ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్


Raghuram Rajan

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. బెన్ బెర్నాంక్ పరపతి విధానం ప్రకటించాక 600 పాయింట్లకు పైగా పెరిగిన బి.ఎస్.ఇ సెన్సెక్స్ రఘురాం పరపతి విధానం తర్వాత దాదాపు అన్నే పాయింట్లు కోల్పోయింది.

పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి ద్రవ్య విధానాన్ని సమీక్షించిన ఆర్.బి.ఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు అనగా 0.25 శాతం పెంచి 7.5 శాతానికి చేర్చారు. రెపో రేటు అంటే ఆర్.బి.ఐ వసూలు చేసే స్వల్పకాలిక వడ్డీ రేటు. ఈ రేటు తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులు మరింత డబ్బును ఆర్.బి.ఐ నుండి రుణం కింద తీసుకుంటాయి. అంటే బ్యాంకుల వద్ద మరింత డబ్బు అందుబాటులో ఉంటుంది. బ్యాంకుల్లో డబ్బు ఉంటే అది తమదే అని ధనిక వర్గాల అభిప్రాయం. అది నిజం కూడా. రైతులకు, విద్యార్ధులకు, పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వాలు ప్రకటించే పధకాల కింద కూడా అప్పులు ఇవ్వడానికి గింజుకునే బ్యాంకులు ధనిక వర్గాలకు మాత్రం పిలిచి మరీ అప్పులిస్తాయి. ధనికవర్గాలు అప్పులు ఎగ్గొడితే అవి ఎన్.పి.ఏ (Non-Performing Assents) కింద తోసేసి యేళ్ళు గడిచాక రద్దు చేసేస్తాయి. ఆ రుణాల ద్వారా బ్యాంకింగ్ బ్యూరోక్రసీ తృణమో పణమో దక్కించుకుంటాయి కాబట్టి వారికి ఆనందమే.

ఈ వడ్డీ రేటు పెంపుదల చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందనీ, ఇక జి.డి.పి వృద్ధిపై దృష్టి పెట్టాలని ఆర్ధిక మంత్రి చిదంబరం నేత్తీ, నోరూ బాదుకుంటున్నాడు. జి.డి.పి పెరగడానికి వీలుగా వడ్డీ రేటు తగ్గించి పరిశ్రమ వర్గాలకు మరింత డబ్బు అందుబాటులోకి తేవాలని ఆయన ఆర్.బి.ఐ ని కోరుతూ వచ్చాడు. ఆయన కోరికను పాత గవర్నర్ మన్నించలేదు. జి.డి.పి వృద్ధి చెందడానికి వీలయిన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి తప్ప ఆర్.బి.ఐ కాదనీ, అసలు లోపం ప్రభుత్వంలో ఉందని ఆయన పరోక్షంగా దెప్పుతూ వచ్చాడు. ఈ నేపధ్యంలో చిదంబరం ఏరి కోరి ఎంచుకున్న రఘురాం రాజన్ పరిశ్రమ వర్గాల ఆశల్ని ఈడేరుస్తాడని ఆశపడ్డారు. ఆ మేరకు తగిన సంకేతాలను కొత్త గవర్నర్ తన పదవీ స్వీకారం సందర్భంగా ఇచ్చారు కూడాను.

కానీ, బహుశా, పదవిలోకి కూర్చున్నాక గాని కొత్త గవర్నర్ కి తత్వం బోధపడలేదు. పాత గవర్నర్ బహుశా ‘నేను, చెప్పానా’ అనుకుంటూ మూసిముసి నవ్వులు నవ్వుకుని ఉంటారు. కరెంటు ఖాతా లోటు (Current Account Deficit -CAD) భారీగా ఉందని, రూపాయి విలువేమో పతనదిశలో ఉందనీ, కాబట్టి ఈ పరిస్ధితుల్లో పరిశ్రమ వర్గాల ఆశలకు తగ్గట్లుగా వడ్డీ రేటు తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని ఆయన హెచ్చరించాడు. ఆయన హెచ్చరించినట్లుగానే ద్రవ్యోల్బణం ఆగస్టు 31 నాటికి 6.1 శాతానికి పెరిగిందని తాజా గణాంకాలు తెలిపాయి. జులైలో ఇది 5.79 శాతం. ఆహార ద్రవ్యోల్బణం భారీగా 18% ఉంటే, ఇంధన ద్రవ్యోల్బణం 11% నమోదయింది. ఈ పరిస్ధితుల్లో మరింత డబ్బు మార్కెట్ లోకి వదిలితే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. ఫలితంగా, గవర్నర్ కి వడ్డీ రేటు పెంచక తప్పలేదు.

“పరిశ్రమల రంగం, అర్బన్ డిమాండు బలహీనంగా ఉన్న పరిస్ధితిలో ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణం అంచనాలను స్ధిరంగా పట్టి ఉంచాల్సిన అగత్యం ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ద్రవ్యోల్బణాన్ని మరింత సహన స్ధాయికి తేవడానికి రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుంది” అని ఆర్.బి.ఐ గవర్నర్ తన సమీక్షలో పేర్కొన్నారు.

గవర్నర్ చర్యను పరిశ్రమల సంఘాలయిన ఫిక్కీ, సి.ఐ.ఐ లు స్వాగతించలేదు. “పెట్టుబడుల ఖరీదు అధికంగా ఉండడం, కఠినమైన పరిస్ధుతుల మధ్య అవి అందుబాటులో లేకపోవడం వలన పరిశ్రమలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. కాబట్టి రెపో రేటును పెంచకుండా ఉండాల్సింది” అని సి.ఐ.ఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నాడు.

రెపో రేటు పెంచినప్పటికీ ఆర్.బి.ఐ సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్ రేషియో) ని తాకలేదు. డిపాజిట్ దారుల భద్రత కోసం బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్.బి.ఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. దానిని సి.ఆర్.ఆర్ అంటారు. అదిప్పుడు 4 శాతం మాత్రమే. దానిని తాకాకపోగా రోజువారీ కనీస సి.ఆర్.ఆర్ నిర్వహణ శాతాన్ని 99 శాతం నుండి 95 శాతానికి ఆర్.బి.ఐ తగ్గించింది. అయినప్పటికీ పరిశ్రమల వర్గాలకు తృప్తి కలగలేదు.

ఖరీఫ్ దిగుబడి సమీపిస్తున్నందున ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గవచ్చని ఆర్.బి.ఐ ఆశీస్తోంది. అది జరిగితే బ్యాంకు రేటు తగ్గించే అవకాశాలు లేకపోలేదని సూచించింది.

5 thoughts on “ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

  1. శ్రీధర్ గారూ, ఇంతకంటే డార్క్ రావడం లేదు. బహుశా ఈ ధీమ్ కి ఇక ఇంతే కాబోలు!

    ప్రవీణ్ గారూ కుడిపక్క సైడ్ బార్ లో లేఖిని లింక్ ఇచ్చాను. ఇంతకు ముందు కింద ఉండేది. ఇప్పుడు సైడ్ బార్ లోకి మార్చాను. అందుబాటులో ఉంటుందని.

  2. పింగ్‌బ్యాక్: ధరలు తగ్గాయ్, షేర్లు కొందాం! -కార్టూన్ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

వ్యాఖ్యానించండి