అసరం బాపు అసలు రూపు ఇదీ!


Asaram Bapu

అసరం బాపు గుర్తున్నాడా? గత డిసెంబర్ నెలలో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య నోరు పారేసుకున్న బాబా!. అత్యాచారంలో నిర్భయ తప్పు కూడా ఉన్నదనీ, తనపై లైంగిక దాడి చేసినవారిని ఆమె ‘అన్నా, తమ్ముడూ’ అని వేడుకుని ఉంటే వారాపనికి దిగి ఉండేవారు కాదనీ, ఆ విధంగా ఆమె గౌరవం (ఆయన ఉద్దేశ్యం శీలం అని) కాపాడబడి ఉండేదనీ కూసిన మహా ‘పురుషుడు’! అంతటితో ఆగాడా? “రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు కదా?” అని అదేదో గొప్ప సత్యం కనిపెట్టిన దేవదేవుడిలా ఫోజు పెట్టిన పెద్ద మనిషాయన! ఒక పాఠశాల బాలికపైన ఆయన అత్యాచారం చేసినట్లు ఢిల్లీల్లో కేసు నమోదయ్యిందివాళ. 15 యేళ్ళ బాలికకు తన వయసుకు దాదాపు ఐదు రెట్లు వయసున్న దేవుడి గారిని ‘అన్నయ్యా’ అని వేడుకోవాలని ఎలా తెలుస్తుంది? తెలియక తాతగారితో ‘చేయి కలిపి’ ‘గౌరవా’న్ని పోగొట్టుకుంది.

రాజస్ధాన్ లోని జోధ్ పూర్ కి చెందిన 15/16 యేళ్ళ బాలిక, ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. రాజస్ధాన్ లో అయితే కేసు తొక్కిపెడతారన్న ఉద్దేశ్యంతో బాలిక తండ్రి ఢిల్లీ వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం సంఘటన జోధ్ పూర్ లో జరిగింది కాబట్టి కేసును అక్కడికే బదిలీ చేస్తామని చెబుతున్నారు. బాలిక తండ్రి ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ట్రాన్స్ పోర్టర్ గా పని  చేస్తున్నాడు. సంఘటన జరిగిన జోధ్ పూర్ లో గానీ, షాజహాన్ పూర్ లో గానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. మళ్ళీ కేసు జోధ్ పూర్ కే బదిలీ చేస్తే న్యాయం జరుగుతుందా?

ఇండియా టుడే పత్రిక ప్రకారం అసరం బాపు ఏదో మతపరమైన కార్యక్రమం ఉందని చెప్పి బాలికను ఆశ్రమానికి పిలిపించాడు. బాలిక తల్లిదండ్రులు అసరం బాపుకి మా చెడ్డ భక్తులు. దానితో బాలిక బాపు పిలిచినట్లే ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ బాలికపైన బాపు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆగస్టు 17 తేదీన బాలిక ఈ విషయం తన ఇంట్లో చెప్పింది. వెంటనే జోధ్ పూర్, షాజహాన్ పూర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చెయ్యడానికి పోతే వారు తీసుకోలేదు. ఆ సమయానికి అసరం బాపు ఢిల్లీలో మూడు రోజుల క్యాంపు నిమిత్తం వచ్చాడట. ఆయన్నే అడుగుదామని పోతే వాళ్ళని కలవడానికి బాపు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కమలా మార్కెట్ స్టేషన్ లో బాలిక ఫిర్యాదు చేసింది.

