భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం


Market collapse -August 16

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని తలపించాయి. అమెరికాలో ఆశావాహ పరిస్ధితులు నెలకొన్నాయని భావించిన అంతర్జాతీయ మదుపరులు భారత స్టాక్ మార్కెట్ల నుండి, రూపాయి నుండి తమ సొమ్ము ఉపసంహరించుకుని డాలర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడంతో రూపాయి ఢమాల్ మని కూలిపోయింది. రూపాయితో పాటు స్టాక్ సూచీలు కూడా ఒక్కుమ్మడిగా కూలిపోయాయి. మార్కెట్ల పతనాన్ని పత్రికలు రక్తపాతంతో పోల్చుతున్నాయి. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను వివిధ స్టాక్ లు కోల్పోయాయంటే దానిని రక్తపాతం కంటే ఎక్కువే అనాలేమో!

ప్రధాన్ స్టాక్ ఎక్ఛేంజీలు సెన్సెక్స్, నిఫ్టీలు దరిదాపు 4 శాతం పతనం అయ్యాయి. బుధవారం 19,367.59 పాయింట్ల వద్ద ముగిసిన బి.ఎస్.ఇ సెన్సెక్స్ శుక్రవారం ప్రారంభం కావడమే 19,297 పాయింట్ల పతన స్ధాయిలో మొదలయింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి 18,618.20 పాయింట్ల వద్ద తేలి మొత్తం 749.39 పాయింట్ల పతనం మూటగట్టుకుంది. ఇది బుధవారంతో పోలిస్తే 3.87 శాతంతో సమానం. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ నిఫ్టీ బుధవారం నాటి క్లోజింగ్ స్ధాయి 225.35 పాయింట్లు పతనం అయి 5,516.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్.ఎస్.ఇ పతనం 3.92 శాతంతో సమానం.

బ్యాంక్ సూచీ 622.62 పాయింట్లు పతనం కాగా వినియోగ సరుకుల సూచీ 548.28 పాయింట్లు పతనం అయిందని పత్రికలు తెలిపాయి. మెటల్ ఇండెక్స్, సహజవాయువు సూచీ, పెట్టుబడి సరుకుల సూచీ కూడా దాదాపు ఇదే స్ధాయిలో పతనాన్ని చవిచూశాయి. పబ్లిక్ సెక్టార్, ఆటో మొబైల్, ఇతర వినియోగాసరుకులు ఇలా ఏది చూసుకున్నా అధోపతనానికి గురయ్యాయి.

పతనానికి కారణం మళ్ళీ అమెరికాయే. అమెరికా కరెన్సీ డాలర్ కోసం మార్కెట్లలో విపరీతమైన తొక్కిడి చోటు చేసుకుంది. అంటే కరెన్సీ మార్కెట్లో రూపాయిల్ని అమ్మేసుకుని డాలర్ కొనుగోళ్ళు జరిపారు. దానితో రూపాయి మళ్ళీ నూతన చారిత్రక అధో స్ధితిని నమోదు చేసింది. శుక్రవారం పతనంతో డాలర్ ఒక్కింటికి 62.03 రూపాయల స్ధాయికి రూపాయి విలువ చేరుకుంది. అంటే రూపాయి – డాలర్ లెక్కల్లో మరో కొత్త నార్మల్ నమోదయ్యిందన్నమాట!

డాలర్ కోసం ఎందుకు డిమాండ్ పెరిగిందయ్యా అంటే ఆ దేశం ప్రకటించిన ఉద్యోగాల లెక్క. జులై నెలలో గతం కంటే ఎక్కువ ఉద్యోగాలను కంపెనీలు కల్పించాయని అమెరికా గణాంక శాఖ ప్రకటించింది. అంటే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందన్న అభిప్రాయాన్ని అది కలిగించింది. ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇస్తున్న భారీ ఉద్దీపన అనగా (క్వాంటిటేటివ్ ఈజింగ్ – 3 లేదా QE-3) ఉపసంహరించుకునే రోజు దగ్గర పడిందని మదుపరులు భావించారు. అంటే డాలర్ రూపాయి కంటే భద్రమైన కరెన్సీగా కనపడిందని అర్ధం. దానితో రూపాయిలో ఉన్న తమ పెట్టుబడుల విలువ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో రూపాయిలు అమ్మేసి డాలర్లు కొనుక్కున్నారు. ఫలితమే రూపాయి పతనం.

