జగన్ కి బెయిలు వచ్చేసింది!


Jaganmohan Reddy

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దర్యాప్తు పూర్తయిందని సి.బి.ఐ చెప్పడంతో కడప ఎం.పికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పెషల్ సి.బి.ఐ కోర్టు తెలిపింది. దాదాపు సంవత్సరంన్నర పైగా జైలులో గడుపుతున్న జగన్, బెయిల్ పై విడుదల కానున్న వార్త ఆయన అభిమానుల్లో సంతోషాతిరేకాలు నింపాయి.

అయితే కాంగ్రెస్ పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్న ఫలితంగా జగన్ త్వరలో విడుదల కానున్నాడని ఆరోపించిన టి.డి.పి జోస్యం నిజం అయినట్లా?

జగన్ ను విషపురుగుగా అభివర్ణించిన తెలుగు దేశం పార్టీ నాయకులకు బెయిలు వార్త ఆశనిపాతం కావచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినందున ఆ ప్రాంతంలో (లేదా కొత్త రాష్ట్రంలో) కాంగ్రెస్-టి.ఆర్.ఎస్ కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువని అందరూ భావిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఆశల్లా సీమాంధ్ర లోనే. జగన్ జైలు నుండి విడుదల అయితే సీమాంధ్రలో వైకాపా పార్టీ అవకాశాలు మెరుగవుతాయని, టి.డి.పి భయం అదేననీ పలువురు విశ్లేషకులు ఇప్పటికే సూచిస్తున్నారు. అందువలన టి.డి.పి పరిస్ధితి రెంటికీ చెడ్డ రేవడి కానుందని పలువురి అంచనా.

కోర్టు విధించిన షరతుల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా జగన్ హైద్రాబాద్ వదిలి ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు. అంటే అనుమతితో ఎక్కడికైనా వెళ్లొచ్చని అర్ధం. కొద్ది రోజులు పోయాక కోర్టు సంతృప్తిపడితే మరో విడత ఓదార్పు యాత్రకు అనుమతి లభిస్తుందేమో! ఇంతకీ ఓదార్పు యాత్రలు ఇక ముగిసినట్లా, లేక తిరిగి ప్రారంభం అవుతాయా?

కోర్టు అవసరం అనుకున్నప్పుడల్లా జగన్ కోర్టు ముందు హాజరు కావాలన్నది మరో షరతు. అది ఎలాగూ తప్పదు. అసలు దీనిని షరతు అనకూడదేమో.

జగన్ పై మోపిన కేసులన్నింటిలోనూ అన్ని రకాలుగా దర్యాప్తు పూర్తయిందని సి.బి.ఐ చెప్పినందున (షరతులతో కూడిన) బెయిల్ ఇస్తున్నట్లు సి.బి.ఐ కోర్టు జడ్జి తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జడ్జి తీర్పు ఇచ్చినపుడు జగన్ భార్య వై.ఎస్.భారతి, బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి తదితరులు కోర్టులోనే ఉన్నారని ది హిందు తెలిపింది.

అయితే మూడు రోజుల క్రితం, సెప్టెంబర్ 20 తేదీన, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ను విచారించిన ప్రత్యేక కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ కష్టడి పొడిగిస్తున్నట్లు తెలిపింది. అయితే జగన్ బెయిల్ పిటిషన్ ను సెప్టెంబరు 18 తేదీన విచారించిన కోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టుకున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 23న తన ఆదేశాలు వెలువరిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ రోజు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

మరోసారి రాష్ట్ర రాజకీయాలు రచ్చ రచ్చ కానున్నాయి. మూడేది ఎప్పుడూ జనానికే కదా!

10 thoughts on “జగన్ కి బెయిలు వచ్చేసింది!

  1. జగన్ బెయిలు వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చు.
    తేదేపా ఆరోపిస్తున్నట్లు..భవిష్యత్తులో కాంగ్రెస్ లో కలవడానికి జగన్ పార్టీ అంగీకరించి ఉండవచ్చు.
    నాకు మరీ హాశ్చర్యం కలిగిస్తున్నదేమంటే ..అసలు జగన్ కేసులో క్విడ్ ప్రోకొ ఆధారాలే లేవట.. !!!
    మరి ఏ ఆధారాలు లేకుండానే ఇంతకాలం బెయిలు ను వ్యతిరేకిస్తూ వచ్చిందా సీబీయై..!?
    మొద్దబ్బాయిని ప్రధానిగా చేయడనికి సోనియా చక చకా పావులు కదుపుతున్నారు.
    తెలంగాణ ప్రకటన, ఆహార భద్రత బిల్లు, .ఆ వరసలోదే జగన్ బెయిలు..
    ముందు ముందు మరిన్ని సిత్రాలు చూడాల్సి రావచ్చు.

  2. కాంగ్రేస్ మర్క్ రాజకీయాలకు ఇది పరాకాష్ట!ఈ కేస్ ని ఇంకా పొడిగించరు!మరికొంతకాలం జగన్ ను విడుదలకాకుండా కూడా చేయగలరు సి.బి.ఐ వాళ్ళు!ఈ దేశంలో చట్టం కొందరికి(పలుకుబడి కలిగిన రాజకీయనాయకులకు,బడా పారిశ్రామికవేత్తలకు) చుట్టం కాదంటారా? నిన్న ములాయం కేస్, నేడు జగన్ కేస్,రేపు లాలు కేస్ ఈ విషయాన్ని తెలుపుతున్నాయి! సి.బి.ఐ ని కాంగ్రేస్ ఏ విదం గా వాడుకుంటుందో తెలుసుకోవడానికి!

  3. చట్టం ముందు అందరు సమానులే అంటుంది మనచట్టం. చట్టం తనపని తాను చేసుక పోతుంది అంటారు ఏలిన వారు. కూటికి లేక చిన్న చిన్న దొంగ తనాలు చేసే వాల్లను మక్కెలిరగదన్ని బొక్కలోతోస్తుంది చట్టాన్ని కాపాడే యంత్రాంగం. మరి లక్షల కోట్ల ఆర్దిక నేరాలకు పాల్పడే వాల్లని చుట్టం లా చూసే మనచట్టానికి సమానత్వం ఎక్కడిది?

వ్యాఖ్యానించండి