ఈగ సినిమా చూశారు కదా! చిన్న ఈగను చంపబోయి ఒక పెద్ద విలను తానే కోరి చావును కొని తెచ్చుకుంటాడు. లేదా ఈగే తెలివిగా విలన్ ను చావు వైపుకి నడిపిస్తుంది. ఇప్పుడు బీహార్ లో నితీశ్ కుమార్ పరిస్ధితి కూడా అలాగే ఉంది చూడబోతే!
బుద్ధ గయ పేలుళ్లు, మధ్యాహ్న భోజనం తిని 23 మంది పిల్లలు చనిపోవడం.. ఈ రెండు దుర్ఘటనల అనంతరం ఆసక్తికరమైన మౌనం పాటించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నట్టుండి నోరు తెరిచారు. ఈ దుర్ఘటనల వెనుక ఆర్.జె.డి (లాలూ పార్టీ), బి.జె.పి లు సంయుక్తంగా పన్నిన కుట్ర ఉందన్నట్లుగా ఆయన చేసిన పరోక్ష ఆరోపణ పరిశీలకులను ఆశ్చర్యపరచగా, ఆయన ప్రకటనల దాగిన నిస్పృహను కార్టూనిస్టు పసిగట్టినట్లు ఈ కార్టూన్ చెబుతోంది.
“మధ్యాహ్న భోజనంలో పురుగు మందు ఉందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. అంటే ఈ దుర్ఘటన వెనుక కుట్ర ఉందన్న మా అనుమానాలను ఇది ధృవ పరుస్తోంది… బోధ్ గయ పేలుళ్లు, చాప్రా మధ్యాహ్న భోజనం దుర్ఘటనల రెండింటి తర్వాత ఆర్.జె.డి, బి.జె.పి లు సంయుక్తంగా బంద్ పిలుపిచ్చి అమలు చేశాయి. దానిని బట్టి ఆ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉండని స్పష్టం అవుతోంది” అని నితీశ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
నితీశ్ ఆరోపణలు దుర్ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను వెలికి తీసి సమస్యలను పరిష్కరించడానికి బదులు, ఎవరో ఒకరిని బలి పశువులుగా ఎంచడానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉన్నాయి. కానీ పోను పోను నితీశ్ కుమార్ ఆగ్రహం తన ఉనికికే ఎసరు తెచ్చేట్లు ఉన్నట్లు కనిపిస్తోంది.
“వాళ్ళు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. కానీ నేను ఎన్నుకున్న మార్గం నుండి వైదొలిగేది లేదు” అని ఆయన గట్టిగా చెబుతున్నారు. నితీశ్ కుమార్ గనక సహనం కోల్పోతే ఆయన ఈగ సినిమాలో విలన్ పరిస్ధితినే ఎదుర్కోవచ్చునేమో?!

సమయం సందర్భం వస్తే అసలు మనిషి బయటపడతాడు. ఇదీ అంతే.
అసలు సమస్య కు నిజాయితీగా పరిష్కారం ఆలోచించకుండా కుతర్క రాజకీయం చేస్తే నితీష్ ప్రజలలో ఉన్న విలువ పోగొట్టుకోవటమే