ఏదీ రూపాయి, ఎక్కడా కనబడదేం? -కార్టూన్


Rupee value

రాజకీయ నాయకుడు: “రూపాయి చాలాకనిష్ట స్ధాయిలో ఉంది. ఇప్పుడూ – దాన్ని ఇంకా మెరుగ్గా గవర్న్ చెయ్యొచ్చంటారా?”

రూపాయి బతుకు కనాకష్టంగా మారింది. జింబాబ్వే ప్రభుత్వం లాగా జాతీయ కరెన్సీ రూపాయి రద్దు చేసుకుని అమెరికన్ డాలర్ నే కరెన్సీగా చేసుకునే రోజులు దాపురిస్తాయా అన్నట్లు తయారయింది పరిస్ధితి. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం కొనసా…….గుతూనే ఉంది.

జులై 8 తేదీన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయి (డాలర్ కి రు. 61.21 పై.లు) కి  పతనమైన రూపాయి, ఆర్.బి.ఐ తీసుకున్న చర్యలతో కొంత కోలుకుంది. గత శుక్రవారం (ఆగస్టు 2) మళ్ళీ పతనమైన రూపాయి డాలర్ కు రు. 61.10 పై.ల స్ధాయికి చేరుకుంది. ఆర్.బి.ఐ అతి సమీపం నుండి పరిశీలిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకుంటుండగానే ఈ పతనం కొనసాగుతోంది. అంటే ఆర్.బి.ఐ నియంత్రణ పరిధిని దాటిపోయి రూపాయి స్వేచ్ఛగా వ్యవరిస్తోందన్నమాటే!

కానీ రూపాయి ప్రాణం ఉన్నదేమీ కాదు తన ఇష్టానుసారం వ్యవహరించడానికి. ఆర్.బి.ఐ నియంత్రణ దాటిందంటే దానర్ధం మరొకరెవరో దానిని నియంత్రించగలుగుతున్నారనే. ప్రభుత్వాలు ఎప్పుడూ కలవరించే సరళీకరణ-ప్రయివేటీకరణ-ప్రపంచీకరణ విధానాలను ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకుంటే చాలు, ఆ ‘మరొకరెవరో’ గ్రహించడానికి. ఆర్ధిక వ్యవస్ధలోని మౌలికాంశాలు గాడి తప్పకుండా ప్రతి దేశమూ నిర్మించుకునే నియంత్రణ వ్యవస్ధలను సరళీకరించి, ‘ప్రైవేటు’ కంపెనీలకు అనువుగా ఉండేలా, ‘ప్రపంచ’ స్ధాయి బహుళజాతి గుత్త కంపెనీలకు దాసోహం చేయడమే ఈ త్రిసూత్ర పధక లక్ష్యం.

సరిగ్గా, దగ్గరగా, తీక్షణంగా పరిశీలించి చూసినట్లయితే రూపాయి విలువను తగ్గించామన్న అపప్రధ తమకు తగలకుండా రూపాయికి ఒక్కో అడుగులో ఒక్కొక్క సరికొత్త అధమ స్ధాయిని ఆపాదించడం మనం గమనించవచ్చు. 1992లో రెండు రోజుల వ్యవధిలో రూపాయి విలువను 25 శాతం పైగా పి.వి-మన్మోహన్ ల ద్వయం తగ్గించినప్పుడు దేశం అంతా చర్చ జరిగింది. ఆ చర్చ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలడానికి దారి తీసింది. స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగల స్ధిరమైన ప్రభుత్వం ఏర్పడడానికి మళ్ళీ ఏళ్లతరబడి ఆగాల్సి వచ్చింది.

ఇప్పుడా పని పెట్టుకోకుండా కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లు మార్కెట్ శక్తులే దానికి కారణం అని రూపాయి పతన భారాన్ని కనిపించని గంధర్వులపైకి నెట్టివేస్తున్నాయి ప్రభుత్వాలు. గంధర్వులు కంటికి కనపడరు. అలాగే మార్కెట్ శక్తులు కూడా. డబ్బు సంచులతో, షేర్ల దానాలతో, పర్సెంటీజీలతో ప్రభుత్వ నాయకులను తెరవెనుకనుండి కనపడకుండా నడిపించే కంపెనీలే మార్కెట్ శక్తులు అని జనానికి ఎప్పుడు తెలియాలి?  తెలిసి ప్రశ్నించే రోజు ఎప్పుడు రావాలి?

