కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి ఇదొక తార్కాణంగా పలువురు కాశ్మీరీలు ఈ వెబ్ సైట్లలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జమ్ము&కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్విట్టర్ లో స్వయంగా తన అసంతృప్తిని ప్రకటించడంతో కాశ్మీరు ప్రజలు పర్వేజ్ రసూల్ ప్రదర్శన కోసం ఎంతగా ఎదురు చూశారో అర్ధం అవుతోంది. కెప్టెన్ కోహ్లీ మాత్రం బౌలింగ్ పధకంలో రసూల్ ఇమడని పరిస్ధితులు ఉండడం వలన ఆడించలేకపోయామని చెబుతున్నారు. క్రీడల చుట్టూ జాతీయ సెంటిమెంట్లు ఎలా అల్లుకుని ఉంటాయో పర్వేజ్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అంతే కాకుండా జాతీయ స్రవంతి నుండి వేరుగా ఉంచబడిన ప్రజల్ని గెలుచుకుని తమలో కలుపుకోవాలంటే అందుబాటులో ఎన్ని అవకాశాలు ఉంటాయో కూడా ఈ ఉదాహరణ తెలియజేస్తోంది.
ప్రర్వేజ్ రసూల్ రంజీ ప్లేయర్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా ధాటిగా చేయగల ఆల్ రౌండర్ అని ది హిందు తెలిపింది. 5 మ్యాచ్ ల సిరీస్ ను 5-0 తో ఇండియా గెలుచుకుంది. 3-0 తేడాతో సిరీస్ భారత్ వశం అయ్యాక మిగిలిన రెండు మ్యాచ్ లు అలంకారప్రాయం అయ్యాయి. కాబట్టి పర్వేజ్ ను ఆడిస్తారని కాశ్మీరీలు ఎంతగానో ఎదురు చూశారు. కనీసం 4-0 దశకు చేరుకున్న తర్వాతయినా ఆడిస్తారని ఎదురు చూసినా చివరి మ్యాచ్ లో కూడా పర్వేజ్ రసూల్ బెంచికే పరిమితం కావడంతో కాశ్మీరీల ఎదురుచూపులు కాస్తా విషాదం, ఉక్రోషంగా మారాయి. అనేకమంది ఆగ్రహం చెందారు కూడా.
బిజ్ బేహారా కు చెందిన పర్వేజ్ రంజీ లాంటి ఫాస్ట్ క్లాస్ మ్యాచుల్లో బాగా ఆడడం ద్వారా జాతీయ జట్టు ఎంపికకు పోటీదారుగా నిలిచాడు. 2012-13 రంజి ట్రోఫీలో జమ్ము&కాశ్మీరు తరపున మంచి ప్రదర్శన ఇచ్చాడనీ, అత్యధికంగా వికెట్లు తీశాడని ది హిందు తెలిపింది. సీజన్ ముగిసే నాటికి అతనే టాప్ స్కోరర్ మరియు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడుగా నిలిచాడని తెలిపింది. (మొత్తం 7 రంజి మ్యాచుల్లో 594 రన్లు, 33 వికెట్లు. రంజీ మొత్తంలో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శనగా తెలుస్తోంది.) దాని ఫలితంగానే రసూల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
పర్వేజ్ రసూల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాక పత్రికలన్నీ ఆ విషయాన్ని పతాక శీర్షికలతో దేశానికి తెలియజేశాయి. కాశ్మీరు పట్ల ఇండియా సహృదయంతో ఉన్నదో చూసారా అన్నట్లుగా కధనాలు రాశాయి. రసూల్ కు అందిన అభినందనలకైతే లేక్కేలేదు. ఒక తెలుగు వ్యక్తి జాతీయ జట్టుకు ఎంపికయితే తెలుగు పత్రికలు ఎంత హడావుడి చేస్తాయో తెలిసిన విషయమే. ‘తెలుగు తేజం’ అనీ ‘ఆంధ్ర ఆణిముత్యం’ అనీ ‘తెలుగు తల్లి ముద్దు బిడ్డ’ అనీ రకరకాల పేర్లు పెట్టి మురిసిపోతాయి. అలాంటిది రాత్రింబవళ్ళు భారత సైనికుల పహారాలో బతికే కాశ్మీరు ప్రజలు తమలో ఒకరు భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడని తెలిస్తే ఇక పండగ ఒక్కటే తక్కువ అనుకోవాల్సిన పరిస్ధితి.
