నిజానికి ఇది సంచలనవార్త! ఆగస్టు 21 తేదీన సిరియాలో రసాయన ఆయుధాలతో జరిగిన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, అధ్యక్షుడు బషర్ అస్సాద్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఒక పక్క చెవి కోసిన మేకల్లా అరుస్తూనే ఉన్నారు. మరో పక్క సదరు రసాయన దాడికి తామే బాధ్యులమని సిరియా తిరుగుబాటుదారులు అంగీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి ఒకరు తిరుగుబాటులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా వెల్లడించారు. ఈ వార్తను కప్పి పుచ్చడానికి పశ్చిమ పత్రికలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసలు ఆ వార్తే తమకు తెలియనట్లుగా అవి మౌనం పాటిస్తున్నాయి. కానీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, టర్కీ తదితర దేశాల వదరుబోతు అబద్ధాల్ని మాత్రం అవి కవర్ చేస్తూనే ఉన్నాయి.
అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) వార్తా సంస్ధ కూడా పశ్చిమ మీడియా కంపెనీల్లో ఒకటి. బహుశా ఎ.పి ఈ వార్తను కవర్ చేస్తుందో లేదో అన్న అనుమానం వచ్చిందేమో, సదరు విలేఖరి డేల్ గవ్లాక్ ఈ వార్తను ‘మింట్ ప్రెస్ న్యూస్’ సంస్ధ ద్వారా వెలుగులోకి తెచ్చింది. డమాస్కస్ నగర శివార్లలోని దాడి జరిగిన ఘౌటా ప్రాంతంలో గవ్లాక్ వార్తల భాగస్వామి యాహ్యా అబద్నే స్వయంగా పర్యటించి రసాయన దాడిలో బాధితులయినవారిని, తిరుగుబాటుదారులను ఇంటర్వ్యూలు చేసి వివరాలు సంపాదించారు. వీరు వెలుగులోకి తెచ్చిన ఈ నిజాన్ని మింట్ ప్రెస్ న్యూస్ సంస్ధ ఆగస్టు 30 తేదీనే ప్రచురించినప్పటికీ పశ్చిమ పత్రికలు ఇంతవరకూ ఈ వార్తను కవర్ చేయకపోవడం గమనార్హం.
డేల్ గవ్లాక్ వాస్తవానికి మింట్ ప్రెస్ న్యూస్ సంస్ధకు ‘మధ్య ప్రాచ్యం’ ప్రాంత కరెస్పాండెంట్. అయితే ఆమె గత పదేళ్లుగా అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్ధకు కూడా అమ్మాన్ (జోర్డాన్) నుండి పని చేసే ఫ్రీ లాన్స్ కంట్రిబ్యూటర్ గా పని చేస్తున్నారు. ఈ రిపోర్టు మాత్రం తమ కోసం ఆమె ప్రత్యేకంగా సేకరించి రాశారని మింట్ ప్రెస్ న్యూస్ తెలిపింది. సిరియాపై దాడికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపధ్యంలో ఆ దేశం రసాయన దాడికి అసలు బాధ్యులను టార్గెట్ చేయడం లేదని ఎం.పి.ఎన్ (మింట్ ప్రెస్ న్యూస్) వ్యాఖ్యానించింది.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లతో పాటు అరబ్ లీగ్ కూడా రసాయన దాడికి సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ బాధ్యుడని ఆరోపిస్తున్నాయి. ఈ దాడిలో ప్రధానంగా అమాయక పౌరులే బలయ్యారు. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్ధ ప్రకారం ఈ దాడిలో 355 మంది చనిపోయారు. తిరుగుబాటు దారులు వారి అనుకూల వార్తా సంస్ధలు మాత్రం కొన్ని డజన్ల నుండి 1300 వరకు చనిపోయారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా అయితే 1429 మంది చనిపోయారని, మూడు వేలకు పైగా గాయపడ్డారని కాంగ్రెస్ కి సమర్పించిన నివేదికలో తెలిపాడు. ఈ దాడికి బషర్ అస్సాద్ ను శిక్షించాల్సిందే అంటూ అమెరికా, ఫ్రాన్స్ లు దాడికి ఏర్పాట్లు ప్రారంభించాయి.
