భారత ‘అవతార్’ నివాసులకు మోడి మద్దతు ఇవ్వగలరా?


హాలీవుడ్ సినిమా ‘అవతార్’ గుర్తుందా? అందులో అవతార్ అనే ఒక గ్రహం ఉంటుంది. విస్తారమైన సహజ వనరులతో ఆ గ్రహం అలరారుతుంటుంది. దానిపైన భూగ్రహం పైన ఉండే కంపెనీల కన్ను పడుతుంది. అక్కడి వనరులను కొల్లగొట్టడానికి వీలుగా దానిని ఆక్రమించుకోడానికి సైన్యాన్ని పంపుతుంది. అలా వెళ్ళిన సైన్యంలోని కొంతమంది ‘అవతార్’ గ్రహవాసులతో కలిసిపోయి సైన్యాన్ని ఓడించి తరిమివేయడంతో సినిమా ముగుస్తుంది.

ఒరిస్సాలోని నియమగిరి కొండ, దాని చుట్టూ ఉన్న అడవుల్ని భారత దేశ ‘అవతార్’ గా ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఒకసారి పోల్చాడు. ఆ పోలిక నిజం కూడా. బ్రిటన్ కి చెందిన బహుళజాతి కంపెనీ ‘వేదాంత’ ఒరిస్సాలో బాక్సైట్ ని శుద్ధి చేసి అల్యూమినియం ఉత్పత్తి చేసే పరిశ్రమను స్ధాపించింది. ఈ కంపెనీ కోసం ఒరిస్సా ప్రభుత్వం దట్టమైన అటవీ ప్రాంతాన్ని కంపెనీకి అప్పజెప్పింది. కంపెనీ కార్యకలాపాల వలన నియమగిరి కొండలకు సమీపాన ఉన్న అటవీ ప్రాంతం నాశనం అయిపోయింది. పర్యావరణం తీవ్రంగా దెబ్బ తిన్నది. కంపెనీ స్ధాపనను అక్కడి గిరిజనులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. వారిపై బలప్రయోగం చేసి వారి భూముల్ని బలవంతంగా లాక్కుని కంపెనీకి అప్పజెప్పారు.

ఈ ఫ్యాక్టరీ కోసం బాక్సైట్ గనులున్న నియమగిరి కొండలు తమకు కావాలని వేదాంత కంపెనీ ఒరిస్సా ప్రభుత్వాన్ని కోరింది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎప్పటిలాగానే అందుకు ఓ.కె చెప్పేసింది. అయితే నియమగిరి కొండల్ని అక్కడి గిరిజనులు దేవతగా కొలుస్తారు. ఆ కొండలపై ఉన్న అడవులే వారి జీవనాధారం. అదీ కాక ప్రాచీన తెగలకు చెందిన గిరిజనుల అక్కడ నివసిస్తున్నారు. వేదాంత కంపెనీ వలన అలాంటి రెండు గిరిజన తెగలు (డోంగ్రియా కోంధ్, కుటియా)  పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం తలెత్తింది. దానితో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసన పెల్లుబుకింది. వేదాంత-నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా అనేకమంది నిపుణులు, హక్కుల కార్యకర్తలు గిరిజనుల పోరాటాలకు మద్దతు పలికారు. గిరిజనుల పోరాటం అంతర్జాతీయ స్ధాయిలోనూ ఖ్యాతికెక్కింది.

ఈ నేపధ్యంలో వేదాంత రెండో దశ ప్రాజెక్టుకు 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ప్రాజెక్టు వలన అక్కడ పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బ తింటుందని నివేదిక రావడంతో అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అంతకు ముందు ఇచ్చిన కొన్ని అనుమతులను కూడా రద్దు చేసేశాడు. అక్కడి గ్రామ సభలు అనేకసార్లు వేదాంత కంపెనీకి తమ భూములను, జీవనాధారమైన నియమగిరి కొండలను అప్పగించడానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కంపెనీ పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఒత్తిడి చేస్తోంది.

