దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి


rupee_low

రూపాయి పతనం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా తన దొర్లుడుకు అడ్డే లేదు పొమ్మంటోంది. ‘కొండలు, గుట్టలు, నదీనదాలు, ఎడారులా నా కడ్డంకి?’ అని శ్రీ శ్రీ ని అరువు తెచ్చుకుని మరీ ప్రశ్నిస్తోంది. అధో పాతాళాన్ని దాటలేనా అని సవాలు చేస్తూ దొర్లి పడుతోంది. తమిళ తంబిలు (అదేనండీ చిదంబరం) ఎందరొచ్చినా, హార్వర్డ్ ఉత్పత్తులు (హార్వర్డ్ ప్రోడక్ట్ అని మన మన్మోహనుడికి పశ్చిమ పత్రికలు ఇచ్చి మురిసిపోయే సర్టిఫికేట్ ఇది) ప్రధానులే అయినా ‘నా దారి నాదే, పడ (పెడ కాదు లెండి) దారే’ అంటూ కిందికి, కిను కిందికి (మును ముందుకు టైపులో) దూసుకెళ్తోంది.

సోమవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూపాయి విలువ డాలర్ ఒక్కింటికి రు. 63.13 పై లు. అంటే ఒక్క రోజులోనే రు. 1.48 పై ల పతనం. ఒకే రోజు ఇంత భారీగా పతనం కావడం గత దశాబ్దంలో ఇదే మొదటిసారి అని ది హిందూ తెలిపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్ఛేంజ్ మార్కెట్ లో డాలర్ కి పెద్ద ఎత్తున డిమాండు పెరగడంతో ఈ పరిస్ధితి దాపురించిందని తెలుస్తోంది. అయితే ఇది పతనానికి కారణంగా చెప్పజాలరు. ఎందుకంటే డాలర్ కి డిమాండ్ పెరగడం మరొక కారణానికి ఫలితమే తప్ప అదే కారణం కాజాలదు.

రూపాయి పతనం అరికట్టడానికి అటు ఆర్.బి.ఐ ఇటు ప్రభుత్వం వరుసగా చర్యలు ప్రకటిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. డాలర్లు బైటికి తరలిపోకుండా అడ్డుకోడానికి ఐదు రోజుల క్రితం ఆర్.బి.ఐ చర్యలు ప్రకటించింది. భారత సంస్ధలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టకుండానూ, భారత దేశీయులు విదేశాలకు డబ్బు తరలించకుండానూ నిబంధనలు విధించింది. బంగారం, ప్లాటినం, వెండి దిగుమతులపైన 10 శాతం మేరకు సుంకాలు పెంచింది. విమాన ప్రయాణీకులు సుంకాలు లేకుండా విదేశాల నుండి ఎల్.సి.డి/ఎల్.ఇ.డి/ప్లాస్మా టెలివిజన్ సెట్ లు తెచ్చుకోడాన్ని ఆగస్టు 26 నుండి నిషేధిస్తున్నట్లు ఈ రోజు ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కాకుండా ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రి చిదంబరం తరచుగా ‘ఏం భయం లేదు’ అంటూ ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. ‘రూపాయి విలువను తగ్గనివ్వం’ అని విత్త మంత్రి బింకం ప్రదర్శిస్తే, ‘1991 నాటి పరిస్ధితిని పునరావృతం కానిచ్చే సమస్యే లేదు. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు’ అని ప్రధాని భరోసా ఇస్తున్నారు. అయినా డాలర్ల ఉరుకులకు రూపాయి దొర్లుడుకు అంతూ పొంతూ అనేదే ఉండడం లేదు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ఫలితం ఎందుకు ఉంటుంది గనక?

