మబ్బుల్లో నీళ్ళు చూపించి ఓటు అడగబోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు?
ఆహార భద్రతా బిల్లును చారిత్రాత్మకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఈ బిల్లును ప్రవేశ పెట్టడం తన అదృష్టంగా చెప్పుకున్నారు. ఈ పధకం ద్వారా దేశంలో 70 కోట్ల మందికి ఆహార భద్రత లభించనున్నదని ఆమె లోక్ సభలో బిల్లు ప్రవేశపెడుతూ ప్రకటించారు. 67 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ 70 కోట్ల మందికి ఆహార భద్రత లేదని కాంగ్రెస్ నాయకురాలు పరోక్షంగా అంగీకరించారు.
బిల్లు లోక్ సభలో మాత్రమే ఆమోదం పొందింది. అది కూడా బి.జె.పి మద్దతుతో. రాజ్య సభలో ఇంకా ఆమోదం పొందలేదు. అక్కడ కాంగ్రెస్ కి మెజారిటీ లేదు. ఎస్.పి, బి.ఎస్.పి ల మద్దతుతో బిల్లు ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోందని పత్రికలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆహార బిల్లునే తమ ప్రధాన ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ ఉపయోగపెడుతుందని కూడా పత్రికలు నమ్మకంగా చెబుతున్నాయి. కానీ సామాన్యుడి ఇంటికి తిండి గింజలు దక్కేది ఆహార భద్రతా చట్టం ద్వారా కాదు. ప్రజా పంపిణీ వ్యవస్ధ నడవడానికే సరైన వ్యవస్ధలు లేక కుంటి నడక నడుతోంటే ఇక కొత్తగా ఆహార భద్రతా చట్టాన్ని ఎవరి ద్వారా అమలు చేస్తారో ప్రభుత్వం ఎక్కడా చెప్పినట్లు లేదు.
వెరసి ఆహార భద్రతా చట్టం కాగితపు పులిగానే, మబ్బుల్లో నీరుగానే మిగిలిపోనున్నదా?
