ఏమైందీ, తొక్కిసలాటా?
కాదు – చట్టం తనపని తాను చేసుకుపోయింది లేండి!
–
పాలక పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా కట్ట గట్టుకుని 17 యేళ్ళ నాడు మేసిన గడ్డి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సౌధాన్ని కూల్చేసే పెను భూతమై నిలిచింది. నితీశ్ కుమార్ (జెడి-యు), బి.జె.పి ల విడాకుల నుండి లబ్ది పొందాలని భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆశలు ప్రత్యేక సి.బి.ఐ కోర్టు తీర్పుతో ఒక్కసారిగా అవిరయ్యాయి. కోర్టు తీర్పులో నేర నిర్ధారణ తప్పదని ముందే గ్రహించిన రాజకీయ పక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో ఒక దారుణమైన ఆర్డినెన్స్ ను తేవడానికి ప్రయత్నించినా రాజకీయ సమీకరణలు దాన్ని సాగనివ్వలేదు. రాహుల్ అంతరంగం ఆకస్మికంగా విస్ఫోటనం చెందడంతో ఆ వేడిలో పడి లాలూ ఆశలు నీరుకారిపోయాయి.
1997లో గడ్డి కుంభకోణంలో చార్జి షీటు నమోదు కావడంతో అవిభక్త బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని లాలూ వదులుకోవాల్సి వచ్చింది. కానీ పెద్దగా చదువు లేని (పత్రికల వార్త) తన భార్యను సి.ఎం. సీటులో కూర్చోబెట్టడం ద్వారా భారత రాజకీయవేత్తల నిజ స్వరూపాన్ని ఆరోజుల్లోనే విప్పి చూపిన ఘనుడు లాలూ.
ఈ రోజు (అక్టోబర్ 1) ది హిందూ సంపాదకీయం ప్రకారం గడ్డి కుంభకోణం ఎంత విస్తృతమైనదంటే దాని విస్తృతి గురించి పూర్తి అవగాహన తెచ్చుకోడానికి సి.బి.ఐ కి కొన్ని యేళ్ళు పట్టింది. కుంభకోణంలో పాల్గొన్న నాయకుల సంఖ్య, కింది స్ధాయి అధికారులకు కూడా భాగం దక్కిన లోతు, దాదాపు 40 యేళ్ళ చరిత్ర ఉన్న కేసును తవ్వాలంటే ఆ మాత్రం సమయం కావాలేమో. బయటపడింది 1997లోనే అయినా దానికి మూలాలు 1970ల్లోనే పడ్డాయని ది హిందు తెలిపింది.
నోరులేదు కదా అని పశువుల గడ్డి మేసినందుకు భారీ తొక్కిసలాటనే పశువులు కానుకగా ఇచ్చాయని కార్టూన్ సూచిస్తోంది. చట్టం నిజంగా తనపని తాను చేసుకుపోతే ఏమవుతుందో కూడా కార్టూన్ చెబుతోంది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతో పాటు ఏకంగా 45 మంది దోషులుగా రుజువయ్యారంటే… భారత ప్రజల సంపద కొద్ది మంది భూస్వాములు, పెట్టుబడుదారులు ఏ స్ధాయిలో బొక్కుతున్నారో తేటతెల్లం అవుతోంది.
ఇది కేవలం ఒక్క కేసు మాత్రమే లాలూ పైన ఇంకా ఐదు కేసులు ఉన్నాయి. మొత్తం గడ్డి కుంభకోణంలో నమోదయిన కేసులు ముప్ఫైకి పైనే. అన్నీ కేసుల్లో విచారణ ఎప్పటికీ పూర్తయ్యేనో? లాలూతో నెయ్యం తప్పిపోయినప్పటికీ, నితీష్ కుమార్ సిద్ధంగా ఉన్నారు గనక కాంగ్రెస్ పార్టీకి పెద్ద బాధ లేదేమో. కానీ ఆర్.జె.డి నేతలు కూడా ధైర్యంగా ఉండడమే విశేషం. వారి దృష్టిలో లాలూ జైలుపాలయితే వారికి ప్రజల సానుభూతి ఓట్లు కురిపిస్తుంది మరి!
భారీ అవినీతి కేసుల్లో జైలుపాలై బెయిల్ పై బైటికి వచ్చిన యువ నేతకు ఘనంగా నీరాజనాలు అందించిన ఆంధ్ర ప్రదేశ్ జనానికీ, బీహార్ జనానికి తేడా ఏముందిక?

ఒక తరం జైలు కు వెళ్ళినా, ఇంకో తరం దోపిడీ కి సిద్ధం !
వంశ పారంపర్యం అవుతుంది దోపిడీ, ఇది యదార్ధం !
పదేళ్ళు జైల్లో ఉన్నా, వంద తరాలు రాజా జీవితం !
దోచుకున్నది కక్కించలేని న్యాయానికేదీ అర్ధం ?