ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా


సిరియాపై పరిమిత దాడి చేసి రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను శిక్షిస్తానని ప్రకటించిన అమెరికా ఒంటరిగా మిగిలింది. సిరియా దాడిలో భాగస్వామ్యం వహించడానికి వీలు లేదని బ్రిటన్ పార్లమెంటు తేల్చి చెప్పింది. ‘దాడికి సై’ అన్న ఫ్రాన్సు వెనక్కి తగ్గి ‘ఐరాస అనుమతితో చేద్దాము, చర్చలు కూడా చేద్దాము’ అంటూ యుద్ధ పిపాసను తగ్గించుకుంది. దాడికి సహకరించేది లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఐరాస పరిశీలకుల నివేదిక అందకుండా దాడి వద్దే వద్దు అని కెనడా, బెల్జియంలు తెగేసి చెప్పాయి. జి8 సమావేశం నిర్ణయాలు, జెనీవా శాంతి చర్చలను వదిలి పెట్టి ఏకపక్ష దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని రష్యా హెచ్చరించింది. ఇరాక్ నుండి పాఠం నేర్చుకోలేదా అని చైనా నిలదీసింది. కానీ బారక్ ఒబామా మాత్రం దాడి చేసేది చేసేదే అని ప్రకటిస్తూ సిరియా ప్రజల రక్షణ పేరుతో వారిపైనే బాంబుల వర్షం కురిపించడానికి సిద్ధం అవుతున్నాడు.

బ్రిటన్ పార్లమెంటు ‘నో’

అమెరికా సాగించే ప్రతి దుర్మార్గానికి ‘నేనున్నానంటూ’ ముందుకు వచ్చే దేశం బ్రిటన్. దురాక్రమణ యుద్ధాలకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడం దగ్గర్నుండి అమెరికాతో సమానంగా కాకపోయినా ఇతర దేశాల కంటే అనేక రెట్లు సైన్యాన్ని, యుద్ధ బలగాలను దించి అమెరికా పాపంలో గణనీయ మొత్తంలో వాటా దక్కించుకుంటుంది. అలాంటి బ్రిటన్ దేశాన్ని సిరియా దాడి విషయంలో ముందుకు వెళ్లకుండా పార్లమెంటు నిరోధించింది.

గురువారం రోజంతా జరిగిన చర్చలో ప్రధాని కామెరాన్ యుద్ధ ప్రయత్నాలను పార్లమెంటు 285-272 ఓట్ల తేడాతో తిరస్కరించింది. పాలక కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు కూడా కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. ప్రజలు, పార్లమెంటు వ్యతిరేకిస్తున్నందున సిరియాలో జోక్యం చేసుకోబోమని ప్రధాని కామెరాన్ ప్రకటించవలసి వచ్చింది. యుద్ధానికి వ్యతిరేకంగా బ్రిటన్ లో పోటెత్తుతున్న ప్రజాభిప్రాయంతో ప్రధాని ఎంతగా దూరంగా ఉన్నాడో పార్లమెంటులో పరిణామాలు స్పష్టం చేశాయని అనేకమంది ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

“బ్రిటిష్ ప్రజల్లో ఉన్న అనుమానాలను హౌస్ ఆఫ్ కామన్స్ ఓటింగు ప్రతిబింబించింది. పశ్చిమాసియాలో మరో యుద్ధానికి వారు సిద్ధంగా లేరని స్పష్టం అవుతోంది.” అని కామెరాన్ ఓటింగు అనంతరం ప్రకటించాడు. గురువారం జరిగిన ఓటింగు సూత్రబద్ధ తీర్మానం పైన. ఈ ఓటింగులో ఆమోదం వస్తే, వాస్తవంగా దాడికి వెళ్ళే ముందు మరో ఓటింగు కు వెళ్లాలని కామెరాన్ నిర్ణయించాడని పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే సిరియా యుద్ధానికి సూత్రబద్ధంగానే పార్లమెంటు తిరస్కరించినందున ఇక రెండో ఓటింగుకు వెళ్ళే సాహసానికి కామెరాన్ దిగకపోవచ్చు.