అలాంటిది ఐదు ఆటల్లో ఒక్క దానిలోనూ తమవాడికి అవకాశం దక్కకపోయేసరికి కాశ్మీరు ప్రజల ఆనందం కాస్తా ఇట్టే ఆవిరయిపోయింది. పర్వేజ్ రసూల్ తండ్రి గులాం రసూల్ కూడా క్రికెటరే. ఆయనా అసంతృప్తి చెందినా దానిని బైటికి రానివ్వలేదు. “అప్ సెట్ అయింది వాస్తవం. కానీ టీం మేనేజర్ల నిర్ణయాన్ని మేము పూర్తిగా గౌరవిస్తున్నాము. ఎవరు ఆడాలో, ఎవరు ఆడకూడదో నిర్ణయించడంలో వారే మెరుగైన నిర్ణేతలు. ఈ రోజు తను ఆడినట్లయితే మా కల నిజం అయి ఉండేది. జమ్ము & కాశ్మీర్ లో ప్రతి ఒక్కరూ తమకది గౌరవంగా భావించి ఉండేవారు. కానీ మా కుటుంబమే స్పోర్టీవీటి కలిగిన కుటుంబం. భావోద్వేగాలకు తావియ్యం. ఏదో ఒక రోజు భారత్ తరపున అతను ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ ఆడి తీరతాడు” అని పర్వేజ్ తండ్రి గులాం అన్నారని ది హిందు తెలిపింది. 1970ల్లో గులాం కూడా మంచి క్రికెట్ ఆటగాడని, గవాస్కర్, బేడీ, అబ్బాస్, ఇమ్రాన్ ల కాలంలో ఆడిన వ్యక్తి అని తెలుస్తోంది.
అయితే కాశ్మీరు లోయలో మాత్రం జనం ఆగ్రహంతో ఉన్నారు. “చివరి మ్యాచ్ లో కూడా ఆడడం లేదని తెలిసాక బిజ్ బెహరాలోనూ, లోయలోని ఇతర ప్రాంతాల్లోనూ విషాధఛాయలు అలుముకున్నాయి. ప్రతిభావంతుడయిన కాశ్మీరీ ఆటగాడికి భారత్ చేస్తున్న అన్యాయంగా దీన్ని చూస్తున్నారు” అని షౌకత్ అహ్మద్ అన్నారని పత్రిక తెలిపింది. “ఇప్పటికే రంధ్రాన్వేషణ లాంటిది వ్యాపించి ఉంది. ముఖ్యంగా యువతలో. కాశ్మీరీ ఆటగాడిని ఇండియా ఎప్పటికీ నమ్మదని వారు గట్టిగా భావిస్తున్నారు. పర్వేజ్ కు జరిగిన అన్యాయం పట్ల అనుమానం, రంధ్రాన్వేషణ, పరాయీకరణ, కుట్ర సిద్ధాంతాలు మొదలైనవి మరింతగా వ్యాప్తి చెందుతాయన్నదే మా భయం” అని వ్యాపారవేత్త, క్రీడల ప్రమోటర్ అయిన ఫరూక్ అమీమ్ వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ‘హేట్ ఇండియా’ ప్రచారం ఊపందుకుందని ఆయన ఎత్తిచూపారు.
“వంచన, అవమానాలే పర్వేజ్ రసూల్ కు సమాధానాలుగా అందాయి. ఇండియా-కాశ్మీర్ లు ఎన్నడూ అతకని కాంబినేషనే అని అతను ఖచ్చితంగా తెలుసుకుంటాడు” అని జావిద్ ఎ. భట్ అనే వ్యక్తి ట్వీట్ చేసినట్లు పత్రిక తెలిపింది.
జమ్ము & కాశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ట్విట్టర్ లో తన అసంతృప్తి వెళ్ళగక్కారు. బులవాయోలో జరిగిన నాలుగో మ్యాచ్ లో పర్వేజ్ ఆడకపోవడం చూసి ఆయన ఇలా ట్వీట్ చేశారు “జింబాబ్వేలో పర్వేజ్ రసూల్ కు అవకాశం దక్కకపోవడం చూసి నేను చాలా అసంతృప్తి చెందాను. కమాన్ బి.సి.సి.ఐ! తనను తాను నిరూపించుకోడానికి ఈ యువకుడికి ఒక అవకాశం ఇవ్వండి.”
బహుశా 5వ మ్యాచ్ లో నైనా రసూల్ కు అవకాశం ఇస్తారన్న ఆశతో ఒమర్ ఈ విధంగా ట్వీట్ చేసి ఉంటారు. అయితే బి.సి.సి.ఐ ఆయన ట్వీట్ ని గమనించినట్లు లేదు. దానితో ఒమర్ మళ్ళీ ఇలా ట్వీట్ చేశారు, “అతన్ని నిరాశపరచడానికి జింబాబ్వే వరకూ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందా? అదేదో ఇక్కడే చేసి ఉంటే ఇంకా చౌకలో జరిగిపోయేది కదా?”
