కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండీ ఈ బిల్లు గురించి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నిరసనల హోరు మధ్య నిన్ననే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ నిరసనలు ఆహార భద్రతా బిల్లుపై కాకుండా వేరే అంశాలపైన కావడం గమనార్హం. కొంతమంది తెలంగాణ వద్దని నినాదాలు చేస్తుంటే, మరి కొంతమంది కాశ్మీరులో జవాన్ల హత్యలపై ఆందోళన చేస్తుండగా ఈ బిల్లుని హడావుడిగా ప్రవేశపెట్టారు.
విచిత్రం ఏమిటంటే ఇలాంటి తొందర గానీ, తెలివి గానీ, వ్యూహం గానీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టడానికీ, లోక్ పాల్ బిల్లు లాంటివి ప్రవేశ పెట్టడానికీ అక్కరకు రాకపోవడం. వీళ్ళకు కావాలనుకున్న ఎలాగైనా ప్రవేశపెట్టి వీలయితే ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేసయినా ఆమోదింపజేసుకుని చట్టాలు చేసేస్తారు. వారికి హాని అనుకుంటే మాత్రం వాటికి అనేక ముళ్ళ కంచెలు, గోడలు అడ్డంగా కనపడుతుంటాయి.
నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా బిల్లు… రానున్న సాధారణ ఎన్నికల్లో ఇవి రెండూ తమకు ఓట్ల పొదుగుల్ని నోటికి అందించే కామధేనువులు కానున్నాయని కాంగ్రెస్ గంపెడాశ పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కో పక్షం ఒక్కో సమస్య పైన నిరసనల మంటల్ని రగిలిస్తుండగా వాటితోనే ఈ బిల్లుల్ని వండి వార్చడానికి కాంగ్రెస్ అధినాయకత్వం పధకాలు రచించిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ కపట వ్యూహాల్లో ఇలాంటివి ఎన్నో!

తమ(అధికారపక్షం)ప్రయొజనాలు కాపాడు కొవడానికి కాంగ్రెస్ తొందరపడడంలో అశ్చర్యం ఏమీలేదు(అది ఆహారభద్రత బిల్ అయినా/తెలంగాణా ప్రకటన అయినా)!