బారక్ ఒబామా సర్కస్ ఫీట్లు -కార్టూన్


Limited Attack

దాడి పరిమితంగా ఉండేందుకే ఇదంతా…

అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ సిరియాపై దాడి చేయడానికే అమెరికా కట్టుబడి ఉన్నదని ఆ దేశ రక్షణ కార్యదర్శి చక్ హేగెల్ మరోసారి ప్రకటించాడు. ప్రపంచ పోలీసు పెత్తనం చెలాయించడంలో అమెరికా లాఠీని మోసే అనుంగు మిత్రుడు బ్రిటన్ లో సిరియా పై దాడి చేసే ప్రయత్నాలను పార్లమెంటు తిరస్కరించినా వెనకడుగు వేసేది లేదని చక్ ప్రకటించాడు.

అమెరికా జాతీయ భద్రతకు కట్టుబడి ఉండడానికే ఒబామాను ప్రజలు ఎన్నుకున్నారని కాబట్టి సిరియాపై దాడి చేసేది చేసేదే అని తలా తోకా లేని కారణం చెప్పాడు చక్ హేగెల్. అమెరికా జాతీయ భద్రతకు సిరియాకు సంబంధం ఏమిటసలు? కిరాయి తిరుగుబాటు రెచ్చగొట్టి సిరియా జాతీయ భద్రతకు పెను ముప్పు తేవడమే కాకుండా అక్కడి ప్రజల ప్రాణాలను, ఆస్తులను, ప్రభుత్వ నిర్మాణాలను సర్వనాశనం చేస్తున్న అమెరికా తన జాతీయ భద్రతకు ప్రమాదం వచ్చిందని ఎలా చెబుతుంది?

పరిమిత దాడి మాత్రమే చేస్తామని ఒబామా ప్రకటించడంలోనే అమెరికా యుద్ధ ప్రయత్నాలలోని అసంబద్ధత స్పష్టం అవుతోంది. పరిమిత దాడి చేసి ఏం సాధించబోతున్నారు? రెండు రోజుల పాటు యుద్ధ విమానాలతో దాడి చేసి ప్రభుత్వ సైనిక నిర్మాణాలను విధ్వంసం చేసి, తద్వారా ప్రభుత్వ బలగాలపై కిరాయి మూకలకు పై చేయి అందించే దుష్ట తలంపుతోనే ‘పరిమిత దాడి’ అని చెబుతున్నారు.

దాడికి అమెరికా చెబుతున్న కారణం ప్రభుత్వ బలగాలు రసాయన ఆయుధాలు ప్రయోగించారని. అదే నిజమైతే పరిమిత దాడితో దానిని ఎలా నిరోధిస్తారు. రసాయన ఆయుధాలతో దాడి చేసేవారు పరిమిత దాడికి భయపడి వెనక్కి తగ్గుతారా? వాస్తవం ఏమిటంటే సిరియా ప్రభుత్వ బలగాలే రసాయన ఆయుధాలు ప్రయోగించారని చెప్పేందుకు అమెరికా వద్ద సాక్ష్యమే లేదు. ఈ మేరకు సి.ఐ.ఏ ఇంటలిజెన్స్ వర్గాలే ధృవీకరించాయని ఫారెన్ పాలసీ పత్రిక తెలిపింది. సరిగ్గా ఈ కారణంతోనే బ్రిటన్ పార్లమెంటు దాడిని వ్యతిరేకించింది.

అమెరికా సెనేట్, ప్రతినిధుల సభల్లోని యుద్ధోన్మాదుల ఆకాంక్షలను పక్కనబెట్టి సిరియా దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా ప్రజల తిరస్కరణను మన్నిస్తే బారక్ ఒబామాకు ఈ సర్కస్ ఫీట్లు చేసే అవసరం తప్పుతుంది. 

వ్యాఖ్యానించండి