సౌదీ సరఫరా
తమ వాదనకు వ్యతిరేకంగా వెల్లడి అవుతున్న సాక్ష్యాలను పరిశీలించడానికి ఈ దేశాలు ఎంతమాత్రం సిద్ధంగా లేవు. ఘౌటా ప్రాంతంలో అనేకమంది డాక్టర్లను, నివాస పౌరులను, తిరుగుబాటుదారులను వారి కుటుంబాలను తాము ఇంటర్వ్యూ చేశామని డేల్ గవ్లాక్, యాహ్యా లు తెలిపారు. వారి ఇంటర్వ్యూలలో అమెరికా వాదనకు పూర్తి భిన్నమైన దృశ్యం ఆవిష్కృతం అయింది. తిరుగుబాటుదారుల్లోని కొంతమందికి సౌదీ అరేబియా గూఢచార శాఖ అధిపతి ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ ద్వారా రసాయన ఆయుధాలు అందాయని ఇతర తిరుగుబాటుదారులు తెలిపారు. (దాదాపు 100కు పైగా తిరుగుబాటు గ్రూపులు సిరియాలో పని చేస్తున్నాయి. వీరిలో కాస్త సంఘటితంగా నిలకడగా సిరియా ప్రభుత్వ బలగాలతో తలపడుతున్నది ఆల్-నుస్రా మాత్రమే. ఇది ఆల్-ఖైదాకు అనుబంధమైన ఇరాక్ టెర్రరిస్టు గ్రూపు. దీనిని టెర్రరిస్టు గ్రూపుగా అమెరికా కూడా గుర్తించింది. ఐనా దానికే ఆయుధాలు ఇస్తుంది.) ఇలా సౌదీ నుండి రసాయన ఆయుధాలు సంపాదించినవారే ఆగస్టు 21 నాటి దాడికి బాధ్యులని గవ్లాక్ తెలిపారు.
ఒక తిరుగుబాడుదారుడి తండ్రి అబు అబ్దెల్ మొనిమ్ ఇలా తెలిపాడు. “రెండు వారాల క్రితం మా అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. తనతో పాటు కొన్ని ఆయుధాలు కూడా తెచ్చాడు. ఆ ఆయుధాలతో పోరాడాలని మా అబ్బాయిని వాళ్ళు కోరారు” అని మొనిమ్ తెలిపాడు. “మా అబ్బాయితో పాటు 12 మంది ఈ రసాయన దాడి సందర్భంగా చనిపోయారు. సౌదీ మిలిటెంటు సరఫరా చేసిన ఈ ఆయుధాలను ఒక సొరంగంలో నిలవ చేశారు. ఆ సౌదీ మిలిటెంటు పేరు అబు ఆయేషా. ఒక బెటాలియన్ కు ఆయేషా నాయకత్వం వహిస్తున్నారు. ఆ ఆయుధాలు ట్యూబ్ తరహాలో ఉన్నాయి. కొన్ని ఆయుధాలకు చివర పెద్ద గ్యాస్ బ్యాటిళ్ళు అమర్చబడి ఉన్నాయి” అని అబ్దెల్ మొనిమ్ తెలిపాడని ఎం.పి.ఎన్ కరెస్పాండెంట్ గవ్లాక్ తెలిపారు.
