చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన


చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న డి.బి.ఓ సెక్టార్ కు సమీపంలోనే ఈ విమాన తలం ఉండడం విశేషం.

భారత వాయుసేనలో C-130J యుద్ధ విమానం ఒక ముఖ్యమైన భాగం. సైనికులను పెద్ద సంఖ్యలో అవసరమైన చోటుకు చేరవేసే ఈ విమానం పేరు ‘సూపర్ హెర్క్యులస్.’ కాగా లడఖ్ లోని డి.బి.ఓ సెక్టార్ లో మళ్ళీ వినియోగంలోకి తెచ్చిన రన్ వే పాకిస్ధాన్ తో యుద్ధం కాలంలో మాత్రమే వినియోగించినది. యుద్ధం తర్వాత ఈ రన్ వే ను మళ్ళీ వినియోగించలేదు. గత ఏప్రిల్ నెలలో డి.బి.ఓ సెక్టార్ లోని భారత భూభాగం లోపలికి 20 కి.మీ మేర 50 మంది చైనా సైనికులు చొచ్చుకుని వచ్చి మూడు వారాల పాటు శిబిరాలు నిర్వహించాయి. ఈ మూడు వారాల పాటు భారత దేశంలో చైనా వ్యతిరేక భావోద్వేగాలు మరోసారి పెచ్చరిల్లిన సంగతి తెలిసిందే. 2008లో మళ్ళీ లడఖ్ రన్ వే కు మరమ్మతులు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చినట్లు తెలుస్తోంది.

భారీ సంఖ్యలో సైనికులను మోసుకెళ్లే విమానాన్ని ఇక్కడ దించడం అంటే భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వడమేనని, అవసరం అయితే పెద్ద సంఖ్యలో సైనికులను తరలించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు పరోక్షంగా హెచ్చరించడమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సైనికులు, సరఫరాలు తరలించగలమని భారత వాయుసేన ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లేనని వారి అభిప్రాయం. ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. లడఖ్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కొండలపైన విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు నైతిక స్ధైర్యమ్ అందించే ఉద్దేశ్యం కూడా ఈ ‘సూపర్ హెర్క్యులస్’ టచ్ డౌన్ వెనుక ఉన్నదని భావిస్తున్నారు.

“ఒక సి-130జె సూపర్ హెర్క్యులస్ విమానం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వైమానికతలం (airstrip) పైన మంగళవారం ఉదయం 6:54 గంటలకు దిగింది. కమాండింగ్ అధికారి, గ్రూప్ కెప్టెన్ తెజ్బీర్ సింగ్, ‘వీల్డ్ వైపర్స్’ (స్క్వాడ్రన్ పేరు) సిబ్బంది, ఒక సీనియర్ అధికారితో సహా 16614 అడుగుల (5065 మీ) ఎత్తున అక్సాయ్ చిన్ ప్రాంతం, డి.బి.ఓ సెక్టార్ లోని ఈ వైమానికతలం పైన దిగారు” అని ఐ.ఏ.ఎఫ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొందని ది హిందూ మంగళవారం తెలిపింది.

“ఈ పెరిగిన ఎయిర్ లిఫ్ట్ సామర్ధ్యం ద్వారా, భూతల సైనికుల అవసరాలను తీర్చడానికి మరింత మెరుగైన స్ధితిలో ఉన్నామని ఐ.ఎ.ఎఫ్ చాటి చెప్పింది. నివాసయోగ్యం కాని అత్యంత ఎత్తైన ఈ ప్రాంతంలో స్ధిరమైన పరిస్ధితి కోసం ఇన్నాళ్లూ వాయు ప్రయాణం పైనే ఆధారపడ్డాం” అని ఐ.ఎ.ఎఫ్ ప్రకటన పేర్కొంది. ది హిందు పత్రిక ప్రకారం ప్రత్యేక కార్యకలాపాల నిమిత్తం వినియోగించే ఈ విమానం బలగాలను త్వరితగతిన చేర్చగల సామర్ధ్యం కలిగినది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితుల్లోనూ ఇది ప్రయాణించగలదు. పై నుండి అవసరమైన సరఫరాలను కిందికి జారవేయగల సామర్ధ్యం కూడా దీనికి ఉన్నది. విమానం దిగడానికి అనువుగా లేని మరియు పాక్షికంగా అనువుగా ఉన్న ప్రాంతంలో కూడా ఈ విమానం దిగగలుగుతుంది.