సిరియా ప్రభుత్వమే రసాయన ఆయుధాలు ప్రయోగించడానికి ఆదేశాలు ఇచ్చింది అని చెప్పేందుకు స్పష్టమయిన ఆధారాలు లేకపోవడం వల్ల బ్రిటన్ కామన్స్ సభ సభ్యుల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇరాక్ యుద్ధం కోసం టోనీ బ్లెయిర్ సృష్టించిన అబద్ధపు సాక్ష్యాలు, ఇరాక్ యుద్ధం వలన దేశంపై పడిన విపరీతమయిన భారం బ్రిటన్ ప్రజల మది నుండి ఇంకా తొలగిపోలేదు. అనేక ప్రజాభిప్రాయ సేకరణ సర్వేల్లో 10 శాతం లోపు ప్రజలే యుద్ధానికి అనుకూలంగా ఉన్నారని తేలినప్పటికీ కామెరాన్ మూర్ఖంగా యుద్ధ భాష మాట్లాడడం బ్రిటన్ ప్రజలకు ససేమిరా నచ్చలేదు. ప్రజల ధోరణిని గమనించిన సభ్యులు వారికి అనుగుణంగా వ్యవహరించక తప్పలేదు. సిరియా దాడికి బ్రిటన్ పార్లమెంటు తిరస్కరణ అమెరికా-బ్రిటన్ సామ్రాజ్యవాద ఆధిపత్య దాహంలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా అమెరికాకు శృంగభంగం కలిగించడంలో బ్రిటన్ ప్రజలు సఫలం అయ్యారు. కానీ బ్రిటన్ పాలకులు ప్రజాభిప్రాయాన్ని ఎంతవరకు గౌరవిస్తారో అనుమానమే.

ఆమోదించబోము –రష్యా

సిరియాపై అమెరికా చేస్తున్న బెదిరింపులను ఆమోదించేది లేదని రష్యా గట్టిగా హెచ్చరించింది. సిరియా ప్రభుత్వానికి మొదటి నుండి అండగా ఉన్న రష్యా ఈసారి కూడా పశ్చిమ పత్రికల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో ముందు పీఠిన నిలిచింది. “ఎంత పరిమిత దాడి అయినప్పటికీ, అది అంతర్జాతీయ చట్టాలను నేరుగా, పచ్చిగా ఉల్లంఘించడమే అవుతుంది. సిరియా ఘర్షణలకు రాజకీయ, రాయబార పరిష్కారాలను అడ్డుకోవడం కూడా అవుతుంది. ఘర్షణలు మరింత పెచ్చరిల్లడానికి, మరింతమంది సిరియా ప్రజలు మరణించడానికీ మాత్రమే అమెరికా దాడి దారితీస్తుంది” అని రష్యా విదేశాంగ మంత్రి లూకాషెవిక్ శనివారం ప్రకటించాడు.

“లాఫ్ ఎర్నేలో జి8 సమావేశం నిర్ణయాలను, దరిమిలా జరిగిన ఒప్పందాల మేరకు సిరియాలో రసాయన ఆయుధాల వినియోగంపై ఐరాస నిపుణుల పరిశోధన నివేదికను ఐరాస భద్రతా సమితికి సమర్పించడానికి బదులుగా, ఎటువంటి సాక్ష్యం లేకపోయినా సిరియాపై దాడి తప్పదన్న బెదిరింపులను మనం వింటున్నాము. ఈ బెదిరింపులు మాకు ఆమోదయోగ్యం కాదు. అమెరికా మిత్రులు కూడా ఐరాస నివేదిక కోసం ఎదురు చూద్దామని సలహా ఇస్తున్నారు” అని లూకాషెవిక్ వ్యాఖ్యానించాడు. రసాయన ఆయుధాల ప్రయోగానికి గురయిన ప్రజలకు వైద్య సేవలు అందించిన ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్ధ కూడా ఆగస్టు 21 డమాస్కస్ రసాయన దాడి మృతులు 355 మంది అని చెప్పగా అమెరికా నివేదిక మాత్రం మృతుల సంఖ్య 1429 అని చెప్పడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.

