భారత నౌకాదళం బుధవారం తెల్లవారు ఝాము భారీ మూల్యం చెల్లించింది. సంప్రదాయక సబ్ మెరైన్ లో పేలుడు సంభవించి ముంబై డాక్ యార్డ్ లో మునిగిపోవడంతో 18 మంది నావికాదళ సభ్యులు చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సింధూరక్షక్’ అనే పేరుగల ఈ జలాంతర్గామును రష్యా సరఫరా చేసింది. కిలో క్లాస్ యుద్ధనౌకగా భావించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళంలో ఒక ముఖ్య భాగం అని తెలుస్తోంది.
ఇప్పటికే వివిధ కారణాల వలన నౌకాదళంలో జలాంతర్గాముల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ పేలుడు భారత నౌకాదళానికి గణనీయమైన నష్టంగా భావిస్తున్నారని తెలుస్తున్నది. భారీ విమానవాహక నౌక ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ జల ప్రవేశం జరిపిన మరుసటి రోజే ప్రమాదం సంభవించడం నౌకాదళాన్ని విచారంలో ముంచింది.
ది హిందు పత్రిక ప్రకారం సింధూరక్షక్ ను డీజెల్ జనరేటర్లతో పాటు, విద్యుత్ బ్యాటరీలతో కూడా నడిపే సౌలభ్యం ఉన్నది. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని ఈ దుర్ఘటనపై పార్లమెంటులో విచారం ప్రకటించారు. దుర్ఘటనపై ప్రధాన మంత్రికి వివరాలు ఇచ్చిన వెంటనే ఆయన ముంబై బయలుదేరి వెళ్లారు. నౌకాధళాధికారి అడ్మిరల్ డి.కె.జోషి కూడా ముంబై బయలుదేరి వెళ్లారు. పేలుడు దృశ్యాన్ని ఇక్కడ వీడియోలో చూడవచ్చు.
16 సంవత్సరాల నుండి నౌకాదళంలో ఉన్న సింధూరక్షక్ ముందుభాగంలో పేలుడు సంభవించిందని, ఈ ముందుభాగంలోనే శత్రు నౌకలు ముంచేసే టార్పెడో లను ఉంచారనీ నావికాదళ అధికారులు తెలిపారు. పేలుడు పైనా, అనంతరం పెద్ద ఎత్తున సంభవించిన మంటలపైనా విచారణ చేయాలని నావికా అధికారులు ఆదేశాలిచ్చారని పత్రికలు తెలిపాయి. భారీ స్ధాయిలో అగ్నిగోళాన్ని గాలిలోకి విరజిమ్మిన పేలుడు తర్వాత జలాంతర్గామి పూర్తిగా నీటిలో మునిగిపోయిందని, కొద్ది భాగం మాత్రమే నీటిపైకి కనిపిస్తోందని అధికారులు తెలిపారు. విధుల్లో లేని సమయంలో జలాంతర్గామి పేలిపోవడం అనుమానాలకు తావిచ్చినట్లు తెలుస్తోంది.
- డాక్ యార్డ్ లోకి ప్రవేశిస్తున్న శవవాహనం
- సింధూ రక్షక్ -ది హిందు
- సింధు రక్షక్ -రష్యా టుడే
- పేలుడు -రష్యా టుడే
- పేలుడు -ట్విట్టర్
- పేలుడు చిత్రం -ట్విట్టర్
జలాంతర్గాములో అంతర్గతంగా ఉండే విభాగాలు విఫలం అవడం వల్ల గానీ లేదా నిర్దిష్ట ప్రమాణ ప్రక్రియలు పాటించకపోవడం వల్ల గానీ పేలుడు సంభవించి ఉండవచ్చని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎ.కె.సింగ్ చెప్పారని ది హిందు తెలిపింది. సబ్ మెరైన్ లోపలి బ్యాటరీలను చార్జింగ్ చేసేటప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదల అయి ఉండవచ్చనీ, దానివలన మంటలు తలెత్తి అవి క్షిపణులు ఉంచే కంపార్టుమెంటుకు వ్యాపించి ఉండవచ్చనీ, అందుకే భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని ఎ.కె.సింగ్ వివరించారు.
సింధూరక్షక్ జలాంతర్గామిలో ప్రమాదం సంభవించడం ఇదే మొదటిసారి కాదు. 2010లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక నావికుడు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. అప్పుడు కూడా బ్యాటరీ కంపార్టుమెంట్ లో పేలుడు వల్లనే మంటలు చెలరేగాయి. 2008లో ఐ.ఎన్.ఎస్ సింధుగోష్ అనే జలాంతర్గాము ముంబైలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటుండగా ఒక వాణిజ్య నౌకతో ఢీకొట్టి దెబ్బతింది. 2011లో ఐ.ఎన్.ఎస్ వింధ్యగిరి అని ఉపరితల నౌకలో నౌకాధికారులు పిక్ నిక్ కి వెళ్ళి వస్తుండగా ముంబై నౌకాశ్రయం నుండి బైటికి వస్తున్న వాణిజ్య నౌకతో ఢీకొట్టి దెబ్బతిన్నదని ది హిందు తెలిపింది.
1980లలో రష్యాతో కుదిరిన ఒప్పందం మేరకు సింధూరక్షక్ భారత నావికాదళంలో 1997లో వచ్చి చేరింది. డీజెల్-విద్యుత్ లతో నడిచే ‘సింధుగోష్’ తరగతి జలాంతర్గాములు 10 భారత నౌకాదళానికి ఉన్నాయి. మొత్తం మీద భారత్ వద్ద 16 జలాంతర్గాములు ఉన్నట్లు తెలుస్తోంది. సింధూరక్షక్ జలాంతర్గామి నౌకాదళంలో ముందుండి నడిచేది. అంటే యుద్ధం సంభవిస్తే ఫ్రంట్ లైన్ లో నిలబడి పోరాటంలో పాల్గొంటుంది. ఈ కారణం రీత్యా ప్రస్తుత ప్రమాదం నౌకాదళానికి భారీ నష్టమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ప్రమాదానికి గురయిన సింధూరక్షక్ ఇటీవలనే రష్యా వెళ్ళి 80 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఆధునీకరించబడింది. మరో పదేళ్లపాటు భారత నౌకాదళానికి ఈ నౌక సేవలు అందించగలదని భావించారు.
రష్యా టుడే పత్రిక ప్రకారం ఈ ప్రమాదంలో నౌకాదళ ఉద్యోగులు చనిపోయారని రక్షణ మంత్రి ఆంటోని తెలిపారు. అయితే ఎంతమంది చనిపోయిందీ ఆయన చెప్పలేదు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు నీటిలోకి దూకి బైటపడ్డారని అయితే ఇంకా 12 మంది లోపలే చిక్కుకుపోయారని ఆర్.టి తెలిపింది. “కొంతమంది లోపలే చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము. బహుశా వారి సంఖ్య 18 వరకు ఉండవచ్చు అని నౌకాదళ ప్రతినిధి పి.వి.ఎస్ సతీష్ తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
సింధూరక్షక్ లో చెలరేగిన మంటలు సమీపంలోనే ఉన్న ఇతర నౌకలకు అంటుకోకుండా ఉండడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐ.ఎన్.ఎస్ సింధూరత్న అనే నౌకను అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లారని, ఇతర నౌకలను కూడా కాపాడడానికి శ్రమిస్తున్నారని నౌకాదళ ప్రతినిధులు చెబుతున్నారు.





