ప్రవేశపెడ్తున్నాం, మోడి ఫిడేల్ సింఫొనీ -కార్టూన్


Modi symphony

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించే రోజు ‘ఇదిగో ఈ రోజే’ అనీ, ‘కాదు, కాదు రేపే’ అనీ పత్రికలు, ఛానెళ్లు ఒకటే రచ్చ! కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు. సెప్టెంబరు 17 లోపు ప్రకటిస్తారని తాజాగా పత్రికల కధనం. కానీ అద్వానీని మె(ఒ)ప్పించడమే బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ సంస్ధలకు మహా కష్టం అయిందని వార్తలు చెబుతున్నాయి.

ఆర్.ఎస్.ఎస్ పనుపున, ఆర్.ఎస్.ఎస్ రాయబారిగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అద్వానితో చర్చలు జరపడం ఒకసారి జరిగిపోయింది. ఆర్.ఎస్.ఎస్ ఇచ్చిన సందేశాన్ని అద్వానీకి చేరవేసిన గడ్కారీ, అద్వానీ ఇచ్చిన సందేశాన్ని ఆర్.ఎస్.ఎస్ కు కూడా చేరవేశారు. అద్వానీని కలిసిన తర్వాత గడ్కారీ నేరుగా ఆర్.ఎస్.ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ వెళ్లారని పత్రికలు చెప్పాయి. నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం పైనే ఈ తతంగం నడించిందని తెలుస్తోంది.

ఈ రోజు అనగా సెప్టెంబరు 11 తేదీన బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కూడా అద్వానీని కలిశారు. నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి అంగీకరించాలని రాజ్ నాధ్ కోరారనీ, దానికి అద్వానీ ససేమిరా అన్నట్లు తెలుస్తోందని ది హిందు తెలిపింది.

ఎన్నికల రధసారధిగా మోడిని ప్రకటించడం ద్వారా ‘మొదటి మోడి ఫిడేల్ సింఫోనిని విజయవంతంగా పూర్తి చేసిన బి.జె.పి రెండో సింఫోనికి మాత్రం ‘ప్రకటన వరకూ వచ్చి’ ఆపేసింది. ఆర్.ఎస్.ఎస్ నాయకులతో వరుస సమావేశాల ద్వారా ఏదో జరుగుతోందన్న సంకేతాలు ఇచ్చిన ఆ పార్టీ తీరా ప్రధాన నాయకులు సహకారం ఇవ్వకపోవడంతో వాటిని పూర్తిచేయలేకపోతోంది. అద్వానితో పాటు సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషిలు మోడి అభ్యర్ధిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యతిరేకత వచ్చే రాష్ట్రాల ఎన్నికల లోపు మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించవద్దనా లేక అసలుకే వద్దనా అనేది సరిగ్గా అర్ధం కాలేదు.

ఎన్నికల సారధిగా మోడిని ప్రకటించినప్పుడే సమస్త బాధ్యతలకు రాజీనామా చేయడం ద్వారా పార్టీని ఒక్క కుదుపు కుదిపేసిన లాల్ కృష్ణ అద్వానీ మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ సంగతి ఎలా ఉన్న కొందరు మోడి భక్తులు అద్వానీని ద్వేషించడానికీ, ఆయనపై అసభ్య వ్యాఖ్యలు చేయడానికీ కూడా వెనకాడకపోవడమే విచిత్రంగా ఉంది.

ఫేస్ బుక్ లో గానీ, వివిధ వార్తా పత్రికల వెబ్ సైట్లలో గానీ అద్వానీ పైన విపరీతమైన విషం కక్కుతున్నారు. పార్టీ వ్యవస్ధాపక నాయకుడయిన అద్వానీకి సొంత పార్టీ అభిమానులనుండే ఇలాంటి మర్యాద ఎదురుకావడం జాలి కలిగించే విషయం. ఆ పార్టీ చెప్పుకునే భారతీయ సంస్కృతికి అసలేమాత్రం నప్పని సంగతి కూడాను. దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించిన నాయకుడికే ఈ పరిస్ధితి ఎదురయితే ఇక వారు ద్వేషించే ముస్లింల పరిస్ధితి వారి దృష్టిలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.

వ్యాఖ్యానించండి