తిరుగుబాటుదారులు రాత్రిళ్ళు మసీదుల్లోనూ, ప్రైవేటు ఇళ్లలోనూ నివసిస్తూ ఆయుధాలను మాత్రం సొరంగాలలో నిల్వ చేస్తున్నారని ఘౌటా నివాసులు తెలిపారు. ఆగస్టు 21 తేదీన రసాయన దాడి జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత ఘౌటా ప్రాంతంలోకి సిరియా సైనికులు చొచ్చుకెళ్ళారు. తిరుగుబాటుదారులు సొరంగాలలో నిలవ చేసిన రసాయన పదార్ధాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. తాము సొరంగాల నుండి స్వాధీనం చేసుకున్న రసాయన పదార్ధాల ఫోటోలను కూడా వారు విడుదల చేశారు. ఈ ఫోటోలను రష్యా టుడే లాంటి వార్తా సంస్ధలు ప్రచురించాయి.
అయితే తాము వాడుతున్నది రసాయన ఆయుధాలని తమకు తెలియదని తిరుగుబాటుదారులు చెప్పారని గవ్లాక్ తెలిపారు. “ఈ ఆయుధాలేమిటో వాళ్ళు మాకు చెప్పలేదు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పలేదు” అని “కె” అనే పేరు గల మహిళా ఫైటర్ తెలిపింది. “అవి రసాయన ఆయుధాలని మాకు తెలియదు. రసాయన ఆయుధాలు మా చేతికి వస్తాయని మేము ఎప్పుడూ ఊహించలేదు” అని ఆమె తెలిపినట్లు తెలుస్తోంది.
“సౌదీ యువరాజు బందర్ అలాంటి ఆయుధాలు ఇచ్చేటపుడు, అలాంటి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా ఖచ్చితంగా చెప్పి ఉండాలి” అని “కె” వ్యాఖ్యానించింది. ఆమెతో పాటు ఇతర తిరుగుబాడుదారులు తమ పేర్లు పూర్తిగా చెప్పలేదని, పేర్లు చెబితే తమను గుర్తించి టార్గెట్ చేస్తారన్న భయంతో అలా చేస్తారని గవ్లాక్ తెలిపారు. కె చెప్పిన అంశాలతో “జె” అనే మరో తిరుగుబాటుదారుడు ఏకీభవించాడు. ఈయన పేరుపొందిన తిరుగుబాటుదారుడని తెలుస్తోంది. “జబ్బత్ ఆల్-నుస్రా మిలిటెంట్లు ఇతర తిరుగుబాటుదారులకు సహకరించరు. యుద్ధరంగంలో కలిసి ఒకరి పక్క ఒకరు నిలబడి పోరాడడమే తప్ప ఇతర ఏ విధంగానూ వారు సహకరించరు. రహస్య సమాచారాన్ని మాతో పంచుకోరు. ఈ (రసాయన) పదార్ధాలను మోయడానికి, ఆపరేట్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఆధారణ తిరుగుబాటుదారులను వాడుకుంటారు” అని “జె” తెలిపాడు.
“ఈ ఆయుధాల పట్ల మేము ఆసక్తిగా ఉన్నాము. దురదృష్టవశాత్తూ కొంతమంది ఫైటర్లు ఈ ఆయుధాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు” అని “జె” చెప్పినట్లుగా ఎం.పి.ఎన్ తెలిపింది. యాహ్యా అబద్నే దాదాపు డజనుకు పైగా తిరుగుబాటుదారులని ఇంటర్వ్యూ చేయగా తమకు సౌదీ అరేబియా ప్రభుత్వమే నెలసరి జీతాలు చెల్లిస్తున్నట్లుగా వారంతా తెలిపారు.
