సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారాలంటే… ?


Telangana

(moola) ప్రశ్న:  సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి?

సమాధానం: కేంద్రం దృష్టిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధమ కర్తవ్యంగా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా తేలిక. కానీ కేంద్రాన్ని ఏలుతున్న పాలకవర్గాల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి మనం అనుకునే పరిష్కారం వారు ఇవ్వరు. వారు చూపే ఉద్యమ అణచివేత పరిష్కారం ప్రజలకి సానుకూలం కాదు.

పాలక వర్గాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రజలకు ఒక పెద్ద సమస్య. ప్రజల మధ్య ప్రాంతీయ తగాదాలు తలెత్తడానికి కారణం, అసమాన అభివృద్ధికి దారితీసే వారి విధానాలే. ఆ సంగతి వారికి తెలుసు. జనానికే పూర్తిగా తెలియదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అక్కడి ప్రజలు పోరాడి సాధించుకున్న ఒక డిమాండు. అన్ని ప్రాంతాల్లాగానే తెలంగాణ ప్రజల్లో వివిధ సెక్షన్లు ఉన్నాయి. వారి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని సాధారణ ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ వస్తే నీటి ప్రాజెక్టులు వస్తాయని, తమ పొలాలు సస్యశ్యామలం అవుతాయని అక్కడి రైతులు ఆశిస్తున్నారు. రాష్ట్రం వస్తే చదువు అయిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని విద్యార్ధులు, బతుకు తెరువుకు కొలువులు దొరుకుతాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. వారికి ఆ ఆశలు కల్పించి నమ్మించడంలో నాయకులు సఫలం అయ్యారు.

కానీ తెలంగాణ ద్వారా అక్కడి నాయకులు కోరుకున్నది తమ సమస్యల పరిష్కారమే గానీ ప్రజల సమస్యల పరిష్కారం కాదు. నాయకులు అంటే అక్కడ గత రెండు మూడు దశాబ్దాలుగా లేదా నాలుగైదు దశాబ్దాలుగా అభివృద్ధి అయిన కొత్త ధనిక వర్గాలు. సీమాంధ్ర ధనిక వర్గాలు తెల్లవారి పాలనలోనే అభివృద్ధి అయ్యారు. రెవిన్యూ కోసం బ్రిటిష్ వాడు నిర్మించిన నీటి ప్రాజెక్టులు వారికి ఆ అవకాశం ఇచ్చాయి. అప్పటికి తెలంగాణ నిజాం భూస్వామ్య పాలనలో ఉన్నది.

ఈ అంశాన్ని కొంత వివరంగా చూడాలంటే మొదట సమస్య మూలాలను తడమడం అవసరం. సీమాంధ్ర ఉద్యమాన్ని, నేపధ్యాన్ని వివరంగా చర్చించడానికి ఈ సందర్భాన్ని అవకాశంగా నేను తీసుకుంటున్నాను.

సీమాంధ్ర దాదాపు 150 యేళ్ళు బ్రిటిష్ వలస పాలనలో ఉంటే తెలంగాణ అదే కాలంలో నిజాం భూస్వామ్య పాలనలో కొనసాగింది. బ్రిటిష్ వాడు తమ అవసరాల కోసం సీమాంధ్ర లోని భూస్వామ్య వ్యవస్ధకు పైపై మార్పులు చేసి తమ వలస పాలనకు అనుగుణమైన పెట్టుబడిదారీ పద్ధతులను ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం భూస్వామ్య ఉత్పత్తి విధానానికి తదుపరి అభివృద్ధి దశ. కనుక బ్రిటిష్ ఏలుబడిలో ప్రవేశపెట్టబడిన పెట్టుబడిదారీ పద్ధతులు (ఉత్పత్తి విధానం కాదు) సీమాంధ్రలో కొంత అభివృద్ధిని తెచ్చాయి. కానీ భూస్వామ్య పాలనలో కొనసాగిన తెలంగాణ ఆ కాస్త అభివృద్ధికి కూడా నోచుకోలేదు.

ప్రధానంగా విద్య, నీటిపారుదల రంగాల్లో ఈ తేడా ప్రస్ఫుటంగా కొనసాగింది. సీమాంధ్రలో విద్యతో పాటు వచ్చే మధ్యతరగతి ఉద్యోగాలు విద్యాధిక మధ్యతరగతిని సృష్టించగా, నీటిపారుదల వల్ల పచ్చగా పండిన పొలాలు ధనిక రైతులను సృష్టించాయి. స్వాతంత్ర్యం (వస్తే) అనంతరం ధనిక రైతులు మెల్లగా వ్యాపారాలను కూడా వశం చేసుకున్నారు. పత్తి, పొగాకు, మిరప తదితర దళారీ వ్యాపారాల్లో కోట్లు గడించి శత, సహస్ర, దశ సహస్ర కోటీశ్వరులుగా అవతరించారు. వారే రాష్ట్ర రాజకీయాలకు అధిపతులు అయ్యారు.

ఇదే కాలంలో నిజాం కాలంలో తెలంగాణలో భూస్వామ్య వ్యవస్ధ వలన ఉత్పత్తి పెద్దగా లేదు. భూస్వామ్య ఉత్పత్తి విధానం లక్షణమే అంత. శ్రామికులను బందీలుగా, అర్ధ బంధీలుగా చేసుకునే భూస్వామ్య వ్యవస్ధలో తమ శ్రమని ఇష్టం వచ్చిన వ్యక్తికి అమ్ముకునే స్వేచ్ఛ ఉండదు. వెనుకబడిన వ్యవసాయ పద్ధతి కనుక వలస (తెల్ల వాడి పాలన), అర్ధ వలస (నల్లవాడి పాలన) సమాజాల కంటే తక్కువ మిగులును మాత్రమే అది ఇస్తుంది. కాబట్టి భూస్వాములు కూడా పెద్దగా అదనపు విలువను పోగేసుకోలేని పరిస్ధితి ఉంటుంది. దానితో వారు ఒకటి, రెండూ కోట్లు మహా అయితే పదుల కోట్లు మాత్రమే పోగేయగలిగారు.

నల్ల దొరల పాలన వచ్చాకయినా ఈ తేడాలు తొలగించడానికి కృషి చేసి ఉండాల్సింది. ఆ కృషి చేయకపోగా తెలంగాణ ధనికులను కూడా సీమాంధ్ర ధనికులు తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. వ్యాపార మిగులును తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టి మరింత పై చేయి సాధించారు. చివరికి తెలంగాణలోని వనరులను కూడా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈ విధంగా ఇరు ప్రాంతాల మధ్య అభివృద్ధిలోనే ప్రాంతీయ తేడాలు రావడానికి సీమాంధ్ర ధనికులు కారణంగా నిలిచారు.

పైగా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా నాయకులను కొనేసి నిద్ర పుచ్చడానికే వారు అలవాటు పడ్డారు తప్పితే కనీసం తెలంగాణ ధనికుల అభివృద్ధికి, వనరుల పంపకానికీ, పదవుల పంపకానికి కూడా వారు సిద్ధపడలేదు. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, 610 జి.ఓ… ఇలా ప్రతి ఒప్పందాన్ని, ఒప్పందం అయిన మరుసటి రోజు నుండే తుంగలో తొక్కారు. ఇది ప్రాంతీయ వివక్ష. ప్రాంతీయ పెత్తనం కూడాను.

అయితే రెండు దశాబ్దాలుగా అమలవుతున్న నూతన ఆర్ధిక విధానాలు తెలంగాణ ధనికుల సంపదలను పెంచింది. సీమాంధ్ర ధనికవర్గాలకు జూనియర్ పార్టనర్లుగా ఉంటూ కూడా వారు ఆస్తులు పెంచుకున్నారు. వంద నుండి వెయ్యి కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిన వర్గం అక్కడ తయారయింది. అయితే పెట్టుబడి పోగుపడ్డాక అది ఊరకనే కూర్చోదు కదా! పెట్టుబడులుగా రియలైజ్ అయ్యి మరిన్ని లాభాలు, అనగా మరింత పెట్టుబడిగా పెరగడానికి దారులు వెతుకుంది.

అలాంటి దారుల్లో రాజకీయ అధికారం ప్రధానమైన రహదారి. కానీ ఆ రహదారిని అప్పటికే సీమాంధ్ర ధనికులు ఆక్రమించి ఉన్నారు. అదీ కాక అప్పటికే అభివృద్ధి అయిన పెట్టుబడి, పోటీగా ఎదిగే కొత్త పెట్టుబడిని అభివృద్ధి కాకుండా తోక్కేస్తుంది. దానికి ప్రాంతాలతో పనిలేదు. కానీ ప్రాంతీయ సెంటిమెంట్లను ఉపయోగపెట్టుకుంటుంది. అలాగే అణచివేతకు గురవుతున్న పెట్టుబడి కూడా ప్రాంతీయ వాసనను పట్టించుకోదు. కానీ తన స్వార్ధం కోసం ఉపయోగపెట్టుకుంటుంది. రెచ్చగొడుతుంది. ఈ విధంగా సీమాంధ్రుల పెట్టుబడి తెలంగాణ పెట్టుబడిని తొక్కేస్తూ వచ్చింది. రాజకీయ అధికారంలోకి జొరబడకుండా అడ్డంకులు కల్పించింది. ఎక్కడన్నా జొరబడ్డా వారి చేతుల్లో నిర్ణయాధికారం లేకుండా అడ్డుపడింది.

దానితో తెలంగాణ పెట్టుబడికి సహజంగానే ప్రాంతీయ వెనుకబాటుతనం గుర్తొచ్చింది. వారి భాష (యాస) గొప్పతనం గుర్తుకు వచ్చింది.

