సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం


Syria fears effect shares

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని ఇజ్రాయెల్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. అమెరికాతో కలిసి తాము తమ ‘మిసైల్ రక్షణ వ్యవస్ధ’ ను పరీక్షించామనీ, దానిలో భాగంగా మధ్యధరా సముద్రంలోకి రెండు రాకెట్లు ప్రయోగించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. సిరియాకూడా దాడి జరగలేదని ప్రకటించింది. మధ్యధరాలో రెండు ఎగిరే వస్తువులను తమ రాడార్ లు గుర్తించాయని రష్యా చెప్పడం విశేషం.

గ్రీన్ విచ్ కాలమానం ప్రకారం ఉదయం గం 6:16  లకు (భారత కాలమానం ప్రకారం ఉదయం గం 11:46 లు) మధ్యధరా సముద్రం మధ్య భాగం నుండి సిరియా తీరం పైకి రెండు క్షిపణులు ఎగరడం తమ ముందస్తు హెచ్చరిక రాడార్లు గుర్తించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సిరియాపై పరిమిత స్ధాయిలో దాడి చేస్తానని అమెరికా గత రెండు వారాలుగా హెచ్చరిస్తున్న నేపధ్యంలో ఇది అమెరికా పనే అని పలువురు భావించారు.

ఆ తర్వాత ఇది మా పనే అని ఇజ్రాయెల్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ లోపు ఇండియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షేర్ మార్కెట్లు భారీగా పతనం కాగా రూపాయి మళ్ళీ 68 రూపాయిల మార్కు దాటిపోయింది.

ఇజ్రాయెల్ ప్రయోగించిన రెండు రాకెట్లు సముద్రంలోనే పడ్డాయని రష్యా వార్తా సంస్ధ ఆర్.ఐ.ఏ నొవోస్తి తెలిపింది. వీటి ప్రయాణం మధ్యధరా సముద్రం మధ్య భాగం నుండి సిరియా భూభాగం వైపుకు సాగినట్లుగా రాడార్లు నమోదు చేశాయని నొవోస్తి తెలిపింది. దాడి జరిగిందా లేదా అన్న సంగతి పైన తమకు సమాచారం లేదని రష్యాలోని సిరియా ఎంబసీ ప్రకటించగా డమాస్కస్ లో రాకెట్లు పేలినట్లుగా ఎలాంటి సిగ్నల్స్ లేవని డమాస్కస్ లోని రష్యా ఎంబసీ ప్రకటించింది. తమ భూభాగంపై ఎక్కడన్నా మిసైల్ దాడి జరిగినట్లుగా తమ మిసైల్ హెచ్చరిక వ్యవస్ధలో నమోదు కాలేదని సిరియా ప్రభుత్వం చెప్పినట్లుగా లేబనీస్ ఛానెల్ ఆల్-మనార్ టి.వి తెలిపింది.

మిసైల్ ప్రయోగం గురించి ఇజ్రాయెల్ మిలట్రీకి కూడా మొదట తెలియనట్లు కనిపిస్తోందని రష్యా టైమ్స్ తెలిపింది. అయితే అమెరికాతో కలిసి తాము సంయుక్తంగా మధ్యధరా సముద్రంలో క్షిపణి పరీక్ష జరిపామని ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక యాంకర్ టార్గెట్ మిసైల్ ను తాము ప్రయోగించామని ఆ దేశం తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికాలు సంయుక్తంగా ఇజ్రాయెల్ లో అభివృద్ధి చేసిన ‘యారో-2’ క్షిపణి రక్షణ వ్యవస్ధను పరీక్షించడానికి ఇలా యాంకర్ టార్గెట్ మిసైల్ ప్రయోగిస్తారని ఆర్.టి సూచించింది.  ఆర్.ఐ.ఏ నొవోస్తి ప్రకారం మిసైళ్ళు సిరియా తీరానికి 300 కి.మీ దూరంలో సముద్రంలో పడిపోయాయి.

మధ్యధరా సముద్రంలో నిలిపి ఉంచిన తమ యుద్ధ నౌకల నుండి ఎలాంటి క్షిపణిని ప్రయోగించలేదని అమెరికా నౌకాదళం కూడా ప్రకటించింది. ఈ మేరకు నౌకాదళ ప్రతినిధి తెలిపాడని ఆర్.టి తెలిపింది. క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వార్తలను పరిశీలిస్తున్నామని నాటో ప్రకటించగా, దానితో తమకు సంబంధం లేదని బ్రిటన్ ప్రకటించింది. (మధ్యధరా సముద్రంలోని సైప్రస్ ద్వీపంలో బ్రిటన్ కు సైనిక స్ధావరం ఉన్నది. సిరియా ఉద్రిక్తతల నేపధ్యంలో అక్కడికి ఇటీవల ఒక భారీ యుద్ధ నౌకను కూడా బ్రిటన్ తరలించింది.)

