అవినీతికి హక్కు లేదా? -కార్టూన్


Right to own fuel

“మా సొంత ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా మాకు లేదా?”

సమాచార హక్కును ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ చట్టానికి తూట్లు పెట్టే కృషిలో నిమగ్నం అయింది. సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను అభినందించుకుంటుంది. ప్రజాస్వామ్య సూత్రాలకు తాను గొప్పగా కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి ఆర్.టి.ఐ చట్టాన్ని ఆ పార్టీ తరచుగా ఉదహరిస్తుంది. కానీ ఆ చట్టం ద్వారా పాలకుల అవినీతి వెల్లడి అవుతుండేసరికి రాజకీయ పార్టీలన్నీ స్వరం మార్చాయి. ఆర్.టి.ఐ చట్టం అభివృద్ధికి ఆటంకంగా పరిణమించిందని ప్రధాన మంత్రే స్వయంగా ప్రకటించే స్ధాయికి ఆర్.టి.ఐ చట్టం పట్ల పాలకుల శతృత్వం చేరుకుంది.

రాజకీయ పార్టీలన్నీ పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులను వినియోగిస్తున్నందున అవి కూడా పబ్లిక్ ఆధారిటీలేననీ కాబట్టి అవి కూడా తగిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో పాలక వర్గ పార్టీలు ఆర్.టి.ఐ అంటే మరింత కంపరం ప్రకటిస్తున్నాయి. ఒకరికొకరు మద్దతు ప్రకటించుకుంటూ నిధుల సేకరణ తమ హక్కుగా చేసుకోవడానికి చట్టానికి సవరణలు చేయడానికి పూనుకున్నాయి.

పార్టీల అంతర్గత నిర్ణయాలను కూడా ప్రజలకు చెప్పాలా అని సి.పి.ఎం లాంటి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కానీ రాజకీయ పార్టీలు ప్రజలకు ఏ విధంగా జవాబుదారీగా ఉండగలవో చెప్పడంలో అవి విఫలం అవుతున్నాయి. భారత దేశ రాజ్యాంగాన్ని కీర్తిస్తూ, వివిధ పాలక వ్యవస్ధలను ప్రజాస్వామిక సంస్ధలుగా అంగీకరిస్తున్నపుడు ఆ వ్యవస్ధల్లోని చట్టాలకు కట్టుబడి ఉండాలన్న ప్రాధమిక సూత్రం ఈ పార్టీలకు తెలియక కాదు. వీరికి వ్యవస్ధపై పోరాడుతున్నామన్న ప్రతిష్ట కావాలి. అదే సమయంలో వ్యవస్ధలో భాగస్వామ్యం కావడం ద్వారా వచ్చే దోపిడీ ఫలాలను ఆరగించే సౌకర్యమూ ఉండాలి. వీరి ద్వంద్వ స్వభావం ప్రజలు సరిగానే అర్ధం చేసుకుంటున్నారు.

దోపిడీ పాలక వర్గాల నిధులతో జల్సా చేస్తూ తేరగా ఆరగించి నునుపుదేలిన చట్ట సభ్యుడిని ఈ కార్టూన్ లో చూపించారు. సదరు సభ్యుడి విషపు నవ్వు ప్రత్యేకంగా గమనించదగినది. తాను చేస్తున్న వ్యాఖ్యలో ఎంత మోసం, గూఢార్ధం దాగి ఉన్నదో ఆ విషపు నవ్వు తెలియజేస్తోంది. సమాచార హక్కు ఉద్యమకారుల పట్ల వెటకారం, హేళన వ్యక్తం చేయడం కూడా అతని కళ్ళల్లో చూడవచ్చు.

వ్యాఖ్యానించండి