‘మాటలు మార్చిన’ మీ కార్టూన్ పబ్లిష్ చేస్తే కార్టూనిస్టు చాలా అభ్యంతరం చెప్పి ఉండేవాళ్లు. కార్టూనిస్టు వరకూ ఎందుకు, తెలంగాణ వాళ్లు ఎవరైనా అభ్యంతరం చెబుతారు. కార్టూన్ అభ్యంతరం కాస్తా మరో తగాదాలోకి వెళ్లిపోతుంది. అందుకే పబ్లిష్ చేయలేదు. మీ అభిప్రాయం మాటల్లో రాయండి. లేదా విదేశీ కార్టూన్లు ఏమైనా ఎంచుకుని దాన్ని మార్చినా పబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్లవరకూ విషయం వెళ్ళే అవకాశం తక్కువ కదా. మీరు ఎఫ్.బిలో పబ్లిష్ చేశారు కదా. తెలంగాణవాళ్ళు చూస్తే గొడవ జరిగినా జరగొచ్చు. చూడకముందే తీసేయగలరేమో చూడండి. (సలహా మాత్రమే)

    మీ అభిప్రాయాన్ని మాటల్లో రాయండి. పబ్లిష్ చేస్తాను.

  7. modatidi ee kaarToon meedE anukunnaanu. renDu F.B. lO post chEsE uddesam naaku lEdu.ikkada elaa post chEyaalO teleeka alaa chEsaanu. daanni delete chEyaDaaniki prayatninchaanu kaani maallee ekkada post chEsaanO naakE dorakalEdu. thank u

  8. aaa గారూ, అవునా. నేనిది ఊహించలేదు. శేఖర్ గారు తెలంగాణ కార్టూనిస్టు. ఆయనా నేనూ ఒకరు కాదు. ఆయన జ్యోతిలోనో మరే దినపత్రికలోనో ఆస్ధాన కార్టూనిస్టు కూడాను.

వ్యాఖ్యానించండి