అవినీతి రాజకీయ నాయకులకు, ఇసుక మాఫియాకు ఎదురొడ్డి నిలబడిన యువ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అక్రమ సస్పెన్షన్ విషయంలో తండ్రీ కొడుకులయిన యాదవ్ లిద్దరూ తమ మంకు పట్టు కొనసాగిస్తున్నారు. దుర్గాశక్తికి న్యాయం చేయాలంటూ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన నేపధ్యంలో ఆమె సస్పెన్షన్ జాతీయ స్ధాయి రాజకీయ సమస్యగా ముందుకు వచ్చింది. దానితో ములాయం సింగ్ యాదవ్ తన పుత్రరత్నం తీసుకున్న చర్య సరైనదే అని ప్రకటిస్తుండగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు స్పస్పెన్షన్ రద్దు కోసం ఆందోళన చేస్తున్నాయి. కాగా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించాడు. యు.పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే “సరైనది. అదే అంతిమం” అని ములాయం ప్రకటించాడు. “బి.ఎస్.పి పాలనలో అనేకమంది అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఒక అధికారి ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కానీ కేంద్రం అప్పుడేమీ నివేదికలు కోరలేదే? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే సమాజ్ వాదీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం, ఒత్తిడి చేయడం” అని ఆయన ఢిల్లీలో పార్లమెంటు వద్ద విలేఖరులతో అన్నారు.
“ఒక అధికారి తప్పు చేస్తే ఆమె/అతడు శిక్ష ఎదుర్కోవాల్సిందే. ప్రభుత్వాలు పని చేసేది అలాగే” అని ఆయన పుత్రుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సూత్రాలు వల్లించాడు. నిజానికి తప్పు చేసింది దుర్గాశక్తి నాగపాల్ కాదు. ఆమె సుప్రీం కోర్టు ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేశారు. ఇసుక మాఫియాకు మద్దతుగా నిలుస్తున్న యు.పి ప్రభుత్వానిదే అసలు తప్పు. పార్లమెంటు ఎన్నికల్లో స్ధానిక అభ్యర్ధిని గెలిపించుకోడానికి, అదే సమయంలో నిజాయితీ అధికారిని అడ్డు తప్పించుకోడానికీ సమాజ్ వాదీ ఎప్పటిలాగానే నీతిమాలిన చర్యలకు దిగుతోంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా అధికారిపై ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది.
విషయానికి పత్రికలు పతాక శీర్షికల ద్వారా ప్రాముఖ్యం ఇవ్వడంతో సోనియా గాంధీ అవకాశం వినియోగించదలుచుకున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతినే ప్రధాన అస్త్రంగా ప్రతిపక్ష బి.జె.పి చేసుకుంటుందని ప్రకటించిన నేపధ్యంలో ఆమె తామే అవినీతికి వ్యతిరేకం అని చెప్పదలిచారు. “నీతిమంతమైన ఒక యువ ఐ.ఎ.ఎస్ అధికారి తన విధులు తాను నిర్వర్తిస్తుంటే అలాంటివారికి తగిన న్యాయం చేయాలి” అని ఆమె ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం, ఛార్జిషీటుకు గురయిన ఐ.ఎ.ఎస్ అధికారులు తమకు అన్యాయం జరిగిందని భావిస్తే వారు కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాల్సిందిగా కోరవచ్చు. అయితే దుర్గాశక్తి నుండి నాగపాల్ ఇంతవరకూ ఎటువంటి విన్నపమూ తమకు అందలేదని సిబ్బంది వ్యవహారాలు మరియు శిక్షణ శాఖ మంత్రి వి.నారాయణ స్వామి విలేఖరులకు తెలిపారు.
కానీ ఐ.ఎ.ఎస్ అధికారుల రాష్ట్ర సంఘం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చింది. దాని గురించి మాట్లాడకుండా దుర్గాశక్తి నుండి విన్నపం రాలేదని చెప్పడం పలు అనుమానాలు కలిగిస్తోంది. ఆహార భద్రతా బిల్లు ఆమోదం పొందడానికి 22 మంది సభ్యులున్న ఎస్.పి మద్దతు అవసరం కావడంతో ప్రధాని మన్మోహన్ నుండి తగిన స్పందనను ఆశించడం వ్యర్ధమే కావచ్చు. “కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నీ వాటికి అనుగుణంగానే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపుల్లో ఉన్నాము” అని ప్రధాని ప్రకటించి ఊరుకున్నారు. సిబ్బంది వ్యవహారాలు మరియు శిక్షణ శాఖ ప్రధాని పర్యవేక్షణలోనిదే కావడం ఈ సందర్భంగా గుర్తించాలి.