ఇదంతా పెట్టుబడి కధ! అది లేనివారి గురించి కూడా మాట్లాడుకోవాలి. భూస్వామ్య, అర్ధ భూస్వామ్య, వలస, అర్ధ వలస, పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో శ్రామిక జనం ఎప్పుడూ కిందనే ఉంటారు. రాజ్యాలను, ప్రభుత్వాలను శాసించే స్ధితిలో వారు ఉండరు. ఉత్పత్తి సాధనాలయిన భూములు, పరిశ్రమలు ఎవరి స్వాధీనంలో ఉంటే వారే రాజ్యాలను, ప్రభుత్వాలను శాసిస్తారు. శ్రామికులకు లేనివి అవే కనుక వారికి అభివృద్ధి అనేది పై వర్గాల నుండే రావాలి.

నీటిపారుదల సౌకర్యం వస్తే అది ఒక్క భూస్వామికీ, ధనిక రైతులకు మాత్రమే కాకుండా, ఆ పక్కన ఒకటీ, అరా ఎకరం ఉన్న రైతుకు కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చిన్న కమతందారులు మధ్య తరగతి అయ్యారు. మధ్యతరగతి రైతు ధనిక రైతు అయ్యాడు. వీరి పొలాల్లో సంవత్సరం పొడవునా పనులు దొరికినందున కూలీలు కూడా కాస్త తిండికి నోచుకున్నారు. వీళ్ళందరి పిల్లలు చదువుల్లోకీ ప్రవేశించారు. ఉద్యోగాలు సంపాదించారు. ఆ విధంగా సీమాంధ్ర భూస్వాముల అభివృద్ధి ట్రికిల్ డౌన్ సిద్ధాంతం తరహాలో అక్కడి కింది వర్గాల మీదికి జారిపడింది.

కానీ తెలంగాణలో ఈ అభివృద్ధి లేదు కదా! దానివల్ల అక్కడి ప్రజలకు చాలా కాలం చదువు అందలేదు. డ్యాంలు, కాలవలు లాంటి నీటిపారుదల సౌకర్యం లేదు. చెరువులు, కుంటలు ఉంటే అవి ప్రధానంగా భూస్వాములకే సొంతం. చదువు లేనప్పుడు భాషా సంస్కారం కూడా దరి చేరదు. [నిజానికి బాషా సంస్కారం అనడం ఇక్కడ దూషణ అవుతుంది. కానీ అర్ధం కావడానికి మాత్రమే రాస్తున్నాను. ప్రాంతీయ యాసలు అనేవి ఏ భాషకైనా సహజమే. వాటిని పదిలపరుచుకుని భాషా వైవిద్యంగా గుర్తించి ఆదరించి గౌరవించాలి. దానికి బదులు ఎగతాళి చేయడమే వాస్తవానికి కుసంస్కారం. చదువుకు ముందు, తర్వాత భాషలో తేడా ఉంటుంది. ఈ తేడాను, ప్రాంతీయ యాసల తేడాను ఒకే రకంగా చూస్తూ సినిమాల్లో, కధల్లో, నవలల్లో తెలంగాణ యాసను అవమానకరంగా వ్యాఖ్యానించడం వల్ల ప్రాంతీయ సెంటిమెంటు మరింత తీవ్రం కావడానికి దారితీసింది] ఎంత ఉత్పత్తి తీసినా ఆ భూస్వామ్య ఉత్పత్తి విధానంలోనే తీయాలి. అందులో మెజారిటీ భాగం భూస్వాముల భుక్తం కాగా కింద ఉన్న జనానికి చేరింది చాలా తక్కువ. ఆ విధంగా ప్రజల్లో కూడా ఆర్ధిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం మెజారిటీ కాలం పాటు కొనసాగింది.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుంది? తెలంగాణ ధనికుల చేతుల్లో ప్రభుత్వం ఉంటుంది. బడ్జెట్ అంతా వారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి కేటాయింపులు కూడా వారి ఇష్టానుసారం చేసుకుంటారు. వారి బడ్జెట్ లో సీమాంధ్ర ధనికుల (పెట్టుబడిదారులు, భూస్వాములు) జోక్యం ఉండదు. తమ ప్రాంతానికి అనుగుణంగా నీటి పారుదల సౌకర్యాలు నిర్మించుకుంటారు. ఆ సౌకర్యాలు చిన్న, మధ్య తరగతి రైతులకు కూడా అందుబాటులోకి వస్తాయి. ఒకటీ, అరా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్ధానికులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా కింది వర్గాలకు కూడా అభివృద్ధి సాపేక్షికంగా ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది.

అయితే తెలంగాణయే సమస్యలన్నింటికీ పరిష్కారం కాదు. రాష్ట్రమే పరిష్కారం అయితే ఈపాటికి దేశంలో చాలా సమస్యలు పరిష్కారం అయి ఉండాలి. కానీ ప్రాంతీయ వివక్ష వల్ల దశాబ్దాల పాటు (నిజానికి రెండు శతాబ్దాల పాటు) వారు కోల్పోయిన అభివృద్ధి వారికి దక్కడం న్యాయం. అవి నీరు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పెట్టుబడి కావచ్చు, బడ్జెట్ కావచ్చు.

దీనివల్ల సీమాంధ్రకు నష్టం ఉండదా? సీమాంధ్ర పెట్టుబడిదారులకు తప్పనిసరిగా నష్టం ఉంటుంది. ఇన్నాళ్లూ వారు లక్ష కోట్ల బడ్జెట్ కు నిర్వాహకులు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ కంటే సీమాంధ్ర బడ్జెట్ తక్కువగా ఉంటుంది. జి.డి.పి కూడా తెలంగాణదే ఎక్కువ. హైద్రాబాద్ ఆదాయం తెలంగాణకే వెళ్తుంది. లక్ష కోట్ల బడ్జెట్ ను నిర్వహించినవారు హఠాత్తుగా 40,000 కోట్ల (ఖచ్చితమైన సంఖ్య కాదు) బడ్జెట్ మాత్రమే వారికి మిగులుతుంది. ఆ విధంగా బ్యాంకు రుణాలలో వారు పొందిన సింహభాగం కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఖనిజ, సహజ వనరుల కాంట్రాక్టులు, కేటాయింపులు దక్కుతాయన్న గ్యారంటీ ఉండదు (అసలు దక్కవు అని అనడం లేదు). కాబట్టి వారి భయాందోళనల్లో వాస్తవం ఉంది.

కానీ వారి ఆందోళన వారి పేరాశకు సంబంధించినది. కాబట్టి వారి సమస్యను సీమాంధ్ర ప్రజలు తమ నెత్తిపై వేసుకోవాల్సిన అవసరం లేదు గాక లేదు.

మరి ప్రజలకు నష్టం ఉండదా? ఉండదని నా అవగాహన! నీళ్ళు ఇవ్వరు అనడం సరికాదు. ఇప్పటి వరకూ నిర్మించిన ప్రాజెక్టుల్లో అధిక భాగం సీమాంధ్రకు నీళ్ళు ఇచ్చేవే. ఆ నీళ్ళు రాకుండా అడ్డుకోవాలంటే వారు ప్రాజెక్టులు నిర్మించుకుంటేనే కుదురుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం నదీ జలాల ఒప్పందాలకు లోబడి మాత్రమే కట్టుకోవాలి. రాష్ట్ర విభజనలో నదీ జలాల ఒప్పందాలు ఎలాగూ ఉంటాయి. కాబట్టి ఆ భయం అవసరం లేదు. నిజానికి నదీ జలాలు ఇప్పుడు నిల్వచేసుకోగలదాని కంటే పదుల రెట్లు సముద్రంలో కలుస్తున్నాయి. నదుల అనుసంధానం ప్రాజెక్టు అమలు చేస్తే ఇరు ప్రాంతాలకు సరిపోయినన్ని నీళ్ళు ప్రకృతి ఇస్తుంది.

‘నదీ జలాల ఒప్పందాలను ఏ రాష్ట్రం గౌరవిస్తోంది? కావేరీ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కర్ణాటక లెక్క చేసిందా? బాబ్రీని అడ్డుకోలేకపోయాం కదా?’ అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు ఎవరిని అడగాలి? పోరాడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజలనా లేక కోర్టు తీర్పులను అమలు చేయించలేని ప్రభుత్వ యంత్రాంగాన్నా? కోర్టు తీర్పులను లెక్క చేయకపోవడం, నదీ జలాలను సంపూర్తిగా నిల్వ చేయకుండా సముద్రం పాలు చేయడం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం… ఇవన్నీ మనల్ని పాలిస్తున్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను అదుపు చేస్తున్న ధనికవర్గాలు దేశ ప్రజలపై రుద్దుతున్న ఎడతెగని సమస్యలు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని వదిలిపెట్టి తోటి ప్రజలకు అందనున్న ఒకటీ, అరా లబ్దిని అడ్డుకోజూడడం అన్యాయం అవుతుంది.

