అందరూ దొంగలే, ఎవరికీ ఓటు వేయం -కార్టూన్


None of the above

ఎన్నికల్లో ఓటు హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఒక తీర్పు ప్రకటించింది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉండాలనేది ఆ తీర్పు తాత్పర్యం. అభ్యర్ధులందరిని తిరస్కరించే హక్కు ఓటర్ కి ఉండాలనీ, అది కూడా భావ ప్రకటనా స్వేచ్చలో భాగమేననీ సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఇ.వి.ఎం మిషన్లలో ‘ఎవరూ కాదు’ అనే బటన్ చేర్చాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశిస్తున్నట్లు పేర్కొంది. పత్రికలతో సహా అనేకమంది దీనిని చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణిస్తున్నారు.

తిరస్కరించే హక్కు భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం అని చెప్పిన కోర్టు విచిత్రంగా తిరస్కరణ ఓట్లను లెక్కించరాదని చెప్పింది. ఆపాటికి తిరస్కరణ హక్కు ఇచ్చి ఉపయోగం ఏమిటో అర్ధం కానీ విషయం. ఒక వ్యక్తి/ఓటర్ ‘పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ అసెంబ్లీ/పార్లమెంటు కు వెళ్ళే అర్హత లేదని’ భావించాడనుకుంటే, ఆ భావం హక్కు అనీ, దాన్ని ప్రకటించే హక్కు అతనికి/ఆమెకు ఉన్నదని కోర్టు గుర్తిస్తే ఆ ఓటును లెక్కించవద్దని చెప్పడం ఏమిటి? అలాంటప్పుడు తన భావాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ అతనికి/ఆమెకు సంపూర్ణంగా సిద్ధించినట్లు కాదు కదా?

అభ్యర్ధులందరికి వచ్చిన ఓట్లు, చెల్లని ఓట్లు, మొత్తం పోలయిన ఓట్ల లెక్కలు చెబుతారు కాబట్టి వాటి ద్వారా తిరస్కరణ ఓట్లు ఎన్ని వచ్చాయో పరోక్షంగా తెలుసుకునే అవకాశం ఉండొచ్చు. కానీ పరోక్షంగా కూడికలు, తీసివేతలు వేసుకుని సంపాదించే లెక్క అధికారికం కాదు కదా. ఆ మేరకు అధికారికంగా తిరస్కరణ హక్కును గుర్తించనట్లే కదా! ఇక తిరస్కరణదారుల భావ ప్రకటనా స్వేచ్ఛను కోర్టు తీర్పు అధికారికంగా ఎక్కడ గుర్తించినట్లు?

అభ్యర్ధులందరినీ తిరస్కరించే హక్కును గుర్తించడం వలన పోలింగు బూత్ కు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని కోర్టు విశ్వాసం వ్యక్తం చేసింది. పార్టీలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. పార్టీలకు నిజంగా అంత సున్నిత మనస్తత్వం, ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లయితే అసలు కోర్టు ఈ తీర్పు ఇవ్వవలసిన అవసరమే ఉండేదా? నేరస్ధులను, దొంగలను, హంతకులను అభ్యర్ధులుగా నిలబెట్టడానికి అలవాటు పడిన రాజకీయ పార్టీలు తిరస్కరణ హక్కు ఇవ్వడంతోనే పవిత్రులయిపోతాయా?

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఒక సానుకూల అంశమే గానీ, అదే మంచి అభ్యర్ధులను తయారు చేస్తుందనుకుంటే అంతకంటే మించిన భ్రమ మరొకటి ఉండబోదు. పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్ధపై ప్రజల్లో నానాటికీ నమ్మకం పోతున్న పరిస్ధితుల్లో ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సుప్రీం కోర్టు నానా తంటాలు పడుతోంది. విడత విడతకూ పడిపోతున్న ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి వరుస సంస్కరణలు తానే ప్రవేశపెడుతోంది. నిజానికి ఈ చర్యలు చేపట్టాల్సింది రాజకీయ పార్టీలు. వారికి ఆ చిత్తశుద్ధి లేదు గణకనే కోర్టు రంగంలోకి దిగుతోంది.