ఇసుక మాఫియా పనే -వక్ఫ్ కార్యదర్శి
దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ ఇసుక మాఫియా పనేననీ ఇందులో ముస్లిం హక్కుల పరిరక్షణ సమస్య లేనేలేదని యు.పి వక్ఫ్ సంస్ధ అయిన ‘హజ్రత్ సయ్యద్ బూరేశా కమిటీ’ కార్యదర్శి కదీర్ ఖాన్ స్పష్టం చేస్తున్నారు. “ఆమె ఇటీవల చర్యల ద్వారా గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని ఇసుక మైనింగు మరియు భూ ఆక్రమణల మాఫియా ఉనికినే ప్రశ్నార్ధకం కావించారు. ఈ మాఫియాకు రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉన్నది. కదల్పూర్ మసీదు కూల్చివేత వల్లనే ఆమెని సస్పెండు చేశారనడం ఒట్టి బూటకం.” అని ఆయన చెప్పారని ది హిందు తెలిపింది.
“మా (ముస్లింల) సమస్యల గురించి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే కోట్ల రూపాయల ఖరీదు చేసే వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకుంటుంటే చర్యలు ఎందుకు తీసుకోరు?” అని కదీర్ ఖాన్ ప్రశ్నించారు. తాము 2008 నుండి వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు సహకరించడం లేదనీ, దుర్గాశక్తి నాగపాల్ అధికారిగా వచ్చాకనే తమ ఫిర్యాదుల విషయంలో కనీస కదలిక వచ్చిందని ఆయన తెలిపారు.
“జిల్లా అధికారుల వద్ద మేము అనేక ఫిర్యాదులు చేశాము. కానీ రాజకీయ పలుకుబడి వల్ల ఒక్క చర్యా తీసుకోలేదు. మే 2012లో దంకౌర్ పోలీసు స్టేషన్ లో ఎలాగో ఒక ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయగలిగాము. దాని కాపీలు ముఖ్యమంత్రి అఖ్లేష్ యాదవ్ కూ, అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి అజామ్ ఖాన్ కు పంపాము. కోట్లాది వక్ఫ్ ఆస్తుల అక్రమ ఆక్రమణ వాస్తవమేనని జులై 2012లో ఏరియా పోలీసు అధికారి నివేదిక పంపితే ఆయనను వెంటనే ఆ స్టేషన్ నుండి బదిలీ చేశారు. గత నవంబర్ లోనే ఏరియా ల్యాండ్ రెవిన్యూ అధికారి రిజిస్టర్ లో అక్రమ ఎంట్రీలు ఉన్నాయని వాటిని సరిదిద్దాలని కూడా సిఫార్సు చేశారు. ఇటీవల జిల్లా మేజిస్ట్రేట్ అధికారి కార్యాలయానికి వెళ్ళినపుడు మా కేసులను ఎస్.డి.ఎం దుర్గాశక్తి నాగపాల్ గారికి అప్పగించారు. మమ్మల్ని తీవ్రంగా ఆశ్చర్యపరుస్తూ మా ఫిర్యాదులను ఆమె శ్రద్ధగా పరిశీలించారు. ఫిర్యాదులపై అవసరమైన చర్యలు తీసుకున్నది ఆ ఒక్క అధికారి మాత్రమే” అని కదీర్ ఖాన్ తెలిపారు.
- జంతర్ మంతర్ వద్ద భగత్ సింగ్ సేన ర్యాలి
- దుర్గాశక్తి నాగపాల్
- లక్నోలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన
- ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన -లక్నో
వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ అక్రమ ఆక్రమణలకు గురయింది వివరిస్తూ లేఖ ద్వారా ఎస్.డి.ఎం కు ఫిర్యాదు చేశామనీ, ఒక జాబితా కూడా ఇచ్చామని కదీర్ తెలిపారు. “మా ఫిర్యాదును పరిగణించిన నాగపాల్ జులై 10 తేదీన ఆక్రమణదారులకు ఇచ్చిన నోటీసులకు బదులు రాలేదన్న సంగతిని ల్యాండ్ రెవిన్యూ అధికారులకు గుర్తు చేస్తూ సూచనలు ఇచ్చారు. అసలు నోటీసులు తీసుకోడానికి కూడా ఆక్రమణదారులు నిరాకరించారు. కానీ ఒక పక్షం రోజులన్నా గడవక ముందే మతసామరస్యం పేరుతో ఎస్.డి.ఎం (నాగపాల్) ను అడ్డు తొలగించుకున్నారు” అని కదీర్ తెలిపారు. కదీర్ మాటలను బట్టి దుర్గాశక్తి సస్పెన్షన్ వెనుక ఇసుక మాఫియాతో పాటు ల్యాండ్ మాఫియా హస్తం కూడా ఉందని భావించవచ్చు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మసీదు గోడ కూల్చివేసినట్లుగా దుర్గాశక్తి నాగపాల్ పైన యు.పి ప్రభుత్వం ఆరోపణలు మోపింది. కానీ అది వాస్తవం కాదని తెలుస్తోంది. జిల్లా అధికారులు మరియు పోలీసు అధికారుల ప్రకారం జులై 27 తేదీన గోడను కూల్చివేయడానికి ముందు రోజు సర్కిల్ అధికారి వసీం ఖాన్, ఏరియా ల్యాండ్ రెవిన్యూ అధికారి ఇద్దరూ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్ధులను సమావేశపరిచి మసీదు నిర్మాణం సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధం అని వివరించి చెప్పారు. మసీదు గోడను కూల్చివేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. “కానీ గోడ కూల్చివేయాలని చెప్పినపుడు ఏ మాత్రం ప్రతిఘటించని స్ధానికులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయం రాజకీయం అయ్యాకే వారు నిరసనలు చేయడం మొదలుపెట్టారు” అని గుర్తింపబడడానికి నిరాకరించిన జిల్లా అధికారులు చెప్పారని పత్రిక తెలిపింది.
