గవర్నమెంట్ షట్ డౌన్! (ప్రభుత్వం మూసివేత) పశ్చిమ పత్రికల్లో ఏది చూసినా ఇదే గోల. ఉదాహరణకి ఈ వార్తల హెడ్డింగులు చూడండి.
House conservatives hold firm as government shutdown looms
-Reuters: Sat Sep 28, 2013 6:37am EDT
US braces for possible government shutdown
-BBC News: 27 September 2013 Last updated at 22:09 GMT
Stocks End Week Lower As Govt. Shutdown Deadline Approaches
-Forbes: 9/28/2013 @ 10:17AM
10 ways a government shutdown would affect your daily life
-CNN: September 27, 2013 — Updated 1605 GMT
ఈ వార్తల సారాంశం ఏమిటంటే అక్టోబర్ 1 తేదీ నుండి అమెరికా ఒక మినీ సంక్షోభం ఎదుర్కోనున్నది. ప్రభుత్వం పని చేయడానికి అవసరమైన నిధుల లభ్యత పైన పాలక, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఈ పరిస్ధితి వస్తోంది. ‘ఒబామా కేర్’ గా ప్రసిద్ధి చెందిన ‘హెల్త్ కేర్ పధకం’ కు నిధుల కేటాయింపు మానుకుంటే తప్ప డెమొక్రాట్లతో బడ్జెట్ ప్రతిపాదనలపై ఒక అంగీకారానికి వచ్చేది లేదని రిపబ్లికన్ పార్టీ పట్టుబడుతోంది. ప్రబుత్వ బడ్జెట్టా? లేక ఒబామా కేరా? రెండింటిలో ఏది కావాలో తేల్చుకొమ్మని రిపబ్లికన్లు హెచ్చరిస్తున్నారు.
కానీ హెల్త్ కేర్ చట్టాన్ని వదులుకోడానికి ఒబామా పార్టీ సిద్ధంగా లేదు. దానితో పీట ముడి పడిపోయింది. బడ్జెట్ బిల్లు ఆమోదం పొందితే తప్ప ప్రభుత్వం నడవడానికి నిధులు అందుబాటులోకి రావు. బడ్జెట్ ఆమోదం పొందకపోతే బడ్జెట్ లోని వివిధ ఖాతాల్లో అంకెలు ఉండవు. సున్నాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎవరికీ చెల్లింపులు చేయలేరు. దానితో ఎక్కడికక్కడ చెల్లింపులు ఆగిపోయి ప్రభుత్వ విభాగాల్లో అనేకం మూతబడిపోయే పరిస్ధితి వస్తోంది.
అమెరికా ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ 1 తేదీతో మొదలై సెప్టెంబర్ 30 తేదీతో ముగుస్తుంది. అంటే మరో రెండు రోజుల్లోపల బడ్జెట్ బిల్లు ఆమోదం పొందాలి. నిజానికి పూర్తిస్ధాయి బడ్జెట్ బిల్లు అందుబాటులో లేదు. 30 బిలియన్ డాలర్ల తాత్కాలిక బడ్జెట్ ను సెనేట్ ఆమోదించి ప్రతినిధుల సభకు పంపింది. సెనేట్ లో డెమోక్రాట్లదే ఆధిపత్యం. కాబట్టి అక్కడ బిల్లు ఆమోదం పొందింది. కానీ ప్రతినిధుల సభ (House of Representatives) లో రిపబ్లికన్లదే ఆధిపత్యం. ఒబామా కేర్ ఫండింగ్ ను నిలిపితేనే తాత్కాలిక బడ్జెట్ బిల్లుకు ఆమోదం ఇస్తామని రిపబ్లికన్లు తెగేసి చెబుతున్నారు.
పూర్తిస్ధాయి బడ్జెట్ కాకుండా తాత్కాలిక బడ్జెట్ బిల్లు మాత్రమే ఎందుకు అందుబాటులో ఉన్నట్లు? అది మరో సంక్షోభం! అమెరికా ప్రభుత్వ అప్పు పరిమితి త్వరలోనే దాటిపోనుంది. అంటే అమెరికా ప్రభుత్వం చేసే అప్పు 16.7 ట్రిలియన్ డాలర్లకు మించకూడదని పరిమితి ఉన్నది. అక్టోబర్ 17 తేదీతో అమెరికా అప్పు ఈ పరిమితికి చేరనుంది. ఈ పరిమితిని పెంచుతూ అమెరికా ఉభయ సభలూ మరో చట్టం ఆమోదించాల్సి ఉంది. అలా ఆమోదిస్తే తప్ప రోజువారీ వాడకానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉండదు. ఋణ పరిమితి పెంపు బిల్లు ఆమోదం పొందేవరకూ ఖర్చులు గడవడానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నమాట!
ఈ ఋణ పరిమితి పెంపు బిల్లుకు కూడా రిపబ్లికన్లు తేలికగా ఆమోదిస్తారని గ్యారంటీ లేదు. రెండేళ్ల క్రితం ఇదే పరిస్ధితి వచ్చినపుడు ఇరు పక్షాల మధ్య తీవ్ర స్ధాయిలో చర్చల ఘర్షణ జరిగింది. కంపెనీలకు పన్ను మినహాయింపులు కొనసాగించాలనీ, ఉద్యోగులు, కార్మికులు తదితర వర్గాలపై మరిన్ని పన్నులు వెయ్యాలనీ రిపబ్లికన్లు పట్టుబడితే, సంపన్నులకు పన్ను మినహాయింపులను తగ్గించాలని డెమోక్రాట్లు పట్టుబట్టారు.
చివరికి ఎలాగైతేనేం ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. దాని ప్రకారం సంపన్నులకు పన్ను మినహాయింపులు కొనసాగాయి. కొన్ని చోట్ల మరింత పెరిగాయి. సాధారణ ప్రజలపై మాత్రం పన్నులు, కోతలు భారీగా విధించారు. 2013 జనవరి నుండి ఆటోమేటిగ్గా అనేక పన్నులు, కోతలు అమలు మొదలయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రిపబ్లికన్లు-డెమోక్రాట్ల మధ్య తలెత్తిందని చెప్పిన ప్రతిష్టంభన వాస్తవంగా ప్రజలపై బాదుడుకేనని ఆ తర్వాత జనానికి తెలిసి వచ్చింది.
ఇప్పుడు కూడా దాదాపు అదే ప్రతిష్టంభన వచ్చిందని చెబుతున్నారు. అప్పటి ప్రతిష్టంభనకు ‘ఫిస్కల్ క్లిఫ్’ అని పేరు పెడితే, ఇప్పటి ప్రతిష్టంభనకు ‘గవర్నమెంట్ షట్ డౌన్’ అని పేరు పెట్టారు. ‘ఏ రాయయితేనేం పళ్లూడగొట్టుకోడానికి?’ అన్నట్లు, ‘ఏ పేరు పెడితేనేం అది అంతిమంగా జనంపై బాదడానికి ఉద్దేశించినప్పుడు?’ అని నిట్టూర్చడమే ఎప్పుడూ అమెరికా జనానికి మిగిలింది.