ఈ ఉద్యమ దిశ మారాలి

ఈ ఉద్యమ దిశ మారాలి

హైద్రాబాద్ ఉద్యోగాలు దక్కవు అని కొందరు వాదిస్తున్నారు. ఏ ఉద్యోగాలు దక్కవు? ప్రభుత్వ ఉద్యోగాలు ఎటూ లేవు. రిక్రూట్ మెంట్ చేస్తున్న బ్యాంకులు ప్రాంతాలను చూడవు. ఇక మిగిలింది ప్రైవేటు కంపెనీలు. వారికి ప్రాంతీయ తేడాలు ఉండవు. దేశంలో ఏ ప్రాంతానికి, రాష్ట్రానికి చెందినా వారి క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇస్తారు తప్ప ప్రాంతం, రాష్ట్రం బట్టి కాదు. తెలంగాణ వాళ్ళు ఒత్తిడి చేసి తమవారికే ఉద్యోగాలు ఇప్పించుకుంటారు అన్న వాదన అర్ధరహితం. అంత ప్రేమ అక్కడి ధనికులకు తమ ప్రజలపై ఉంటుందనుకోవడం వెర్రిబాగులతనం. సరైన క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం ఇచ్చి కంపెనీని ఎవరు నష్టపెట్టుకుంటారు? తెలుగువాళ్లు దేశవ్యాపితంగానే కాదు, ప్రపంచవ్యాపితంగా ఉన్న నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి నగరాల్లో హైద్రాబాద్ ఒకటి. అక్కడికి సీమాంధ్రులను రానివ్వరు అనడం దుష్ప్రచారం తప్ప వాస్తవాలపై ఆధారపడినది కాదు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కంపెనీలకు బాగానే తెలుసు. ఒత్తిడి చేసేవారి ఆశాలను సంతృప్తిపరచడం ప్రైవేటు కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య.

నష్టం ఉండకపోగా సీమాంధ్ర ప్రజలకు లాభాలు ఉన్నాయి. కొత్త రాజధాని వారికి చేరువలో వస్తుంది. కొత్త రాజధాని కోసం అనివార్యంగా సృష్టించబడే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వారికి అందుబాటులోకి రానున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా డిమాండ్ చేసి సాధించుకోవడానికి సీమాంధ్ర ప్రజలకు ఇది మంచి అవకాశం. మామూలు రోజుల్లో అడిగినా పట్టించుకునే నాధుడు ఉండడు. కొత్త కాలేజీలు, కొత్త కోర్సులు, కొత్త యూనివర్సిటీలు, కొత్త మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐ.ఐ.టి (కొత్తగా 7 ఐ.ఐ.టిలు  కేంద్రం నెలకొల్పనున్నది), మెడికల్ పి.జి కోర్సులు డిమాండ్ చేసి సాధించుకునే అమూల్య అవకాశం ఇప్పుడు వచ్చింది. ‘తెలంగాణ ఇచ్చేసాం, మీకేం కావాలో అడగండి’ అని కేంద్రం స్వయంగా కోరుతున్న సందర్భం మరొకటి రాదు గాక రాదు.

సీమాంధ్ర ప్రజల ఆందోళన న్యాయమైనదే కానీ వారి డిమాండు అన్యాయమైనది.

సీమాంధ్ర ప్రజలు అడగాల్సింది విభజన వద్దని కాదు. ఇప్పటికయినా సమాన అభివృద్ధి చేకూరే విధానాలు అమలు చేయాలని. నదుల అనుసంధానం ప్రాజెక్టు ఎందుకు మూలపడిందో ఇప్పుడన్నా సీమాంధ్ర ప్రజలు అడగాలి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు మటుమాయం అయ్యాయో అడగాలి. సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ ప్రాంత ప్రజలను గాలికి వదిలేసి హైద్రాబాద్ లోనే పెట్టుబడులన్నింటినీ ఎందుకు తరలించారో అడగాలి. ఇప్పుడన్నా వాటిని వెనక్కి తెచ్చి కొత్త రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయరని నిలదీయాలి. హైద్రాబాద్ చుట్టూ ఉద్యమాన్ని తిప్పుతున్న ఉద్యోగ సంఘాలను నిలదీయాలి.

సీమాంధ్ర ప్రజల ఆందోళన న్యాయమైనది. కానీ తెలంగాణ వద్దన్న డిమాండ్ అన్యాయమైనది. ఒక ప్రాంత ప్రజలు పోరాడి సాధించుకున్న డిమాండును వెనక్కి తీసుకోవాలని డిమాండు చేయడం ఎక్కడన్నా ఉంటుందా? న్యాయమైన ఆందోళనలో అన్యాయమైన, అసంగతమైన డిమాండు చొప్పించడం తగని పని. మామూలుగా అయితే ప్రజలు ఇలాంటి డిమాండ్లు చెయ్యరు. వారి మనోభావాలను శాసిస్తున్న వాళ్ళు ధనిక వర్గాలు. వారి పేరాశను, భయాందోళనలను జనం నెత్తిమీద రుద్దుతున్న సంగతిని సీమాంధ్ర ప్రజలు గుర్తించి తిరస్కరించాలి.

సమైక్యాంధ్ర ప్రజల ఉద్యమం చల్లారాల్సిన అవసరం లేదు. కానీ వారు తమ ఉద్యమ దిశను మార్చాల్సిన అవసరం అయితే ఉంది. సమైక్యాంధ్ర కోసం బదులుగా ‘నీళ్ళు, ఉద్యోగాల’ కోసం ఉద్యమంగా తమ శక్తులను ఎక్కుపెట్టాలి. ఒక కొత్త రాష్ట్రం వస్తేనే నీళ్ళు, ఉద్యోగాలు దక్కవన్న భయాందోళనలు తలెత్తిన పరిస్ధితి ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు సమస్య. ఈ సమస్యను గుర్తిస్తే దానికి కారణం ప్రభుత్వాలు, వాటిని గుప్పెట్లో పెట్టుకున్న ధనికవర్గాలే అని ఇట్టే అర్ధం అవుతుంది. 

41 thoughts on “సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారాలంటే… ?

 1. సమైక్యవాదులకి తామేమి మాట్లాడుతున్నారో తమకే తెలియదు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్‌కి వలస వెళ్ళినవాళ్ళలో ఎక్కువ మంది కాపులు. కానీ కాపులు ఎక్కువగా ఉన్న పాలకొండ, వీరఘట్టం మండలాలలో సమైక్యవాదం అంత బలంగా లేదు. డబ్బున్నవాళ్ళు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, ఆముదాలవలస పట్టణాలలో గొడవలు చేసి, మా జిల్లా నుంచి ఎంతో మంది కూలీ పనుల కోసం హైదరాబాద్ వెళ్ళారని ఏడుస్తున్నారు. సున్నాలు కొట్టేవాళ్ళు & పెయింటర్లు ఏ ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళకి పనులు ఇస్తారు. రిజర్వేషన్‌లు పాటించడానికి అవేమైనా ప్రభుత్వ ఉద్యోగాలా?

 2. మీ వాదనతో ఏకీభవిస్తున్నాను!కానీ,మీరన్నట్లు ప్రస్థుతపరిస్తితులలో సీమాంద్రప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే అంశం సమైక్యాంద్ర నినాదం ఒక్కటే!ఆ ముసుగులో వారికి కావలసినవి ఖచ్చితంగా సాధించుకుంటారని నా భావన!మరి ఆంధోళనాలకు కారణాలను చర్చించుకొంటే,తెలంగాణా ఉద్యమ ముసుగులో ఒకనాయకుడుకి కల్పించిన ప్రచారం ఆ నాయకుని నోటినుండి జాలువారిన మాటల పర్యవసానాలమాటేమిటి?ప్రత్యేక రాష్త్రంగా ఏర్పడబొతున్న రాష్త్రం తెలంగాణానా? సీమాంధ్రానా? ఇప్పటివరకు కొత్తగా ఏర్పడిన రాష్త్రాలు రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలేకదా! తెలంగాణా వాళ్ళు పోరాడి సీమాంధ్ర ప్రాంతానికి కొత్తగా రాష్త్రాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు!ఇదెక్కడి చొద్యమో?

 3. ఆ ముసుగులో సాధించుకునేది ఏదీ లేదు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నది ఉద్యోగులు మాత్రమే కానీ రైతులు కాదు. ఎందుకంటే రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, లేకపోయినా పోలవరం లాంటి ప్రోజెక్ట్‌లు పూర్తి కావనివాళ్ళకి తెలుసు.

 4. పోలవరం ప్రోజెక్ట్ పూర్తైనా, పూర్తవ్వకపోయినా శ్రీకాకుళం జిల్లా వరకు గోదావరి కాలువలు రావు. అయినా శ్రీకాకుళం పట్టణానికి చెందిన సమైక్యవాదులు పోలవరం ప్రోజెక్ట్ గురించి తెలిసితెలియని విషయాలు మాట్లాడడం జరిగింది. తోటపల్లి ప్రోజెక్ట్ పనులు పూర్తైతే విజయనగరం, శ్రీకాకుళం జిలాల నుంచి హైదరాబాద్‌కి వలస వెళ్ళే కూలీల సంఖ్య తగ్గుతుంది. ఆ ప్రోజెక్ట్ గురించి ఎన్నడూ మాట్లాడని వాళ్ళు ఇప్పుడు తమకి ఏమాత్రం సంబంధం లేని పోలవరం విషయం ఎత్తుతున్నారు. ఒక విషయం స్పష్టంగా తెలూతోంది. సీమాంధ్ర హక్కులు అని ఎంత మేలి ముసుగు వేసుకున్నా దాని అజెండా హైదరాబాద్‌లో కట్టిన ఫ్లై ఓవర్లూ, రింగ్ రోడ్ల కోసమే కానీ ప్రజల కోసం కాదు.

 5. మూల గారు, మీరు బహుశా కె.సి.ఆర్ గురించి చెబుతున్నారనుకుంటా. నేను ఆయన్నీ, ఆయన కుటుంబాన్ని తెలంగాణ ప్రజలకు ప్రాతినిద్యం వహించే నాయకులని అనుకోను. ఇటీవల పంచాయితీ ఎన్నికల ద్వారా వారి పార్టీకి ఉన్న ఆదరణ వారు చెప్పుకునేంతగా లేదని స్పష్టం అయింది. ఆ నాయకుడి మాటలు ఆయనకి కావలసినంత అపకీర్తినే తెచ్చిపెట్టాయి. ప్రజల ఉద్యమంలో అనేక బలహీనతలు దొర్లుతాయి. అందులో ఇలాంటివారికి కొంత ఆదరణ లభించడం ఒకటి. మనం చూడవలసింది వారిని కాదు, ప్రజల ఉద్యమం న్యాయమయిందా కాదా అన్నదే.

