అయోధ్య రాజకీయం పట్ల వి.హెచ్.పిపై సాధువుల విమర్శలు


రామ మందిరం సమస్యను రాజకీయం చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ పై అయోధ్య సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఇప్పటికే తామందరమూ కలిసి పరిక్రమను ఇప్పటికే పూర్తిచేయగా పరిక్రమ పేరుతో మళ్ళీ కొత్త కార్యక్రమం చేపట్టం రాజకీయ లబ్ది పొందేందుకేనని వారు తీవ్రంగా విమర్శించారు. పరిక్రమ యాత్ర అంటూ కరపత్రాలు పంచి ఇప్పుడేమో పరిక్రమ కాదు పధ యాత్ర అంటూ మాట మార్చడంపైన వారు విరుచుకుపడ్డారు. భారత దేశ హిందువులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఫోజులు పెట్టే విశ్వ హిందూ పరిషత్, దాని సోదర సంస్ధలకు తాజా పరిణామం ఇబ్బందిగా మారింది.

“పరిక్రమ’ను యేటా నిర్వహించే కమిటీ అధిపతి మహంత జ్ఞాన దాస్ విశ్వహిందూ పరిషత్ ను విమర్శించడంలో ముందు పీఠిన నిలవడం విశేషం. సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోవడమే కాకుండా అత్యంత పవిత్రమైన కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ఉపక్రమించిందని జ్ఞాన దాస్ విమర్శించారు. “ప్రతి యేటా చైత్ర పూర్ణిమ నుండి వైశాఖ నవమి వరకు యాత్రను నిర్వహించడం సాంప్రదాయం. నా పదవ యేట నుండి నేను దీనిలో పాల్గొంటున్నాను. సాధువులు ఇప్పటికే సరైన సమయంలో దానిని ఇప్పటికే నిర్వహించారు. అసలు పరిక్రమ పూర్తయిపోయింది” అని మహంత జ్ఞాన దాస్ చెప్పారని ది హిందు తెలిపింది.

మహంత జ్ఞాన దాస్ అసలు విషయం చెప్పేయడంతో విశ్వహిందూ పరిషత్ దిద్దుబాటుకు దిగింది. తాము నిర్వహించింది పరిక్రమ కాదని పధయాత్ర మాత్రమేనని వి.హెచ్.పి ప్రతినిధి శరద్ శర్మ మాట మార్చారు. అసలు తాము పరిక్రమ అని చెప్పనేలేదని, సాధువులే దానిని ‘పరిక్రమ’గా తప్పు అర్ధం చేసుకున్నారని ఆయన ప్రకటించారు. పరిక్రమ వెళ్ళే మార్గం లోనే పధయాత్ర కూడా వెళ్లడంతో సాధువులు అలా తప్పుగా భావించారని శరద్ శర్మ నెపాన్ని సాధువుల పైకి నెట్టేశారు. “అది జన జాగరణ పధయాత్ర. 200 నుండి 250 వరకూ సాధువులు మాత్రమే అందులో పాల్గొంటారు. వి.హెచ్.పి కార్యకర్తలను గానీ, రాజకీయ నాయకులను గానీ దానికి ఆహ్వానించలేదు” అని శర్మ పత్రికలు తెలిపారు.

అయితే మహంత జ్ఞాన దాస్ మళ్ళీ నోరు విప్పారు. వి.హెచ్.పి నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆక్షేపించారు. తాను స్వయంగా హాజరయ్యాననీ, అక్కడ వి.హెచ్.పి నాయకులు కూడా ఉన్నారనీ, కరపత్రంలో కూడా పరిక్రమగానే వారు ప్రచారం చేశారని ఆయన వెల్లడించారు. “పరిక్రమగా తప్పు అర్ధం చేసుకున్నారని ఇప్పుడు చివరి నిమిషంలో వారు చెబుతారా? దానిని పరిక్రమ అని చెబుతూ వారే కరపత్రాలు పంపారు కదా? నేనూ ఆ సమావేశానికి హాజరయ్యాను. (విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు) అశోక్ సింఘాల్ కూడా అక్కడే ఉన్నారు” అని మహంత జ్ఞాన దాస్ తెలిపారు. వి.హెచ్.పి తలపెట్టిన యాత్ర మార్గం పట్ల కూడా జ్ఞాన దాస్ అభ్యంతరం తెలిపారు.

