సిరియాపై దాడి చేయడానికి కాంగ్రెస్, సెనేట్ ల అనుమతి కోరిన బారక్ ఒబామా, ఓటింగులో తాను ఓడిపోవచ్చని అంగీకరించాడని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. సోమవారం ఎన్.బి.సి చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఒబామా ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఐతే ఓటింగులో ఓడిపోతే ఏమి చేసేదీ చెప్పడానికి ఒబామా నిరాకరించారు. ఆ విషయమై తానింకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. సిరియాపై దాడికి అమెరికా ఉభయ సభలను, ప్రజలను ఒప్పించడానికి తంటాలు పడుతున్న ఒబామా వివిధ టి.వి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సిరియా ప్రభుత్వం వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ఐరాస అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో ఉంచాలని రష్యా ప్రతిపాదించడంతో అమెరికా మరింత ఇరకాటంలో పడిపోయింది.
ఒక్క సోమవారం రోజే ఒబామా 6 టి.వి చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్ లో ఓటమి ఎదురయిన పక్షంలో ఏమి చేస్తారు అన్న ఎన్.బి.సి ప్రశ్నకు ఆయన “నిజాయితీగా చెప్పాలంటే నేను ఇంకా నిర్ణయించుకోలేదు” అని ఒబామా సమాధానం ఇచ్చారు. సిరియా రసాయన ఆయుధాలను అంతర్జాతీయ పరిశీలకులకు అప్పగించాలన్న రష్యా సూచనను సిరియా స్వాగతించడాన్ని కూడా తన దాడి పధకానికి మద్దతుగా తెచ్చుకోడానికి ఒబామా ప్రయత్నించాడు. కానీ సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లో ఐదు నెలలు బందీలుగా ఉండి సోమవారం (సెప్టెంబర్ 9) విడుదలయిన ఇటలీ, బెల్జియంల జర్నలిస్టులు ఒబామాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. డమాస్కస్ శివార్లలో జరిగిన రసాయన దాడికి తామే బాధ్యులమంటూ తిరుగుబాటుదారులు చెప్పుకోగా తాము విన్నామని సదరు విలేఖరులు వెల్లడి చేశారు.
కాగా సిరియా దాడికి అమెరికా చట్ట సభల సభ్యులు అనేకమంది వ్యతిరేకంగా ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ప్రజల్లో అత్యధికశాతం మంది దాడికి వ్యతిరేకంగా ఉన్నట్లు వరుసగా జరుగుతున్న సర్వేలలో వెల్లడి కావడమే వారి వ్యతిరేకతకు కారణమని తెలుస్తోంది. ప్రజలను, చట్ట సభల సభ్యులను నమ్మించడానికి రసాయన దాడికి సంబంధించిన వీడియోలను సైతం ఒబామా ప్రభుత్వం విడుదల చేసింది. (ఈ వీడియోలను ఇప్పటివరకూ రహస్యంగా ఉంచారు.) తీరా చూస్తే ఆ వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో ఉన్నాయి. దాడి నెపాన్ని సిరియా ప్రభుత్వం పైకి నెట్టడానికి వాటిని తిరుగుబాటుదారులు దాడి జరిగిన రోజే విడుదల చేశారు. ఆ వీడియోలే రహస్య సాక్ష్యాలు అంటూ ఇన్నాళ్లూ దాచి ఉంచారు.
ఇవి కాకుండా సిరియా ప్రభుత్వాధికారుల మధ్య సంభాషణలు కూడా తమ వద్ద ఉన్నాయని ఒబామా ప్రభుత్వం చెబుతోంది. వాటిని ఇంకా విడుదల చేయలేదు. కానీ సదరు సంభాషణల సారాంశం ఇప్పటికే వెల్లడి అయింది. ఆగస్టు 21 నాటి రసాయన దాడి ఎలా జరిగిందని అడుగుతూ సిరియా ప్రభుత్వాధినేతలు తమ రసాయన ఆయుధాలు నిల్వ చేసిన శాఖకు చేసిన ఫోన్ కాల్స్ అవి. అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ కు తెలియకుండా రసాయన ఆయుధ విభాగం వాళ్ళు ఆయుధాలను ప్రయోగించారా లేదా అన్న సంగతిని విచారించడానికి ఆ ఫోన్ కాల్స్ చేశారు. వాటినే రహస్య సాక్ష్యాలుగా ఒబామా ప్రభుత్వం చెప్పుకుంటోంది. నిజానికి అంత ఖచ్చితమైన సాక్ష్యం అయినట్లయితే వాటిని చూపించి దాడి చేసే అనుమతిని చట్ట సభల నుండి ఒబామా పొందవచ్చు. అది జరక్కపోవడంతో కాంగ్రెస్, సెనేట్ సభ్యులకు అనుమానం ఇంకా పెరిగిపోయింది.
సిరియా దాడికి వ్యతిరేకంగా ప్రతినిధుల సభ (కాంగ్రెస్), సెనేట్ ల సభ్యులు కొందరు బహిరంగంగానే ముందుకు వస్తున్నారు. కొందరయితే తాను ఇప్పటివరకూ దాడికి మద్దతుగా ఉన్నాననీ, కానీ సాక్ష్యాలు లేవని తేలాక దాడిని వ్యతిరేకిస్తున్నాననీ ప్రకటిస్తున్నారు. “ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయంలో తీవ్రమైన అనిశ్చితి ఉన్నది. అందువలన దాడికి నేను ‘వద్దు’ అనే చెబుతాను” అని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లామార్ అలెగ్జాండర్ ప్రకటించాడు. “స్టెప్ ఎ తర్వాత ఏమిటి? స్టెప్ బి, స్టెప్ సి, స్టెప్ డి ఏమిటసలు? ఏ సమాచారం లేదు” అని లామార్ ప్రశ్నించాడని ది హిందు తెలిపింది.
“సిరియాలోగానీ మరెక్కడయినా గానీ రసాయన ఆయుధాలు ప్రయోగించకుండా చూసే పని ఒక్క అమెరికాదే కాదు, మొత్తం ప్రపంచానిది అని నా బలమైన అభిప్రాయం” అని మహిళా సెనేటర్ హీదీ హీత్ కాంప్ వ్యాఖ్యానించింది. ఆమె డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ అయినప్పటికీ సిరియా దాడిని వ్యతిరేకిస్తోంది. సెనేట్ లో డెమొక్రాట్ పార్టీదే మెజారిటీ. కానీ దాడి తీర్మానం సెనేట్ లో నెగ్గడమే కష్టం అని అమెరికా తదితర పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి. ప్రతినిధుల సభలో దాడికి అనుకూలంగా డజను మంది అభిప్రాయం వ్యక్తం చేయగా 150 మందికి పైనే వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. 200 మంది వరకూ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది.