గత ఏప్రిల్ నాటి సుప్రీం కోర్టు తీర్పుతో ఇటీవల మళ్ళీ గ్రామ సభలు నిర్వహించారు. 12 గ్రామ సభలు నిర్వహించగా అందులో 11 సభలు వేదాంత తవ్వకాలకు నిరాకరించాయి. వాస్తవానికి నియమిగిరి ప్రాంతంలో 100కి పైగా గిరిజన గ్రామాలుంటే రాష్ట్ర ప్రభుత్వం 12 మాత్రమే ఎంపిక చేసింది. స్ధానిక కాంగ్రెస్ నాయకులు వేదాంతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా బి.జె.పి నుండి ఈ సమస్యపై ఏ ప్రకటనా వెలువడలేదు. నిన్ననే గాంధీ నగర్ లో గ్రామ స్వరాజ్యం గురించి ఉపన్యాసం దంచిన నరేంద్ర మోడి కూడా ఏమీ మాట్లాడ లేదు. ఒకవైపు గ్రామాల్లో కూలీలకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పధకం పైన దాడి చేస్తూనే గ్రామ స్వరాజ్యమే తన లక్ష్యం అని చెప్పడం మోడి ద్వంద్వ స్వభావాన్ని వెల్లడి చేస్తోంది. గ్రామ సభలను ఆయన నిజంగా గౌరవిస్తుంటే రాహుల్ గాంధీ తరహాలో నియమగిరి గిరిజనుల పోరాటానికి ఆయన మద్దతు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ వైపుగా మోడి ఇంతవరకూ ఏ మాటా చెప్పలేదు.

డౌన్ టు ఎర్త్ పత్రిక ప్రకారం ఉప్పు, కిరోసిన్ తప్ప నియమగిరి పల్లెలు బైటి నుండి ఏ ఒక్క వస్తువు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వారి జీవనం అంతా ఆ పల్లెల్లోని అడవులతోనే గడిచిపోతుంది. బహుశా ఈ కారణం వల్లనేమో కొండల్ని తమ దేవుడిగా కొలుచుకుంటారు. నియమరాజ అనే దేవుడి ఆ కొండలపై కొలువుదీరి తమను కాపాడుతున్నాడని డోంగ్రియా కోంధ్ తెగల ప్రగాఢ విశ్వాసం. ఈ పల్లెలను చేరుకోవాలంటే బైటివారికి సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే వందకు పైగా ఉన్న ఆ గ్రామాల్లో రోడ్డు అనేదే లేదు. ఇన్నాళ్లూ ఈ పల్లెల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు వేదాంత కంపెనీ కోసం ‘అభివృద్ధి మంత్రం’ జపిస్తున్నాయి. డోంగ్రియా గిరిజనులు ప్రభుత్వంపై ఎంత అపనమ్మకంతోనూ, ఆగ్రహంతోనూ ఉన్నారంటే వైద్యం కోసం వారు సమీప ఆరోగ్య కేంద్రాలకు రావడానికి సైతం నిరాకరిస్తున్నారు. తమ జోలికి ఎవరూ రాకపోతే అదే పదివేలని వారు తెగేసి చెబుతున్నారు.

ఒరిస్సా కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్ ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జైరాం రమేష్ మరోసారి నియమగిరి గిరిజనులకు మద్దతు తెలిపాడు. “నియమగిరిలోని బాక్సైట్ రిజర్వుల నుండి లంజీ ఘర్ లోని వేదాంత రిఫైనరీకి అవసరమైన ముడి ఖనిజంలో కేవలం 10 శాతం మాత్రమే సమకూరుతుంది. ఐనా ఎందుకని వాళ్ళు నియమగిరి కొండల పైన అంతగా పట్టుబడుతున్నారు? ఇది జబర్దస్తి తప్ప మరొకటి కాదు” అని జైరాం రమేష్ ర్యాలీ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. గ్రామ సభలు నిర్వహించిన 12 గ్రామాలూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎన్నిక చేసినవేననీ, వాటిలో 11 గ్రామ సభలు వేదాంత తవ్వకాలను వ్యతిరేకించాయని కాబట్టి నియమగిరి చాప్టర్ ని కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంతటితోనైనా ముగించాలని జైరాం రమేష్ కోరారు. లేకపోతే అదే ‘నవీనాంతం’ అవుతుందని రమేష్ హెచ్చరిక కూడా చేశారు.

మరి గ్రామ స్వరాజ్యం అంటూ గాంధీని వల్లె వేస్తున్న నరేంద్ర మోడి ఏమంటారు?

2 thoughts on “భారత ‘అవతార్’ నివాసులకు మోడి మద్దతు ఇవ్వగలరా?

  1. నియమ గిరి లో అల్యూమినియం
    కూడా దోచుకోవాలనే నియమం !
    ఆదిమ జాతుల జీవితాలలో అయోమయం !!
    ఇదెక్కడి బహుళ జాతి ‘వేదాంతం’ ?!!!

వ్యాఖ్యానించండి