మతపరంగా సున్నితమైన ప్రాంతాల గుండా యాత్ర వెళ్ళేలా రూపొందించారని, ముస్లింలు నివసించే ప్రాంతాల గుండా యాత్రను తీసుకెళ్లి మతపరమైన ప్రశాంతతను చెడగొడుతున్నారని ఇతర సాధువులు ఆక్షేపించారు. “ఓటర్లను చీల్చి లబ్ది పొందడానికీ, మత సామరస్యతను దెబ్బ తీయడానికి” ప్రయత్నం చేస్తున్నారని సరయూ కుంజ్ ఆలయం ప్రధాన పూజారి జుగల్ కిషోర్ శరణ్ శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆలయం బాబ్రీ మసీదుకు సమీపంలోనే ఉండడం ఒక విశేషం కాగా కిషోర్ శరణ్ శాస్త్రి వి.హెచ్.పి మాజీ నాయకులు కావడం మరో విశేషం. “తమ సొంత ప్రయోజనాల కోసం హిందువులకు చెడ్డపేరు తేవడానికి వి.హెచ్.పి సిద్ధపడింది. కానీ అయోధ్య ప్రజలు వారి పధకాలను అర్ధం చేసుకున్నారు. అందుకే వారు స్పందించలేదు” అని కిషోర్ శాస్త్రి వ్యాఖ్యానించారు.

గత 20 యేళ్లలో వి.హెచ్.పి అయోధ్య హిందువులలో మద్దతు కోల్పోయిందని కిశోర్ శరణ్ తెలిపారు. కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసం ఉన్నవారు మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని కిషోర్ శరణ్ కుండబద్దలు కొట్టారు. “మత సామరస్యాన్ని వి.హెచ్.పి దెబ్బతీయడానికి అనుమతించనందుకు అయోధ్య ప్రజలను అభినందించాలి. శాంతిని కోరుకునే అయోధ్య ప్రజలు మతసామరస్యం ఎంతో ప్రియమని గుర్తించారు” అని కిషోర్ శరణ్ వ్యాఖ్యానించారు. అయితే వివాదం రేకెత్తించడంలో వి.హెచ్.పి సఫలం అయినందున యాత్రను రాజకీయం చేయడంలో ఒక విధంగా సఫలం అయినట్లేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

వి.హెచ్.పి తలపెట్టిన “చౌరాసి కోస్ పరిక్రమ” యాత్రను సాగనీయకుండా గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా యు.పి ప్రభుత్వం శ్లాఘనీయమైన కృషి చేసిందని వి.హెచ్.పి విమర్శకులు, సాధువులు ప్రశంసలు కురిపించారు. ఆరు జిల్లాల్లో 144 సెక్షన్ విధించడమే కాక, యాత్ర ముగిసే తేదీ అయిన సెప్టెంబరు 13 వరకూ అది కొనసాగుతుందని యు.పి ప్రభుత్వం ప్రకటించింది. వి.హెచ్.పి నాయకులు అయోధ్య ప్రవేశించకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రవీణ్ తొగాడియా అయోధ్య ప్రవేశించడంపై పత్రికలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. కాగా బి.జె.పి, ఎస్.పి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ జరిపి పరస్పర ప్రయోజనాల నిమిత్తం నాటకాన్ని రక్తి కట్టించారనీ, ఆగస్టు 17 తేదీన ములాయం-అశోక్ సింఘాల్ ల మధ్య పరస్పర అవగాహన కుదరడం వల్లనే ప్రవీణ్ తొగాడియా అయోధ్య ప్రవేశించగలిగారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

2 thoughts on “అయోధ్య రాజకీయం పట్ల వి.హెచ్.పిపై సాధువుల విమర్శలు

  1. ప్రజలు అనేక సమస్యల్లొ ఉంటె వీళ్ల వోట్ల గొల వీళ్లది. వీరి బూజు పట్టిన మత రాజకీయలాను అర్థం చెసుకునే స్ధితి లో ప్రజలు ఉన్నారు. ప్రజలకి సంతి కావాలి. తమ కనీస అవసరాలు కావాలి. వీళ్లని నమ్మె స్తితిలొ జనం లేరు. వి.హెచ్.ఫి. తన లక్ష్యం ఎన్నటికీ సాధించలేదు.

వ్యాఖ్యానించండి