ఢిల్లీ పోలీసులు బాలికను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. బాలిక పైన అత్యాచారం జరిగిన మాట వాస్తవమేనని డాక్టర్లు అక్కడ ధృవీకరించారు. దానితో పోలీసులు వివిధ సెక్షన్ల క్రింద అసరం బాపు పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 (అత్యాచారం) సెక్షన్ 509 (అసభ్య సైగలు, మాటలు మొదలయిన చర్యలు), సెక్షన్ 352 (లైంగిక దాడి)… ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పిల్లలపై లైంగిక అత్యాచారాల నిరోధక, రక్షణ చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అసరం బాపును ఎవరూ ఇంకా ఏమీ అడిగినట్లు లేదు. ఉత్తర భారతంలో అసరం బాపుకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందట. అందుకని పోలీసులు ఆచితూచి అడుగు వేస్తున్నారట. ఆచితూచి అడుగు వేయడం అంటే ఫిర్యాదు తీసుకోకపోవడం, మా పరిధిలోనిది కాదని మళ్ళీ ఫిర్యాదు తీసుకోనివారి వద్దకే ఫిర్యాదు బదిలీ చేయడం… ఇలాంటివేనా?

అనేక లీలలు

అసరం బాపు పైన ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. హత్య, హత్యా ప్రయత్నం, భూ ఆక్రమణ కేసులు ఆయనపై ఉన్నా ఆయన మహిమలు మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ లో ఆయన తన అనుచరుడు రాజు చందక్ ని హత్య చేయడానికి ప్రయత్నించాడని కేసు నమోదయింది. 2009లో సబర్మతి వద్ద ఇద్దరు వ్యక్తులు రాజు పైన కాల్పులు జరిపారు. ఆయన ఎలాగో బతికి బైటపడి బాపు ఆదేశాలతోనే తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి కేసు నడుపుతున్నారు.

2010లో అహ్మదాబాద్ లో బాపు ఆక్రమించిన దాదాపు 67 వేల ఎకరాల భూమిని గుజరాత్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో గుజరాత్ సి.ఐ.డి వాళ్ళు అసరం బాపు ఆశ్రమంలోని ఇద్దరు బాలుర హత్య కేసులో ఆశ్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. హత్య జరిగింది 2008లో. ఆశ్రమం నిర్వహిస్తున్న పాఠశాలలో బాలురు చదువుకునేవారు. వారి శవాలు ఒక రోజున సబర్మతి నది ఒడ్డున ప్రత్యక్షం అయ్యాయి. జనం పెద్ద ఎత్తున ఆందోళన చేశాక కేసును సి.ఐ.డికి అప్పగించారు. వారు పరిశోధించి ఏడుగురు ఆశ్రమ నిర్వాహకులపై కేసు హత్య కేసు నమోదు చేశారు.

మధ్య ప్రదేశ్ లో 700 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఆక్రమించుకున్నందుకు ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు’ వాళ్ళు ఆయనపైన మొన్న జనవారిలోనే కేసు పెట్టారు. జయంత్ విటమిన్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 200 ఎకరాల స్ధలాన్ని బాపు ఆశ్రమం పేరుతో ఆక్రమించుకున్నారు. ఢిల్లీ-పూణే సరుకు రవాణా రహదారిపై ఉన్న ఈ స్ధలం కోట్లు పలకడంతో దాన్ని ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మరో హత్య కేసు అసరం బాపు పైన నమోదయ్యింది. జబల్ పూర్ లోని ఆయన ఆశ్రమంలో పని చేసే 24 యేళ్ళ రాహుల్ పచౌరీ అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయాడు. అతనికి విషం ఇచ్చి చంపారని ఆయన తండ్రి చెబుతున్నాడు. ఆశ్రమం వాళ్ళు కల్తీ మందులు అమ్ముతున్న సంగతి తన కుమారుడుకి తెలిసిందనీ, విషయం బైటికి పొక్కుతుందన్న భయంతో తన కుమారుడిని చంపేశారని రాహుల్ తండ్రి ‘టైమ్స్ నౌ’ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారని ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది.

