నిర్భయ: నిందితులందరికీ ఉరి


anti-rape protest in Hyderabad

నిర్భయ హంతకులు నలుగురుకి సత్వర న్యాయస్ధానం (fast-track court) ఉరిశిక్ష విధించింది. జరిగిన ఘోరం ఖచ్చితంగా అరుదయిన కేసుల్లోకెల్లా అరుదైనదేనని కనుక నిందితులకు మరణ శిక్షే సరైనదనీ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తీర్పు విన్న వెంటనే నిర్భయ తల్లిదండ్రులు, సోదరులు హర్షాతిరేకాలు ప్రకటించారు. తమ కూతురికి న్యాయం దక్కిందని చెబుతూ, తమ వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

తీర్పు ప్రకటించిన తర్వాత నిందితుల్లో ఒకరు ఏడుపు మొదలు పెట్టగా, ఇతరులు తమ పాపాన్ని క్షమించి శిక్ష తగ్గించాలని బిగ్గరగా జడ్జిని కోరినట్లు ది హిందు తెలిపింది. కోర్టు బయట తీర్పుకోసం ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన జనం కూడా చప్పట్లతో హర్షం తెలిపారు. ‘ఈ నలుగురి ఉరితో భారత దేశంలో ఇక మానభంగ నేరాలు ఆగిపోయే పక్షంలో తాను పై కోర్టుకు అప్పీలుకు వెళ్లబోమని నిందితుల్లో ఒకరి లాయర్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే సైతం ఉరిశిక్ష పట్ల హర్షం ప్రకటించారు.

అడిషనల్ సెషన్స్ జడ్జి యోగేష్ ఖన్నా తీర్పు వెలువరిస్తూ “అందరికీ ఉరి” అని ప్రకటించారు. “ఇతర నేరాల గురించి చర్చ చేయడానికి ముందు నేను నేరుగా ఐ.పి.సి సెక్షన్ 302 (హత్యా నేరం) లోకి వస్తాను. దోషుల అమానవీయ స్వభావం కిందికి ఈ నేరం వస్తుంది. వారు పాల్పడిన నేరం యొక్క తీవ్రత ఎంతమాత్రం సహించరానిది. నలుగురు నిందితులకూ ఉరి శిక్ష విధిస్తున్నాను” అని యోగేష్ ఖన్నా ప్రకటించారు.

తీర్పు వార్తను భారత పత్రికలు, ఛానెళ్లతో పాటు అంతర్జాతీయ పత్రికలు, చానెళ్లు కూడా ప్రాధాన్యం ఇచ్చి కవర్ చేశాయి. అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన నిర్భయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుండీ అంతర్జాతీయ వార్తా సంస్ధలు ఈ ఉదంతంపై దృష్టి కేంద్రీకరించాయి. దేవ్యాపితంగా ఎగసిపడిన ఆందోళనలను క్రమం తప్పకుండా ప్రచురించాయి. సంపాదకీయాలు, ప్రత్యేక వార్తా కధనాలు, విశ్లేషణలు ప్రచురించాయి.

“ఈ అమానుషమైన చర్య పట్ల కోర్టు గుడ్డిగా వ్యవహరింపజాలదు. మహిళలపై నేరాలు రోజువారీగా పెరుగుతూ పోతున్న ఈ నాటి పరిస్ధుతుల్లో కోర్టు తన కళ్ళు మూసుకొని ఉండలేదు” అని జడ్జి పేర్కొన్నారు. “బాధితురాలిపైన అత్యంత హేయమైన రీతిలో సాగించిన సామూహిక మానభంగం, హత్య కని వినీ ఎరుగని క్రూరత్వంతో కూడుకుని ఉన్నది. ఇది అరుదైన కేసుల్లో కెల్లా అరుదైనది కాబట్టి అత్యంత కఠిన శిక్ష తప్పనిసరి. అందరికీ ఉరి శిక్ష విధిస్తున్నాను” అని తీర్పులోని భాగాన్ని చదువుతూ జడ్జి పేర్కొన్నారు.

“ఒక మహిళపైన జరిగిన అత్యంత తీవ్రమైన నేరం దేశం ముందుకు వచ్చిన తరుణం ఇది. కనుక మహిళల్లో విశ్వాసం పాదుకొల్పవలసిన బాధ్యత ఇప్పుడు కోర్టులపై ఉన్నది” అని ఆయన తన తీర్పును చదివి వినిపించారు. అయితే నేరస్ధుల్లో అత్యంత క్రూరంగా వ్యవహరించి ఆమె మరణానికి కారణం అయిన అసలు వ్యక్తి మాత్రం వయసు రీత్యా మూడు సంవత్సరాల శిక్షతో బైటపడ్డట్లయింది. సుప్రీం కోర్టు అనుమతితో మైనర్ యువకుడిపై తీర్పు ప్రకటించిన బాల నేరస్ధుల కోర్టు చట్టం నిర్దేశించిన గరిష్ట శిక్షను విధించింది.