రష్యాతో ప్రిన్స్ బందర్ బేరసారాలు
సిరియాలో కిరాయి తిరుగుబాటుకు సౌదీ అరేబియా మొదటి నుండి సహాయ, సహకారాలు అందిస్తోంది. ఫైటర్లకు నెలసరి వేతనాలు చెల్లించడమే కాక, వారికి కావలసిన ఆయుధాలను సేకరించడంలో కూడా పూర్తిగా నిమగ్నం అవుతూ వచ్చింది. సౌదీ అరేబియాకు పోటీగా కతార్ కూడా కొన్ని తిరుగుబాటు గ్రూపులను పోషిస్తూ సిరియాలో ప్రవేశపెట్టింది. సౌదీ, కతార్ లు ధన సహాయం చేస్తూ తిరుగుబాటుదారులను సరఫరా చేస్తుంటే, వారికి టర్కీ, జోర్డాన్ లలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు శిక్షణ ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా వీరికి పూర్తిగా సహకరిస్తోంది.
సౌదీ అరేబియా తరపున సిరియా కిరాయి తిరుగుబాటు వ్యవహారాలు పర్యవేక్షిన్నవారిలో ప్రిన్స్ బందర్ ప్రముఖుడు. సౌదీ గూఢచార విభాగానికి అధిపతి అయిన ప్రిన్స్ బందర్, అమెరికా సహాయంతో బషర్ అస్సాద్ ను కూలదోయడానికి శ్రమిస్తున్నాడు.
బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో ఇటీవల జెఫ్రీ ఇంగర్సోల్ అనే విలేఖరి రాసిన ఆర్టికల్ ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం ఆసక్తిగా ఉంటుంది. రష్యా-సౌదీ అరేబియా ల మధ్య జరిగిన రహస్య చర్చలను జెఫ్రీ తన నివేదికలో వివరించాడు. ఈ రహస్య చర్చల గురించి ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక వివరించింది. ఈ చర్చల్లో బషర్ అస్సాద్ కు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ప్రిన్స్ బందర్ కోరాడు. దానికి బదులుగా రష్యాకు అత్యంత చౌక ధరలకు చమురు సరఫరా చేస్తానని బేరం పెట్టాడు.
“బషర్ కి మద్దతు ఇవ్వడం మానుకుంటే (బషర్ ని కూల్చివేసిన తర్వాత) సిరియా తీరంలోని రష్యన్ నౌకా స్ధావరాన్ని కొనసాగిస్తానని ప్రిన్స్ బందర్ వాగ్దానం ఇచ్చాడు. ఈ మేరకు ఒప్పందం కుదరని పక్షంలో ఒక బెదిరింపు కూడా ఆయన చేశాడు. వచ్చే సంవత్సరం రష్యన్ నగరం సోచిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ పైన చెచెన్ టెర్రరిస్టులు దాడి చేయగలరని బందర్ రష్యాకు సూచించాడు” అని జెఫ్రీ రాశాడు. అంటే చెచెన్ టెర్రరిస్టులను తాను పోషిస్తున్నాననీ, బషర్ కి మద్దతు ఇవ్వడం కొనసాగిస్తే సోచి వింటర్ ఒలింపిక్స్ పైన చెచెన్ టెర్రరిస్టులతో దాడి చేయిస్తానని బందర్ రష్యాని బెదిరించాడన్నమాట! (టెర్రరిస్టు దాడులు ఎందుకు జరుగుతాయో ఇక్కడ ఒక అవగాహన లభిస్తోంది.)
“వచ్చే సంవత్సరం జరిగే వింటర్ ఒలింపిక్స్ ను కాపాడతానని నేను మాట ఇవ్వగలను. వింటర్ ఒలింపిక్స్ కు బెడదగా మారిన చెచెన్ టెర్రరిస్టులు మా అదుపాజ్ఞల్లోనే ఉన్నారు” అని ప్రిన్స్ బందర్, రష్యా అధ్యక్షుడు పుటిన్ ను బెదిరించాడని లెబనాన్ పత్రికను ఉటంకిస్తూ తెలిపింది. రష్యాతో ఈ విధంగా రహస్య చర్చలు జరపడానికి సౌదీ యువరాజు బందర్ కు అమెరికా స్వయంగా అనుమతి ఇచ్చిందని జెఫ్రీ (బిజినెస్ ఇన్సైడర్) తెలిపాడు. జెఫ్రీ సమాచారం ప్రకారం బందర్ అమెరికాలో చదువుకున్నాడు. కాలేజీ విద్య, మిలట్రీ విద్య రెండూ అమెరికాలోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలో సౌదీ రాయబారిగా పని చేశాడు. బందర్ ను సి.ఐ.ఏ అమితంగా ఇష్టపడుతుందని జెఫ్రీ తెలిపాడు.
