జవహర్ లాల్ నెహ్రూ పండిట్ కాదా?


న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రెసిడెంట్ ట్రూమన్, విజయ లక్ష్మి పండిట్ లతో నెహ్రూ

న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రెసిడెంట్ ట్రూమన్, విజయ లక్ష్మి పండిట్ లతో నెహ్రూ

ప్రశ్న:  పండిట్ నెహ్రూ వంశ చరిత్ర ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఆయన అసలు పండిటే కాదని కొందరు అంటున్నారు?

జవాబు: భారత దేశపు ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పండిట్ వంశస్ధుడే. మోతీలాల్ నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణులకు చెందినది. అనగా జవహర్ లాల్ నెహ్రూ  కాశ్మీరీ పండిట్ ల వంశంలో జనించారు. వారి కుటుంబం 18వ శతాబ్దం ప్రారంభంలోనే ఇండియాకు వలస వచ్చింది.

నెహ్రూ అసలు పండిట్ కాదని ప్రచారం చెయ్యడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్ధం కాలేదు. ‘పండిట్’ కాదు అంటే ‘పండిట్ వంశస్ధుడు కాదు’ అని చెప్పదలిచారా లేక ‘పండితుడు కాదు’ అనా? ‘పండిట్ వంశస్ధుడు కాదు’ అనే పనైతే అందులో నిజం లేదు. ‘పండితుడు కాదు’ అనే పనైతే అది చూసేవారిని బట్టి ఉంటుంది.

‘డిస్కవరి ఆఫ్ ఇండియా’ పుస్తకం రాశారు కనుక ఆయన మేధో సంపద కలిగిన పండితుడు అని వాదించేవారు ఉన్నారు. కానీ చదువులో ఆయన పెద్దగా రాణించలేదు అన్న సంగతి తెలిసినవారు మాత్రం ‘ఆయనేం పండితుడు?’ అని ప్రశ్నిస్తారు.

తన 16వ యేట వరకు ఆంగ్ల ట్యూటర్ల వద్ద విద్యాభ్యాసం నెరిపిన జవహర్ లాల్ నెహ్రూ అనంతరం లండన్ లోని హ్యారో స్కూల్ లో చేరి చదువుకున్నారు. హ్యారో స్కూల్ లో చేరక ముందు ఒక భారతీయ ట్యూటర్ వద్ద హిందీ, సంస్కృతం నేర్చుకున్నారని చెబుతారు. హ్యారో స్కూల్ తర్వాత ట్రినిటీ కాలేజీలో, ఆ తర్వాత కేంబ్రిడ్జిలో ఆయన చదివారు. కేంబ్రిడ్జిలో నేచురల్ సైన్స్ లో హానర్స్ పూర్తి చేశాక, ‘ఇన్నర్ టెంపుల్ లో బారిస్టర్ విద్య చదివారు. చదువులో తాను ‘అంత గొప్పగా ఏమీ లేననీ, అలాగని సిగ్గుపడే విధంగా కూడా లేనని’ నెహ్రూ స్వయంగా చెప్పుకున్నారు. అంటే ‘యావరేజ్’ అన్నమాట!

మోతీలాల్ నెహ్రూ సంతానంలో జవహర్ లాల్ నెహ్రూయే అందరిలో పెద్ద. ఆయన చెల్లిలు విజయ లక్ష్మి పండిట్ ఐరాస జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. 

కాశ్మీర్ నుండి అలహాబాద్ వలస వచ్చిన నెహ్రూ వంశంలో పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ, తమకు తీరని ద్రోహమే చేశారని కాశ్మీరీలు భావిస్తారు. కాశ్మీర్ లో ‘ఫ్లెబిసైట్’ జరిపిస్తానని హామీ ఇచ్చిన నెహ్రూ దానిని నెరవేర్చలేదు. పైగా హామీ నెరవేర్చాలని కోరినందుకు షేక్ అబ్దుల్లాను దాదాపు 17 సంవత్సరాలకు పైగా జైలు పాలు చేశారు.