 6. కొత్తగా ఏర్పడబొయే రెండు రాష్త్రాలలో పరిపాలనాపరంగా,ఆర్థికపరంగా కలిగే పరిణామాలు(మార్పులు-చేర్పులు,లాభనష్టాలు రాబోయే పదేళ్ళలో)ను సవివరంగా వివరిస్తారా?

 7. నాకు కొన్ని సందేహాలు.ఎవరైనా తీరిస్తే సంతోషం.

  telangaanaaవస్తే చదువు అయిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని విద్యార్ధులు, బతుకు తెరువుకు కొలువులు దొరుకుతాయని నిరుద్యోగులు భావిస్తున్నారు”——నిజంగానా?andarikeena? ఎలా?ఆగిపోయిన పెట్టుబదులతో పాటు పొయిన ఉద్యోగాల కంటే ఎక్కువా?

  ” ఒకటీ, అరా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్ధానికులకు ప్రాధాన్యత ఉంటుంది.”—–
  జోనల్ పధ్ధతి వచ్చాకా ఎవరి జాబ్స్ వాల్లకే వస్తున్నయి కదా? (గ్రూప్ 1 తప్ప).

  ” లక్ష కోట్ల బడ్జెట్ ను నిర్వహించినవారు హఠాత్తుగా 40,000 కోట్ల (ఖచ్చితమైన సంఖ్య కాదు) బడ్జెట్ మాత్రమే వారికి(peetubadidaarulaki) మిగులుతుంది” వారి ఆందోళన వారి పేరాశకు సంబంధించినది. కాబట్టి వారి సమస్యను సీమాంధ్ర ప్రజలు తమ నెత్తిపై వేసుకోవాల్సిన అవసరం లేదు గాక లేదు.” ———బడ్జెట్ పెట్టుబడిదారులకు మాత్రమే సంబందించిందా? ప్రజల ప్రయోజనాలేమి పోవా?

  తెలంగాణ వాళ్ళు ఒత్తిడి చేసి తమవారికే ఉద్యోగాలు ఇప్పించుకుంటారు అన్న వాదన అర్ధరహితం. ——ఇప్పటికే కొన్ని చోట్ల ఉద్యోగార్ధుల్ని ఓ.యు. వాల్లు అడ్డుకుంటున్నారు. రాబోయే కాలంలో వచ్చే ప్రైవేటు ఉద్యోగాలలొ స్తానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యొగ సంఘ నేత అన్నారు. (recently eenaadu)

  అంత ప్రేమ అక్కడి ధనికులకు తమ ప్రజలపై ఉంటుందనుకోవడం వెర్రిబాగులతనం. ——-కావచ్చు. ఇప్పటిలానే తమ స్వార్ధం కోసమే ప్రతి ఎన్నికలలో సెటిలర్స్ ని టర్గెట్ చేసి పబ్బం గడిపితే ఎలా? (నవ నిర్మాన సేన లాగ)

  సరైన క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం ఇచ్చి కంపెనీని ఎవరు నష్టపెట్టుకుంటారు? ——–తెలంగానా లోనే కావాల్సినంత మంది నైపుణ్యం కల వారు ఉన్నారు. కంపనీలు(సీమాంధ్రపెట్టుబడివైనా సరేఇన్నాళ్ళు కూడా తమ ఆస్తుల రక్షణ్ కోసం భయపడే మాట్లాడలేదు,)తమ సేఫ్టీ కొసం వారికే పరిమితమైతే సీమాంధ్రుల అవకాసాలు పొయినట్టే కదా?

  కొత్త రాజధాని కోసం అనివార్యంగా సృష్టించబడే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వారికి అందుబాటులోకి .——-తెలంగానా వాదుల ప్రకారం ఉద్యోగులంతా అంధ్రా వారే ఐతే వారే కొత్త రాష్ట్రానికి అధికం అవుతారు కదా? జనాభా నిష్పత్తి లొ చూసినా ఎన్ని స్రుష్టించబడతాయి?

  మీకేం కావాలో అడగండి’——-నిలబెట్టుకుంటారా? ఇచ్చిన తర్వాతే ముందుకెల్తారా?

  “సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా డిమాండ్ చేసి సాధించుకోవడానికి సీమాంధ్ర ప్రజలకు ఇది మంచి అవకాశం.——– “సాలరీస్ ఎక్కణ్ణించి ఇస్తారు?

  ” సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ ప్రాంత ప్రజలను గాలికి వదిలేసి హైద్రాబాద్ లోనే పెట్టుబడులన్నింటినీ ఎందుకు తరలించారో అడగాలి. ఇప్పుడన్నా వాటిని వెనక్కి తెచ్చి కొత్త రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయరని నిలదీయాలి”——————–మా రాజధాని అనుకుని పెట్టారు..ఇన్ని ఇండస్ట్రీస్ కంపనీలు ఇంత పెట్టుబడి ఒక్కసారిగా వెనక్కి ఎలా మళ్ళిస్తారు ? అంత అవసరం ఆ స్వార్ధ పరులకు ఏముంది?కొత్తవి స్రుస్టించాలంటే ఎన్ని తరాలు పడుతుంది? ఈ తరం ఏమవుతుంది?

  చివరిగా ” 56 ఏళ్ళూ రాజధానినే తప్ప ఇతర ప్రాంతాలు అభివ్రుధి చేయలేదు. 56 ఏళ్ళ ప్రజల సొమ్ములు అన్నీ ఇక్కడే పెట్టారు. ఇవాల మొత్తం అప్పనంగా వదిలేసి 56 ఏళ్ళ వెనకనుంచి మొదలు పెట్టాలా? అంతా తామడిగినట్టే చేయాలా? ఇది న్యాయమా?

  ఇంత దాకా స్వార్ధపరులు చేసిన దానికి సామాన్యులు సత్రువులుగా మారిపోయారు. బయటి వాల్ల ముందు ఇంతకంటె దిగజారేకంటే విడిపోవడమే బెటర్.
  ఇచ్చి పుచ్చుకునేధొరణి తో సామరస్యం గా విడి పోవాలని నా భావన.

  (రహనా హై ?యా జానా హై? ఇది నేనెదుర్కున్న బెదిరింపు. పెద్ద వాల్లకి పొలిస్ రక్షన తెలంగానా నాయకులే కల్పిస్తారు. చావంతా మామూలు వాల్లకే. ఈ దందా ఉపాధి మార్గం గా మార్చుకునె గల్లి నాయకులకి మంచి అవకాసం వస్తుందనే భయం. )

 8. విశేఖర్ గారు, ఇక్కడ ఇంకో విషయం
  ఏంటంటే రాష్ట్ర విభజన కచ్చితంగా జరుగుతుంది అని తేలాక, రాయలసీమ ప్రజలు కోస్తాతో కలిసి ఉండగలరా..?
  నా ఉద్డేశం ప్రకారం రాయలసీమ కోసం మరో ఉద్యమం జరిగితీరుతుంధి.
  అదీ కాక అవకాశవాద రాజకీయ నాయకులు ఎలాగు ఉన్నారు కదా… ?

  మొత్తంగా ఇక్కడ విషాదం ఏంటంటే 50ఏళ్ళకు పైగా కలిసి ఉన్నా ప్రజల్లో ప్రాంతీయాంతరాలు తగ్గకపోవడం. ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం.

  ఇప్పుడు కొత్తగా సమైక్యాంద్ర అంటూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు గతంలోనూ ఉద్యమాలు చేసి ఉంటే బాగుండేధేమో. రాష్ట్ర ప్రకటన జరిగేదాక ఎందుకు ఊరుకున్నారో అర్ధం కాదు. సీమాంద్ర నాయకులు చాలామంది అక్కడి ప్రజల్ని మోసం చేశారు.
  ఆ తర్వాత విభజన ప్రకటన తర్వాతనైన వాళ్ళకు ఏం కావాలో అడగకుంటా…సమైక్యాంద్ర అంటూ మళ్ళీ కొత్త మోసానికి తెర లేపారు. ఐతే సమైక్యంద్ర డిమాండ్ బూమరంగ్ లా ఇప్పుడు సీమంద్ర రాజకీయ నాయకులకే ప్రమాదంగా మారింది. ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితి.

  వాళ్ళు స్పష్టం గా హైదరాబాద్ గురించో, తమకు కావాల్సిన ప్యాకేజ్ గురుంచో అడగాలి. సీమాంద్ర ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి..

 9. మిష్టర్‌ aaa గారు,
  మీ మొదటి సందేహన్ని ఇలా తీర్చుకోవాలి: ఉద్యోగాలు అందరికీ కాదు పరిమితంగానే- ఇప్పుడు కంటే మెరుగ్గా. నూరు శాతం ఊద్యోగకల్పన దేశంలొ ఉంటే గదా అది తెలంగాణాలో ఉండేది?

  బడ్జెట్‌ ప్రజలకోసం ఏస్తున్నట్లు మీ అవగాహనా? కాదు, ప్రజలకోసం ఏస్తున్నట్లు బ్రమ కల్పించడమే.ప్రజల ప్రయోజనా లు పోవటానికే బడ్జెట్‌! వీరి ప్రయొజనాలు పోతేనే వారికి లాభం.
  ఉద్యోగ సంఘాలో లేక రాజికీయ నాయకులో మాట్లాడెది రాజకీయ పబ్బం గడుపు కోడానికే. అవి కేవలం సందర్బోచిత రాజకీయాలు. ముంబాయ్‌ లో శివసేన లాంటి పార్టీలు ఓట్ల కోసం ఈరాజకీయాన్నే నడిపేది. అంత మాత్రానా, ముంబై నుండి స్తానికులు కాని వార్రంత వెల్లిపోతున్నారా?