సౌదీ అరేబియా రాచరికం సున్నీ మత పోషకురాలు. ఇరాన్ ప్రభుత్వం షియా మత పోషకురాలు. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ షియా శాఖలోని ‘వహాబీ’ తెగకు చెందినవాడు. అయితే బషర్ అస్సాద్ మత పోషకుడు కాదు. సిరియాను సెక్యులర్ రాజ్యంగానే ఆయన ఉంచాడు. అయితే ఇజ్రాయెల్-అమెరికా ల నుండి వచ్చే ప్రమాదం రీత్యా ఇరాన్ తో సత్సంబంధాలు కొనసాగించాడు. సరిహద్దులోని లెబనీస్ హిజ్బోల్లా కూడా షియా శాఖకు చెందినదే. లేబనీస్ హిజ్బోల్లా-సిరియా-ఇరాన్.. ఈ మూడు రాజ్యాలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు శక్తివంతమైన ప్రతిఘటన ఇచ్చే అక్షం (Axis of Reistence) గా ప్రసిద్ధి చెందాయి.
సున్నీ పోషకులయిన సౌదీ రాజులకు షియా ఇరాన్ తో బద్ధ శతృత్వం ఉంది. ఇది సున్నీ-షియా శత్రుత్వంగా పైకి కనబడినా వారి అసలు వైరం చమురు వ్యాపారానికి సంబంధించినది. ఇరాన్ నుండి చమురు పోటీని నివారించడం, పోటీని నివారించి తన చిత్తానుసారం చమురు ధరలను నిర్ణయించడం సౌదీ రాజుల ప్రధాన ఆసక్తి, లక్ష్యం. దానికోసమే సిరియాలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సౌదీ రాజులు అమెరికాతో చేతులు కలిపారు.
రష్యాకు కూడా అపార చమురు, సహజవాయు నిల్వలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ఐరోపాకు సరఫరా చేస్తోంది. అంటే రష్యా చమురు, ముఖ్యంగా సహజవాయువు ఐరోపాకు చాలా అవసరం. ఈ నేపధ్యం నుండే సిరియాపై దాడికి ఐరోపా దేశాలు నిరాకరించడాన్ని చూడాలి. రష్యాకు అతిగా కోపం తెప్పించడం ఐరోపా రాజ్యాలకు ఇష్టం ఉండదు. ఫలితంగా పార్లమెంటు ఓటు ద్వారా బ్రిటన్ చేతులు కడిగేసుకోగా, జర్మనీ తదితర దేశాలు రాజకీయ మద్దతుతో సరిపుచ్చుకున్నాయి. ‘ఏదో ఒకటి చేయాల్సిందే’ అంటూ నిన్న మొన్నటి వరకూ ఊగిపోయిన ఫ్రాన్సు అధ్యక్షుడు ఫ్రాంష ఒలాండే ఇప్పుడు తాను కూడా తమ పార్లమెంటు అనుమతి తీసుకుంటానని ప్రకటించాడు. నిజానికి దాడి/యుద్ధం ఆరు నెలల కంటే తక్కువ కాలం అయితే ఫ్రాన్స్ పార్లమెంటు అనుమతి తీసుకోవలసిన అవసరం ఫ్రాన్స్ అధ్యక్షుడికి లేదు. ఐనా అనుమతి తీసుకుంటాను అని ఆయన అనడం అంటే సిరియా దాడి గిరించి చేసిన వీరాలాపాల నుండి తనను తాను బైటపడేసుకునే ప్రయత్నంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం తాను కాంగ్రెస్ అనుమతి కోరుతున్నట్లు ప్రకటించాడు. సిరియా దాడి చర్చించడానికి సెప్టెంబరు 9 తేదీన కాంగ్రెస్ సమావేశం అవుతుందని కాంగ్రెస్ స్పీకర్ బోయేనర్ తెలిపాడు. అంటే సెప్టెంబర్ 9 వరకూ దాడి జరగదు. ఒబామా నిన్నటివరకూ చేసిన దుందుడుకు ప్రకటనలను బట్టి ఈపాటికి దాడి జరిగి ఉండాల్సింది. కానీ జరగలేదు. పరిమిత దాడి మాత్రమే అని చెప్పినప్పటికీ అమెరికా చేయబోయే దాడిపైన మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. కాకపోతే అవి నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి.
