పనిపిల్లను పెంపుడు కుక్కలతో కరిపించిన దుర్మార్గం!


కుక్కా, మనిషా?

కుక్కా, మనిషా?

జీవజాలంలో అత్యంత అభివృద్ధి చెందిన జాతి మనిషి. కానీ మనుషుల్లో ‘మనిషితనం’ చిక్కనవడానికి బదులు జంతు ప్రవృత్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషి ‘నిజంగా నాగరీకుడేనా’ అన్న అనుమానం కలక్క మానదు. పని చేయించుకోడానికని ఇంటిలో ఉంచుకున్న మైనర్ బాలికను పెంపుడు కుక్కలతో ఒళ్ళంతా కరిపించిన దుర్మార్గులని ఏమనాలి? వారిని జంతువులతో కూడా పోల్చడానికి మనసొప్పడం లేదు. జంతువు, జంతువు కాబట్టి జంతువులానే ప్రవర్తిస్తుంది. కానీ మనిషిలా ప్రవర్తించలేని మనుషుల్ని జంతువుతో ఎలా పోల్చగలం?

దక్షిణ ఢిల్లీలో పోష్ కాలనీగా చెప్పుకునే వసంత్ కుంజ్ లో అత్యంత ఘోరమైన, నీచమైన, క్రూరమైన…. ఇంకా ఇలాంటి పదాలు ఎన్నుంటే అన్నీ ఉపయోగించి వర్ణించగల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో తల్లీ కూతుళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళు 5 కుక్కల్ని పెంచుతున్నారట! తల్లీ కూతుళ్ళు ఒక ప్రైవేటు సంస్ధ ద్వారా ఒక మైనర్ బాలికను పనమ్మాయిగా పెట్టుకున్నారు. మాట వినలేదో, లేక పని సరిగ్గా చేయడంలేదని భావించారో గాని ఆ అమ్మాయిని తమ కుక్కలతో వంటి నిండా కనిపించారు. ఒంటిమీద కుక్క కరిచిన గాట్లు లేని భాగమే లేదని, ఇటువంటి ఘోరం ఎప్పుడూ చూడలేదని ఆ అమ్మాయిని కాపాడిన స్వచ్ఛంద సంస్ధ తెలిపింది.

“బాధితురాలిని మొదట చూసినపుడు షాక్ తిన్నాం. ఆమె తలపైన అనేక చోట్ల గాయాలు ఉన్నాయి. వాటికి కనీసం మందు లాంటిది కూడా పూయలేదు. ఆమె కళ్ళు బైటికి పొడుచుకు వచ్చాయి. చెవులు రెండూ తీవ్రంగా వాచిపోయి ఉన్నాయి. కుక్కలు కరిచిన గాట్లు, కత్తితో కోసిన గాయాలు, పుండ్లు ఒంటినిండా ఉన్నాయి. గతంలో మేము అనేకమందిని రక్షించాము. కానీ శారీరకంగా, మానసికంగా ఇంత తీవ్ర స్ధాయిలో హింస పెట్టిన కేసు ఎప్పుడూ చూడలేదు. యజమానుల క్రూరత్వానికి బలయిన బాధితురాలిని తల్లి దండ్రులు ఎవరని అడిగితే అత్యంత కష్టం మీద నోరు తెరవగలిగింది. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ నుండి తాను వచ్చానని చాలా కష్టం మీద చెప్పింది” అని స్వచ్ఛంద సంస్ధ శక్తి వాహిని ప్రతినిధి ఋషి కాంత్ తెలిపారు.

శక్తి వాహిని సంస్ధకు ఎవరో పొరుగువాళ్లు ఫోన్ చేసి చెప్పారట. ఒక అమ్మాయిని ఇంట్లో బంధించి ఉంచారని, ఆమెను తీవ్రంగా హింశిస్తున్నారని తమకు చెప్పడంతో పోలీసుల సహాయం కోరామని సంస్ధ ప్రతినిధులు తెలిపారు. “కొద్ది మంది పోలీసులతో ఆ ఇంటికి వెళ్లాము. ఒక పెద్దావిడ తలుపు తెరిచింది. కానీ ఆమె మాతో మాట్లాడడానికి నిరాకరించింది. లోపలికి రానివ్వలేదు. తన కూతురు వస్తే తప్ప ఎవరూ లోపలికి రావడానికి వీలు లేదని చెబుతూ అడ్డుకుంది. ఆమెతో వాదించడానికి ప్రయత్నించాం. ఆ ఏరియా ఎస్.డి.ఎం (సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్) కు రిపోర్ట్ చేయాలని పోలీసుల్ని కోరాం. అయినా సరే ఆమె మమ్మల్ని లోనికి వెళ్లనివ్వలేదు” అని ఋషి కాంత్ తెలిపారు.