కాశ్మీర్ గురించి హిందూత్వవాదులు తరచుగా పనికిరాని భావోద్వేగాలు వ్యక్తం చేస్తుంటారు. ‘మా దేహం ముక్కలైనా, మా దేశాన్ని ముక్కలు కానివ్వం’ అనో, లేదా ‘మా తల్లి నుదుటి సింధూరం’ అనో… ఇంకా ఇలాంటివి. ఇవన్నీ ఎందుకూ అక్కరకురాని, అక్కర్లేని వ్యక్తీకరణలు. కాశ్మీరును భారత దేశంలో భాగంగా ఉంచుకోవాలనుకుంటే మొదట ఆ ప్రాంతాన్ని సింధూరంగానో లేదా భూభాగంగానో చూడడం మానుకోవాలి. కాశ్మీర్ అంటే అక్కడ ప్రజలు నివసిస్తారనీ, అందరిలా వారికి ఒక అస్తిత్వం ఉందనీ, బాధాలూ గాధలూ వారికి ఉన్నాయనీ, వారికీ దుఃఖము, విచారము, బాధ, కోపం లాంటి భావోద్వేగాలు వారికీ ఉన్నాయనీ గుర్తించాలి. భారత దేశంలోనే అనేకానేక ప్రజా సమూహాలకు ఉన్నట్లే వారికీ ఒక చరిత్ర, వారసత్వం, జాతీయత, భాష, సంస్కృతి, జీవన విధానం ఉన్నాయని గుర్తించాలి. ఇవన్నీ ఉన్నాయని గుర్తిస్తే వాటిని కాపాడుకోవాలని ఆ ప్రజలు భావిస్తారని తేలికగానే గుర్తించవచ్చు. అలా గుర్తిస్తే కాశ్మీరును గెలుచుకోవాలంటే మొదట వారి హృదయాలను గెలుచుకోవడం అత్యవరం అన్న వాస్తవం స్ఫురిస్తుంది. దానికి క్రికెట్ లాంటి ఆటలు ఒకానొక మార్గం అయితే అంతకంటే కావలసింది ఏముంటుంది?


ఇది ఒక అర్ధం లేని వివాదంలా కనిపిస్తొంది… మనదెశంలొ ప్రతివిషయాన్ని సంకుచిత ప్రాంతీయ భావనతొ చూడడం బాగా అలవాటు ఐపోతొంది…. టీం నిర్ణైంచుకునె హక్కు పూర్తిగా కెప్టైన్ ది… అందులొ కష్మిర్ యువకుడు కనుక ఎంపిక చెసుకొవలి అనుకొవడం ఏ విధం గా కరెక్ట్…. ఇదివరకు గంగూలి విషయం లొ కుడా అంతె అతను సరిగ్గ అడేవాడు కాదు.. టీం లొంచి తిసివెస్తె బెంగాల్ అంత అట్టుడికిపోయేది… ఇలా ప్రాంతీయ భావనలను సంతౄప్తి పరచడానికి టీం లొకి తిస్కొవాలి అంటె .. మన దేశం 2 టీంలను ఎంపిక చెసుకొవలి..1- గెలవడానికి 2- రకరకాల ప్రజల మనోభావాలని గౌరవించడానికి.. చెప్పలేంలెండి ఓట్ల కోసం మన నాయకులు.. దానిని కూడా సాధ్యం చెయ్యగలరు.
క్రీడలను,రాజకీయాలను ఒకేగాటానికి కట్టడం మానుకోవాలి.ఇప్పుడున్న జట్టుసభ్యులలో ఎందరు తాముఎంపికైన మొదటి సిరీస్లోనే ఆడారో చెప్పండి?!అంతమాత్రాన అతనిని అవమానిచినట్లా?వీలైతే వారిని నచ్చచెప్పండి!అంతేగానీ సి.యమ్మె స్వయానా ఇలా విమర్శించండం ఏమిటి?!
Naga Srinivas garu i will agree with u…….it seems there must be 2 teams for india as per your opinion…..may be it will become true bcoz of our politicians
విచిత్రం ఏమిటంటే ఇక్కడ అన్నీ ప్రతిభలమీద ఆధార బట్టీ జరుగుతున్నట్లు!? గమనించే వాల్లకు రోజూ వారి జీవితములో ప్రతి క్షణం ఈ పార్శియాలిటీ అడుగడుగున చూస్తున్నదే! అందుకే శ్రీ శ్రీ ‘ అవినీతి బందుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు ‘ అన్నాడు. కిరాణ కోట్టు వారు కూడా కాస్త ఎక్కువ క్రౌడ్ ఉన్నట్లైతే అందు లో ఎవడు బాగా తెలిసిన వాడా అని చూసి వాన్ని ముందుకు మరీ పిలిచి కావలిసిన వస్తువులిస్తాడు. మరి ఈలాంటి చోట బందు ప్రీతి, కులాభిమనం భాషాభిమానం ప్రాంతియాభిమానం ఇంకా కావలిస్తే వర్గాభిమానం – ఇలా ఏదో ఒక అభి మానం తోనే పనులు జరుగుతున్నవి. మిమ్మల్ని ఒక ఫ్రెండ్ గా భావించాలన్న మీ దగ్గర ఏదొ ఎదురు చూసే అలా బావిస్తారు. ఇంక ఇలాటివి చెప్పాలా?
ఇంకా శాడిస్టుల దగ్గరికి అధికారం వస్తే ఇంక చెప్ప తరమా?