ఎలక్ట్రానిక్ మీడియా దురహంకార చేష్టలు విలువిద్యలో దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన యువతిని కంటతడి పెట్టించాయి. ఒక రోజంతా విమానంలో ప్రయాణించడంతో తిండి, నిద్ర లేవనీ, అర్జెంటుగా మరో విమానం ఎక్కాల్సి ఉన్నదనీ వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఇంటర్వ్యూల కోసం పట్టుబట్టడంతో భారత దేశంలో అత్యున్నత ప్రతిభ కల క్రీడాకారిణిగా భావించబడుతున్న దీపికా కుమారి సున్నితంగా తిరస్కరించింది. తాము టి.విల్లో చూపించడమే గొప్పగా భావించే మీడియా విలేఖరులు దీపిక పరిస్ధితి పట్టించుకోకుండా అహంకారి అని దూషించడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
రికర్వ్ ఆర్చరీ ప్రపంచ కప్ క్రీడలు పోలండ్ నగరం రోక్లాలో సోమవారంతో ముగిశాయి. ఇందులో భారత మహిళల టీము వరుసగా రెండో సంవత్సరం గోల్డ్ మెడల్ సాధించింది. దీపిక కుమారి, ఎల్.బొంబాయ్లా దేవి, రిమిల్ బురుయ్లి లతో కూడిన మహిళల టీం కి దీపిక కుమారి కెప్టెన్. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన కొరియా టీం తో వీరు ఫైనల్ లో పోటీ పడి ప్రతికూల పరిస్ధితుల మధ్య విజయం సాధించారని పత్రికలు చెబుతున్నాయి. అయితే క్రికెట్ వెర్రిలోనూ అది తెచ్చిపెట్టే డబ్బులోనూ నిండా మునిగే ప్రభుత్వ పెద్దలు గానీ క్రీడా మంత్రిత్వశాఖ గానీ ఆర్చరీ టీం ని కనీసం ఆహ్వానించడానికి కూడా విమానాశ్రయానికి రాకపోవడం ఆర్చరీ బృందం సభ్యులను నిరాశకు గురిచేసిందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ఆర్చరీ మహీళా క్రీడా బృందం సభ్యులకు మీడియా కవరేజి ఇవ్వడమే ఒక గొప్ప విషయం అన్నట్లుగా ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహరించడంతో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఆనందం దీపికకు మిగలకుండా పోయింది. గోల్డ్ మెడల్ గెలుచుకున్నందుకు గాను ‘ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు వి.కె.మల్హోత్రా ఢిల్లీలోని తమ నివాసంలో ఒక చిన్నపాటి అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి మీడియాను ఆహ్వానించారు. ఈ సమావేశంలో టీం కెప్టెన్ దీపిక కుమారి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
రోక్ల నుండి మంగళవారమే ఆర్చరీ టీం సభ్యులు ఢిల్లీకి వచ్చారు. వారు జాతీయ శిబిరం నిర్వహించబడుతున్న ఔరంగాబాద్ కు బయలుదేరి వెళ్లవలసి ఉంది. ఈ లోపు అభినందన సభ ఏర్పాటు చేశారు. అయితే టి.వి ఛానెళ్లు ఎవరికి వారు తమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వాలని పట్టుబట్టడంతో పరిస్ధితి చేయిదాటిపోయిందని ది హిందు తెలిపింది. అప్పటికే జెట్ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న క్రీడాకారిణులు ఒక్కొక్కరు, ఒక్కక్క చానెల్ కు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్ధితిలో లేరు. దాని బదులుగా అందరం కలిసి ఇంటర్వ్యూలు ఇస్తామని, ఒక టీంగా సమాధానాలు ఇస్తామని వారు విన్నవించుకున్నారు.
అయితే టి.ఆర్.పి రేటింగులతో ఆబ్సెషన్ లో ఉండే ఎలక్ట్రానిక్ మీడియా వారి విన్నపాన్ని చెవికి ఎక్కించుకోలేకపోయారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో అప్పటికే క్రీడాకారిణుల నుండి మాటలు (soundbytes) సేకరించినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా సంతృప్తి పడలేదు. ఎవరికి వారు తమకు తాము ఎక్స్ క్లూజివ్ కవరేజి ఇవ్వాలన్న ఆతృతలో కనీస మర్యాద పాటించడం మర్చిపోయారని కొన్ని పత్రికలు తెలిపాయి.
