“నేను మీకు పాత పేపర్ ఏమీ అమ్మలేదు. కావాలంటే తేదీ చెక్ చేసుకోండి!”
–
సాధారణంగా వార్తా పత్రికలు ఒక వార్తను తామే ముందు ఇవ్వడానికి పోటీ పడుతుంటాయి. ఫలానా వార్త మేమే ముందు ఇచ్చాం అని కొన్నిసార్లు చెప్పుకుంటుంటాయి. తద్వారా వేగంగా వార్తలు అందించే యంత్రాంగం తమ వద్ద ఉన్నదని చెప్పుకుని సర్క్యులేషన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో పత్రికలకు అలాంటి అవకాశం లేకుండా పోతోంది. ఫ్రంట్ పేజీ వార్తలన్నీ చద్ది వార్తలుగానే కనిపించడం దానికి కారణం అని ఈ కార్టూన్ సూచిస్తోంది. అది నిజం కూడాను.
ఉదాహరణకి ఈ వార్తలు చూడండి.
పార్లమెంటు ఉభయ సభల్లో రగడ!
ఫలానా కుంభకోణంపై అట్టుడికిన పార్లమెంటు!
పార్లమెంటు వాయిదా!
పెట్రోలు ధరల పెంపు!
రికార్డు స్ధాయికి రూపాయి పతనం!
సరిహద్దులో చైనా చొరబాటు!
సరిహద్దులో పాక్ సైనికుల కాల్పులు!
కాశ్మీరులో టెర్రరిస్టుల చొరబాటు!
పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన!
సరిహద్దులో జవాన్ల హత్య!
సీమాంధ్ర ఉద్యమ హోరు! (లేదా) రగులుతున్న సీమాంధ్ర (లేదా) …..
హైద్రాబాద్ ని వదులుకోం! (లేదా) హైద్రాబాద్ మాదే! (లేదా) రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం! (లేదా) సీమాంధ్ర మంత్రులు/నాయకులు ఢిల్లీ పయనం (లేదా) ….
ఇంకా ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో….
ఫలితంగా ఏ రోజు చూసినా ఫ్రంటు పేజీ వార్తలన్నీ చద్ది వార్తలుగానే కనిపిస్తే అందులో ఆశ్చర్యం ఏముంది?