“అత్యంత ఎత్తైన ప్రాంతంలో విమానాన్ని దించిన ప్రపంచ రికార్డుకు కూడా ఈరోజు మేము సాధించిన విజయం అర్హమైనది.” అని ఐ.ఎ.ఎఫ్ ప్రకటన పేర్కొన్నది. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో కూడా బాధితుల రక్షణకు ఈ విమానం సేవలు అందించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లోని ధరసు ప్రాంతం నుండి బాధితులను బైటికి తరలించడానికి ఇదే విమానం, ఇదే సిబ్బంది పని చేశారని పత్రిక తెలిపింది. 1965 నాటి పాకిస్ధాన్ యుద్ధం తర్వాత 2008లో లడఖ్, డి.బి.ఓ సెక్టార్ లోని వైమానిక తలానికి మరమ్మతులు చేశారు. 2008లో చండీఘర్ నుండి ఆంటోనోవ్-32 విమానాన్ని ఇక్కడ దించినప్పటి నుండి ఈ వైమానిక తలానికి ప్రాముఖ్యత పెరిగిందని ఐ.ఎ.ఎఫ్ తెలిపింది.

ఐ.ఎ.ఎఫ్ చర్యను ‘గణనీయమైన సామర్ధ్య ప్రదర్శన’గా రక్షణ మంత్రిత్వ శాఖ కొనియాడింది. “సి-130జె విమానం డి.బి.ఒ సెక్టార్ లో ల్యాండింగ్ కావడం ఎత్తుగడల రీత్యా చిన్న చర్యే. కానీ వ్యూహం రీత్యా భారీ ప్రభావాన్ని పడవేస్తుంది” అని మాజీ వాయుదళ అధికారి ఒకరు వ్యాఖ్యానించారని హిందూస్ధాన్ టైమ్స్ తెలిపింది.

భారత సైనిక సామర్ధ్యం సంగతి ఎలా ఉన్నా, సరిహద్దులో మెల్ల మెల్లగా ఉద్రిక్తతలు చెలరేగడం భారత ప్రజలు గమనించవలసిన విషయం. ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల ప్రజలకు ఎలాంటీ ప్రయోజనాలు చేకూర్చేవి కావు. పైగా నష్టకరం. ఇంకా నిర్ణయం కానీ సరిహద్దు రేఖలపై చర్చలు జరిపి పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా నిశ్చిత సరిహద్దులపై ఒక ఒప్పందానికి రావడం మాని ఉద్రిక్తతలు తలెత్తడానికే ఇరు పక్షాల పాలకులు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.

డి.బి.ఒ సెక్టార్ లోనూ, దాని చుట్టుపక్కలా గత కొన్ని యేళ్లుగా భారత ప్రభుత్వం సైనిక వసతులను మెరుగుపరుస్తూ వచ్చింది. బంకర్లు నిర్మించడం, సి.సి.కెమెరాలను అమర్చడం వంటివి. డి.బి.ఒ సెక్టార్ వైమానిక తలానికి మరమ్మతులు వినియోగంలోకి తేవడం కూడా ఆ చర్యల్లో భాగమే. హిందూస్ధాన్ టైమ్స్ ప్రకారం ఇలాంటి వైమానిక తలాలను ఈ ప్రాంతంలో కనీసం మూడింటిని భారత్ వినియోగంలోకి తెచ్చింది. డి.బి.ఒ సెక్టార్, ఫుక్చేలలోని వైమానిక తలాలను మూసివేయాలని చైనా కొన్నేళ్ళుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే భారత పాలకులు దానిని పట్టించుకోలేదు. పత్రికల ప్రకారం ఈ చర్యలకు ప్రతిగానే చైనా సైనికులు గత ఏప్రిల్ లో డి.బి.ఒ సెక్టార్ లోకి చొచ్చుకు వచ్చారు. సి-130జె విమానాలు ఆరింటిని భారత్ 2008లోనే అమెరికా నుండి కొనుగోలు చేయడం గమనార్హం. తనకు ప్రయోజనాలు లేకుండా అమెరికా ఇటువంటి ఆయుధ అమ్మకాలు చేపట్టదు.

‘ఆసియా పివోట్’ విధానాన్ని బారక్ ఒబామా ప్రకటించిన నేపధ్యంలో ఈ ఉద్రిక్తతలు ప్రజలకు మరింత నష్టాన్ని తెస్తాయి. చైనాను సైనికంగా చుట్టుముట్టిన అమెరికా తన చైనా వ్యతిరేక వ్యూహంలో భారత్ పాత్రను పెంచుతోంది. తద్వారా అమెరికా పాలకుల చైనా వ్యతిరేక ప్రయోజనాలను భారత పాలకుల పైన రుద్దుతోంది. దీనిని భారత పాలకులు ప్రతిఘటించకపోగా అమెరికా ఆదేశాలు పాటిస్తున్నట్లే కనిపిస్తోంది. ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికాకు భాగస్వామిగా చేరి ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీసుకున్న పాక్ పాలకులకు మల్లే భారత పాలకులు వ్యవహరించడానికి భారత ప్రజలు అవకాశం ఇవ్వరాదు. ఇచ్చినట్లయితే పాక్ ప్రజలకు మల్లే భారత ప్రజల జీవన పరిస్ధితులు కూడా అనేక దశాబ్దాలు వెనుకకు ప్రయాణించడం తధ్యం.

One thought on “చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన

వ్యాఖ్యానించండి