“రసాయన దాడిలో పాల్గొన్నవారు త్వరలో జరగనున్న జెనీవా శాంతి చర్చలను నిరోధించడానికే ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ కధను సృష్టించినారి ఉద్దేశ్యం కూడా అదే అయి ఉండవచ్చు. సిరియా తిరుగుబాటుదారులు శాంతియుతంగా చర్చలు జరపడానికి సిద్ధంగా లేరు” అని రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ వ్యాఖ్యానించారు. ఒక పక్క యుద్ధ ప్రయత్నాలను ఖండిస్తూనే మరో పక్క రష్యా కూడా నిశ్శబ్దంగా తన యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రానికి తరలించింది. సిరియాలో ఉద్రిక్తతలు రేగుతున్న పరిస్ధితిని దృష్టిలో పెట్టుకునే తమ నౌకలను తరలించినట్లుగా రష్యా మిలట్రీ అధికారులు చెప్పారని రష్యా టుడే తెలిపింది. గతంలో అయితే రష్యా ఇలా చెప్పేది కాదు. సాధారణ కార్యకలాపాల కోసం అనో, గస్తీ కోసం అనో చెప్పేది. అలాంటిది ‘ఉద్రిక్త పరిస్ధితుల రీత్యానే’ అని నేరుగా చెప్పడం అంటే అమెరికా దాడిని తిప్పికొట్టడానికి రష్యా కూడా తగిన ఏర్పాట్లు చేస్తోందని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇరాక్ ను పునరావృతం చేయొద్దు –చైనా

చైనా కూడా గతం కంటే ఎక్కువగా కఠినమైన భాషను ప్రయోగిస్తోంది. సిరియాపై దాడి చేసేందుకు దారితీసే తీర్మానాలను భద్రతా సమితిలో వీటో చెయ్యడం వరకే ఇప్పటివరకూ పరిమితమైన చైనా అమెరికా బెదిరింపుల నేపధ్యంలో జోరు పెంచింది. శాంతి పాటించాలని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ పార్టీ పత్రికలు, ప్రభుత్వ అంతర్జాతీయ పత్రికలు అమెరికాను ఘాటుగా హెచ్చరిస్తున్నాయి. “ఇరాక్ యుద్ధం యొక్క సారం ఏమిటంటే ఐక్యరాజ్యసమితిని పక్కకు నెట్టి బల ప్రయోగం ద్వారా ఒక సార్వభౌమాధికార ప్రభుత్వాన్ని కూలదోయడం. సిరియాపై కూడా ఇదే పద్ధతిని పునరావృతం చేయడానికి కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నందున అంతర్జాతీయ సమాజం అప్రమత్తతతో ఉండాలి” అని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ సంపాదకీయం హెచ్చరించింది.

2011లో ఇలాగే లిబియా విషయంలో దురుద్దేశపూరితంగా పశ్చిమ దేశాలు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని చైనా, రష్యాలు బలపరిచి ‘నిషిద్ధ గగనతలం’ (నో ఫ్లై జోన్) అమలు చేయడానికి సహకరించాయి. ఈ తీర్మానాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుని మందబలంతో లిబియాపై విరుచుకు పడ్డాయి. లిబియా అంతటా బాంబులు, క్షిపణుల వర్షం కురిపించి మౌలిక నిర్మాణాలను సర్వనాశనం చేసాయి. వేలాది మంది లిబియా ప్రజలను బలిగొన్నాయి. దీని ఫలితంగా లిబియాలో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులను చైనా కోల్పోయింది. సిరియాలో చైనాకు చమురు ప్రయోజనాలు పెద్దగా లేనప్పటికీ సిరియా కూలిపోతే అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ ల తదుపరి లక్ష్యం ఇరానే అని చైనాకు బాగా తెలుసు. ఇరాన్ చమురు వెలికితీతలో చైనాకు గణనీయ మొత్తంలో ప్రయోజనాలు ఉన్నాయి. ఒబామా ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ వ్యూహంలో భాగంగానే సిరియా, ఇరాన్, హిజ్బోల్లా (లెబనాన్) లను కబళించడానికి అమెరికా ప్రయత్నిస్తున్నందున సిరియా దాడిని నిరోధించవలసిన అవసరం చైనాకు బాగా ఉంది.