కరెన్సీ మార్కెట్ల వరకే ఈ తొక్కిడి పరిమితం కాలేదు. భారత స్టాక్ మార్కెట్లలో మదుపు చేసిన ఎఫ్.ఐ.ఐ లు కూడా తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని మరో భద్రమైన చోటు వెతుక్కున్నాయి. ఒక పక్క ఈ హాట్ మనీ (ఎఫ్.ఐ.ఐ) ని ఆకర్షించడానికి ఆర్ధికమంత్రి వరుసగా సరళీకరణ చర్యలు ప్రకటిస్తున్నా అవేవీ వారిని ఆకర్షించడం లేదు. ‘రూపాయిని పతనం కానివ్వం’ అంటూ శపధం చేసిన విత్త మంత్రి చిదంబరం గారు శుక్రవారం పరిణామాలకు వివరణ ఇవ్వాల్సి ఉంది.

అయితే భారత ప్రజలకు వివరణ ఇవ్వడానికి బదులు చిదంబరం గారు విదేశీ మదుపుదారులకు, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఐ లకు గట్టి హామీ ఇచ్చారు. రూపాయి విలువ పతనం అవుతున్న నేపధ్యంలొ పెట్టుబడులు తరలిపోకుండా ఉండడానికి ప్రభుత్వం మళ్లీ పెట్టుబడి నియంత్రన చర్యలు (capital controls) చేపట్టనున్నదని మార్కెట్లలో పుకార్లు వ్యాపించాయనీ, అవి పుకార్లేననీ, వాస్తవం కాదని ఆర్ధిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆర్.బి.ఐ కూడా తమ వద్ద అలాంటి ఆలోచనేదీ లేదని విదేసీ మదుపరులకు హామీ ఇచ్చింది.

డివిడెండ్లు, లాభాలు, రాయల్టీలు మొదలైన వాటిని తమ తమ దేశాలకు తరలించకుండా నియంత్రణ విధించే ఆలోచన కూడా తమకు లేదని చిదంబరం హడావుడిగా హామీ ఇచ్చారు. మామూలుగా అయితే వీటిపై నియంత్రణ విధించాలని కాని తాము మాత్రం ఆపని చేయబోమని కూడా మంత్రి చెప్పేశారు. పనిలో పనిగా ఈ పుకార్ల వల్లనే స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువ పతనం అయ్యాయని ఆర్ధిక మంత్రి నిర్ధారించారు.

భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టకుండానూ, దేశంలో నివసిస్తున్నవారు విదేశాల్లో డబ్బు జమ చేయకుండానూ ఆగస్టు 14 తేదీన ఆర్.బి.ఐ చర్యలు ప్రకటించింది. ఈ చర్యల వల్లనే ఎఫ్.ఐ.ఐ లపై కూడా నియంత్రణలు తేబోతున్నట్లు పుకార్లు వచ్చాయని తెలుస్తోంది. పుకార్ల సంగతేమో గానీ ఆర్ధిక వ్యవస్ధ నిర్వహణలో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వరుస తప్పులు ప్రజల కొనుగోలు శక్తికి పెనుభారంగా మారడమే ఆందోళన కలిగిస్తోంది.

2 thoughts on “భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం

  1. రూపాయి మారకం విలువ,ఎక్సేంజీల భావనలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికి వైరస్ ఉనికి మాదిరి అర్దం కావడంలేదు!

  2. డబ్బు విలువ మారడానికి దాని అంతర్గతంగా వుండే శ్రమ పైన ఆదారపడి వుంటుంది ఒక వస్తువపైన వెచ్చించే శ్రమ ఉత్పాదక శక్తి హెచ్చడం గాని లేదా తగ్గడం గానీ జరిగితే డబ్బు విలువ మారవచ్చు. కాని పెట్టుబడిదారీ సమాజంలొ మాత్రమే ఇలా కౄత్రిమంగా బయట శక్తులు ప్రబావితం చేస్తాయి.

వ్యాఖ్యానించండి