ఇక ఆగస్టు 2013కి వచ్చేసరికి బాలికపై అత్యాచారం. అత్యాచారం ఒక ఘోరం అయితే ఫిర్యాదు తీసుకోకపోవడం ఇంకో ఘోరం. అత్యాచారం నేరం జరిగినప్పుడు ఏం చేయాలో స్పష్టమైన ఆదేశాలు నిర్భయ దుర్ఘటన జరగడానికి ముందే పోలీసులకు ఉన్నాయి. ముఖ్యంగా నేరస్ధులు తప్పించుకోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఫోరెన్సిక్ జాగ్రత్తల విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు, సూత్రాలు ఉన్నాయి. అవసరమైన శాంపిల్స్ సేకరించడం, వాటిని తగిన జాగ్రత్తలతో భద్రపరచడం మొ.నవి అందులో ఉన్నాయి. నిర్భయ దుర్ఘటన జరిగిన తర్వాత మరిన్ని ఆదేశాలు, జాగ్రత్తలు, సెక్షన్లు అమలులోకి వచ్చాయి. అయినా పోలీసుల తీరు మారలేదంటే ఎవరిని వేలెత్తి చూపాలి? ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడం అంటే మరొక విధంగా నేరాన్ని రుజువు చేయడానికి గల అవకాశాలాను కూడా రూపుమాపడమే. సమయం గడిచేకొద్దీ తీసుకోవాల్సిన శాంపిల్స్ అందుబాటులో లేకుండా పోతాయి. ఆ విధంగా దోషులు సాక్ష్యాలు లేనందుకు నిర్దోషులుగా విడుదల అవుతారు. ఈ సంగతి పోలీసులకు తెలియక కాదు. నిజానికి తెలిసే ఆ అవకాశం నేరస్ధులకు ఇస్తున్నారని అనుమానించవలసివస్తోంది.

4 thoughts on “అసరం బాపు అసలు రూపు ఇదీ!

  1. భారత దేశం పుణ్య భూమి !
    బాబాలెవరూ నష్టపోరిక్కడ !
    వారి పెట్టుబడి కేవలం ‘భజనే’ !
    కానీ , ఎకరాలూ , ఆస్తులూ కూడ బెడతారు,నికరం గా !
    భక్తులంతా చూసుకుంటారు వారిని, కనికరంగా !
    వారి నిఘంటువు లో’ పేదరికం’ ,’ ఆకలి’ ఉండవు !
    మరి నిరుద్యోగులెందుకు బాబాలవడం లేదో ?!
    మత వాదం ముందు హేతువాదం దిగదుడుపే !
    దభాల్కర్ హతుడయ్యాడు !
    అసారాం ఇప్పటికీ ‘పూజ్య బాపూ ‘నే !
    ఎంతైనా భారత దేశం పుణ్య భూమి !

  2. విశ్వాసం, విజ్ఞానాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సంగ్రామంలో మరో వైజ్ఞానిక ఉద్యమకారుడు నేలకొరిగాడు. ప్రముఖ సంఘ సంస్కర్త, అంధ విశ్వాసాల వ్యతిరేక ఉద్యమకారుడు డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌ను మంగళవారం పూణెలో ముష్కరులు కాల్చి చంపడం ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మూఢ నమ్మకాలకు, అమానవీయ ఆచారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న దభోల్కర్‌ను హత్య చేయడంపై ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనాయి. క్షుద్ర తాంత్రికులు, దొంగ బాబాల మోసాలకు అనునిత్యం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలవుతున్న అమాయక ప్రజలను సంరక్షించేందుకు ఉద్దేశించిన ‘అంధ విశ్వాసాల వ్యతిరేక’ చట్టం కోసం ఆయన ఏళ్ళతరబడి పోరాడుతూ వచ్చారు.

    బాలిక తల్లిదండ్రులు అసరం బాపుకి మా చెడ్డ భక్తులు. కనుకనే అసరం బాపు ‘ అవసరం ‘ తీర్చుకో గలిగాడు.

    ” ఇది ఆంధ్ర జ్యోతి సంపదకీయం లోని ఒక పేరా”

వ్యాఖ్యానించండి