  తెలాంగణ వాల్లు వత్తిడి చేసినంత మాత్రాన ఉద్యోగార్‌ హత లేకుండ స్తానికులకే ఉద్యోగాలు ఇవ్వారు. అవి తెలంగాణ పెట్టుబడి కంపెనీలైనా, లేక ఆంద్ర పెట్టుబడి కంపెనీలైనా,. అందువల్ల సీమంద్రులు తెలాంగాణ వారి కంటే క్వాలిఫైడ్‌ కాబట్టీ వారి కే ఉద్యోగాలు అవకాశాలు ప్రస్తుతానికి ఉంటాయి. ఆ తరువాత క్రమేన మారోచ్చు.
  ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు శాలరీస్‌ ఎక్కడనుండి ఇస్తున్నారో అక్కడనుండే భవిష్యుత్‌ లో కూడా ఇస్తారు.
  సీమాంద్రపెట్టుబడి దారులు తమ పెట్టుబడికి లాభాలు కావాలంటే మౌలిక వనరులు హయ్‌ దరబాద్‌ లో ఉన్నాయి కాబట్టే అక్కడ పెట్టారు. వాల్లూ అయిదరాబాద్‌ అభివృద్ది చేసే ఉద్దేశం తో పెట్ట లేదు. ఆ ఉద్దేశమే ఉన్నట్లైతే ఆంద్ర ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ది చేయలేదు?
  @చివరిగా ” 56 ఏళ్ళూ రాజధానినే తప్ప ఇతర ప్రాంతాలు అభివ్రుధి చేయలేదు. 56 ఏళ్ళ ప్రజల సొమ్ములు అన్నీ ఇక్కడే పెట్టారు. ఇవాల మొత్తం అప్పనంగా వదిలేసి 56 ఏళ్ళ వెనకనుంచి మొదలు పెట్టాలా? అంతా తామడిగినట్టే చేయాలా? ఇది న్యాయమా? @
  ఈమాటే సీమాంద్ర రాజకీయ నాయకులను అడగాలి!
  ‘ చావంతా మామూలు వాల్లకే!’ నిజమే! ఆప్రభావం కొంతయినా ప్రజలపై లేకుండ వుండదు.

 10. తెలంగాణలోని విభజన ఉద్యమం కాని, ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలోని సమైక్య ఉద్యమం రెండింటిలో ప్రజలు పాల్గొంటున్నప్పటికీ వీటిని ప్రజా ఉద్యమాలు అని అనకూడదు. ఎందుకంటే ఈ ఉద్యమాలతో సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీలేదు. నేను తెలంగాణలో ఉంటూ సమైక్యంగా తెలుగు ప్రజలు అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందని భావించే వాడిని. అయినా ప్రస్తుతం జరుగుతున్న సమైక్య ఉద్యమం కేవలం హైదరాబాద్ గురించి మాత్రమే. తెలంగాన ఉద్యమానికి కారణాలను విశ్లేషిస్తూ ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నంలేకుండా జరిగే సమైక్య ఉద్యమం వారి స్వార్థంతో జరిగేదిగానే ఉంటుంది. కేవలం హైదరాబాద్ కొరకు జరిగే ఉద్యమాన్ని సమైక్య ఉద్యమం అన కూడదు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకొరకు జరుగుతున్న ఉద్యమాలను వ్యతిరేకించాలి. ఈ రెండు ఉద్యమాలు తెలుగు ప్రజలలో కలహాలు పెంచేవిగానే ఉన్నాయి. ప్రజలను విభజించే ఉద్యమాలను మనం స్వాగతించకూడదు అనేది నా అభిప్రాయం.

 11. ఈ ఉద్యమాల వల్ల సామాన్య జనానికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు, ఒక చిన్న corp orator నుంచి mla , మినిస్టర్ దాక బాగా డబ్బున్న వాడే అవుతున్నాడు. కనీసం లక్షాధికారి అయిన mla వుండడం కూడా నాకు తెలిసి ఇక్కడ అసంబవమే, కేవలం కోట్లకి పడగలెత్తిన వారు మాత్రమె mla లు మినిస్టర్ లు కాగల్గుతున్నారు. దీనికి తోడూ కులం ఒక్కటి తగలడింది. ఇన్ని సంవత్సరాలుగా SC ల నుంచి ఒక్కడు కూడా CM కాలేదు. రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ సమైక్యంద్ర ఉద్యమం లో పాల్గొంటున్న ప్రజలకి ఏం ఉపయోగమో నాకు తెలిట్లేదు , అదేవిదంగా తెలంగాణా ప్రజలు కూడా , తెలంగాణా వచినంత మాత్రానా వారి బతుకులు మారతాయంటే , అది కూడా అసాధ్యమే. ఈ ఉత్తుత్తి ఉద్యమాల మొదలు రాజకీయ శక్తీ సామాన్య జీవికి చేరువ చేసే ఉద్యమం ఐతే సాధారణ ప్రజలు బాగుపడే అవకాశాలు ఉన్నాయి అని నమ్మచు !!!

 12. హలో ఫ్రెండ్స్, మనం అందరం రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచించాల్సిన అవసరం చాలా వుంది. 12 ఇయర్స్ నుంచి పూర్తిగా రెచ్చ కొట్టడం వల్ల తెలంగాణా లో తెలంగాణా వస్తే వాళ్ళ సమస్త సమస్యలు చిటికెలో మాయం అవుతాయని అనుకొంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర మరియు సీమలోని రాజకీయ నాయకులూ కూడా రెచ్చ కొట్టడం వల్ల రాష్ట్రము విడిపోతే సీమ, ఆంధ్ర వాళ్ళకు నీళ్ళు, కరెంటు, ఉద్యోగాలు ఇక రావు అని మబ్య పెట్టి రెచ్చ కొడుతున్నారు. ఇది అంత నిజo కాదు. ఈ మార్పు వల్ల కొంత లాబమో నష్టమో కొంతమందికి ఉండవచ్చు. కానీ మెజారిటీ ప్రజలకు, ఈ రాష్ట్రము విడిపోయిన, కలిసున్నా పెద్దగా జరిగేది ఏమి లేదు. ఒక స్టేట్ రెండు స్టేట్స్ ఆయితే
  అ) బాబ్లి, అలమట్టి వల్ల kalgina నష్టం కన్నా ఎక్కువ నష్టం ఇంకేమి జరుగుతుంది.
  ఆ)కొన్ని (1000 నుంచి 2000 ఒక ఇయర్ కి) government jobs తప్ప మిగిలినవన్నీ, district wise and zone wise గ నింపుతారు. ప్రైవేటు పోస్ట్స్ like software అండ్ industries అన్ని లోకల్ or నాన్-లోకల్ అని చూడరు. So Andhra mariyu seema vidyarthulu Banglore, Chennai, Mumbai lo lage Hyderabad lo kuda jobs pondavachchu.
  ఇ)ఎలక్ట్రిసిటీ విషయంలో ఆంధ్ర మరియు సీమ కలసిన రాష్ట్రము మిగులు విద్యుత్ తో కొత్త ఇండస్ట్రీస్ని attract చేయవచ్చు.
  ఈ) ఇప్పుడు మనం డివిజన్ అఫ్ స్టేట్ ని ఆపిన కూడా ఒక 5 – 10 ఇయర్స్ తరువాతైన ఇంకెవరైనా మళ్లీ ఇంకొక సారి రాజకీయాల తో రెచ్చ కొట్టరని గారంటి లేదు.
  ఉ) అప్పుడు మళ్లీ ఇంకొక సారి ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు మనం ఇంకొక స్టేట్ కాపిటల్ నిర్మిస్తే capital adjacent vunna కొన్ని areas డెవలప్ అవుతాయి.
  I believe that with new state capital definitely Andhra, Seema and Telangana will get benefited more than the present state of condition continues.
  Now Rayalaseema and Andhra people need only leaders with vision, but not the leaders who creates confusion and terror in people.
  కాబట్టి మిత్రులారా ప్లీజ్ దయచేసి ఈ గొడవలు రాజకీయాలు లేకుండా ఆంధ్ర మరియు సీమ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ కు ఏమి కావాలో పోరాడoడి. మీకు ఏమైనా నా అభిప్రాయం నొప్పిస్తే sorry.