తీర్పు ప్రకటించిన తరువాత నిర్భయ తల్లి సంతోషం ప్రకటించారు. “ఊపిరి బిగబట్టుకుని ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాను. నా దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను” అని ఆమె చెప్పారని పత్రిక తెలిపింది. నిర్భయ తండ్రి, ఆమె ఇద్దరు సోదరులు కూడా క్రిక్కిరిసిన కోర్టులో హాజరయ్యారు. వారు కూడా తమ హర్షాతిరేకాలు ప్రకటించారు.

తీర్పు వెలువడిన అనంతరం నిందితుల్లో ఒకరయిన వినయ్ శర్మ ఏడవడం ప్రారంభించాడు. మిగిలిన ముగ్గురు నిందితులు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలు మాత్రం తమను క్షమించి శిక్ష తగ్గించాలని గట్టిగా అరుస్తూ జడ్జిని వేడుకున్నారని, డిఫెన్స్ లాయర్ ఏ.పి.సింగ్ కూడా వారికి జత కలిశారని తెలుస్తోంది. ముఖేష్ తరపున వాదించిన లాయర్ వి.కె.ఆనంద్ తాను ఢిల్లీ హై కోర్టుకు అప్పీలు చేస్తానని తెలిపాడు.

ప్రజల ఆందోళనలకు జడిసే నిర్భయను సింగపూర్ ఆసుపత్రికి భారత ప్రభుత్వం తరలించిందన్న అనుమానాలు కలిగే స్ధాయిలో దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ దేశంలో ఆ తర్వాత కూడా మానభంగ నేరాలు ఏ మాత్రం తగ్గకపోగా నేరస్ధులు నిర్భీతిగా మరిన్ని దారుణాలకు పాల్పడడం కొనసాగింది. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక ఫోటోగ్రాఫర్ పై ముంబై నగరంలో జరిగిన దారుణం కేవలం ఒక్కటి మాత్రమే. నిర్భయ తనపైకి వస్తున్న నేరస్ధులను, ‘అన్నలారా, తమ్ములారా’ అని వేడుకుంటే వారు ఈ ఘోరానికి పాల్పడేవారు కాదనీ, రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు కదా అని వ్యాఖ్యానించిన అసరం బాపు కూడా అత్యాచారం నేరం కింద రిమాండులో రోజులు గడుపుతున్న పరిస్ధితి!

అంటే ఇంకా అనేకమంది నిర్భయలను సృష్టించే పరిస్ధితి సమాజంలో కొనసాగుతున్నదన్న విషయం స్పష్టమే. తీర్పుపై హర్షం ప్రకటిస్తున్న హోమ్ మంత్రి సామాజిక విలువలను, ప్రజాస్వామిక నాగరికతను పెంపొందించాల్సిన బాధ్యత తమపై ఉందన్న సంగతిని గుర్తించారా అన్నది అనుమానమే. నిర్భయపై జరిగిన దారుణంపై ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేస్తున్న ప్రజలతో మాట్లాడడానికి రమ్మన్నపుడు ‘రేపు నక్సలైట్లు కూడా నేను రావాలని డిమాండ్ చేస్తారు. అప్పుడూ రావాలా?’ అని ప్రశ్నించిన బాధ్యతాయుత మంత్రి ఆయన!

6 thoughts on “నిర్భయ: నిందితులందరికీ ఉరి

  1. ఉరిశిక్షను రద్దుచేయాలి.ఒకమనిషిని చంపడంద్వారా సమాజంలో మార్పుతీసుకురావడం అసాధ్యం!వారిలో పరివర్తన తీసుకురాలేకపోయినా వారిని ఉరితీయడం దారుణం!చర్యకు ప్రతిచర్య సహజం.కానీ,కన్నుకు కన్ను సమాధానం ఎప్పటికీ సరైనదికాదు!

  2. ఉరిశిక్షలవలన ఎవరికి శాంతిచేకూరుతుందో,ఎవరిలో పరివర్తన కలుగుతుందో ఖచ్చితంగా ఎవరూచెప్పలేరు!మరి అటువంటపుడు ఈ ఉరిశిక్షలవలన ఎవరికి ప్రయోజనం? మనలోఉన్న జంతువాంఛను తృప్తికలిగించడానికితప్ప!

వ్యాఖ్యానించండి