- Rimil Buriuly, Deepika Kumari and Bombayla Devi in New Delhi
- Deepika Kumari receives the Arjuna Award 2012
ఒక కెమెరామెన్ అయితే క్రీడాకారిణుల వెంట పడుతూ వారి ప్రతికదలికను రికార్డు చేయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. టీం కోచ్ లిమ్ చే వూంగ్ (కొరియా) తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న దీపిక తనకు అసౌకర్యంగా అడ్డుగా ఉన్న సదరు కెమెరా మెన్ ను పక్కకు, దూరంగా వెళ్ళమని కోరడంతో రగడ మొదలయినట్లు ది హిందు తెలిపింది. ఈ సందర్భంలో బహిరంగ ఘర్షణ లాంటిదేమీ జరగనప్పటికీ దీపికను అంతిమంగా దూషించడానికి ఇదే పునాదిగా మారిందని పత్రిక సూచించింది.
పక్కకు వెళ్లాలన్న దీపిక విజ్ఞప్తిని కెమెరామెన్ పట్టించుకోకపోగా ఆమెను వెంటాడడం ప్రారంభించాడు. ఈ మాత్రం మీడియా కవరేజి ఇస్తున్నందుకు దీపిక సంతోషించకుండా పక్కకు వెళ్ళమని చెప్పడం ఏమిటని ఎత్తిపొడిచాడు. అయినా క్రీడాకారిణులు సహనం కోల్పోకుండా ఓపికగా టి.వి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ సమయం గడిచేకొద్దీ ఎంతకీ ఇంటర్వ్యూలు ముగియని పరిస్ధితి ఏర్పడింది. విమానం సమయం దగ్గరపడేకొద్దీ అమ్మాయిల్లో ఆందోళన మొదలయింది. దానితో ఇక మిగిలిన టీ.విల వాళ్ళు ముగ్గురిని కలిపి ఇంటర్వ్యూలు తీసుకోవాలని వారు కోరారు.
ఇది మిగిలిన టి.విల సిబ్బందికి ఎంతమాత్రం నచ్చలేదు. కొందరికి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చి తమకు ఉమ్మడి ఇంటర్వ్యూ ఇవ్వడం అవమానంగా భావించి తమకు కూడా ఒక్కొక్కరే ఇంటర్వూలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఒక టి.వి రిపోర్టర్ దీపికను ‘అహంకారంగా వ్యవహరిస్తున్నదంటూ’ దూషించడం జరిగిపోయింది. విడివిడిగా ఎందుకు మాట్లాడరనీ, అలా చేయకపోవడం అహంకారమేననీ వ్యాఖ్యానించడంతో దీపిక కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె తాము 24 గంటలుగా నిద్ర పోలేదనీ, ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో తలనొప్పిగా ఉన్నదనీ, పైగా విమానం అందుకోవాల్సి ఉన్నదనీ వేడుకున్నారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు పరిస్ధితిని సద్దుమణగడానికి ప్రయత్నించారు. అయితే వారు కూడా అమ్మాయిల పరిస్ధితి గమనించకుండా టి.వి ఇంటర్వ్యూలను కొనసాగించాలని ఒత్తిడి చేశారు. అయితే దీపిక ఇక ఎంతమాత్రం కుదురుగా మాట్లాడే పరిస్ధితి లేకపోయింది. ఇతర బృందం సభ్యులు అక్కడి నుండి వెళ్ళిపోయినప్పటికీ టి.విల సిబ్బంది దీపిక పైన కేంద్రీకరించి ఆమె వేడుకోళ్ళను కూడా రికార్డు చేసి గానీ అక్కడి నుండి కదల్లేదు.