ఈజిప్టు లాంటి అమెరికా మిత్ర దేశాల్లో సైతం అనేక సంస్ధలు, మత పరిశోధనా సంస్ధలు సిరియా దాడిని గట్టిగా తిరస్కరించాయి. దానిని ఎదుర్కోవడానికి ఈజిప్టు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపు కూడా ఇచ్చాయి. ఈ నేపధ్యంలో అమెరికా కూడా సిరియాపై చేసిన దుందుడుకు వాదన నుండి వెనక్కి తగ్గడానికి మార్గం దొరక్క సతమతం అవుతోందన్న వాదన ఉన్నది. ఇది ఎంతవరకు నిజం అన్నది సెప్టెంబర్ 9 తర్వాత తెలుస్తుంది. సిరియా దాడికి సిద్ధం అయితే గనక అమెరికా కోలుకోలేని విధంగా దెబ్బతినడం మాత్రం ఖాయం. మూడో ప్రపంచ యుద్ధానికి అది దారి తీసినా ఆశ్చర్యం లేదు. “ప్రపంచ యుద్ధాలు ఇలానే మొదలవుతాయి” అని జర్మనీ నేత ఒకరు చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం.








వినాశకాలే విపరీత బుద్ది….
అంటె టెర్రరిస్టులు ఏదో ఒక రాజ్యానికి పెంపుడు కుక్కలన్నమాట!
చెచెన్ టెర్రరిస్టులు ante evaru??asalu vallaki russia ki satrutvam ento dayachesi koncham vivarinchagalara!!!
చెచెన్యా, రష్యాలో ఒక భాగం. చెచెన్లు తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. చెచెన్లు ముస్లిం మతస్ధులు. అందువలన వారి స్వతంత్ర కాంక్షకు కూడా టెర్రరిస్టు ముద్ర వేశారు. చెచెన్యా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నవారిలో ఒక గ్రూపుని సౌదీ అరేబియా పోషిస్తోంది. సిరియా ప్రభుత్వం కూల్చివేతకు సహకరించాలని లేకపోతే వింటర్ ఒలింపిక్స్ పైన దాడి చేయిస్తామని సౌదీ రాజు బెదిరించాడు.
అమెరిక ఒక దేశం పై దాడి చేయడానికి ఇలాంటి కుంతీ సాకులు ఎన్నైనా చెబుతున్ది. కాని దాని అసలు ఉద్దేశం తన చమురు ఎగుమతుల చెల్లింపుల్లో డాలర్ ను ప్రమాణంగా తిసుకొండా యురోల్లో గని, దిగుమతి దారు తమ కరెంసిలో చెల్లించడానికి అనుమతి ఇవ్వడంమే అసలు కారణం.
Always be careful about western media. Western media never bothers about social evils like caste and dowry system in India but they bother about the practice of hijab (covering the face) followed in Islamic countries. Indian ruling class has no opposition on globalisation. Imperialists never interfere in the internal matters of those countries that do not oppose globalisation.