అయితే చైనా పాలకవర్గాల్లోని కొన్ని సెక్షన్లు సిరియాపై అమెరికా దాడిని చూసీ చూడనట్లు వదిలేయాలనీ, అవసరం అయితే ఐరాస తీర్మానానికి మద్దతు కూడా ఇవ్వాలని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. సిరియాపై దాడికి దిగితే, ఇరాక్, ఆఫ్ఘన్ తరహాలో అమెరికా అందులో కూరుకుపోవడం ఖాయమనీ, తద్వారా చైనాపై అమెరికా కేంద్రీకరణను తగ్గించవచ్చని వారు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో అమెరికా కూరుకుపోయిన పరిస్ధితిలో చైనా బాగా లాభపడింది. యుద్ధాలు మోపిన భారంతో అమెరికా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోగా చైనా వాణిజ్య మిగులును పెంపొందించుకుంటూ రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించింది. బహుశా ఇదే తరహాలో లబ్ది పొందవచ్చని పైన చెప్పిన సెక్షన్లు భావిస్తుండవచ్చు. కానీ ఇది అడ్డగోలు వాదన తప్ప మరొకటి కాదు. సిరియాపై దాడి లక్ష్యమే ఇరాన్, చైనా, రష్యాలు అయినప్పుడు అలాంటి దాడిని అనుమతించడం చైనాకు ఆత్మహత్యా సదృశమే అవుతుంది.

అయితే పీపుల్స్ డెయిలీ, గ్లోబల్ టైమ్స్ పత్రికల సంపాదకీయాలను బట్టి సిరియా దాడిని దృఢంగా వ్యతిరేకించాలన్న వాదనే చైనాలో పై చేయి సాధించినట్లు అర్ధం చేసుకోవచ్చు. సిరియా దాడిని గట్టిగా వ్యతిరేకించాలని గ్లోబల్ టైమ్స్ (చైనా ప్రభుత్వ అంతర్జాతీయ పత్రిక) వ్యాఖ్యానం ప్రభోదించింది. “సిరియాలో మిలట్రీ జోక్యాన్ని వ్యతిరేకించే శక్తులు ఐక్యం కావాలి. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు సిరియాపై తలపెట్టిన వాయు దాడులను నిరోధించడానికి సాధ్యమైనంతగా కృషి చేయాలి. సిరియా ప్రతిఘటనకు బహిరంగంగా మద్దతు ప్రకటించాలి” అని గ్లోబల్ టైమ్స్ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపుకు అర్ధం రష్యా, ఇరాన్ లు సిరియా ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ప్రకటించి మిలట్రీ సహకారం ఇవ్వాలని కోరడమే. చైనా తదితర దేశాలు ఇతర పద్ధతుల్లో సహకారం ఇవ్వాలని కూడా ఈ పిలుపు ధ్వనిస్తోంది. రష్యా, ఇరాన్ లు బహిరంగంగా సిరియాకు మద్దతు ప్రకటిస్తే అనివార్యంగా చైనా కూడా అందులోకి ఈడ్వబడుతుంది. అమెరికా దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా రష్యాతో జట్టు కట్టాలని వాదిస్తున్నవారు కూడా చైనాలో లేకపోలేదు.

మేము పాల్గొనం –జర్మనీ

సిరియా దాడిలో తాము పాల్గొనబోమని జర్మనీ స్పష్టం చేసింది. “సిరియా దాడిలో పాల్గొనే అంశాన్ని మేమసలు పరిగణించలేదు. మిలట్రీ దాడిలో పాల్గొనే ఉద్దేశ్యం కూడా మాకు లేదు” అని ప్రభుత్వ ప్రతినిధి చెప్పినట్లుగా ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. రసాయన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యులని తేలితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జర్మనీ మొదట ప్రకటించింది. అయితే బ్రిటన్ పార్లమెంటు ఓటింగు తర్వాత జర్మనీ స్వరం మారింది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రష్యా, అమెరికా అధ్యక్షులతో ఫోనులో సంప్రదించడంలో మునిగిపోయిందే తప్ప దాడి విషయమై స్వయంగా ఏ ప్రకటనా చేయలేదు. ఐరాస భద్రతా సమితిలో ఐక్య తీర్మానం ఆమోదించాలని మాత్రం ఒక పిలుపిచ్చారామె. కానీ సిరియాపై దాడిని చైనా, రష్యాలు వ్యతిరేకిస్తున్నందున ఐక్య తీర్మానం కుదిరే పని కాదు.