మొన్నటికి మొన్ననే డాలర్ కి 40 రూపాయలు వచ్చేవి. నూతన ఆర్ధిక విధానాల రెండో అంచె అమలు కార్యక్రమం నూతన మిలీనియంలో మొదలయిందో లేదో డాలర్ కి 45 రూపాయలన్నారు. పోన్లే 50 రూపాయలు దాటలేదు కదా అనుకునే లోపే అది కూడా అనేశారు. నిన్ననే ఇంకా చెప్పాలంటే గత డిసెంబరులో కూడా డాలర్ కి 55 రూపాయలు. ఎఫ్.డి.ఐ లకు గేట్లు ఇంకా బాగా తెరిస్తే రూపాయి త్వరలోనే మునుపటి స్ధితికి, అంటే డాలర్ కి 50 రూ. స్ధితికి, చేరుతుందని ఊదరగొట్టారు. జనం సరే అనకుండానే చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐలు, ఇన్సూరెన్స్ బిల్లు, డీజిల్ అనియంత్రణ, గ్యాస్ ధరల మార్కెటీకరణ జనం నెత్తిపైన రుద్దారు. రూపాయి మునుపటి దశకు చేరుకోకపోగా 60 మార్కును దాటి జనాన్ని మాత్రమే కాదు ఉద్దండ పిండాలుగా చెప్పుకునే ఆర్ధిక పండితులనూ పరిహసిస్తోంది.

పత్రికల వార్తల ప్రకారం ఫ్యూచర్ మార్కెట్ లో రూపాయి కరెన్సీ విలువ విదేశాల్లోని ‘నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్’ మార్కెట్ లో రానున్న నెల కాలంలో రూపాయి విలువ డాలర్ ఒక్కింటికి 61.66 రూపాయలకు పతనం అవుతుందని పందేలు కాశారు. మూడు నెలల కాలానికయితే 62.56 రూపాయలకు పతనం అవుతుందని పందేలు కాశారు. అంటే రూపాయి పతనం వచ్చే నెల నుండి మూడు నెలల కాలంలో మరింత పతనం అవుతుందని వారి గట్టి నమ్మకం. అసలు ఇలాంటి పందేలు కూడా ఆయా సరుకుల విలువల్ని కిందకి దిగ్గోడుతుంటాయి. ఇవి కూడా మార్కెట్ శక్తులే మరి. కళ్ళెం వదిలాక ‘అయ్యో, పరుగెడుతోంది’ అని బాధ నటిస్తే ఏం ప్రయోజనం?

ఎఫ్.ఐ.ఐ (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్) లు పరుగెట్టుకుంటూ వస్తాయి చూసుకోండి అంటూ భారత ప్రభుత్వం వరుసగా సరళీకరణ చర్యలు ప్రకటించింది. పరుగెట్టుకురావడం సంగతేమో గానీ ఇక్కడ ఉన్నవి పరుగెత్తి పారిపోకుండా ఆపడమే మనవారి వల్ల కావడం లేదు. గత జులై నెలలోనే రు. 18,500 కోట్ల మేర ఎఫ్.ఐ.ఐ లు దేశ కేపిటల్ మార్కెట్ ను విడిచి చక్కా పోయాయి. ఒకవైపు ఎఫ్.ఐ.ఐ ల పలాయనం, మరోవైపు రూపాయి విలువను షార్ట్ చేస్తున్న కరెన్సీ మాయగాళ్ళు! వీళ్ళేవరూ మన చేతిలోనివారు కాదు. మన చేతిలోని కళ్ళేలనేమో తీసుకెళ్లి వారికే అప్పగిస్తుంటిరి! ఇక నియంత్రించడానికి మన చేతుల్లో ఏం మిగిలింది, ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఖర్చు పెట్టుకుని రూపాయిలను కొనుగోలు చేస్తూ నిల్వలను ఆవిరి చేసుకోవడం తప్ప?

రూపాయి విలువకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రామాణికత (standardness) లేదా ‘సాధారణత’ (normal) ను చేర్చుతూ జనానికి అదే అసలు సాధారణత అని నచ్చజెప్పడమే మన ప్రభుత్వాలు తలకెత్తుకున్న బాధ్యత! అంటే ఏమిటంటే… డాలర్ కి 40 రూపాయలు అన్నపుడు అదే రూపాయి యొక్క సాధారణ విలువ అని మనం నమ్ముతాము. డాలర్లని రూపాయిల్లోకి మార్చుకోవాల్సి వచ్చినపుడు 1 డాలర్ = 40 రూపాయలు అని గుర్తుంచుకుని లెక్కలు వేసుకుంటాం.

