అసరం అత్యాచారం: ప్రాధమిక సాక్ష్యాలున్నాయ్ -పోలీసులు


asaram 01

తన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిపై అసరం బాపు అత్యాచారానికి పాల్పడ్డాడనేందుకు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. జోధ్ పూర్ డి.సి.పి అజయ్ లాంబ ప్రకారం 16 యేళ్ళ బాలిక ఫిర్యాదుపై పోలీసులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అసరంపై బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని వారి ప్రాధమిక విచారణలో తేలిందని డి.సి.పి తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటాక మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ ఆశ్రమం నుండి అసరం బాపును అరెస్టు చేసిన రాజస్ధాన్ పోలీసులు ఆయన్ను జోధ్ పూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనను ఒక రోజు పోలీసుల కస్టడీకి అనుమతించింది.

అరెస్టుకు ముందు అసరం బాపును పోలీసులు రెండున్నర గంటలపాటు విచారించారు. తనపై వచ్చిన ఆరోపణలను అసరం బాపు తిరస్కరించాడని వారు తెలిపారు. అసరం పైన ‘పొటెన్సీ పరీక్ష’ నిర్వహించాల్సిందిగా డాక్టర్లను కోరామని కూడా పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన చోటికి కూడా అసరం బాపును తీసుకెళ్తామని సంఘటన ఎలా జరిగిందీ తిరిగి రూపొందించడం ద్వారా నిర్ధారించుకుంటామని తెలిపారు.
“ఇప్పటివరకూ మాకు దొరికిన సాక్ష్యాలకు సంబంధించిన నిజాలను దృఢంగా ఉన్నాయి. కానీ కేసును మరింత గట్టిగా నిర్మించేందుకు మరింత సమయం కావాలని కోర్టును కోరాము” అని జోధ్ పూర్ పోలీసు కమిషనర్ బిజూ జార్జ్ జోసెఫ్ అన్నారని ది హిందు తెలిపింది. “అసరం పైన పొటెన్సి పరీక్ష జరపాలని డాక్టర్లను కోరాము. నేరాన్ని పునహ్రూపోండించడానికి వీలుగా ఆయన్ని మనాయ్ కి తీసుకెళ్తాము” అని జోసెఫ్ తెలిపారు.

ఇండోర్ ఆశ్రమంలో గట్టి పోలీసు కాపలా మధ్య అసరం ను అరెస్టు చేశారు. ఒకవైపు ఆశ్రమంలో అసరంను పోలీసు అధికారులు విచారిస్తుండగానే మరో పక్క భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో 3000 మందికి పైగా ఉన్న అసరం బాపు మద్దతుదారులను అదుపులో ఉంచడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను దించారు. “నన్ను అరెస్టు చేయడానికి వచ్చిన జోధ్ పూర్ పోలీసులు బాగా తెలివిగలవారై ఉండాలి” అని తన మద్దతుదారులతో అసరం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు అసరం బాపు తనయుడు నారాయణ్ సాయి పోలీసులకు షరతులు విదించాడు. తన తండ్రి 13 యేళ్లుగా నరాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని, ఆయన అనారోగ్యం కుదుటపడ్డాక జోధ్ పూర్ పోలీసులు ప్రశ్నించుకోవచ్చని విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు. రాత్రి 8:30 గంటలకు ఆశ్రమానికి పోలీసులు చేరేసరికి అసరం తన భక్తులతో కలిసి ‘సత్సంగ్’ నాటకం మొదలు పెట్టాడు. అది 9:30 కి ముగిసింది. 10 గంటలలోపు విచారణ ముగించాలని, ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఉదయం తిరిగి విచారణ చేసుకోవచ్చని ఆంక్షలు విధించేందుకు నారాయణ్ ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆయన ఆంక్షలను ఖాతరు చేయలేదు.

బైట భక్త మహాజనం ఉద్రిక్తత సృష్టిస్తుండగానే రెండున్నర గంటల పాటు అసరం బాపు విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు, రెవిన్యూ అధికారులు అక్కడే ఉన్నారు. 11:30 గంటల ప్రాంతంలో అంబులెన్సు, ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని అసరం మద్దతుదారులను బారికేడ్లకు పరిమితం చేశారు. అరెస్టు సమయానికి పోలీసుల సంఖ్య 1000కి పైనే ఉందని పత్రికలు తెలిపాయి. 12:15 గంటలకల్లా అసరం బాపును అరెస్టు చేసి 10 వాహనాల బారులో ఇండోర్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి జోధ్ పూర్ కి అసరంను తరలించారు. మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఒక రోజు కస్టడీకి కోర్టు ఆదేశించింది.

ఆదివారం ఉదయం జోధ్ పూర్ చేరుకున్న రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేరం రుజువైతే అసరంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాడు. స్వామీజీ అరెస్టు కోసం శనివారం నిరాహార దీక్ష ప్రారంభించిన బాలిక తండ్రి ఆయన అరెస్టుతో తన దీక్షను విరమించుకున్నారు. పోలీసు అధికారులే ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసినట్లు తెలుస్తోంది.

అసరం బాపుకు మొదట మద్దతుగా వచ్చిన బి.జె.పి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అసరం బాపు నుండి దూరంగా ఉండాలనీ, విచారణ పూర్తయ్యేవరకూ ఎలాంటి ప్రకటనా చేయవద్దనీ పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు సలహా ఇవ్వడంతో మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల బి.జె.పి నాయకులు నోరు తెరవడం మానుకున్నారు.

“మహిళలపై అత్యాచారాల పట్ల తీవ్రంగా వ్యవహరించే బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్, అసరం బాపు విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో ప్రశ్నించాడు. దానికి సుష్మా స్వరాజ్ కూడా ట్విట్టర్ లోనే స్పందించారు. “పెద్దా, చిన్నా అంటూ ఎవరూ ఉండరు. చట్టం తన పని తాను చేయవలసిందే” అని ఆమె స్పందించారు.

అసరం అరెస్టుతో బాలిక పోరాటంలో ఒక ఘట్టం ముగిసింది. కానీ కోర్టు విచారణ ముగిసి శిక్ష పడేవరకూ బాలిక కుటుంబం గానీ, వారి మద్దతుదారులు గానీ విశ్రమించడానికి వీలు లేదు. అసరం లాంటివారు తప్పించుకోడానికి చట్టంలోనూ, సమాజంలోనూ అనేక అవకాశాలు ఉన్నాయి.

వ్యాఖ్యానించండి