ఫుకుషిమా డ్రైనేజి నీటిలో ప్రమాదకర రేడియేషన్ -కంపెనీ


Fukushima Dai-ichi reactor

ఫుకుషిమా అణు కర్మాగారం చల్లబరచడానికి నిర్మించిన డ్రైనేజి వ్యవస్ధ మొత్తం తీవ్రస్ధాయి రేడియేషన్ తో కూడిన నీటితో నిండిపోయిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ‘టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ’ (టెప్కో) ప్రకటించింది. డ్రైనేజీలో ఇప్పుడు 20,000 టన్నుల నీరు నిలవ ఉన్నదనీ ఇందులో అణు ధార్మికత అత్యంత ప్రమాద స్ధాయిలో ఉన్నదని కంపెనీ తెలిపింది. భూమి అడుగున నిర్మించిన పైపుల్లో ఉన్న ఒక లీటర్ నీటిలో 2.35 బిలియన్ బెక్యూరల్స్ పరిమాణంలో సీసియం రేడియేషన్ (అణు ధార్మికత) ఉన్నట్లు తాము కనుగొన్నామని టెప్కో ప్రకటించింది. నీటిలో అనుమతించే సీసియం రేడియేషన్ పరిమితి లీటర్ కి 150 బెక్యూరల్స్ మాత్రమే. అంటే ప్రమాద స్ధాయికి మించి 1.57 కోట్ల రెట్లు రేడియేషన్ ఉందన్నమాట!

ఇది ఎవరో అణు పరిశ్రమ వ్యతిరేకులు ఇచ్చిన లెక్క కాదు. సామాజిక కార్యకర్తలు పనిగట్టుకుని ఉన్న అంకెల్ని పెంచి చెప్పిన సంఖ్య అసలే కాదు. ఫుకుషిమా ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసిన జపాన్ ప్రభుత్వం ఇచ్చిన వివరాలు కూడా కాదు. ఏ కంపెనీ అయితే ఫుకుషిమా ప్రమాద తీవ్రతను దాచి ఉంచడానికి నానా రకాలుగా శ్రమ పడుతోందో, ఏ కంపెనీ అయితే జపాన్ ప్రభుత్వం నుండి కూడా సమాచారం చెప్పకుండా దాచి ఉంచిందన్న ఆరోపణలు ఎదుర్కొన్నదో ఆ కంపెనీ -టెప్కో- స్వయంగా ఇచ్చిన సమాచారం. కాబట్టి ప్రజా వ్యతిరేక రంధ్రాన్వేషకులు ఎవరైనా మిగిలి ఉంటే ఈ లెక్కను నిస్సందేహంగా నమ్మవచ్చు.

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద అండర్ గ్రౌండ్ లో పైప్ లైన్లను నిర్మించారు. అణు రియాక్టర్లను చల్లబరిచే నీటిని సరఫరా చేయడానికీ, చల్లబరిచిన తర్వాత రేడియేషన్ తో కలుషితం అయిన నీటిని తోడివేయడానికీ ఈ పైపులను వినియోగిస్తారు. సెప్టెంబరు 11, 2011 న సంభవించిన భారీ భూకంపం వలన ఈ నిర్మాణాలు కొన్నిచోట్ల పాక్షికంగానూ, కొన్ని చోట్ల పూర్తిగానూ ధ్వంసం అయ్యాయి. వీటిని బాగుచేసే అవకాశం గానీ, పునర్నిర్మించే అవకాశం గానీ అక్కడ లేదు. దానితో ఈ పైపుల గుండా ప్రవహించే రేడియేషన్ కలుషిత నీరు అంతకంతకూ పేరుకుపోతూ వచ్చింది. దానితో పాటు ఈ నీరు ధ్వంసం అయిన పైపుల గుండా భూగర్భంలోకి ఇంకిపోయి భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తోంది.

ఇలాంటి నీటిలో ఒక లీటర్ కి 2.35 బిలియన్ బెక్యూరల్స్ రేడియేషన్ ఉండడం అంటే ఆ నేల, పరిసరాలు ఇంక ఎందుకూ పనికిరానట్లేననీ నిపుణులు చెబుతున్నారు. అంతవరకే అయితే నయమే. కానీ ఈ రేడియేషన్ నీటిని త్వరలో సముద్రంలో కలుపుతామని టెప్కో చెబుతూ వస్తోంది. అదే జరిగితే సముద్రంలోని మత్స్య సంపదను జాలరులు వదులుకోవాల్సిందే. మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. జపాన్ చేపలు ఎగుమతికి నోచుకోక ఆర్ధిక వ్యవస్ధపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడవేసింది. తాజా వార్తతో ఈ పరిస్ధితి ఇంకా తీవ్రం అవుతుంది.