అదీ విషయం! సామాన్య జనమే తెలిసీ తెలియకుండా తమకు, తమ ఆస్తులకు రక్షణగా నిలిచిన ఒక యువ ఐ.ఏ.ఎస్ అధికారికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగస్వాములు అవుతున్నారు. సంకుచిత మతప్రయోజనాల మాయలో పడి తమ ప్రయోజనాలకు తామే విరుద్ధంగా నిలబడ్డారు. కష్టజీవికి కాసింత కూడు పెట్టని మతం, వారి కొంపాగోడు దోపిడికీ గురవుతున్నప్పటికీ చూడకుండా ఏ విధంగా అడ్డుతెరలను సృష్టిస్తుందో ఈ ఉదాహరణ ద్వారా స్పష్టం అవుతోంది.
సుప్రీంలో వ్యాజ్యం
ఇదిలా ఉండగా సుప్రీం కోర్టులో నాగపాల్ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ‘ఇది యజమాని సేవకుల మధ్య వ్యవహారం’ అంటూ విచిత్ర వ్యాఖ్యానం చేసి నాగపాల్ సస్పెన్షన్ లో జోక్యానికి అలహాబాద్ హై కోర్టు నిరాకరించిన నేపధ్యంలో సుప్రీం కోర్టు తాజా పిటిషన్ కు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మనోహర్ లాల్ శర్మ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. గుడి, చర్చి, మసీదు, గురుద్వారాల పేరుతో ప్రభుత్వ స్ధలాల్లో, పార్కులలో ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనధికార నిర్మాణాలు చేపట్టడం నిలిపివేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులకు ఆదేశాలు ఇస్తూ సెప్టెంబర్ 29, 2009 తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతిని పిటిషనర్ గుర్తు చేశారు.
ఫేస్ బుక్ అరెస్టు… మళ్ళీ!
పిచ్చి ముదిరింది అంటే రోకలి తలకు చుట్టమన్నాట్ట వెనకటికొకడు! దుర్గాశక్తి నాగపాల్ విషయంలో ఇలాంటి విచిత్రాలే జరుగుతున్నాయి. ఫేస్ బుక్ పోస్టు ద్వారా ఆమెకు మద్దతు ఇచ్చినందుకు ఒక దళిత మేధావి పైన కేసు బనాయించింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకులను విమర్శిస్తూ నాగపాల్ కు ఆయన తన పోస్టులో మద్దతు తెలిపారు. దానితో అల్లర్లు రెచ్చగొడుతున్నారన్న కేసు (సెక్షన్ 153/295) ఆయనపై మోపారు. సమాజ్ వాదీ పార్టీనీ, ఎస్.పి పార్టీ రాంపూర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ నూ తరచుగా విమర్శిస్తున్నందుకే తన తండ్రి కున్వాల్ భారతిని అరెస్టు చేశారని ఆయన కుమారుడు ఆరోపించాడు.
కునాల్ పోస్టు ఇదే:
“How they had been cut off from the public, the morale of criminals was high and unrestrained ministers had turned into monsters, they are penning down their own downfall. But to make these “power-blinded” persons see it was like trying to make a buffalo dance.”
అరెస్టే చెయ్యాలనుకుంటే ఇలాంటి రాతలు, అభిప్రాయాలూ ఫేస్ బుక్ లో ఎన్ని లేవు?





నీరూ నేలా అందరిదీ !
కానీ కొందరే దోచుకునేదీ !
ఇదేం సిత్రం, సమాజ వాదీ ?!
పైగా, రామ నామం కూడా గుర్తొస్తుందీ ???