అద్వానీ ఆవిరై న.మోగా ఘనీభవనం


BJP all set to name Modi

హాలీవుడ్ యాక్షన్ ధ్రిల్లర్ ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమాలో హీరో, విలన్ ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇప్పుడంటే అలాంటి గ్రాఫిక్ సీన్లు మామూలయ్యాయి గాని రెండు దశాబ్దాల క్రితం ఆ తరహా గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని నిజంగానే భవిష్యత్తుకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా ఆ విలన్ ఏ పాత్రలోకయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. రంధ్రాల గుండా, సందుల గుండా ఎక్కడికంటే అక్కడికి పాదరసంలా జారిపోతూ కావలసిన రూపంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు. ఇప్పుడు బి.జె.పిలో జరుగుతున్న పరిణామాలు ఆ సినిమా విలన్ రూపాంతకరీకరణను తలపిస్తున్నాయి.

నరేంద్ర మోడిని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడానికి బి.జె.పి దాదాపు సిద్ధం అయినట్లేనని పత్రికలు చెబుతున్నాయి. అద్వానీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషిలను కూడా ఒప్పించి నాలుగు రాష్ట్రాల ఎన్నికలలోపే మోడి పేరు ప్రకటించెయ్యాలని అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కంకణబద్ధుడై ఉన్నారని పత్రికలు జోరుగా ఊహాగానం చేస్తున్నాయి. అయితే రాష్ట్రాల ఎన్నికలు అయ్యేవరకూ ఆగమని అద్వానీ-స్వరాజ్-జోషిలు చెబుతున్నారట! కానీ మోడి చుట్టూ సృష్టించిన హైప్ నుండి లాభపడడాన్ని అసెంబ్లీ ఎన్నికల నుండే ఎందుకు ప్రారంభించకూడదని బి.జె.పిలోని మెజారిటీ నాయకత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అద్వానీ ఈ విషయంలో ఇంతవరకు పైకి ఏమీ చెప్పనప్పటికీ, ఆయనకు గట్టి మద్దతుదారు అయిన సుధీంద్ర కులకర్ణి లాంటివారు మోడిని బహిరంగంగానే విచ్ఛిన్నకర శక్తి అని చెప్పేస్తున్నారు. “సామాజికంగా విచ్ఛిన్నకర నాయకుడయిన ఒక వ్యక్తి తన సొంత పార్టీని కూడా విచ్ఛిన్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి కేంద్రంలో ప్రబ్బుత్వాన్ని తిన్నగా, స్ధిరంగా, ప్రభావవంతంగా నడపగలడా? సీరియస్ గా ఆలోచించండి!” అని కులకర్ణి ట్విట్టర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సామాజిక వెబ్ సైట్లను క్రమం తప్పకుండా వినియోగించే మోడి మార్గాన్నే ఆయన వ్యతిరేకులు కూడా ఎంచుకున్నారన్నమాట!

“ఎన్నికలకు ఏడు నెలలే ఉన్నాయి.  జనానికి మార్పు కావాలి. కానీ మార్పును ఎవరు ఇవ్వగలరు? సమాజాన్ని విచ్ఛిన్నం చేసే నాయకులా?” అని కులకర్ణి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మోడి దేశ విచ్చినకర శక్తి అని బి.జె.పి నాయకులే అంగీకరిస్తున్నారు. మోడి అభ్యర్ధిత్వంపై పార్టీలో ఏకాభిప్రాయం లేదని కులకర్ణి స్పష్టం చేస్తున్నారు. అయితే అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ మాత్రం మోడి విషయంలో పార్టీలో విభేదాలు ఏమీ లేవని చెప్పుకొస్తున్నారు.

మోడి మద్దతుదారులకు కూడా కొదవ లేదు. నిజానికి వారి సంఖ్యే బి.జె.పిలో ఎక్కువగా కనిపిస్తోంది. మోడీకి ఉన్న ప్రజాదరణను అద్వానీ ఎందుకు గుర్తించారని వారు ప్రశ్నిస్తున్నారు. వాజ్ పేయి పేరును ప్రధానిగా ప్రతిపాదించినట్లే అద్వానీ, మోడిని పేరును కూడా ప్రతిపాదించాలని బీహార్ బి.జె.పి నాయకుడు సుశీల్ మోడి లాంటివారు వాదిస్తున్నారు.

చివరి ఘడియ సమీపించే కొద్దీ ప్రధాని రూపంలో అద్వానీ చిత్తరువు కరిగిపోతూ మోడి చిత్తరువు అవతరిస్తోంది. ది హిందూ ఊహించింది నిజమే అయితే గనక పార్లమెంటరీ బోర్డును సమావేశం ఏర్పాటు చేయకుండానే ప్రతి సభ్యుడితోనూ తాను వ్యక్తిగతంగా సంప్రదించానని చెప్పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్, మోడిని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించవచ్చు.

తధాస్తు దేవతలారా, కనీసం ఏడు నెలల వరకు భూలోకం వైపుకు రాకండి, ఫీజ్!

3 thoughts on “అద్వానీ ఆవిరై న.మోగా ఘనీభవనం

  1. “చివరి ఘడియ సమీపించే కొద్దీ ప్రధాని రూపంలో అద్వానీ చిత్తరువు కరిగిపోతూ మోడి చిత్తరువు అవతరిస్తోంది…….” సందర్భం పక్కనపెడితే మీలొ మంచి రచయిత ఉన్నారండి… ఈ పదాల వాడకం చాలా చాలా బాగుంది

వ్యాఖ్యానించండి