(ఈ ప్రశ్న స్పామ్ లోకి వెళ్లిపోయింది. ఇతర ప్రశ్నలకు వీలు వెంబడి సమాధానం ఇవ్వగలను -విశేఖర్)

11 thoughts on “జవహర్ లాల్ నెహ్రూ పండిట్ కాదా?

  1. ఈ విషయం మీద అంటే నెహ్రు కుటుంబం మీద కొన్ని ఆర్టికల్స్ నెట్లో పోస్ట్ చేయబడి వున్నాయి. ఆ ఆర్టికల్ మీరు చదివారా? ఆ పోస్ట్ చదివితే ఇంకా నమ్మలేని విషయాలు చాల తెలుస్తాయి. వొకసారి చదవగలరు.

  2. నెహ్రూ పండితుడా…కాదా అనే చర్చ కన్నా ఆయన పాండిత్యం వల్ల దేశానికి ఎంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
    ఇక నెహ్రూని పండిట్ అని పిలవడం వెనక ఇతర కారణాలూ ఉండి ఉండవచ్చు.
    ఉదాహరణకు గాంధీని మహాత్మా గాంధీగా, సర్దార్ వల్లభాయ్ గా, లోకమాన్య తిలక్, ఆంధ్రకేసరి ప్రకాశం…లాగా ఇలా ఆనాటి జాతీయోద్యమ నాయకుల్లో చాలా మందికి పేరుకు ముందు ఒక బిరుదు తగిలించి పిలిచేవారు. అందులో భాగంగానే ఈ పండిట్ వచ్చి ఉండవచ్చు.
    ఇక్కడ అప్రస్తుతమే ఐనా ఓ చిన్నవిషయం ఏంటంటే మనం జవహర్ లాల్ అని పిలుచుకుంటాం. కానీ జవాహర్ లాల్ గా పలకాలని చెబుతారు.
    జవాహర్ అంటే రత్నం, ఆభరణం అని అర్థం ఉందని సమాచారం.
    అలాగే లాల్ బహదూర్ పేరులోని శాస్త్రి కూడా…బ్రాహ్మణుల పేరు వెనక వచ్చే శాస్త్రి లాంటిది కాదని, బనారస్ వర్సిటీలో శాస్త్రి పరీక్ష పాసైన వాళ్లు…. శాస్త్రి అని పెట్టుకుంటారని
    ఎక్కడో చదివినట్లు గుర్తు.

  3. జవహర్లాల్ నెహ్రు పండిట్ అవునా? కాదా? అని ప్రశ్నించడం , కేవలం గడ్డి వాము లో సూది వెదికిన చందం లా ఉంది ! హిందీ లో ఏమో కానీ నెహ్రు , ఆంగ్లం లో మంచి వక్త ! జైలు జీవితం గడుపుతూ ‘ భారత దర్శనం ‘ ( డిస్కవరీ ఆఫ్ ఇండియా ) రాసిన గొప్ప రచయిత ! అహింసా మార్గం లోనే, స్వాతంత్ర్యం సాధించడం లో గాంధీ తో పాటుగా పనిచేసిన క్రియాశీలి ! ఆయన తండ్రి , మోతీ లాల్ నెహ్రూ, తన సంపాదన లో చాలా భాగం, కాంగ్రెస్ పార్టీ కి దానం చేసిన దేశ భక్తుడు ! ఆయన , తన ప్రతి పుట్టిన రోజూ , తన బరువు తో సమానమైన ధనాన్ని పేదలకు దానం చేసిన దాన శీలి ! జవహర్ లాల్ నెహ్రూ ఒక మానవుడే , ఆ తరువాతే ప్రధాన మంత్రి అయ్యాడు !
    ఆయన వంద శాతం పొరపాట్లేవీ చేయలేదు అనడం ఎంత హాస్యాస్పదమో, కట్టు బట్టలతో, రాజకీయ ‘వ్యాపారం’ మొదలు పెట్టి , ప్రజలను దగా చేసి, కోటీశ్వరులవుతున్న నేటి రాజకీయ నాయకులను ఏమాత్రం పట్టించుకోకుండా , నెహ్రూ పండిట్ అవునా? కాదా? అని సందేహించడం కూడా అంతే హాస్యాస్పదం !

వ్యాఖ్యానించండి