అమెరికా: సిక్కు డాక్టర్ పై దాడి


Prabhjot Singh1

అమెరికాలో సిక్కు మతస్ధుల పట్ల అపోహలు కొనసాగుతున్నాయి. సిక్కుల తలపాగాను బిన్ లాడెన్ తలపాగాతో పోల్చుకుంటూ మొత్తం సిక్కులను టెర్రరిస్టులుగా భ్రమించే ధోరణి కొనసాగుతోంది. న్యూయార్క్ నగరంలో డాక్టర్ మరియు ప్రొఫెసర్ కూడా అయిన ఒక సిక్కు యువకుడిపై జరిగిన అమానుష దాడి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది.

అంతర్జాతీయ మరియు ప్రజా సంబంధాల విద్యా సంస్ధ (School of International and Public Affairs) లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుజోత్ సింగ్ పైన శనివారం ఈ దాడి జరిగింది. న్యూయార్క్ సమీపంలోని హర్లెమ్ ప్రాంతంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా దాడి జరిగిందని ది హిందు తెలిపింది. ప్రభుజోత్ స్నేహితుడు సిమ్రాన్ జీత్ సింగ్ ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన వివరాల ద్వారా దాడి గురించి భారత పత్రికలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సిమ్రాన్ జీత్, కొలంబియా యూనివర్సిటీలో ‘మతం’ అంశం పైన డాక్టోరల్ అభ్యర్ధిగా ఉన్నారు.

దాడికి పాల్పడినవారు ప్రభుజోత్ ను “ఒసామా” అనీ, “టెర్రరిస్టు” అనీ తిట్టిపోసారని పత్రికలు తెలిపాయి. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రభుజోత్ పైన అత్యంత క్రూరంగా దాడి చేశారని, దవడ విరిగిపోవడంతో మొఖం బాగా వాచిపోయిందని, కనీసం తనపై జరిగిన దాడి గురించి కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్ధితిలో ఆయన ఉన్నారని సిమ్రాన్ జీత్ తెలిపారు. ముఖంపై దాడి చేయడంతో పళ్ళు అనేకం ఊడిపోవడమో, వదులు కావడమో జరిగిందని తెలుస్తోంది. వార్త తెలిసిన వెంటనే తాను ప్రభుజోత్ ను చేర్చిన ఆసుపత్రికి వెళ్లానని, తాను వెళ్ళేసరికే న్యూయార్క్ పోలీసులు అక్కడ ఉన్నారని సిమ్రాన్ తెలిపారు.

“నేను, నా సోదరుడు అక్కడికి వెళ్ళేసరికి న్యూయార్క్ పోలీసులు, ‘హేట్ క్రైమ్ టాస్క్ ఫోర్స్’ సిబ్బంది అక్కడ ఉండడం చూసి మేము ఆశ్చర్యపోయాము. అతి కష్టం మీద పోలీసులకు ఆయన ఇస్తున్న స్టేట్ మెంటు ను బట్టి ‘ఒసామా’, ‘టెర్రరిస్టు’ అని అరుస్తూ పదే పదే మొఖంపై పిడి గుద్దులు కురిపించారని మాకు అర్ధం అయింది. కింద పడిపోయాక కూడా తలపై కొట్టడం కొనసాగించారని ప్రభు చెప్పారు… ఆయన అప్పుడే డిన్నర్ నుండి తిరిగొస్తూ తన భార్య, ఒక సంవత్సరం పిల్లాడిని ఇంటి వద్ద వదిలిపెట్టి వాకింగ్ లో ఉన్నారు… ఒక యువకుడు తన కోటు జేబులో చేయి పెట్టి తుపాకి పైకి తీస్తున్నట్లే కనిపించాడని చెబుతూ అవి తన జీవితంలో అత్యంత భయంకర క్షణాలుగా అభివర్ణించారు” అని సిమ్రాన్ జిత్ ‘హఫింగ్టన్ పోస్ట్‘ పత్రికలో రాసిన ఆర్టికల్ లో తెలిపారు.

ప్రభుజోత్ పొడవైన గడ్డాన్ని లాగుతూ అవమానించారని, దొమ్మీలాగా విరుచుకుపడి హింసాత్మకంగా వ్యవహరించారని ప్రభుజోత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఎంతగా భయపడ్డారంటే దాడి చేసినవారు ఎలా ఉంటారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టం లేనట్లుగా వ్యవహరించారు.

