తన ఆశ్రమం నడిపే పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అసరం బాపు పోలీసులకు దొరక్కుండా దొంగాట ఆడుతుంటే, ఆయన ఎక్కడ ఉన్నదీ తెలిసి కూడా పోలీసులు తొండాట ఆడుతున్నారని పత్రికలు ఆరోపిస్తున్నాయి. హిందూ మత ప్రబోధకుడు అసరం బాపుకు ఇచ్చిన ఆగస్టు 30 తేదీ గడువు ముగిసినా ఆయన అరెస్టు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత దేవుడికీ, సామాన్యుడికి చట్టం ఒకే విధంగా ఎందుకు పని చేయదని జర్నలిస్టులు, ఎడిటర్లు ప్రశ్నిస్తున్నారు. జోధ్ పూర్ ఆశ్రమం వద్ద జర్నలిస్టులపై దాడి చేసిన 16 మందినయితే పోలీసులు అరెస్టు చేశారు గానీ అసరం బాపుని మాత్రం అరెస్టు చేయలేకపోయారు.
కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాజస్ధాన్ లో అయితే అరెస్టవుతానన్న భయంతో అసరం బాపు ఇండోర్ ఆశ్రమానికి పారిపోయాడని కొన్ని పత్రికలు సూచిస్తున్నాయి. ఇండోర్ ఆశ్రమంలోనే ఆయన ఉన్నాడని తెలిసినా పోలీసులు ఆయనను అరెస్టు చేయడం లేదని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి వ్యక్తులు నిలదీస్తున్నా సమాధానం చెప్పేవారు లేరు.
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మనీష్ తివారీ నుండి రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వరకు అసరం బాపును విమర్శిస్తున్నప్పటికీ ఆయనను పోలీసులు ఎందుకు విచారించలేకపోతున్నారో శేష ప్రశ్నగా నిలిచింది. అసరం బాపు పేరు ఎత్తకుండా ఆయనను నరేంద్ర మోడి రాక్షసుడితో పోల్చడం సరికొత్త పరిణామం. మహిళలను గౌరవించలేనివారు రాక్షసులతో సమానమని మోడి వ్యాఖ్యానించారు. అసరం బాపును వెనకేసుకు వస్తున్నందుకు మధ్య ప్రదేశ్ బి.జె.పి నాయకుల పట్ల మోడి అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జోధ్ పూర్ కి చెందిన 16 యేళ్ళ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడని అసరం బాపు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పూజ కోసం అంటూ తనను ఆశ్రమానికి పిలిపించుకున్న అసరం బాపు తనపై అత్యాచారం జరిపాడని బాలిక స్వయంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీసుకోవడానికి జోధ్ పూర్ పోలీసులు నిరాకరించడంతో బాలిక, ఆమె తండ్రి ఢిల్లీలో ఫిర్యాదు చేయడంతో విషయం పత్రికలకు ఎక్కింది.
కేసును మళ్ళీ రాజస్ధాన్ పోలీసులకు అప్పగిస్తే పురోగతి ఉండదని బాలిక తండ్రి మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి జోధ్ పూర్ కి బదిలీ చేశారు. బాలిక తండ్రి అనుమానించినట్లే అసరం బాపును అరెస్టు చేయడానికి పోలీసులు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆయన ఆశ్రమాల వెంటా, విమానాశ్రయాల వెంటా తిరుగుతున్నపుడు నోటీసులు ఇచ్చి సరిపుచ్చుకున్న పోలీసులు ఇప్పుడు ఆయన ఎక్కడున్నదీ తెలియడం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.
భోపాల్ ఆశ్రమంలో ఉన్న అసరం బాపును విచారించడానికి జోధ్ పూర్ పోలీసులు వస్తున్నారని తెలిసిన వెంటనే ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారని ది హిందు తెలిపింది. భక్త మహాజనం తరలి వస్తుండడంతో ఇండోర్ ఆశ్రమంలోనే అసరం బాపు కొలువు తీరాడని పత్రికలు అనుమానిస్తున్నాయి. ఆయనకు రక్షణగానే ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి ల పిలుపు మేరకు భక్తులు ఇండోర్ వస్తున్నారని, రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించినట్లు తెలుస్తోంది.
మద్దతుదారులు (లేదా భక్తులు) పెద్ద సంఖ్యలో వస్తున్నందున ఆశ్రమం వద్ద పోలీసులను మోహరించామని పోలీసు అధికారులు చెప్పారు. సదరు అధికారుల ప్రకారం అసరం బాపు ఎక్కడ ఉన్నదీ ఇండోర్ పోలీసులకు తెలియదు. ఇండోర్ ఆశ్రమంలో అసరం ఉన్నాడా లేదా అని అడిగినప్పుడు తమకు తెలియదని పోలీసు అధికారులు చెప్పారని ది హిందు తెలిపింది. మరీ విచిత్రం ఏమిటంటే అత్యాచారం కేసు విచారిస్తున్నామని చెబుతున్న జోధ్ పూర్ పోలీసులు ఇంతవరకూ ఇండోర్ పోలీసులను సంప్రదించకపోవడం!
శుక్రవారం తన తనయుడు నారాయణ్ సాయి తో సహా భోపాల్ వీడిపోయిన అసరం ఇండోర్ సమీపంలోని దేవాస్ టోల్ నాకా వద్ద స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ లో కనిపించాడని పత్రికలు తెలిపాయి. మధ్య ప్రదేశ్ బి.జె.పి నాయకురాలు ఉమా భారతి అసరంను వెనకేసుకొచ్చిన నేపధ్యంలో ఆయన మధ్య ప్రదేశ్ వెళ్లాడని అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉండగా జోధ్ పూర్ ఆశ్రమానికి తరలి వస్తున్న భక్తులను చిత్రీకరిస్తున్నందుకు జర్నలిస్టులపై ఆశ్రమంలోని వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కెమెరాలు పగల గొట్టి విలేఖరులను కొట్టారని, విలేఖరులు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ దాడిని ఖండించడానికి మాత్రం రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని హిత బోధ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒకడుగు ముందుకేసి దాడి ఆర్.ఎస్.ఎస్, బి.జె.పిల పనేనని ఆరోపించాడు.
“ఇలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఐక్య కంఠంతో ఖండించాలి. వివిధ సందర్భాల్లో, మీడియా తన విధి నిర్వర్తించే ఇటువంటి పరిస్ధితుల్లో నేను తరచుగా బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ మద్దతుదారులను చూస్తుంటాను. ఇది అనాగరికుల చర్య. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఈ నేరంలో ఉన్నవారిని అందరిపైనా చర్య తీసుకుంటాము” అని గెహ్లాట్ అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆశ్రమం నుండి 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 16 మంది సామాన్యుల విషయంలో చూపించిన వేగం, చిత్త శుద్ధిని పోలీసులు అసరం బాపు విషయంలో ఎందుకు చూపలేదన్నదే ప్రశ్న!




@ ఆయనను నరేంద్ర మోడి రాక్షసుడితో పోల్చడం సరికొత్త పరిణామం @
దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయట అప్పుడప్పుడు. వీరి ఆశీర్వాదాలు లేకుండా అసరం బాపులు దేశం నిండా తులతూగుతున్నారా?