ఫుకుషిమా డ్రైనేజి నీటిలో రేడియేషన్ అత్యంత తీవ్రమైన ప్రమాదకర స్ధాయికి చేరుకున్న రీత్యా “అత్యవసర పరిస్ధితి” ఏర్పడిందని జపాన్ అణు నియంత్రణ సంస్ధ ప్రకటించింది. ఇంకా ఘోరం ఏమిటంటే డ్రైనేజీ నీరు మరో మూడు వారాల్లో భూమి ఉపరితలం మీదికి వచ్చేస్తుందని టెప్కో ప్రకటించింది. డ్రైనేజి నీరు సముద్రంలో కలవకుండా చేయడంలో ఇప్పటికే విఫలం అయిన టెప్కో తాజా ప్రమాదకర పరిస్ధితికి స్పందించే పరిస్ధితిలో అసలే లేదని తెలుస్తోంది. అడ్డుగోడలను మరింత శక్తివంతం కావిస్తామని, మరింత వేగంగా నీటిని పంపింగ్ చేస్తామని కంపెనీ ప్రకటిస్తున్నా ఆ చర్యలు ప్రమాదాన్ని ఎంతవరకు నివారిస్తాయో తెలియదు.

గత రెండు సంవత్సరాలుగా ఈ విధంగా వెలువడుతున్న కలుషిత నీటిని ప్రత్యేకంగా నిర్మించిన స్టోరేజి ట్యాంకుల్లోకి పంపుతున్నామని టెప్కో చెబుతూ వచ్చింది. అయితే వాస్తవంలో ఈ పద్ధతిలో విష తుల్యమైన నీటిని తాము అదుపు చేయలేకపోయామని గత నెలలో టెప్కో అంగీకరించిందని రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. ఆర్.టి ప్రకారం మార్చి 2013 ఆఖరు నాటికి వివిధ స్ధాయిల్లో రేడియేషన్ కలిగి ఉన్న 360,000 టన్నుల నీటిని కంపెనీ నిలవ చేసింది. ఫుకుషిమా అణు కర్మాగారాన్ని పూర్తిగా శుభ్రం చేయడానికి మూడు శతాబ్దాలకు (అవును 30 సంవత్సరాలే) పైగా పడుతుందని టెప్కో కంపెనీ, జపాన్ ప్రభుత్వం తెలిపాయి. కానీ నెత్తిమీదికి వచ్చిన ప్రమాదాన్ని ఎలా నివారిస్తారో వేచి చూడాలి.

ఫుకుషిమా ప్రమాదం వలన 90,000 మంది తమ ఇళ్ళూ వాకిళ్లూ వదిలి తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో చాలామందికి ఇంకా నష్ట పరిహారం అందలేదని పత్రికలు చెబుతున్నాయి.  ఇంత జరిగినా జపాన్ ప్రభుత్వం పాఠాలు నేర్వలేనట్లు కనిపిస్తోంది. ఫుకుషిమా ప్రమాదం అనంతరం దేశంలోని అణు కర్మాగారాలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మళ్ళీ వాటిని ఒక్కటోక్కటిగా తెరుస్తోంది. రెండు రియాక్టర్లను ఇప్పటికే తెరవగా మార్చి 2015 లోపల మరో నాలుగు రియాక్టర్లను ప్రభుత్వం తెరవనున్నదని రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధలు చెబుతున్నాయి. ప్రజా ప్రభుత్వాలైతే కదా ప్రజల గోడు పట్టించుకోడానికి!

One thought on “ఫుకుషిమా డ్రైనేజి నీటిలో ప్రమాదకర రేడియేషన్ -కంపెనీ

  1. ఫుకుషిమా లో రేడియోధార్మికత, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఒక సవాలు !
    అనేక మానవోపకర ప్రయోజనాలు ఉన్నా కూడా, రేడియో ధార్మికత నియంత్రణలో కొద్ది పాటి లోపాలు కూడా , వాతావరణం లో రేడియో ధార్మికతను వెదజల్లి , మానవ వినాశానికి కారణమవుతుంది ! రేడియో ధార్మిక సీశియం ప్రకృతి లో సహజం గా లేదు. ఇది పూర్తి గా మానవ నిర్మితం. ఎట్లాగంటే , అణు రియాక్టర్ లలో న్యూ క్లియర్ ఫిషన్ అనే చర్య ఫలితం గా ఏర్పడుతుంది ఈ రేడియో ధార్మిక పదార్ధం !సీశియం హాఫ్ లైఫ్ ( అంటే అర్ధ జీవిత కాలం అనొచ్చేమో తెలుగులో ! ) సుమారు ముప్పై సంవత్సరాలు అంటే ఒక పరిమాణం లో ఉన్న సీశియం సగానికి తగ్గాలంటే పట్టే కాలం ! మానవ శరీరం లో ప్రవేశిస్తే, అర్ధ జీవిత కాలం డెబ్బై రోజులు ఉంటుంది.కానీ ఈ సమయం లోనే ప్రాణాలు పోవచ్చు! ఈ సీశియం ఏ కారణం చేత నైనా మానవ శరీరం లో ప్రవేశిస్తే ,అది ప్రాణాంతకం ! కుక్కల మీద చేసిన ప్రయోగాలలో సీశియం తమ దేహం లో ప్రవేశించిన కుక్కలు ముప్పై మూడు రోజుల్లో చచ్చి పోయాయి ! ఫుకుషిమా సముద్ర తీరం లో ఉన్న చేపలనూ, గొడ్డు మాంసాన్నీ యూ రోపియన్ దేశాలు పూర్తి గా నిషేధించాయి , ఆ జీవాలలో మానవులకు ప్రాణాంతకం అయ్యే పరిమాణం లో రేడియో ధార్మిక సీశియం కనుక్కోబడడం వల్ల !

వ్యాఖ్యానించండి