సిమ్రాన్ జిత్ ఇచ్చిన వివరాలను బట్టి ‘ప్రభుజోత్ ‘ఎర్త్ ఇనిస్టిట్యూట్’ లో ‘డైరెక్టర్ ఆఫ్ సిస్టమ్స్ మేనేజ్ మెంట్’ గా పని చేస్తున్నారు. హర్లేమ్ లాంటి చోట్ల స్ధానికులకు ఆరోగ్య సౌకర్యాలు పెంపొందించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆయనకు విదేశాల్లో సైతం ఈ కార్యకలాపాలకు సంబంధించి అనుభవాలు ఉన్నాయి. ఎవరి పట్టింపుకు నోచుకోని వర్గాలకు సేవలు చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. కొలంబియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూనే మౌంట్ సినాయ్ హాస్పిటల్ లో రెసిడెంట్ ఫిజీషియన్ గా పని చేస్తున్నారు.’

“దురదృష్టవశాత్తూ, దాడి చేసినవారు ప్రభుజోత్ సింగ్ ను చూడలేదు.  ఒక ప్రొఫెసర్ ను, ఒక కమ్యూనిటీ ఆరోగ్య నిపుణుడిని, ఒక స్ధానిక వైద్యుడిని వారు చూడలేదు. గడ్డం పెంచుకుని, తలపాగా ధరించిన వ్యక్తిని మాత్రమే -ఇవి ఆయన నమ్మకానికి సంబంధించినవి- చూశారు. ఆయనలో ఒక టార్గెట్ ను చూశారు. విచారకరమైన విషయం ఏమిటంటే అనేకమంది అమెరికన్ సిక్కులకు ఈ కధ కొత్తది కాదు. అనేకమంది స్వయంగా అనుభవించారు. గత మే నెలలోనే కాలిఫోర్నియాలో ఒక వృద్ధ సిక్కును స్టీల్ పైపుతో దారుణంగా కొట్టారు. ఫ్లోరిడా, ఒర్లాండోలో ఒక సిక్కు పురుషుడు కారు డ్రైవ్ చేస్తుండగా కాల్పులు జరిపారు. ఆగస్టు 2012లో అయితే ఒక తెల్ల దురహంకారి ఓక్ క్రీక్ లోని గురుద్వారాలోకి జొరబడి అనేకమందిని కాల్చి చంపిన సంగతి చెప్పనవసరం లేదు” అని సిమ్రాన్ జీత్ తన ఆర్టికల్ లో పేర్కొన్నారు.

న్యూయార్క్ పోలీసులు ప్రభుజోత్ పై జరిగిన దాడిని విద్వేషంతో జరిగిన దాడిగా పరిగణిస్తున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా లేదా తలపాగా ధరించిన వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాన్ని రెచ్చగొట్టిపెట్టాక ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగవన్న గ్యారంటీ ఎలా ఉంటుంది? ఈ విద్వేషంలో అమెరికా రాజ్యం ప్రధమ ముద్దాయి అంటే అతిశయోక్తి కాబోదు.

5 thoughts on “అమెరికా: సిక్కు డాక్టర్ పై దాడి

  1. విశేఖర్ గారు
    కెన్యా లో ఉగ్రవాద దాడి జరిగింది. ఆ సంఘటన మీ దృష్టికి వచిందా? దాని మీద స్పందిన్చావలసిందిగా కోరుతున్నాను.

  2. నాకు ఈ సంఘటన చూస్తుంటే స్థానికంగ ఉన్న కుక్కలు కొత్తగా ఆ వీధికి వచ్చిన ధాన్ని తరిమి తరిమి కరుస్తుంటాయి. ఇది జంతు లక్షణం. మానవుడు మాత్రం తాను హొమో సేపియన్‌ జాతికి చెందిన మనిషన్న సంగతి మరిచి పోతుంటాడు. ఈ జంతు లక్షణాలు మనిషిలో ఇంకా మరుగున పడలేదు. తనకంటే డిఫరెంట్‌ గా కనిపించే మనిషినిచూసి కుక్కలాగే ప్రవర్తిస్తాదనుకుంటా? అలాగే వుంది ఈ సిక్కు ను కొట్టడం.

  3. విసేకర్ గారు మిమ్మల్ని చూస్తుంటే తస్లిమా నస్రీన్ లజ్జా నవలలో సురంజన్ అనే క్యారెక్టర్ నాకు గుర్తుకొస్తుంది, ఆ నవల చదవకుంటే ఒక సారి చదవండి. lajja novel telugu ebook link is here

    Click to access lajjatasleemanas020901mbp.pdf

వ్యాఖ్యానించండి