బేర్ మన్న రూపాయి, షేర్లు

ఈ మాత్రం దానికే భారత షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ పాతనాన్ని చవిచూసింది. మంగళవారం ఒక్క రోజులోనే బి.ఎస్.ఏ సెన్సెక్స్ 651 పాయింట్లు పడిపోయింది. ఇది 3.45 శాతం పతనంతో సమానం. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 209 పాయింట్లు, 3.77 శాతం, పతనం అయిపోయింది. ఈ పతనం ఫలితంగా మదుపుదారులు ఏకంగా 1.63 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ విలువ కోల్పోయారని ది హిందు తెలిపింది. సిరియా దాడి భారత్ కు ఎంత ప్రమాదకరమో ఈ పరిణామం ద్వారా స్పష్టం అవుతోంది.

సిరియా దాడి వార్తకు తోడు ఇండియా క్రెడిట్ రేటింగ్ ను రేటింగ్ సంస్ధలు తగ్గించనున్నాయి అన్న వార్తలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ లోని భారీ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు అయిన ‘గోల్డ్ మెన్ సాచ్’ ఇండియా జి.డి.పి వృద్ధి రేటు అంచనాను భారీగా తగ్గించింది. 2013-14కు గాను ఇండియా జి.డి.పి 6 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసిన గోల్డ్ మేన్ దానిని 4 శాతానికి తగ్గిస్తునట్లు ప్రకటించింది. వాల్ స్ట్రీట్ బ్యాంకు ఇంత భారీగా అంచనా తగ్గించుకోడం అరుదనే చెప్పాలి. వాటి అంచనా మార్పులు సాధారణంగా ఇంత భారీగా ఉండడం తక్కువ. మరో వైపు ఎస్&పి రేటింగ్ కంపెనీ ఇండియా క్రెడిట్ రేటింగ్ ను తగ్గించే అవకాశాలు ఇండోనేషియా కంటే ఎక్కువగా ఉన్నాయన్న వార్త వ్యాపించడం వల్ల కూడా షేర్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

షేర్లతో పాటు రూపాయి కూడా పతనం అయింది. సోంవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల వద్ద ముగిసిన రూపాయి విలువ మంగళవారం ప్రారంభం లోనే తక్కువగా రు. 66.29 పై వద్ద ట్రేడింగ్ మొదలయింది. ఒక దశలో రు. 68.27 పై లకు పతనం అయింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుని ట్రేడింగ్ ముగిసేసరికి రు. 67.63 పై వద్ద తేలింది. ఈ ఒక్క రోజులో 163 పైసలు లేదా 2.47 శాతం రూపాయి విలువ పతనం అయింది. ఆగస్టు నెల చివరి రోజుల్లో పతనం అయినప్పుడేమో నెల చివర్లో డాలర్ల డిమాండు పెరుగుతుందనీ, చమురు కంపెనీలు డాలర్ డిమాండ్ పెంచుతాయనీ అందువలన తగ్గిపోయిందని చెప్పారు. ఇప్పుడు నెల చివర కాకపోగా కేవలం 3 వ తేదీయే. ఐనా పడిపోవడాన్ని ఎలా చెబుతారు? చిదంబరం గారు చెప్పిన స్వదేశీ కారణాలు ఏమీ లేకపోగా పూర్తిగా విదేశీ కారణాలే -సిరియా దాడి భయం, గోల్డ్ మెన్ సాచ్ జి.డి.పి అంచనా, ఎస్&పి రేటింగ్ భయం- రూపాయిని అణగదొక్కాయి.

2 thoughts on “సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

  1. ఒక్కసారి చచ్చే వాడికైతే ఎవరైనా అయ్యో అని ఏడుస్తారు కానీ రోజూ చచ్చేవానికోసం ఎవరు ఏడుస్తారన్నట్లు…

    ఇజ్రాయిల్ రెండు మిస్సైల్లు ప్రయోగిస్తే కూడా..రూపాయి విలువ పడిపోతుందా..?

    పాశ్చాత్య దేశాల్లో తుమ్మినా,దగ్గినా రూపాయి విలువ పడిపోతుందంటే…అర్ధం ఏంటి..?
    మనం దాదాపు ఆర్ధిక స్వాతంత్ర్యం కోల్పోయాం అన్నమాట…!

  2. భారత ఆర్థికవ్యవస్థను ప్రక్షాలన గావించడానికి ఇంతకంటే మంచి అవకాశం ప్రభుత్వానికి ప్రస్తుత తరుణంలోమరోకటి రాదేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s