ప్రభుత్వ వర్గాల ఆందోళన ప్రకారం డాలర్ల పోక దేశ కరెంటు ఖాతా లోటును పెంచుతోంది. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి.ఈ పరిస్ధితి మరింత క్షీణించకుండా ఉండడానికి ప్రభుత్వం ఇప్పటికే ఐ.ఎమ్.ఎఫ్ వాకిట మరోసారి నిలబడింది. ఐ.ఎం.ఎఫ్ అప్పు ఇవ్వకపోతే గనుక కరెంటు ఖాతా లోటును తగ్గించుకునే అవకాశాలు (ఎఫ్.ఐ.ఇ, ఎఫ్.డి.ఐ లు ఎలాగూ రావడం లేదు గనక) ఇంకా మూసుకుపోతాయి. అదే జరిగితే రూపాయి విలువ డాలర్ ఒక్కింటికి రు. 75 పలికే అవకాశాలు ఉన్నాయనీ, ఈ సంవత్సరం డిసెంబరు చివరికల్లా ఐ.ఎం.ఎఫ్ అప్పు రాకపోతే జరిగేది అదేనని ఆర్ధికవేత్తలు ఇప్పటికే చెప్పేస్తున్నారు.

1991లో కూడా ఇలాగే విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకుని చంద్రశేఖర్ ప్రభుత్వ హయాంలో బంగారం తాకట్టు పెట్టారు. ఆ తర్వాత మన్మోహన్ ఆర్ధిక నేతృత్వంలో ఐ.ఎం.ఎఫ్ ముందు చేయిచాచి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకున్నారు. కాని ఐ.ఎం.ఎఫ్ షరతుల మేరకు ఆర్ధిక వ్యవస్ధకు జీవనాడులుగా ఉన్న ప్రభుత్వరంగ కంపెనీలను క్రమంగా విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెబుతున్నారు. ఇప్పుడు కూడా ఐ.ఎం.ఎఫ్ అప్పుకోసం వెళ్తున్నారు. అప్పుడూ అప్పుతోనే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. అప్పటి వైద్యం పనికి రాలేదని ఇప్పటి పరిస్ధితే చెబుతోంది. అయినా మళ్లీ అప్పటి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు పాలకులు. ఈసారి మరిన్ని షరతులతో దేశ ఆర్ధిక వ్యవస్ధ మరింతగా పరాయీకరణకు గురికానుంది.

స్వతంత్ర ఆర్ధిక వ్యవస్ధను అభివృద్ధి చేసుకోడానికి బదులుగా ప్రభుత్వ రంగం రూపంలో నామమాత్రంగా ఉన్న స్వతంత్రత కూడా రద్దు చేసుకుంటూ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ రూపంలో ఆర్ధిక వ్యవస్ధను తీసుకెళ్ళి సామ్రాజ్యవాద దేశాలకు కట్టి పడేయడమే అసలు రోగం. ఈ రోగానికి మందు ఈ విధానాలను తక్షణం రద్దు చేసుకుని స్వతంత్ర వ్యవస్ధను అభివృద్ధి చేసుకోవడం. కార్మికులు, రైతులు, ఉద్యోగులు తదితర దేశీయ మానవ వనరులకు చేతి నిండా పని కల్పించే దేశీయ ఆర్ధిక విధానాలను అభివృద్ధి చేసుకుంటే ఒకవైపు దేశీయ మార్కెట్ అభివృద్ధి అయ్యి ఎగుమతి మార్కెట్ పై ఆధారపడే అవస్ధ తప్పుతుంది; మరోవైపు కరెంటు ఖాతా లోటు, ఫిస్కల్ లోటు మొదలయిన ఫండమెంటల్స్ అన్నీ మన చేతుల్లోనే మన నియంత్రణలోనే కొనసాగే పరిస్ధితి వస్తుంది.

కానీ మన పాలకులకు సామ్రాజ్యవాదులకు, వారి బహుళజాతి కంపెనీలకు సేవ చేయడంలోనే పొద్దు గడుస్తోంది. భారతీయుల కోసం తెల్లవారడం అనేదే వారికి ఉండదని వారి వైద్యమే చెబుతోంది.

One thought on “దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి

వ్యాఖ్యానించండి