ఆ తర్వాత కొంత సేపటికి ఒక మధ్య వయస్కురాలు ఇంటికి వచ్చింది. ఆమె ఆ పెద్దావిడ కూతురు. ఆమె కూడా బాధితురాలితో ఎన్.జి.ఒ సంస్ధ ప్రతినిధులను మాట్లాడనివ్వలేదు. ఇంటినుంచి వెళ్లిపోవాలని ఆమె డిమాండ్ చేసింది. “తమ ఇంట్లోకి వచ్చే హక్కు మాకు లేదని ఆమె మాతో పోట్లాటకు దిగింది. పోలీసులు గట్టిగా జోక్యం చేసుకోవడంతో చివరికి అమ్మాయితో మాట్లాడ్డానికి ఒప్పుకోక తప్పలేదు. అత్యంత దారుణమైన స్ధితిలో ఆ అమ్మాయి ఉంది. ఇరుగు పొరుగును విచారిస్తే వాళ్ళకి 5 కుక్కలు ఉన్నాయని చెప్పారు. ఆమె ఒంటిపైన తాజాగా కరిచిన గాయాలు కూడా ఉన్నాయి. తమ కుక్కలని అమ్మాయిపై ఉసి గొల్పారని మా అనుమానం” అని శక్తి వాహిని ప్రతినిధి తెలిపారు. బహుశా ఐదు కుక్కల మధ్య సంచరించి తల్లీ కూతుళ్లు తాము వాటిలో కలిసిపోయి ఉండవచ్చు.

యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అమ్మాయిని నాలుగు నెలల క్రితం ఇక్కడికి తెప్పించారని ప్రాధమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇంటి పని నిమిత్తం అమ్మాయిని నియమించుకున్నారనీ, ఒక ప్రైవేటు  ఏజన్సీ ద్వారా తల్లీ కూతుళ్ళు బాలికను మాట్లాడుకున్నారని పోలీసులు తెలిపారు. బాలిక మాట్లాడలేని పరిస్ధితిలో ఉండడంతో ఆమె నుండి సమాచారం ఇంకా సేకరించలేదని ది హిందు తెలిపింది.

ఐ.బి.ఎన్ లైవ్ ప్రకారం బాలిక వయస్సు 15 సంవత్సరాలు. సోమవారం సాయంత్రం మనిషి రూపంలో ఉన్న క్రూర జాతి నుండి ఆమెను రక్షించిన తర్వాత సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. కూతురు వయసు 50 సంవత్సరాలు, ఆమె తల్లి వయసు 85 సంవత్సరాలు ఉంటాయని ఐ.బి.ఎన్ తెలిపింది. ఒక ప్రైవేటు కంపెనీలో ఓ సీనియర్ పోస్టులో ఆమె పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాలుగు నెలల నుండి బాలిక ఆ ఇంట్లో పని చేస్తున్నట్లు ది హిందు తెలపగా, సంవత్సరం నుండి పని చేస్తున్నట్లుతనను ప్రతి రోజూ కొట్టడమేనని అమ్మాయి చెప్పినట్లుగా ఐ.బి.ఎన్ తెలిపింది. తనను ప్రతి రోజూ కొట్టడమేనని బాలిక చెప్పినట్లు సదరు చానెల్ తెలిపింది.

పోష్ కాలనీల్లో నివసించే మనుషుల్లో ఎంత ఘోరమైన వ్యక్తులు ఉంటారో వసంత్ కుంజ్ దారుణం స్పష్టం చేస్తోంది. పరిసరాలు పోష్ గానే ఉన్నా అందులో బతికే మనుషుల మనసులు మాత్రం పోష్ గా ఉండనవసరం లేదనీ స్పష్టం చేస్తోంది. నేరాలను ఎల్లప్పుడూ పేదలకు అంటగట్టి సూత్రీకరణలు చేసే పెద్ద మనుషుల కొద్ది బుద్ధులను కూడా ఈ దుర్మార్గం తెలియజేస్తోంది. పేదల ఆర్ధిక స్ధితిగతులు వారిని పెట్టీ నేరాలకు పురిగొల్పితే పోష్ కాలనీవాసుల దుర్మార్గాలకు ఏ కారణం చెప్పుకోవాలి? మానసిక వ్యాధులతో మనిషి దశ నుండి జంతు దశకు ప్రయాణం కట్టారని అసహ్యించుకోవడం తప్ప!

2 thoughts on “పనిపిల్లను పెంపుడు కుక్కలతో కరిపించిన దుర్మార్గం!

  1. పింగ్‌బ్యాక్: ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s