దాదాపు 80,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వికారమైన మలుపు తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుంభకోణాన్ని విచారిస్తున్న సి.బి.ఐకి అవసరమైన ఫైళ్ళు బొగ్గు శాఖ ఇవ్వనే లేదు. ఈ విషయాన్ని సి.బి.ఐ కోర్టుకి ఫిర్యాదు చేస్తే కోర్టు తీసిన ఆరాలో ప్రభుత్వంగా చల్లగా చెప్పిన సంగతి ఏమిటంటే సంబంధిత ఫైళ్ళు కనపడడం లేదట. ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ విషయంపైన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఈ అఫిడవిట్ సమర్పించగా అందులో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెల్లడయ్యాయి. కుంభకోణం జరిగిందని రుజువు చేసే ఏ ఫైలూ కనపడడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దానితో ఉభయ సభల్లో సరికొత్త నాటకానికి తెరలేచింది.
బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి 257 దస్త్రాలు (ఫైళ్ళు) కావాలని సి.బి.ఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇవేవీ కనపడడం లేదని ప్రభుత్వం చెప్పడడంతో సి.బి.ఐ విచారణ ఆగిపోయింది. 1993-2004 మధ్యలో జరిగిన బొగ్గు కేటాయింపుల దస్త్రాలు కనపడడం లేదని ప్రభుత్వం మొదట చెప్పింది. ఈ కాలంలో 45 బొగ్గు బ్లాకులు వివిధ కంపెనీలకు కేటాయించారు. అయితే 2006-09 కాలంలో జరిగిన కేటాయింపులకు సంబధించిన దస్త్రాలు కూడా కనపడ్డం లేదని తాజాగా చెబుతోంది. ఈ కాలానికి సంబందించిన అక్రమ కేటాయింపులపై సి.బి.ఐ 13 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసింది. దస్త్రాలు మాయం కావడంతో ఈ కేసుల్లో ఇక విచారణ ఆగిపోయినట్లే.
“బొగ్గు కుంభకోణానికి సంబంధించి దస్త్రాలు కావాలంటు మేము మే నెలలో ప్రభుత్వాన్ని కోరాము. వారి నుండి మాకు ఇంతవరకు ఏ స్పందనా రాలేదు” అని సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. 2006-09 కేటాయింపులకు సంబంధించి దస్త్రాలు అందకపోవడంతో తాము దాఖలు చేసిన 13 ఎఫ్.ఐ.ఆర్ ల విషయంలో కేసుల పరిశోధన పూర్తిగా ఆగిపోయిందని సి.బి.ఐ వర్గాలు తెలిపాయి. ఈ కేటాయింపుల వల్ల లబ్ది పొందిన వివరాలన్నీ ఈ దస్త్రాల్లో ఉన్నాయని దానితో పరిశోధన ముందుకు సాగడం అసాధ్యం అనీ వారు తెలిపారు.
బొగ్గు కేటాయింపుల కోసం లబ్దిదారులు తమ తమ దరఖాస్తుల్లో పూర్తిగా అబద్ధాలు పొందు పరిచారనీ, కాబట్టి వాటి ఆధారంగా జరిగిన కేటాయింపులు అక్రమమనీ ఆరోపణలు వచ్చాయి. కేటాయింపుల సమయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఎటువంటి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించలేదనీ, నచ్చినవారికి నచ్చినట్లు గనులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెట్టాయి. ఈ ఆరోపణలపై జరుగున్న సి.బి.ఐ విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. ఏ కంపెనీకి ఎందుకు, ఎన్ని బ్లాకులు కేటాయించిందీ తెలుసుకోవాలంటే దస్త్రాల పరిశీలన తప్పనిసరి. లబ్దిదారులు తమ దరఖాస్తుల్లో పొందుపరిచిన అంశాలు వాస్తవమో కాదో పరిశోధించి, దాని ఆధారంగా కేటాయింపులు అక్రమమో, సక్రమమో సి.బి.ఐ తేల్చాల్సి ఉన్నది. అసలు దస్త్రాలే మాయం కావడంతో ఇక సి.బి.ఐ పరిశోధించడానికి ఏమీ లేనట్లే.
బొగ్గు గనుల అక్రమ కేటాయింపులే ఒక భారీ కుంభకోణం కాగా సదరు కేటాయింపుల దస్త్రాల మాయం మరో భారీ కుంభకోణం! అక్రమ కేటాయింపుల్లో కేవలం యు.పి.ఏ ప్రభుత్వం మాత్రమే దోషి కాదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం కూడా దోషియే. కాబట్టి దస్త్రాల మాయం వల్ల లబ్ది దారులు పాలక పక్షంలోనూ ఉన్నారు, ప్రతిపక్షంలోనూ ఉన్నారు. ఇరు పక్షాలు కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ వారికి సేవలు చేసేవే. కాబట్టి ఇప్పటి దస్త్రాల మాయంలో కేవలం పాలక పక్షాన్ని మాత్రమే తప్పు పట్టడానికి వీలు లేదనీ, ఈ కుంభకోణంలో ప్రతిపక్షాలు కూడా కుమ్మక్కయ్యాయనీ, జనాన్ని వెర్రిబాగులోళ్లను చేయడం కోసం ఉభయ సభల్లో విమర్శ-ప్రతివిమర్శల నాటకాలు ఆడుతున్నారనీ స్వతంత్ర పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేటాయింపులు జరిగిన దస్త్రాలు మాత్రమే మాయలు కాలేదు. కేటాయింపులు జరగని దస్త్రాలు కూడా మాయం అయ్యాయట. అంటే కేటాయింపులు నిరాకరించడానికి గల కారణాలు కూడా సి.బి.ఐ తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇప్పటి వరకూ తమకు అవసరమైన 257 దస్త్రాలు కనపడడం లేదని చెబుతున్నారనీ, నిజానికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనీ సి.బి.ఐ చెబుతోంది. అయితే బొగ్గు కుంభకోణాన్ని బైటపెట్టింది కాగ్ సంస్ధ. కాబట్టి కాగ్ వద్ద కొన్ని దస్త్రాలు దొరికి అవకాశాలు లేకపోలేదు. సి.బి.ఐ ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అయితే కాగ్ దస్త్రాలు సి.బి.ఐ పరిశోధనకు ఎంతవరకు దోహదపడేదీ తేలాల్సి ఉంది.
పార్లమెంటు వేదికగా జరుగుతున్న నాటకంలో ప్రస్తుతం ప్రతిపక్ష బి.జె.పి ఆదేశాలు ఇచ్చేవారయితే వాటిని పాటించే పాత్రలో పాలక కాంగ్రెస్ జీవిస్తోంది. తెరవెనుక మాత్రం వీరిద్దరూ విలన్లేనని జనం గ్రహించాల్సిన అసలు నిజం.
చట్టాల నుండీ, విచారణల నుండీ తప్పించుకోడానికి ధనిక వర్గాలకు ఎన్ని మార్గాలు ఉన్నాయో కదా!

బాధ్యత లేని పాలకులు. బరువుతెలియని ప్రజలు.
‘ తవ్వి నా చూపించేది, ‘ మసి పూసిన ‘ దస్త్రాలే కదా !