బి.జె.పి… బోడి మల్లయ్య -కార్టూన్


Bodi Mallaiah

“ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య!” ఈ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బి.జె.పి పైన ప్రయోగించిందని కార్టూన్ సూచిస్తోంది. కాని, అది నిజమేనా?

ఉప్పు-నిప్పుగా ప్రజలకు కనిపించే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటై ఆహార భద్రతా బిల్లు, భూ స్వాధీన బిల్లు లను ఆమోదించాయి. బిల్లులు ఆమోదం పొందేవరకు ఇరు పక్షాలు ఒకరినొకరు బాగా సహకరించుకున్నాయి. ఆహార భద్రతా బిల్లులో బి.జె.పి చేసిన కొన్ని సవరణలను ఆమోదించేవరకు కాంగ్రెస్ వెళ్లింది. కొన్ని సవరణలను తిరస్కరించినప్పటికీ ఇరు పక్షాల మధ్యా ప్రధానంగా ఐక్యతే కనిపించింది.

బిల్లులు ఆమోదం పొందినాక ఇరు పక్షాలు ఒక్కసారిగా తిట్టుకోవడం మొదలు పెట్టాయి. రూపాయి పతనం ద్వారా వ్యక్తం అవుతున్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులపై ప్రధాని ఇచ్చిన వివరణను బి.జె.పి విమర్శిస్తే, సదరు విమర్శలను ప్రధాని ఎన్నడూ లేనివిధంగా అలంకారాలు జోడించి మరీ తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. ఎప్పటిలాగానే నంగి, నంగిగా, మొఖంలో ఎటువంటి హావభావాలు లేకుండా రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మన్మోహన్ సింగ్ మాటల్లో మాత్రం దృఢత్వం కనబరిచాడు. ఆయన మొఖం చూస్తే బి.జె.పిపైన ఘాటుగా విమర్శలు సంధిస్తున్న దాఖలాలే కనపడలేదు. కాస్త కళ్ళు మూసుకుని విన్న తర్వాతనే ‘ఓహో, ఈయన బి.జె.పి విమర్శలకు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు’ అని భావించవలసి వచ్చింది.

బహుశా ఎటువంటి హావభావాలు లేకుండా మాటలు పలకడం కూడా ఒక కళ అయితే ఆ కళలో ప్రధాని మన్మోహన్ నిష్ణాతులని చెప్పక తప్పదు. 64 కళల్లో అది లేకపోతే గనుక అర్జెంటుగా చేర్చాల్సిన అవసరం కనిపిస్తోంది.

విషయం ఏమిటంటే కాంగ్రెస్, బి.జె.పిలు రెండు వైరి పక్షాలకు నాయకులు. వీరి మధ్య విధానాల పరంగా ఎటువంటి తేడా లేదు. కానీ ఆ సంగతి జనానికి అర్ధం అయితే ఎన్నికల్లో పోటీలు ఒక ఫార్సుగా వాళ్ళు అర్ధం చేసుకుంటారు. అదే జరిగితే మొత్తం ఎన్నికల వ్యవస్ధ పైనే జనానికి భ్రమలు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే అని విద్యాధికులు కూడా భావిస్తున్న పరిస్ధితి. కాబట్టి ఎన్నికలపై భ్రమలు కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యంపైన భ్రమలు కోల్పోవడం. రాజకీయ పార్టీలు, ధనిక వర్గాలు దీనిని ఎంతమాత్రం అనుమతించలేవు. దాని ఫలితమే బిల్లుల ఆమోదంలో ఐక్యత ప్రదర్శించిన పాలక, ప్రతిపక్షాలు అకస్మాత్తుగా తిట్టుడు మొదలుపెట్టాయి. 

 

One thought on “బి.జె.పి… బోడి మల్లయ్య -కార్టూన్

వ్యాఖ్యానించండి