సెప్టెంబరు 22 ఎన్నికల్లో మెర్కెల్ మూడోసారి ఛాన్సలర్ పదవికి పోటీ చేయనున్నారు. జర్మనీలో జరిపిన సర్వేల్లో మెజారిటీ ప్రజలు సిరియా దాడిని వ్యతిరేకిస్తున్నట్లు తేలడంతో ఆమె తగిన జాగ్రత్తలు పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. జెడ్.డి.ఎఫ్ టి.వి జరిపిన సర్వేలో 58 శాతం మంది సిరియా దాడిని వ్యతిరేకిస్తున్నట్లుగానూ 33 శాతం సమర్ధిస్తున్నట్లుగానూ తేలింది. “దాడిలో పాల్గొనాలని జర్మనిని ఎవరూ అడగలేదు, జర్మనీ కూడా పాల్గొనాలని భావించడం లేదు” అని జర్మనీ విదేశీ మంత్రి గిడో వెస్టర్ వెల్లే ప్రకటించాడు.

ఇతర నాటో సభ్య దేశాలలో అనేకం దాడిలో పాల్గొనబోమని స్పష్టం చేసాయి. కొన్ని దేశాలు రాజకీయంగా దాడికి మద్దతు ఇస్తాం కానీ ప్రత్యక్షంగా పాల్గొనబోము అని ప్రకటించాయి. దాడి కంటే చర్చలే మేలు గ్రీసు ప్రకటించింది. అయితే దాడికి నాటో నిర్ణయిస్తే తమ స్ధావరాలు వినియోగించడానికి అనుమతి ఇస్తామని తెలిపింది. అయితే నాటోలోని 28 సభ్య దేశాలూ అంగీకరిస్తేనే దాడిలో నాటో పాల్గొనడానికి వీలవుతుంది. బ్రిటన్ పార్లమెంటు తిరస్కరించినందున నాటో పాత్ర ఆ విధంగా రద్దయినట్లే. కెనడా, డెన్మార్క్ దేశాలు రాజకీయంగా మద్దతు ప్రకటించాయి. కానీ దాడిలో పాల్గొనేది లేదని స్పష్టం చేశాయి. దాడి వల్ల ఫలితం ఉంటుందని భావించడం లేదని పోలండ్ ప్రకటించింది. దాడి చేస్తే జాగ్రత్త వహించాలని హాలండ్ కోరింది. ఐరాస అనుమతి లేకుండా దాడి చేస్తే అది ప్రపంచ స్ధాయి ఘర్షణగా రూపుదిద్దుకుంటుందని ఇటలీ హెచ్చరించింది. “ప్రపంచ యుద్ధాలు ఎప్పుడూ మొదలయ్యేది ఇలాగే” అని ఇటలీ మంత్రి ఎమ్మా బొనినో ప్రకటించడం విశేషం.

మొత్తం మీద సిరియా దాడి విషయంలో ఇప్పుడు అమెరికా ఒంటరి. టర్కీ మద్దతు ఇస్తున్నా స్వయంగా పాల్గొనదు. ఇజ్రాయెల్ పాల్గొనే అవకాశం ఉన్నా అది బహిరంగంగా జరగదు. ఇజ్రాయెల్ ప్రవేశిస్తే మధ్య ప్రాచ్యం మొత్తం అప్రమత్తమవుతుంది. ఈ పరిస్ధితుల్లో ఒంటరిగా ఐనా సరే దాడి చేసి తీరతాం అని అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రకటిస్తున్నారు. దాడికి తగినట్లుగా అమెరికా ప్రజలను తయారు చేయడంలో వారు మునిగిపోయారని సి.బి.ఎస్ వార్తా సంస్ధ చెబుతోంది. ఇరాక్, ఆఫ్ఘన్ ల నుండి పాఠాలు నేర్వని మూర్ఖులకు సిరియా ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆశించడంలో తప్పు లేదు.

3 thoughts on “ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా

  1. పింగ్‌బ్యాక్: అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s