 13. తెలంగాణాకు అనుకూలంగా నేనూ, వ్యతిరేకంగా నా మిత్రులూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను.
  నా మిత్రుల వాదనలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినవి నదీ జలాలను పంచుకోవడం, కొత్త రాష్ట్రాన్నీ, కొత్త రాజధానినీ నిర్మించుకోవడానికి కావలసిన నిధులు, ఆదాయాలూ- ఆస్తులూ వాటి పంపకాలూ ప్రస్తావనకు వచ్చాయి. నదీ జలాల విషయం ఒక్కొక్క నదినీ సోదాహరణంగా తీసుకొని అవి కేవలం ఒక్క ఆంధ్ర, తెలంగాణాలకు సంబంధించినవి మాత్రమే కావనీ అంతర్రాష్ట పరిధిలోకి వస్తాయనీ, వాటి పంపకం జల వనరుల సంఘం చూస్తుందని అన్నప్పుడు కర్నాటక కోర్టులను కూడా ధిక్కరిస్తూ వాడుకున్న ఉదంతాన్ని వారు ప్రస్తావనకు తెచ్చారు. ఇదే దోరణి రేపు తెలంగాణా అవలంబిస్తే మన పరిస్థితి ఏమిటని వారు అన్నారు. అంతే కాక భారీ ప్రాజెక్టులను తెలంగాణాలో గోదావరి మీద వారి ఇష్టానుసారంగా కట్టుకుంటే రేపు వారు దయ తలిచి నీళ్ళు వదిలితేనే మనకు నీళ్ళు వస్తాయి .అందువల్ల ఆంధ్రాలోని దిగువ ప్రాంతాలు కరువు ప్రాంతాలు అవుతాయి. ఒక వేళ అధిక వర్షాలు కురిస్తే పైనున్న వాళ్ళు గేట్లు ఎత్తివేస్తే దిగువనున్న ప్రాంతాలు ఆకస్మిక ముంపుకు గురవుతాయి. అంటే అయితే కరువు లేకుంటే ముంపు అన్నట్టుగా మన పరీవాహక ప్రాంతాలు తయారవుతాయి అన్నది వారి వాదన. భారీ ప్రాజెక్టులు కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ సమస్య ఉండదు కదా అంటే అలా జరుగుతుందని గ్యారెంటీ ఏమిటీ అని ప్రశ్న.
  అలాగే ఇంత పెద్ద రాష్ట్రానికి ఒకే నగరం ఉండడం, దాని చుట్టూ పెట్టుబడులు గుమ్మరించడం మంచిది కాదు, విభజన వల్ల మరో నగరాన్ని మనం ఊహించవచ్చు అన్నప్పుడు దానికి చాలా ఏళ్ళు పడుతుంది కదా, అలాగే దానికి కావలసిన వేల కోట్లు ఎవరిస్తారు? కేంద్రం అలా ఇచ్చిన దాఖలాలు లేవుకదా అన్నది అటు వైపు వాదన.
  చిన్న రాష్ట్రాలవల్ల రిజర్వేషన్ అమలు మరింత ప్రభావవంతంగా జరుగుతుందనీ, మరింత మేలు కలుగుతుందని అంటే, రేపు విభజన జరిగాక మన సీమాంధ్రా వాళ్ళందరూ ఇటు వైపు వచ్చి పడితే ఉన్న పోష్టులు కూడా వాళ్ళకే సరిపోవు. పైగా సూపర్ న్యూమరీ పోష్టులు కల్పించాల్సి వస్తుంది. ఇదంతా జరగాలంటే కొన్నేళ్ళ పడుతుంది. అన్నేళ్ళ పాటూ కొత్త పోష్టుల కల్పననేదే ఉండదు. ఇక రిజర్వేషన్ల వ్యవహారానికి తావెక్కడ అన్నది వారి వాదన. అంతే కాకుండా ఈ ప్రక్రియ అంతా సజావుగా జరుగుతుందని, ఉన్న వాటికి తోడు కొత్త సమస్యలు ఏర్పడవని ఏమిటీ గ్యారెంటీ? అందుకే అసలు విభజనే లేకుంటే ఈ సమస్యలే ఉండవు కదా అన్నది వారి ధోరణి.
  వీటన్నిటినీ పరిశీలించినప్పుడు వాళ్ళు నాతో ప్రస్తావించిన విషయాలు: 1.నదీ జలాల విషయంలో గానీ, ఆస్తుల వాటాల పంపకం విషయంలో గానీ సమన్యాయం అనేది ఒకటి ఉండదు.
  2. పరిపాలనలో అవకతవకలు జరగడం మామూలు కాబట్టి ఆ స్థితి ఏర్పడకుండా ఉంటే మేలు. వాటిని ప్రశ్నించడం కష్టం. వాటిని సరిచేసేసరికి చాలా మంది నష్టపోతారు.
  3. ఉన్న సమస్యలను పరిష్కరించడానికి బదులుగా రెట్టింపు సమస్యలను విభజన ప్రక్రియ ముందుకు తీసుకరాబోతుంది.
  ఈ అవగాహన రాజ్యం నుంచి ఎదురవుతున్న నిత్య అనుభవాల నుండే వచ్చాయన్నది స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ రాజ్యం పూచీ పడాలనీ, దాన్ని ప్రశ్నించాలనీ, సమన్యాయం అడగడం మన హక్కు అనే వైఖరి లేకపోవడం, దానికి తోడుగా ప్రత్యామ్నాయమైన, శ్రేయోదాయకమైన,పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు అనేవి ఒకటి ఉండాలనే సృహ లేకపోవడం అన్నింటికంటే ప్రధానమైన ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి.
  మొత్తంగా ఈ వాదనలు విన్నప్పుడు రాజ్యం, పాలకులు, రాజకీయాల మీద అపనమ్మకం, ప్రజాస్వామ్యం పట్ల పీత్తోలు మందానికి మించని ప్రవర్తనా ధోరణి, ప్రత్యామ్నాయ అభివృద్ధి పట్ల ఏమాత్రమూ అవగాహన లేకపోవడం, సమాచారానికీ, ఙ్ఞానానికీ పక్షపాతా ధోరణి ఉంటుందన్నసృహ లేకపోవడం నాకు కనిపించింది. వ్యవస్థలతోటీ, రాజకీయాలతోటీ మనం పోటీపడి వేగలేము కాబట్టి ఉన్న తెలంగాణాను మన కిందే ఉంచుకోవాలి గానీ దాన్ని వదులుకోకూడదు అని వాళ్ళ వైఖరి.
  వీటన్నింటినీ చూసినప్పుడు తెలంగాణా వ్యతిరేక ధోరణి సెంటిమెంట్, భావోద్వేగాల అంశం మాత్రమే కాదనీ దాని పునాదులలో చాలా అంశాలున్నాయని, మొత్తంగా వ్యవస్థ వైఫల్యమే ఉందని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు?

 14. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఇరిగేషన్ ప్రోజెక్ట్‌లని పూర్తి చెయ్యలేదు అనే విషయాన్ని సమైక్యవాదులు కావాలని మర్చిపోతున్నారు. ఆ చెవిటివాళ్ళ ముందు శంఖం ఊదితే ఏమీ రాదు. రాజధాని విషయానికొస్తే, హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం వల్ల అక్కడికి ఐ.టి. కంపెనీలు వచ్చాయి. ఐ.టి. కంపెనీల వాళ్ళు అలాంటి సౌకర్యాలు లేని విజయవాడలోనో, కర్నూల్‌లోనో కార్యాలయాలు పెట్టరు కాబట్టేసమైక్యవాదులు తమకి హైదరాబాద్ తప్ప ఏదీ వద్దని అంటున్నారు. అన్నిటికంటే పెద్ద జోక్ ఏమిటంటే హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికే అవకాశం లేని పల్లెటూరివాళ్ళని హైదరాబాద్ పేరుతో రెచ్చగొట్టడం. సమైక్యవాదుల అసహనం ఎలాంటిదో దీన్ని బట్టి అర్థమవుతుంది.

 15. nalla doralu పెట్టుబడిదారులు అంటారు చేతనైతే స్పెసిఫిక్ గా వాల్లెవరో చెప్పండి సీమంద్రోల్లు అంటే ఎవరినని అనుకోవాలి ఎవడూ వ్యాపారమ చెయ్యకూడదా telangana వస్తే పెట్టుబడిదారుల జోక్యం ఉండదా అది ఎట్లా ? భూస్వామ్యులున్దరా ఏమైపోతారు ???? ధనిక వర్గాలు అన్నారు రేపు తెలంగాణా లో ధనికులని ఏమి చేస్తారు

 16. డబ్బులున్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకూదడదని ఎక్కడన్నా ఉందా ఉద్యోగాలు పోతాయని ఎవడికి భయం లేదు పొతే తెలంగాణా వాళ్ళకే పోతాయి ప్రైవేటు సంస్థలు చాల వరకు సీమ కోస్త వాళ్ళవే కాబట్టి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు విడిపోతే అసలు ఆ ప్రస్నే ఉండదు అన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలే వస్తాయి నీళ్ళు ఎందుకు రావు చచ్చినట్లు వస్తాయి ఎవడూ ఇక్కడ నీళ్ళు ఉద్యోగాలు అడగట్లా కావాలంటే అమెరిక బ్రిటన్ పోయి చేసుకుంటారు

 17. The disgust caused by some Facebook posts led me to write this comment.సమాజం గురించి ఏమీ తెలియకపోతే లేదా కొద్దిపాటి జ్ఞానం మాత్రమే ఉంటే నేను కూడా మార్క్సిజంపై prejudicial అభిప్రాయాలు కలిగి ఉండేవాణ్ణేమో. కానీ తెలిసితెలిసి మార్క్సిస్ట్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నవాళ్ళని చూస్తోంటే నాకు జుగుప్స కలుగుతోంది. ఫేస్‌బుక్‌లో కొంత మంది తాము మార్క్సిస్ట్‌లమని చెప్పుకుంటూ తెలంగాణా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. మార్క్సిజం ఒక అంతర్జాతీయవాద భావజాలమైనప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలూ, రాష్ట్రాలూ ఉన్నా ఆ భావజాలానికి కలిగే ఆటంకం ఏమీ ఉండదు. ఈ విషయం అర్థం కాని మూర్ఖులకి మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు. కానీ కార్మిక వర్గంతో ఏమాత్రం సంబంధం లేని సమైక్యవాదాన్ని సమర్థించుకోవడానికి మార్క్సిజం పేరుని దుర్వినియోగం చేసే వీళ్ళని చూస్తోంటే ఒక మార్క్సిస్ట్‌నైన నాకు చాలా కోపం వస్తోంది.

