–
బి.ఎజే.పి ప్రచార రధ సారధి మోడితో: మన పైలట్ వాహనం దెబ్బతిని కూలిపోయింది!
–
ఉత్తర ప్రదేశ్ లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన ‘చౌరాసి కోసి పరిక్రమ యాత్ర’ దాదాపు అభాసుపాలయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం వి.హెచ్.పి యాత్రపై విరుచుకుపడడంతో యాత్ర లాంఛనప్రాయంగా ప్రారంభం అయినట్లు ప్రకటించి ఊరుకున్నారు. అసలు పరిక్రమ యాత్ర ఇప్పటికే సాంప్రదాయ బద్ధంగా నిర్దిష్ట కాలంలో తాము పూర్తి చేయగా వి.హెచ్.పి తలపెట్టిన యాత్ర ఓటు బ్యాంకు వృద్ధి చేసుకోవడానికీ, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికీ ఉద్దేశించినదని పరిక్రమ కమిటీ నాయకులే తీవ్ర విమర్శలకు దిగడంతో వి.హెచ్.పి యాత్ర ‘వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు’ అన్నట్లుగా మారింది.
పరిక్రమ కమిటీ పెద్దలే విమర్శించడంతో తమది పరిక్రమ యాత్ర కాదనీ, పధ యాత్రమేనని వి.హెచ్.పి చివరి నిమిషంలో సవరణలు ప్రకటించింది. అయినప్పటికీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. సాధువులు 200 నుండి 250 మందివరకూ మాత్రమే పాల్గొనే జన జాగరణ పధయాత్రను తాము తలపెట్టామని వి.హెచ్.పి ప్రకటించగా వెయ్యి మందికి పైగా అయోధ్యకు తరలివచ్చినవారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని బట్టి వి.హెచ్.పి ప్రకటన నిజం కాదని స్పష్టం అయిపోయింది. వి.హెచ్.పి నాయకులు గానీ, రాజకీయ నాయకులు గానీ పాల్గొనబోరని చెప్పిన యాత్రకు వి.హెచ్.పి అగ్రనాయకులైన అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలే హాజరై అరెస్టు కావడంతో అది కూడా అబద్ధమేనని తేలిపోయింది. వెరసి తాము నిర్వహించిన యాత్రను తామే ధైర్యంగా సమర్ధించుకోలేని పరిస్ధితిలోకి వి.హెచ్.పి నెట్టబడింది.
వెరసి బి.జె.పి ఓటు బ్యాంకు యాత్ర ప్రారంభంలోనే సంధి కొట్టింది. రానున్న పార్లమెంటు ఎన్నికలకు పైలట్ యాత్రగా పరిక్రమ యాత్రను, పైలట్ వాహనంగా వి.హెచ్.పి ని ముందుకు నెట్టిన ఆ పార్టీ ప్రచార రధసారధి పన్నిన వ్యూహం ఆ విధంగా ఆరంభంలోనే విఫలం అయింది. భవిష్యత్తులో ఇలాంటి జిమ్మీక్కులు ఎన్ని జరుగుతాయో, ఎన్ని విఫలం అయ్యి మరెన్ని సఫలం అవుతాయో చూడవలసి ఉంది.
