ముంబై డాక్ యార్డ్ లో అనూహ్య కారణాలతో పేలిపోయి మునిగిపోయిన ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ జలాంతర్గామి నుండి నాలుగు శవాలను వెలికి తీశారు. ఈ శవాలు గుర్తు పట్టలేని స్ధితిలో ఉన్నాయని తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో డి.ఎన్.ఏ శాంపిల్ సహాయంతో గుర్తుపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాంతర్గామిలో సజీవులుగా ఎవరైనా మిగిలి ఉండే అవకాశాలు పూర్తిగా అడుగుంటాయని అధికారులు చెబుతున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి మాత్రం అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదని జలాంతర్గామి లోపల గాలి గదుల్లో కొద్దిమందైనా రక్షణ పొంది ఉండవచ్చనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
“అద్భుతాలు (కొన్నిసార్లు) జరుగుతాయి… ఎక్కడో ఒక చోట గాలి గది ఉండి ఉండవచ్చు. లేదా ఊపిరి తీసుకునే సంచులను కొంతమంది సంపాదించి ఉండవచ్చు” అని డి.కె.జోషి అన్నారు. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనితో కలిసి ప్రమాద స్ధలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ మాటలు అన్నారు. అయితే ఈ రోజు ఉదయం నావికా దళం విడుదల చేసిన ప్రకటన అలాంటి ఆశలేవీ వ్యక్తం చేయలేదు. లోపల ఉన్న అధికారులు గానీ, నావికులు గానీ బతికి ఉండే అవకాశాలు దాదాపు లేవని తెలిపింది.
“జలాంతర్గామి లోపలి కంట్రోల్ రూమ్ ఏరియాకు జరిగిన నష్టాన్నీ, దాని చుట్టూ ఉన్న పరిస్ధితినీ బట్టి చూస్తే సిబ్బంది విగత దేహాలను వెలికి తీయగల అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పేలుడు వల్ల భారీ స్ధాయిలో వేడి ఉత్పత్తి అయింది. ఈ వేడికి లోపల ఉన్న ఉక్కు భాగాలు కూడా కరిగిపోయాయి. కాబట్టి సిబ్బంది శరీరాలు కూడా బూడిదగా మారి ఉండొచ్చు” అని సదరు ప్రకటన పేర్కొంది.
- కోనింగ్ టవర్ వద్ద సిబ్బంది
- ముంబై డాక్ యార్డ్
- పాక్షికంగా మునిగిన సింధూరక్షక్
- ఇండియా జలాంతర్గాముల స్ధానం
జలాంతర్గామిలోకి చేరిన నేరు అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికిపోయిందని, దానితో ప్రారంభంలో రక్షణ సిబ్బంది లోపలికి ప్రవేశించడమే కష్టం అయిందని తెలుస్తోంది. “తలుపులన్నీ జామ్ అయిపోయాయి. నిచ్చెనలు వంకర్లు తిరిగిపోయి ఉపయోగానికి వీలు లేకుండా ఉన్నాయి. మునిగిపోయిన జలాంతర్గామి లోపలి భాగంలో ఆయిల్, మట్టితో కూడిన నీరు నిండిపోయి ఉంది. దానితో పూర్తిగా చీకటి ఆవరించింది. అత్యధిక శక్తి కలిగిన అండర్ వాటర్ దీపాలు కూడా పని చేయడం లేదు. ఫలితంగా చూపు అనేదే లేకుండా పోయింది” అని నావికాదళ ప్రకటన తెలిపింది.
జలాంతర్గామి లోపల మామూలుగానే కదలడానికి తక్కువ చోటు ఉంటుంది. ప్రమాద తీవ్రత వల్ల అంతర్గత భాగాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. లోపలి లోహ భాగాలు ఆకారం కోల్పోయి కదలిక స్ధలాన్ని మరింతగా కుచించివేశాయి. దానితో ఈతగాళ్లకు పరిస్ధితి పూర్తిగా ప్రతికూలంగా మారింది. రక్షణ చర్యలు అత్యంత శ్రమతోనూ, అత్యంత నెమ్మదిగానూ చేయవలసి వస్తోంది.
లోపలికి ప్రవేశించడానికి అవసరమైన చర్యలను ఒకే సమయంలో ఒకే ఈతగాడు మాత్రమే చేయడానికి వీలుగా ఉన్నది. గజ ఈతగాళ్ళు 36 గంటలపాటు నిరంతరాయంగా శ్రమించిన తర్వాత మాత్రమే కోనింగ్ టవర్ వెనుక ఉండే రెండో కంపార్టుమెంట్ లోకి శుక్రవారం ఉదయానికి ప్రవేశించగలిగారు. “రక్షణ ప్రక్రియ చాలా నెమ్మదిగా నడుస్తోంది. కానీ మా ఈతగాళ్ళు 24X7 పని చేస్తున్నారు” అని నావికాదళ ప్రతినిధి తెలిపారు.
400 కోట్ల రూపాయల ఖర్చుతో రష్యా నుండి కొనుగోలు చేసిన సింధూరక్షక్ 1997లో భారత నావికాదళంలో ప్రవేశించింది. యుద్ధరంగంలో ఫ్రంట్ లైన్ కు ఉద్దేశించిన ఈ జలాంతర్గామి ఇటీవలే మరో 450 కోట్లతో ఆధునీకరించారు. ప్రమాదానికి కారణాలను పరిశోధించడానికి రష్యా నేవీ ఒక బృందాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వలన భారత నౌకాదళంలో ఒక కీలకమైన సామర్ధ్యం లోపించినట్లయిందని నౌకాదళం మాజీ అధికారులు చెబుతున్నారు.
జలాంతర్గామి ముందు భాగంలో పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. క్షిపణులు, టార్పెడోలను ఈ భాగంలోనే నిలవ చేస్తారని తెలుస్తోంది. విద్రోహ చర్యను కొట్టిపారేయలేమని చెబుతూనే, ఇప్పటివరకూ అందిన సూచనల ప్రకారం విద్రోహం జరిగినట్లు భావించడం లేదని నౌకాదళాధిపతి డి.కె.జోషి స్పష్టం చేశారు. పరిశోధనకు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమించామని ఆయన తెలిపారు. మంచి కోసం ఆశిస్తూనే అత్యంత చెడ్డవార్తకు సిద్ధంగా ఉన్నామని తెలిపారాయన.
ప్రాధమిక సమాచారాన్ని బట్టి వాహనంలోని టార్పెడో సెక్షన్ లోకి పేలుడు పదార్ధాలను లోడింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. మొదట మంటలు చెలరేగి అవి కాస్తా పేలుడుకు దారి తీసింది. వరుసగా అనేకసార్లు పేలుడు సంభవించిన తర్వాత ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ ని ఇక వదులుకున్నట్లేనని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక వ్యాఖ్యానించింది.
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్క్ షిప్ యార్డ్ నిర్మించిన సింధూ రక్షక్ 16 యేళ్లుగా భారత నౌకాదళానికి సేవలు అందిస్తోంది. ఇటీవల జరిపిన ఆధునీకరణ ఫలితంగా మరో పది సంవత్సరాలు సేవలు అందించగలదని భావించారు.