 18. seemandhra telangana udhyamaalu ani lev unnadi vibhajana udhyamam samaikyaudyamam 1956 nunchi vuntunna capital ni vadili pommanteevaru potaaru poyi kottadi kattukomante kottadi (raashtram)kaavaalani adagatledu gaa monna kishorechandra dev cheppaduga cm pcc chief postullo edookatiste ee golundadani veellu ivvaru vallu aagaru idi saagutoo unundi raajaeeyam lo pradana amsam ide kabatti evadoo deenni vadaladu rajakeyam hcheyataniki vere issue ledu janam abhivrudhi emi akkarla rendu perlunte chaalu

 19. సీమాంధ్ర అంతున్నరు అసలు ఆంధ్ర అంతెనె 3 ప్రాంతాలు including telangana ఉంటాయి సీమాంధ్ర కాదు kostaరాయలసీమ correct janaalni rechagodataanki kosta vaallani andhra vaallu annaru asalu andhra padame telangana ki chendina satavaahunula kaalam nunchi undi valla rajule andhradesadheeswara laanti birudulu pettukunnaaru idantaa comedy

 20. బతకమ్మ తెలంగాణా కే పరిమితం అట అక్కడ ఉండాలంటే ఆ పాటలు రావాలంట ఇదెక్కడి గోల మా ఊర్లో కూడా బతకమ్మ ఉంది పాటలు పాదకుండానే పూజిస్తారు ఆయన పాడతాడని అందరూ పాడాలంటే ఎట్లా ఎదో ప్రశ్నలు అడగొచ్చు అన్నారు నా ప్రశ్న విశాలాంధ్ర ఉద్యమం చేసింది ఎవరు ? ఎందుకు చేసారు ? ఎవరికోసం చేసారు? చరిత్ర ఎందుకు అనకండి అది తెలీకపోతే ఏది తెలీదు

 21. batakamma పాటలు వచ్చా రాదా అని పాత బస్తీ కి వెళ్లి అడగమనండి
  పెట్టుబడిదారులు అన్నారు తెలంగాణ లో వివేక్ వినోద్ నామ నాగేస్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాలు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా రాయండి

 22. చల్లారంటే రెండు మార్గాలున్నాయి
  సి ఎం పి సి సి పదవులు తెలంగాణా కి ఇవ్వటం
  తెలంగాణా ఇష్యూ ని క్లియర్ గా మానిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్ కి వెళ్ళడం
  ఈ రెండిట్లో ఏది జరగదు జరిగోది పనికిరాని గోలే……………. …

 23. ఉద్యమ దిశ ని మార్చాలింది సమైక్య వాదులు ni కాదు విభజన వాదులుni ముందు ఆ ఉద్యమ నాయకుడిని అడగ మనండి ఆయన మెదక్ కి మహబూబ్ నగర్ కి ఏమి చేసాడో మధ్యలో కొంత కాలం సెంటర్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు ఆ ఒక్కడే కాదు అందరఅని అడగమనండి అంత ధైర్యం ఎవరికీ లేదు ఐలయ్య లాంటి వల్లే కావట్లా మీరు ఆ మాట చెప్పలేరు చెపితే తెలంగాణా ద్రోహి అని ముద్ర వేస్తారు

  కాని సమైక్యవాదులు అట్లాంటి మాటలు అనరు మేరె చెప్పారుగా బ్రిటిష్ పాలన లో వాళ్ళni so decromatic not feudal

 24. పెట్టుబడిదారులు దోపిడీ చేశారన్నారు రేపు తెలంగాణ వస్తే ఈ సీమాంధ్ర పెట్టుబడిదారులు అక్కడే ఉంటారుగా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాం అన్నారుగా మరి అప్పుడు ప్రత్యెక రాష్ట్రం లో దోపిడీ ఆగదు పెట్టుబడిదారులు ఎక్కడికి పోరు అక్కడే ఉంటారు

 25. writer sugar coated laa samaikyadra agitation ni nelli challarchandaniki prayatnam chesaru. ekkada samasya adi kadu, seemandrula bratuku teruvu samasya, munduchupuleni palakulu techina tanta. hyderabad manadi anukono leda valla self interest lu choosukoni development antha akkada pedithe, aa development antha memu appanam ga teesukontamante, yemai potundi seemandra area, akkada maali development yela ithundi, present rupee value padi poyi, economic crysis loo undi, desame tirogamistunte, pettubadulu vastsya? chala easy ga chepputunnaru vibhajana vadulu, nillaku nadee jalala oppondalu untayani, mana kalla munde, antar rastra nadi jalala oppondalu tungalo tokkutunte chetulu mudusukoni courts kuda yemi cheyalekunda chodyam chustunte, inka nadi jalala oppandalu yemiti vatini respect chese samkruthi unda, vidipokundane hyd loo oka sabha jarupukunte anni pakkala nunchi dadulu jaripi, paipechu valle maameeda dadi chesaru ante, dadiki cheyadaniki prayatinichina varini veerulu churulu ante pogaduthu bahu manalu estunnare, inka oppandalu gowravistaara? eppativaraku vidipoyi develop ina state unda, okkati chupichandi? Panjab, Haryana states inka Assembly buildings kuda kattukolekha poyayi ante? ardam kavadam leda Cen.govt. manaku funds yemi estundo. ok eppudu vidipothe capital yekkada? aa issue gurinchi asalu matladinga Cen.Govt. Rayala seema vallu tamake kavalantaru, ledu Andhra area loo pedithe malli ati koddi kalam, rayalaseema separate movement vastundi. Rayalaseemaloo capital pedithe, Andhra vallaku oka muulaga untundi? capital develop iyye, industries vaste kada youth ki job vachedi? yeppudu develop ithudi, yeppudu jobs vastayi, yennni taralu loss ithayi meeru cheppagalara? evi konni samasyalu matrame, inka aneka samasyalu vastayi, motha rastram sarvanasanam ithundi, maa poratam telangana vadam meeda kadu? maa bratuku teruvuni kollagondatunna palakula meeda, vari analochitha niryala meeda? meeku yenduku antha uluko naku ardam kavadam ledu? ok maku division estame, Hyd lanti capital develop cheinchi estamu ani daniki avasaramaina vanarulu mundugane deposit cheincha galara? aa promise yevaraina evvagala palakulu? antha ratra nadi jalala oppondalalu ullangincha nivvamu ani yevaraina hamilu ivvagalara? avi jaragavu kabatti, oka samaya pariskaram aneka samasyalaku tavu ivvaradane, palakula pai vattidike Samaikyandra undyamam

 26. రెడ్డి గారూ, సమైక్యాంధ్ర కొనసాగితే మీరు చెప్పిన సమస్యలన్నీ ఉండవు అని హామీ ఇవ్వగలరా? సీమాంధ్రుల మొత్తం బ్రతుకు తెరువు గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నట్లే నాకూ తెలంగాణ బ్రతుకు తెరువు గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. దానికి మీరు ‘ఉలుకు’ అని పేరు పెడితే, నేను మీ ‘వలపోత’ కు ‘అవగాహనా రాహిత్యం’ అని పేరు పెట్టగలను.

  ‘పోరాటం తెలంగాణపై కాదు. తెలంగాణకు వ్యతిరేకం కాదు. కేవలం విభజనకు వ్యతిరేకంగా మాత్రమే. మా సమస్యల కోసం మాత్రమే’ ఇవి ఎ.పి.ఎన్.జి.ఒ నేత అశోక్ బాబు గారు తరచుగా చెబుతున్న మాటలు. విభజనకు వ్యతిరేకంగా పోరాటం అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కాదా? ఈ రెండు వేరు వేరు అని చెప్పినంత మాత్రన వేరు అయిపోవు కదా?

  బ్రతుకు తెరువు కోసం పాలకులపై చేసే పోరాటం అయితే, ఒక ప్రాంత ప్రజల ప్రయోజనాలపై చేసే పోరాటంగా అది ఉండరాదు. ప్రజా ఉద్యమాలకు అది కనీస సూత్రం, నియమం. ఒక ప్రజా ఉద్యమం మరో ప్రాంతపు ప్రజల ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండకూడదు.

  తెలంగాణ వివక్ష, నిర్లక్ష్యాలకు సీమాంధ్ర ప్రజలు కారణం అనుకోవడం ఎంత తప్పో, సీమాంధ్ర ప్రజల బ్రతుకు తెరువు సమస్యకు తెలంగాణ రాష్ట్రం విరుద్ధం అనుకోవడం కూడా అంతే తప్పని నా అభిప్రాయం. ఇరువురూ కలిసి పాలకులపై పోరాడగల సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు చెప్పిన సమస్యలన్నీ అలాంటివే. కాని ఆరు దశాబ్దాల వివక్ష, నిర్లక్ష్యాలకు రాష్ట్రం ఒక పరిష్కారం. అది తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. దానిని అపోహలతో వ్యతిరేకించడం అంటే ఒక విధంగా ధనికులు వేసిన వలలో చిక్కుకున్నామని.

  ఇది నా అవగాహన. మీరు ఏకీభవించనవసరం లేదు. అలాగని ముద్రలు వేయాల్సిన అవసరమూ లేదు. వీలయితే చర్చించుకోవచ్చని మాత్రం చెప్పగలను!

  (కింద లేఖిని కి లింక్ ఇచ్చాను. దాని ద్వారా తెలుగులో వ్యాఖ్య రాయొచ్చు. ఆంగ్ల లిపిలో తెలుగు చదవడం కష్టం. నేనెలాగో కష్టపడి చదివాను. కాని ఇతరులకు అంత ఆసక్తి ఉండకపోవచ్చు. అంటే మీరు రాసినా పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. కనుక వీలు చేసుకుని తెలుగులో రాయగలరు. మరొక సంగతి. యు.ఆర్.ఎల్ అంటే మీ వెబ్ సైట్ లింక్ ఇవ్వాలి. నా బ్లాగ్ అడ్రస్ కాదు.)