మన పిచ్చిగానీ, చిత్తశుద్ధి లేని, చెత్త శుద్ధి మాత్రమే ఉన్న రాజకీయ పార్టీల వంకరను కోర్టు తీర్పులు సరిదిద్దుతాయా? జనం మేలుకోవాలి గాని!

3 thoughts on “అందరూ దొంగలే, ఎవరికీ ఓటు వేయం -కార్టూన్

  1. నిజమే శేఖర్ గారూ….రాజకీయ పార్టీల్లో…వాటి విధానాల్లో మార్పు రాకుండా, ఊరికే తిరస్కరించే అవకాశం వల్ల ఒరిగేది ఏమిటి…?
    అదీ తిరస్కరణ ఓట్లను అసలు లెక్కించనపుడు ఇంక ఓట్లు వేసేది ఎందుకు…?
    లెక్కించే ఓట్ల కోసం, అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించే ఓటు కోసం పోలింగ్ బూత్ లకు రాని జనం,
    అసలు లెక్కించడమే జరగని ఓట్ల కోసం వస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

    అసలు ఒక వ్యక్తికి ఓటు వేయలేదంటేనే అతన్ని తిరస్కరించినట్లు కదా…
    ఎవరికి ఓటు వేయకుండా దూరంగా ఉండడం అంటే అభ్యర్థలెవరూ నచ్చలేదని…అసలు ఓటింగ్ వ్యవస్థ పట్ల పెద్ద సీరియస్ నెస్ లేదనే కదా అర్థం.
    ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిస్థితి దురదృష్టకరమే కాదు….ప్రమాదకరం, విషాదకరం కూడా.

    ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే……ఎప్పుడో మరణించిపోయిన రాజకీయ నేతలను స్మరించుకునేందుకోసం, సెలవులు ప్రకటించే ఈ దేశంలో…..
    ఓట్లు వేసే రోజు మాత్రం సెలవు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాలెట్ ఓటు హక్కు ఉండవచ్చు. కానీ అనేక మంది ప్రైవేటు ఉద్యోగులకు, చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే కార్మికులకు ఆరోజు సెలవు ఉండదు. అంతెందుకు, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభానిగా చెప్పుకునే మీడియాలో…ఆరోజు సెలవు ఇవ్వరు సరికదా…ఆరోజు సెలవు పెట్టడం తీవ్ర విషయంగా పరిగణిస్తారు. ….చైతన్య పరచాల్సిన మీడియాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వారి సంగతి చెప్పేదేముంది.
    అనేక చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంటుంది.
    ప్రముఖ రచయిత పతంజలి (కేఎన్ వై) ఓ సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా ఎండగట్టారు.

    …..మనదేశంలో ప్రభుత్వాల్ని ప్రజలు ఎన్నుకుంటారనుకుంటాం….
    కానీ మనదేశంలో ఓట్లెప్పుడూ మూడు విషయాల కోసం జరుగుతాయి.
    ఒకటి మతం, ఇంకోటి కులం, మరోటి డబ్బు
    ఏ మతం లేదా కులం వాళ్లు అధికంగా ఉంటే ఆ ఏరియాలో వాళ్లను ఎంపిక చేసి..
    అందులోనూ డబ్బులు ఎవడు ఎక్కువ వెదజల్ల గలడో వాడికి టికెట్ ఇస్తారు.
    ఎవరైనా పదవిలో ఉన్న నేత చనిపోతే…అతని భార్యకో కొడుక్కో టికెట్ ఇస్తారు-సానుభూతి ఓట్ల కోసం..
    అసలు ఎంతమంది జనం ఓట్లేస్తున్నారు… పోలింగ్ లో వేసిన ఓట్ల కన్నా వేయని ఓట్లే ఎక్కువ ఉంటాయి.
    ఆ సగం కన్నా తక్కువ ఓట్లను అభ్యర్థులందరూ పంచుకుంటే….గెలిచాడని ఎవరనుకుంటామో….వాడికి పదిశాతం ఓట్లు కూడా రావు.
    అంటే…మనం గెలిచాం అనుకుంటున్న వాళ్లెవరూ మెజారిటీ ప్రజల మద్దతు లేదన్న మాట….
    అలా మెజారిటీ ప్రజల మద్దతు లేని వాడు…ఆ ప్రజలందరినీ పాలించే దుస్థితి.
    ప్రజాస్వామ్యంలో ఇదో విచిత్రం…?!

