రాయల తెలంగాణ ఏర్పాటును మొట్టమొదట ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయారెనా? అవునంటోంది ‘ది హిందు.’ వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజమట! రాయల తెలంగాణ ప్రతిపాదన తనకే ఎదురు తిరగడంతో దానిని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ఇప్పుడు నటిస్తున్నారని పత్రిక సూచిస్తోంది.
ది హిందు పత్రిక మాటల్లోనే ఆ సంగతి చూడడం సముచితం.
Sounds strange but true that the proposal of ‘Rayala-Telangana’ with ten districts of Telangana and two of Rayalaseema is the brain child of Telangana Rashtra Samiti (TRS) president K. Chandrasekhar Rao, but has boomeranged on him.
రెండు సంవత్సరాల క్రితమే ‘రాయల తెలంగాణ’ను కె.సి.ఆర్ తెరమీదికి తెచ్చారని పత్రిక తెలిపింది. తనను సంప్రదించకుండా, తన పాత్ర లేకుండానే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుపై ముందుకు వెళ్తుండడంతో ఇప్పుడు ఆ ప్రతిపాదన నుండి కె.సి.ఆర్ దూరం జరుగుతున్నారని పత్రిక తెలిపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన క్రెడిట్ అంతా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కడం కె.సి.ఆర్ కి ఇష్టం లేదని దానితో ఆయన గొంతు సవరించుకుని పది జిల్లాల తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని చెబుతున్నారని పత్రిక తెలిపింది.
పత్రిక ప్రకారం కె.సి.ఆర్ గతంలో అనేక మార్లు జె.ఎ.సి సమావేశాల్లోనూ, తమ పార్టీ సమావేశాల్లోనూ రాయల తెలంగాణ గురించి మాట్లాడారు. ఇరు ప్రాంతాల మధ్య నీటి వనరుల విభజన సమస్యను తీర్చుతుందన్న ఉద్దేశ్యంతో ఆయన ఈ ప్రతిపాదనను చేసినట్లు తెలుస్తోంది.
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే తుంగభద్ర, శ్రీశైలం రిజర్వాయర్లు, నల్లమల అటవీ ప్రాంతం, అనంతపూర్ లోని సహజ వనరులు… ఇవన్నీ ఒకే రాష్ట్రంలో ఉంటాయని కె.సి.ఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులకు ఆయన లేఖ కూడా రాశారనీ గత జనవరిలో ఢిల్లీలో మకాం వేసినపుడు వారితో చర్చలు కూడా జరిపారని పత్రిక తెలిపింది. ఈ చర్చల్లో ఆయన అనేక డిమాండ్లు పెట్టారట. ముఖ్యమంత్రి పదవి, కేంద్రం మరియు రాష్ట్రంలో మంత్రి పదవులు, 60 ఎం.ఎల్.ఎ పోస్టులు సదరు డిమాండ్లలో భాగం. కానీ ఈ చర్చలు ఎలా ముగిసిందీ పత్రిక చెప్పలేదు.
లిఖిత హామీ
కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం సమావేశం అయినపుడు రాష్ట్రం నుండి హాజరయిన ముగ్గురు నాయకుల నుండి లిఖిత పూర్వక హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పి.సి.సి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామాదర రాజనరసింహల నుండి ‘తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము’ అన్న హామీని కోర్ కమిటీ సమావేశం సందర్భంగా తీసుకున్నారని ది హిందు తెలిపింది. ఈ మేరకు అభిజ్ఞ వర్గాల నుండి సమాచారం అందినట్లు పత్రిక తెలిపింది.
తన ఆధ్వర్యంలో రాష్ట్రం విడిపోవడం కంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికే కిరణ్ కుమార్ ముగ్గు చూపినట్లుగా కాంగ్రెస్ పార్టీలో పుకార్లు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే పార్టీ గీసిన గీత దాటబోమని రుజువు చేసుకోడానికి ముగ్గురూ లిఖిత పూర్వక హామీ ఇచ్చారని సీనియర్ నాయకులు చెబుతున్నారని పత్రిక తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయనతో మాట్లాడిన నాయకులు చెబుతున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చినప్పటికీ అధిష్టానం తెలంగాణ ఇవ్వడానికి ముగ్గు చూపడం ఏమిటని ఆయన విస్మయం చెందుతున్నారట.
తెలంగాణ ఖాయమని సీమాంధ్ర నాయకులు సైతం ఒక నిర్ణయానికి వచ్చారనీ, అధిష్టానం తమ నిర్ణయం ప్రకటించడమే తరువాయి అని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని తాము అనుసరిస్తామని ఇద్దరు, ముగ్గురు మంత్రులు చెప్పినట్లు ది హిందు తెలిపింది. మంత్రి పదవులకు రాజీనామా చేసినా పార్టీని వదిలిపోవడానికి వారు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్ధానాలు సాధించడమే దానికి కారణంగా తెలుస్తోంది.
రేపే సి.డబ్ల్యు.సి సమావేశం
తెలంగాణపై అంతిమ నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రేపే (మంగళవారం, జులై 30) జరగనుందని పత్రికలు చెబుతున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు యు.పి.ఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందనీ, తదనంతరమే సి.డబ్ల్యు.సి సమావేశం జరుగుతుందనీ కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. పంచాయితీ ఎన్నికల చివరి ఘట్టం పోలింగు జులై 31 తేదీన జరగనుంది. దానికి ఒక రోజు ముందే సి.డబ్ల్యు.సి సమావేశం పెట్టుకోవడం విశేషమే.

కే. సి.ఆర్. ది దింపుడు కళ్ళం ఆశ .