 27. రెడ్డి గారు, ఇరిగేషన్ ప్రోజెక్ట్‌ల కోసమో, రైల్వే ప్రోజెక్ట్‌ల కోసమో రెండు రాజకీయ పార్టీలు ఏకమవ్వడం నా ముప్పై ఏళ్ళ జీవితంలో ఎన్నడూ చూడలేదు. విజయవాడలోనో, కర్నూల్‌లోనో ఐ.టి. కంపెనీలు కార్యాలయాలు పెట్టవు కనుక మీకు హైదరాబాద్ తప్ప ఏదీ అవసరం లేదనే విషయం డైరెక్ట్‌గా చెప్పుకోండి. అంతే కానీ తాగు నీరు, సాగు నీరు మీద మీకేదో ఆశ ఉన్నట్టు నటించొద్దు.

  విశేఖర్ గారు, పార్లమెంట్‌లో బిల్ ప్రవేశపెట్టబడి, అది పాసైన తరువాత కూడా ఈనాడు, ఆంధ్ర జ్యోతులు ఆ బిల్‌ని కేంద్రం వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం చేసి ఆందోళనలని రెచ్చగొడుతూనే ఉంటాయి. కొంత మంది చెట్టు కింద ప్లీడర్లు కోర్ట్ ఎదుట టెంట్ వేసి నిరాహార దీక్షలు చేస్తే మొత్తం బార్ అసోసియేషనే నిరాహార దీక్ష చేసిందని ప్రచారం చేసే పత్రికలు అవి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తైపోయి ఆ రాష్ట్రానికి వేరే అసెంబ్లీ ఏర్పాటు చేసిన తరువాత కూడా కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం ఉందని సీమాంధ్ర పత్రికలు ప్రజలని నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి.

 28. ఖచ్చితంగా ఈ విభజన విషయం లొ తెలంగాన గత చరిత్ర, అభివ్రుద్ది, ఆశలు, కలలు వున్నయి. దానిని ఎవరు కాదనలేని సత్యము. విసేఖర్ గారు రాసినదాంతొ కొంత నిజం గొచరిస్తుంది. కానీ వారు రాసిన ప్రతి దాన్ని అంగీకరించ లంటే కస్టం అనిపిస్తుంది.

  ఈసూత్రం లొ ఇంకొక దౌర్బగ్యమయిన భాగస్వామి వుంది – అది రాయలసీమ. తెలంగాణ లాగే దానికి దాని చరిత్ర వుంధి, సంస్క్రుతి వుంది.

  కానీ రాయలసీమ పరిస్థితి తెలంగాణకంటే ఎన్నో రెట్లు ఘోరము. ఆన్నీ కరువు జిల్లలే. పట్టుమని చెప్పుకొనేందుకు రెందు పరిస్రమలు లెవు. వుధ్యొగాలు రావు. దగ్గర వుండే పట్టణ్ణాలంటె, పరాయి రాస్ట్రాలు (బెంగలురు మరియు మదరాసు). ఎంతొమంది ముఖ్యమంత్రులు ఈ ప్రాతం నించి వచ్చినా, వారు చెసింది శూన్యమనే చెప్పక తప్పదు. ఆది సీమ చెసుకొన్న దౌర్బాగ్యం.

  ఏ జాతి మనుగడకైనా, ఈ రొజైనా, రేపైనా, ఇంకొక వందల సంవత్సరాలయినా, జీవానకికి అదారం “నీళ్ళు”. ఇది చరిత్ర చెప్పిన సత్యం మరియు నెర్పే పాటం.

  సీమలొ నీళ్ళు లెవు. వర్షాలు పడవు. అంతా దైవా దీనం బతుకులు. ఫెరిగిన జనభా, తగ్గిన వనరులు, మధ్య తరగతి కుటుంబాలను బీదవారిగా, బీదవరిని అడూకునె వాళ్ళు గా, అడుక్కునే వాళ్ళను దొంగలు గా మార్చి వెస్తూందే ప్రస్థుత పర్స్థితులు. దుమ్ము, ధూలి తప్ప తాలుక కెంద్రల్లొ ఒక్క బతుకు సాదనం లెదు. ఈది శీమ జిల్లాలొ ఈ రొజు పరిస్తితి. మరి రెపు పరిస్తితి పరమాత్ముడికే ఎరుక. వ్యవసాయము నడుము సీమలొ పూర్తిగ విరిగి పొయింది.

  (పదిహెనేల్లక్రితం ఏజి బెయెస్సీ చదివి, వ్యవసాయం చెసేవాళ్ళను చాలమందిని చూడొచ్చు. కానీ ఈరొజు, వాళ్ళు వుంధ్యొగాలె కొరుకుంటున్నరు. (క్షమించాలి, దీంత్లొ తప్పేంలేదు. దీనికి కారణాలు ఎన్నైనా, వ్యవసాయము “కొనసాగిముపుగా మరియు లాభ సాటి గా వుండడం లెదు” అనెది నగ్న సత్యము).

  అందరూ చదువు ద్వారా వచ్చె వుద్యొగాలమీద ఆదరపడే పరిస్తితి. మరి, వుద్యొగాలకు హయిదరబాదు ముక్య మైన లంకె. (విసాఖ పట్నం కొద్దిగా ఆశాజనకం. కానీ ప్రత్యమ్నాయము కాదు.

  వ్యవసాయన్ని మల్లి లాభసాటి చెయ్యలి. ఆప్పుడే, ఈ సమజిక చట్రం లొ అందరూ, వారికి తగ్గ, ఇస్టమైన, లాభసాటి బ్రతుకు తెరువును అవలంబించ గలుగు తారు.

  ఇంతకు మునుపటి తరాల కోస్తా భుస్వములొ లేదా రాయలసీమ రాజకీయ నాయకులొ అదికారం చెలయించి వుండొచ్చు. ఆస్స్తులు సంపాయించుకొని వుండొచ్చు. దానికి ఇప్పటి తరాల యువకులను గురి చెయ్యడం, షిఖించడం, ఏ సమజపు నాగరికత, సంస్కారం, ఇది ఎమి అభివ్రుద్ది అన్ అనిపిస్తుంది.

  60 సంవత్సరాలు, కలిసి వున్న రాశ్ట్రం ఇది. దీంట్లొ, హయిదరబాదు వంటి లాభలుండవచ్చు, కొస్తాంధ్ర పెట్టూబడిదారుల దొపిడీలు వుంద్డి వుండొచ్చొ.

  గతం తవ్వుకొని, కక్చలు పెంచు కొంటె – ఇరు పక్షాలకు నస్టము, బాదే గాని, సుఖము సంతొషము, శాంతి మరియు అభివ్రుద్ధి వుండవు.

  విభజన జరిగె “పద్దతి” చాల ముఖ్యం. ఇది రాత్రికి రాత్రె జరిగె నిర్నయం కాదు, కాకూడదు (అంటె సమస్య పరిష్కారాన్ని ద్రుస్టిలొ వుంచుకొని).

  విభజన వలన వచ్చె సమస్యలను, పరిష్కారం ద్వార వచ్చె మార్పులను, కాల క్రమం లొ చెయ్యలి. దానికి అన్నీ ప్రాంతాల ప్రజలు మనసికం గా తయరు కావాలి (అన్నె ప్రాంతాల రాజకీయ నాయకులు సిద్దం చెయ్యలి).

  – అన్ని సమస్యలను, క్షున్నముగా దాఖలు (డొకుమెంట్) చెయాలి (నీరు, వ్యవసయం, విధ్యుత్థు, పించనులు, తదుపరి రాజధనులు (లెక అంతె సక్తిమంతయిన నగరాలు, కనీసం మూడు) – సర్వం అందులొకి రావాలి.
  – దానికి అందరూ బాఘ్స్వములు సుత్ర ప్రాయం గా అంగీకరించాలి (కొద్ది తెడాతొ నైనా)
  – ఈ సమస్యలను పరిష్కరిచడానికి, అవసరమయ్యె వనరులను, మూడు ప్రాంతాల ప్రజలు, దామాషా పద్దతిలొ కట్టుతూ పొవాలి.

  – ఒక కాల పరిమితి విదించాలి (10, 15 లెక 20 ఎళ్ళు). దీన్ని సాంకెతికంగా నిర్నయించాలి.
  – ఒక సంగ్గాన్ని వెయ్యలి. అందులొ, మూడు ప్రాంతాలనిచి, అన్ని వర్గాల ప్రజలను మెంబరులు గా నియమించాలి. అన్నీ పార్టీల రజకీయ నయకులు వాచర్లు గా వుండవచ్చు.

  శ్రీ క్రిష్ణ కమిటీ చక్కని పద్దతి. కాని దాని వివరించి, దాని వల్ల వచె నిర్నయాన్ని అమొదయొగ్యం గా చెప్పగల రాజకీయ పార్టీ గ కంగ్రెస్స్ వ్యవరరించలేదు. ఇది ముక్య సమస్య.

  ఫ్రస్తుత పరిస్తుతులలొ, వాతవరణం లొ, పాలుపంచుకొనె మనుషులతొ, పదవులె & లాభ నస్టాలే తప్ప ఇంకెమీ లెని రాజకీయ వ్యాపరం లొ, పరస్పరం నమ్మక లెమి తొ, రానున్న ఎన్నికల కాల పరిది లో ఇది జరగాలంటే – దాదాపు అస్సాద్యం మరియు దుస్సాద్యం అనె చెపావచ్చు.

  మొదట గొంతు మీద కత్తి వుంచే పద్దతి నుంచి కూర్చుని మాట్లదె పరిస్తితి రావలి.

  సహ్రుద్భావ వాతవరం నెలకొల్పాలి మల్లి , ఆ తరువాతే అన్నీ.

  పొడుగయిన వుత్తరానికి క్షమించాలి.

  నమస్కారం

 29. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s