పతనం: రూపాయి vis-à-vis ఉపగ్రహం -కార్టూన్


Sa Tellite Lunch vehicle

ఈ లోపు, మరో శాటిలైట్ లంచ్ వెహికల్:

ఒక వార్త: సోమవారం ఏకంగా 148 పైసలు పతనమై డాలర్ తో మారకపు విలువ 63 రూపాయల మార్కు దాటిన రూపాయి విలువ మంగళవారం మరో కొత్త పతన స్ధాయిని నమోదు చేసింది. నిన్న 63.13 రు.ల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ రోజు ట్రేడింగ్ ఎత్తుకోవడంతోనే 63.75 రు.ల వద్ద ఎత్తుకుంది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ అదింకా పతనమై డాలర్ ఒక్కింటికి రు. 64.11 పై.ల వద్ద కొట్టుకులాడుతోంది. కారణాలు షరా మామూలే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన 85 బిలియన్ డాలర్ల నెలసరి ఉద్దీపన పధకాన్ని ఉపసంహరించుకుంటుందేమోనన్న భయంతో ఎఫ్.ఐ.ఐ లు బైటికి వెళ్లిపోతున్నాయి; కరెంటు ఖాతా లోటు పెరుగుతుందన్న భయంతో షేర్ మార్కెట్లు పతనం అవుతున్నాయి; డాలర్ల కొనుగోళ్ళు పెరిగిపోతున్నాయి; రూపాయి అమ్మకాలు పెరిగిపోతున్నాయి; వెరసి రూపాయి విలువ ఇంకా ఇంకా పతనం అవుతోంది.

మరో వార్త: ఆగస్టు 19 తేదీన అనగా సోమవారం GSAT-14 కమ్యూనికేషన్ శాటిలైట్ ను కక్ష్య లోకి ప్రవేశ పెట్టాల్సిన GSLV-D5 ప్రయోగం చివరి గంటలో వాయిదా పడిపోయింది. శాటిలైట్ ప్రయోగం ప్రయాణంలోని రెండో దశలో ఉపగ్రహాన్ని మరింత పైకి నెట్టడానికి ఉపయోగపడాల్సిన ద్రవ ఇంధనం లీక్ అవుతున్నట్లు గ్రహించడంతో శాటిలైట్ ప్రయోగాన్ని ఒక గంటా పది నిమిషాల ముందు రద్దు చేసి, వాయిదా వేసుకున్నారు. ఇంధనం ఎందుకు లీక్ అయిందో ఇంకా తెలియలేదు. ప్రయోగం చేసి అది విఫలం అయ్యాక ఖర్చును తలచుకుని బాధపడడం కంటే ఇది నయం. ముందే లోపాన్ని కనిపెట్టి బోలెడు డబ్బు ఆదా చేశారు. ఆ మేరకు మన శాస్త్రవేత్తలను అభినందించాల్సిందే.

ఈ రెండు వార్తలను ఒకే కార్టూన్ లో కార్టూనిస్టు ఎంత చక్కగా ప్రతిఫలించారో చూడండి. శాటిలైట్ ప్రయోగం (తాత్కాలికంగా) విఫలం అయ్యి కిందికి దూసుకు రావడాన్ని, పాతాళంలోకి దూసుకుపోతున్న రూపాయి విలువతో కార్టూనిస్టు పోల్చారు. అక్కడ ఒక శాటిలైట్ ప్రయోగం లాంచ్ దశలో విఫలమై డబ్బు + కాలం వృధా కాగా ఇక్కడ మరో శాటిలైట్ విఫలం అయ్యి సామాన్యుడిని పెరిగే ధరల రూపంలో లంచ్ కింద మింగివేయ డానికి దూసుకు వస్తోంది.

నిజంగా మరో జన్మంటూ ఉంటే గనక నేను ఖచ్చితంగా కార్టూనిస్టుగా పుడతాను. ఆఫ్ కోర్స్! ఆ ఛాయిస్ నాకు ఉంటేనే లెండి!

వ్యాఖ్యానించండి