ఛానెళ్ల విలేఖరులు తాము అన్ని రకాల ప్రవర్తనా మర్యాదలకు అతీతం అని భావించుకోవడం మానుకోవాలని కోరడంలో తప్పు లేదనుకుంటాను. గోల్డ్ మెడల్ సంపాదించిన టీం ని తమ వార్తల ద్వారా, కవరేజి ద్వారా అభినందించాలనుకోవడంలో ఎంతమాత్రం తప్పు లేదు. కానీ తమ అభినందనలే వారికి అంతిమ సర్టిఫికేట్ గా వ్యవహరించడమే బాధాకరం. అది కూడా ఎవరినైతే అభినందిస్తున్నారో వారికే కళ్ళనీళ్లు తెచ్చేలా వ్యవహరించడం మరింత అభ్యంతరకరం. క్రీడలు క్రీడలుగా మిగలకుండా అసోసియేషన్ల సంపాదనలకు, పరువు ప్రతిష్టలకు సాధనాలుగా మారినప్పుడు ఈ దుస్ధితి సహజమే కావచ్చు!






శ్రమతొ సంభంధం లేకుండా వచ్చిపడేది డబ్బు. జూదంలొ మాత్రమే సాద్యం. అక్కడ కొత్తగా ఉత్పాదక శ్రమ గానీ అనుత్పాదక శ్రమ గానీ ఎమీ వుండదు. డబ్బు అటూ ఇటూ తన యజమానుల్ని మార్చుకుంటుంది అంతే . ఒక మొడల్ చేసే కుత్రిమైన హావబావాలు నడకల్ని చూడండి. అక్కడ పక్రుతి సహజంగా ఇచ్చిన శరీరమే కనకవర్షం కురిపిస్తుంది.అందులొ అనువంతైనా శ్రమలేకుండా. అలాగే వేశల్ని తీసుకున్నా వాళ్ళ సొంతంగా చేసినా లేదా ఒక వ్యాపారిదగ్గిర పనిచేసినా అందులొకుడా శ్రమంటూ ఎమీ వుండదు. ఈ మద్య పేపర్లొ చూశాను దుబాయిలొ ఒక పావురం కొన్ని కొట్లు అమ్ముడు పొయిందని కారణం ఆ పావురం పొటీల్లొ ముందుఫీటీన వుంది. ఒక బడా పారిశ్రామిక వ్యెక్తిపక్కన బొజనం చేయడానికి కొట్లు చెల్లించుకున్నాడని. అమెరికాలొ సినీనటుడు బాలక్రిష్న తన పక్కన బొజనం చేయడానికి ఆసుపత్రి పేరుతొ వసూలు చేశాడు. పైవాటిన సరసన క్రీడల్ని కుడా చేర్చవచ్చు.అక్కడ కుడా అణువంతైనా శ్రమ వుండదు. క్రీడలు ఆటవిక దశనుంచీ వున్నాయి అక్కడ డబ్బు ప్రమేయం లేకుండా జరిగాయి. క్రీడలు కేవలం ఉల్లాసంకొసం ఆరొగ్యంకొసం. వర్గ సమాజం ప్రతివిషయాన్ని విక్రుతం చేసినట్టె క్రీడలు ద్వారా జూదాల ద్వారా ప్రజల్ను ఉన్నపణాన డబ్బు కీర్తి ప్రతిష్టలు దొరుకుతాయనే బ్రమల్ని వ్యాపింపచేసింది వర్గ ప్రభుత్వం. ప్రజల్ని మత్తులొ ఉంచడం వర్గప్రభుత్వానికి అత్యవసరం లేకపొతే దాని పునాదికే యసరు వస్తుంది.
సరిగ్గా చెప్పారు రామ్మోహన్ గారు,
వేశ్యల శ్రమని ఇందులో చేర్చటం బాగున్నట్లు లేదు. అది అనుత్పాదక శ్రమైనా, అమానుషమైన శ్రమ. తనకున్న పాపులారిటి తో సినీ నటులు, క్రీడా కారులు సంపాదించే సంపాదనకు, వాల్లకి పోలిక పెట్ట కూడదు. సమాజంలో ఉన్న క్రేజీ ని వీల్లందరూ మోసం తోటి డబ్బు చేసు కోనే వారైనా వేశ్యలుమోసపుచ్చటంకంటే మోసపోయేవారే ఎక్కువ. వాల్లని పావులుగా ఉపయోగించుకొనే వారే ఎక్కువ. చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి..