అద్భుతమైన కార్టూన్ ఇది!
మన్మోహన్ సింగ్ అనుసరించిన నూతన ఆర్ధిక విధానాల డొల్లతనాన్ని ఈ కార్టూన్ శక్తివంతంగా వివరిస్తోంది. డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప మరో దారి లేదని చెప్పి డబ్ల్యూ.టి.ఓ ఉరుగ్వే రౌండ్ చర్చలను భారత దేశ ప్రజల నెత్తిన ‘నూతన ఆర్ధిక విధానాలు’గా రుద్దిన మన్మోహన్ తిరిగి బయలుదేరిన చోటికే చేరడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ఆ విధానాల తీరే అంత.
ఏ విధానాలైనా ప్రజల కొనుగోలు శక్తిని స్ధిరంగా పెంచగలిగితేనే కంపెనీలకి లాభాలూ, ప్రభుత్వాలకి పన్నులూ వచ్చేది. కానీ పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రభుత్వాలు సరిగ్గా ఈ ప్రాధమిక అంశం తప్ప మరింకేదైనా పట్టించుకుంటాయి. వారి మాస్టర్లయిన సామ్రాజ్యవాదుల సంగతి సరేసరి! ఐరోపా ఋణ సంక్షోభం, అమెరికా బలహీన ఆర్ధిక వ్యవస్ధ, ఆ దేశాల్లో అదుపులోకి రాని నిరుద్యోగం ఆ సంగతి చెబుతాయి.
కరెంటు ఖాతా లోటు పెరిగిపోయిందనీ, అప్పులు పుట్టడం లేదనీ, చేతిలో డబ్బు లేదనీ, ఎగుమతులు పడిపోయాయనీ చెప్పి ఆనాడు మన్మోహన్ మంత్రసానిగా నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టారు. కరెన్సీ విలువని తెగ్గోశారు. విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరుస్తూ పోయారు. ప్రభుత్వ కంపెనీలని ఒక్కొక్కటిగా తెగనమ్ముతూ వచ్చారు. ఉద్యోగ కల్పనను ప్రైవేటు కంపెనీలకి అప్పజెప్పి ఎల్లెడలా కాంట్రాక్టీకరణ చేపట్టారు.
రెండు దశాబ్దాలు గడిచాయి. రెండు దశల నూతన ఆర్ధిక విధానాలూ పూర్తయ్యాయి. కానీ జి.డి.పి వృద్ధి మళ్ళీ అదే స్ధాయిలో (5.3%) తగలడింది. కరెంటు ఖాతా లోటు చుక్కల్ని చూస్తోంది. ఎగుమతులు నేలను తాకుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పైకి లేస్తాయో, ఎప్పుడు పాతాళానికి దూసుకెళ్తాయో తెలియడం లేదు. కార్పొరేట్లకి రాయితీల మీద రాయితీలు ఇస్తున్నా ఉత్పత్తి పెరగడం లేదు. లక్షల కోట్ల రూపాయల అవినీతి తప్ప పెరిగిందేమీ లేదు.
దగాకోరు పెట్టుబడిదారీ అనుకూల మార్కెట్ ఎకానమీ నమూనా విఫలం అయిందని చెప్పడానికి నేడు ప్రపంచం ఉన్న పరిస్ధితి చాలు. అందులో భారత దేశం, మన్మోహన్ ప్రభుత్వం భాగమేనని వేరే చెప్పాలా?

పాతికేళ్ళ తర్వాతే కాదు. వంద సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంటుంది. చరిత్ర చెపుతున్న నిజం అదే.
కాలచక్రంలో ఎక్కడమొదలుపెడితే అక్కడికేరావాల్సిఉంటుందని అంటారు!అదేగతి మనదేశ ఆర్ధిక వ్యవస్తకు సరిపొతుందేమో!అయితే ఆమార్గం ఉందిచూశారూ దానితీరుతెన్నులును విశ్లేషించుకోవడం చాలావసరం! దయచేసి దానిగురించి క్లుప్తంగా వివరించండి(లాభనష్టాలు,దేశయవనికపై దానిప్రభావం).