కానీ ద్రవ్య మార్కెట్ శక్తుల లాభాల కోసం సరళీకరణ విధానాలు చేపట్టడంతో అది కాస్తా 45 రూపాయలకు పడిపోతుంది. అంటే ఇప్పుడు కొత్త సాధారణత (new normal) అమలులోకి వచ్చిందన్నమాట! ఈ పరిణామాన్ని గుర్తించి new normal కి జనం అలవాటు పడే లోపు  మరో కొత్త normal అనగా ‘1 డాలర్ = 50 రు.’ అమలులోకి వచ్చేస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త ‘normals’ కి జనం అలవాటు పడడానికి ప్రభుత్వ పెద్దలు, ఆర్.బి.ఐ పండితులు కాకమ్మ కబుర్లు మనకి చెబుతూ ఉంటారు. విదేశాల్లో పరిస్ధితి బాగో లేదంటారు, ఎగుమతులు తగ్గాయంటారు, ఎఫ్.ఐ.ఐల ఉపసంహరణ అంటారు. మళ్ళీ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి అంటారు. ఇదిగో రేపో ఎల్లుండో అన్నీ చక్కదిద్దుకుంటాయి అంటారు.

అలా  చెబుతుండగానే మళ్ళీ సరికొత్త నార్మల్ ఉనికిలోకి వస్తుంది. ఈసారి 1 డాలర్ = 55 రూ. అనేది నార్మల్. మళ్ళీ షరా మామూలే. ఆ విధంగా కొద్ది సంవత్సరాల్లోనే రూపాయి విలువను డాలర్ కి 40 రు. నుండి 61 రు. వరకూ చేర్చారు. పైన చెప్పిన ఫ్యూచర్ మార్కెట్ వ్యవహారాన్ని బట్టి ఇది 65 రూ. కి చేరుకునే రోజు త్వరలోనే ఉందనీ అంటున్నారు. అసలు 70 రూ. కి చేరుకునే దాకా మార్కెట్లు శాంతించవు అనీ అంటున్నారు. ఒకేసారి డాలర్ కి 100 రూపాయలు అయితేనే మార్కెట్లు స్ధిరీకరణ సాధించేది అంటున్నవారు కూడా లేకపోలేదు.

ఈ స్ధిరీకరణ అనేది భారత దేశ ప్రజల కోసం కాదు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను మహా మాంద్యం లోకి నెట్టి తీవ్రమైన సంక్షోభపు లోతుల్లోకి దిగేసిన వాల్ స్ట్రీట్, ది సిటీ (ఆఫ్ లండన్), ఫ్రాంక్ ఫర్ట్, దలాల్ స్ట్రీట్ తదితర ద్రవ్య మార్కెట్లలోని బడా బడా బహుళజాతి కంపెనీల లాభదాహం సంతృప్తి పడడం కోసమే ఈ తంపులాట. ఎందుకంటే మన ఆర్ధిక వ్యవస్ధ మనది కాదు. గ్లోబలైజేషన్ అనే నాటకంలో అది పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలకు అనుబంధ ఆర్ధిక వ్యవస్ధగా మార్చివేయబడింది. అనగా వారి ఆర్ధిక వ్యవస్ధలకు ఏది అవసరమైతే అది ఇక్కడ జరిగిపోవాలి. అలా జరగడానికి అనుకూలంగానే మన పెద్దల మాటలు ఉంటాయి. కొంత తరిచి చూస్తే ఈ సంగతి గమనించొచ్చు.

కాబట్టి రూపాయి విలువను మైక్రోస్కోపులో వెతుక్కోవాల్సిన రోజు త్వరలోనే వస్తుంది. చాప కిందికి నీళ్ళు వచ్చేదాకా కదిలేది లేదంటే ఆ నీళ్ళు వచ్చేశాయి. చూడడానికి, స్పర్శ తెలియడానికి మనమే కళ్ళు, చర్మమూ కోల్పోయినట్లున్నాము.

వ్యాఖ్యానించండి