చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…


‘అక్షర లక్షాధికారి’ అని శ్రీశ్రీకి పేరు. అక్షరాలను ఒడుపుగా పట్టుకుని, ఛందోబద్ధ పరిష్వంగాలను వదులించుకుని, లక్షలాది అక్షరాలతో యధేచ్చ ఉరికిపడే జలపాతంలా కవితా ఝరులను సృష్టించినందుకు ఆయనకు ఆ పేరు దక్కింది. ఇప్పుడు అక్షరాలతో లక్షాధికారులు అవుతున్నవారు ఎంతమందో కానీ, లక్షల రూపాయలకు అక్షరాలను అమ్ముకుంటున్నవారికి కొదవలేదు.

తమ విద్యార్ధులకు ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లోనే విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం విద్యను అమ్మి తీరాలని శాసించాయి. డంకేల్ ఒప్పందం ద్వారా, నూతన ఆర్ధిక విధానాల ద్వారా భారత దేశంతో పాటు అనేక మూడో ప్రపంచ దేశాలకు ప్రైవేటు విద్యావిధానాన్ని రుద్దిన పశ్చిమ దేశాలు తద్వారా తమ అంతర్జాతీయ విద్యా సంస్ధలకు మూడో ప్రపంచ దేశాల్లోనూ విద్యా మార్కెట్లు సృష్టించుకున్నాయి.

ఫలితంగా విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్ధాయికి చేరడం సంగతేమో గానీ ‘విద్యా వివక్ష’ మాత్రం నేడు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంది. ఆ రోజుల్లో నాణ్యమైన చదువుకు సర్కారీ పాఠశాలలు పెట్టింది పేరు. ఈ రోజుల్లో కె.జి విద్యకు సైతం లక్షలు ఖర్చు చేయాల్సిన దుర్గతి దాపురించింది. బాగా చదువు చెప్పే పంతుళ్ళు  సర్కారీ కొలువుల్ని వదిలి లక్షలు కురిపించే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు వలస కట్టారు.  ఫలితంగా నాణ్యమైన చదువు ఇప్పుడొక ఒక లగ్జరీ. ఈ అంశాలను ఈ కింది ఫోటోలు పట్టిస్తున్నాయి.

పసి మనసుల్ని వారి మొఖాల్లో పట్టి భద్రపరిచేందుకు ఏ ఫోగ్రాఫర్ కి మాత్రం ఇష్టం ఉండదు! ఉత్సాహం, ఉత్సుకత, చురుకుదనం అన్నీ సమపాళ్లలో తుళ్ళిపడే పసివారిని పరిశీలించి,  వారి కదలికను, హావభావాలని బంధించిన ఫోటోలను ‘ఏజెన్స్ ప్రెస్-ఫ్రాన్స్’ (ఎ.పి.ఎఫ్) వార్తా సంస్ధ  సేకరించగా బోస్టన్ పత్రిక ప్రచురించింది.

3 thoughts on “చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…

  1. జీవితం అంగట్లో సరుకు కావాలంటే ముందు పునాది అయిన విధ్యలో వివక్షను గట్టి పరచుకోవాలి. విధ్యను వ్యాపారం చేయడమంటే మెజారిటి ప్రజలకు జ్ణానాన్ని నిరాకరించడం. జ్ణానాన్ని నిరాకరించడమంటే ప్రజలను నమూనాలు తయారు చేసి , (భావ జాలం తో)చెప్పుచెతుల్లో పెట్టుకోవడం. చెప్పుచేతల్లో పెట్టుకోవడమంటే తమ అధికారాన్ని పధిలపరుచుకోవడం. అప్పుడే కదా దోపిడీ కొనసాగించేది! ఇందులో లూప్‌ హోల్స్‌ లేకుండ చూచుకొగలడా వాడు- అదే! సామ్రాజ్యవాది?

  2. చదువుపై అవగాహన లేనివాళ్ళే ఎక్కడ(ప్రభుత్వ/ప్రైవేట్)తమ పిల్లలను చదివించాలో తెలియక తికమక పడుతుంటారు!జ్ఞానసముపార్జనకే ఐతే ఎక్కడచదివించినా పెద్దతేడా ఉండదు! ఉపాధ్యాయులకోసం ప్రభుత్వ పాఠశాలలలొ పిల్లలు చదువుతుంటే,తల్లిదంద్రులకోసం ప్రైవేట్ పాఠశాలలలో పిల్లలు చదువుతుంటున్నారు!ఇదీ నేటి పరిస్థితి!

  3. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఎక్కడ చెబుతున్నారు? ఉద్యోగం వచ్చే వరకు ఎంతో కష్టపడి జాబ్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు. మంచి శాలరీస్, బోలెడు శెలవులు,అనుకూల పని వేళలు, అనేక ఇతర బెనెఫిట్ లు పొంది స్కూల్స్ లో టైం పాస్ చేస్తున్నారు.వాళ్ళ శేలరీ కి ఢొకా ఉండదు.గట్టిగా ఎవరైనా జవాబుదారీ గా ఉండమంటే ఉద్యోగ సంఘాలంటూ ప్రెజర్ చేస్తారు.. (నా ఉద్దేసం లో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ వారు చేసే పనికి చాలా ఎక్కువ).

    నేర్చుకునే విషయం లో పిల్లలందరకీ ఉండేది ఒకే రకమైన జిజ్ఞాస,ఉత్సాహం. కాని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లల స్టాండర్డ్స్ చూడండి. ఏమీ రావు.

    ప్రభుత్వం ఫెసిలిటీస్ ఇవ్వక పోతే మేమేమి చేస్తాం అంటారు. విద్య గురువు ముఖతహ వస్తుంది. వారిలో నిజాయితీ ఉంటే నల్ల బల్ల ,సుద్ద ముక్క తో ఎంతో నేర్పవచ్చు.

    వ్యవస్థ ను తీర్చిదిద్దగల అవకాసం గురువులకి ఉంది.నేటి ప్రభుత్వ పాఠశాల టీచర్లలో మనస్సాక్షి లేకుండా పోతోంది.
    ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచకుంటే వ్యవస్తలో కొత్త రకమైన వ్యత్యాసాలు(ప్రభుత్వ చదువు చదివిన,ప్రైవేటు చదువు చదివిన)మొదలై కొత్త సమస్యలు ఏర్పడతాయి.

    నేను నా పర్సొనల్ అబ్జెర్వేషన్ నుంచి ప్రభుత్వ పాఠసాలల్లో చదువు నేర్పించాలనే తపన ఉన్న టీచర్ మిత్రుల సమాచారం నుంచి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నాను.ఎవరినైనా నొప్పించి ఉంటే సారీ.

    (ఇది అత్యధిక శాతం మంది కి మాత్రమే వర్తిస్తుంది. చిత్త సుధ్ధి గల కొంత మంది గురువుల ఋణం తీర్చుకోలేనిది.భవష్యత్ కి దారి చూపిన వారిని మరువలేము. తల్లిదండ్రుల సేవ తో వారి ఋణం తీర్చగల ప్రయత్నం చేయగలమేమో కాని, చదువు ఐన తరువాత వారిని గుండెల్లో దాచుకుంటాం అంతే.

వ్యాఖ్యానించండి