  2. చైతన్య పరచాల్సిమీడియా సెలవు తీసుకొంటే మరి చైతన్యం కాస్త చల్లారి పోతుంది తులసి గారు!
    మిగతా విషయాల్లొ మీరన్నది నిజం చందు తులసి గారు,
    కొన్ని ప్రాంతాల్లో పంచాయితి ప్రెసిడెంట్‌ స్థాయిలో ఆ పై స్థాయిలో పోటీలో నిలబడ్డ అభ్యర్దుల్లోనే వేలంపాటలు ద్వారా అబ్యర్దులను ఎన్ను కొని అసలు ప్రజల పాత్రే లేకుండ చేస్తారు. మరి దీని కి ఎన్నికల అధికారులు ఎలా ఒప్పుకుంటారో తెలియదు. ఇదే పద్దతి అసెంబ్లి, పార్లమెంట్‌ తెరవెనుక జరుగుతూ వుండ వచ్చు.అలా జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అందుకు అలవాటు పడిపోయి కూడా వుంటారు. అడిగే నాధుడే వుండడు. దీన్నే మనం ప్రజా స్వామ్యం అని ముద్దుగా పిలుచుకుంటూవుంటాం.

    ఇంక పై స్థాయి లో కూడా ఎన్నో చట్ట బద్దమైన అడ్డ దారులున్నాయి గదా! దొడ్డీ దారిన ప్రధాన మంత్రులు హొం మంత్రులవటం.

  3. తిరుపాలు గారూ..నా ఉద్దేశం మీడియా సంస్థలన్నింటికీ ఆ రోజు సెలవు ఇవ్వాలని కాదు.
    ప్రజాస్వామ్యానికి…ప్రాణం లాంటి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడనానికి పౌరులకు ఎంత ఇబ్బంది ఉందో…చెప్పడానికి మీడియాను ఉదాహరించాను.
    నా ఉద్దేశం ఏమిటంటే….పౌరులకు ఓటు వేయడం అనేది తలకు మించిన పనిగా పరిణమించకూడదని…( ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే మీడియా…లేదా ఇతర అత్యవసర సర్వీసుల్లో ఉన్న వారికి బ్యాలెట్ తరహా ఓటు అనుమతించవచ్చు కదా..?)
    పోలియో నిర్మూలన కార్యక్రమం ఎలాగైతే…బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో, అన్ని చోట్లా అందుబాటులో ఉంటుందో….( సరిగ్గా అలాగనే కాదు. నా ఉద్దేశం సౌకర్యం), అలా అందరికీ అందుబాటులో ఉండాలని. అందులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఆచరణ రూపం దాల్చడానికి కొంత శ్రమ అవసరం కావచ్చు…కాని ఓటింగ్ మనదేశానికి…ప్రజాస్వామ్యానికి చాలా ప్రధానమైంది కదా..?
    ఎప్పుడైతే ఓటు వేయడం సులభంగా మారుతుందో..అప్పుడు అన్ని రకాల ప్రజలూ ఓటు వేయడానికి ముందుకొస్తారు. కొత్త నాయకులు ఉద్భవిస్తారు. ఈ దేశంలో ఎంతో కొంతైనా మార్పు వస్తుందని…నా ఆశ

వ్యాఖ్యానించండి